క్రొయేషియా ఆటగాళ్ల విజయోత్సాహం (రాయిటర్స్ ఫొటో)
సాక్షి, న్యూఢిల్లీ : కేవలం నలభై లక్షల జనాభా కలిగిన, అందులోనూ 1991లో స్వాతంత్య్రం సాధించిన క్రొయేషియా మొట్ట మొదటిసారి వరల్డ్‌కప్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఫైనల్‌కు చేరుకోవడం అసాధారణ విషయం. కేవలం 34 లక్షల జనాభా కలిగిన ఉరుగ్వే, నాలుగు లక్షల లోపు జనాభా కలిగిన ఐస్‌లాండ్ క్రీడాకారులతో పోటాపోటీగా రాణించి ప్రపంచ ప్రజల ప్రశంసలు అందుకోవడం క్రొయేషియా క్రీడాకారులకే దక్కిన అరుదైన గౌరవం. ఇంతటి చిన్న దేశాలు అంతటి ఘనకీర్తిని దక్కించుకుంటున్నప్పుడు 130 కోట్ల జనాభా కలిగిన భారత దేశం ఇంతటి చిన్న దేశాలతోని ఎందుకు పోటీపడలేకపోతోందని, ఎందుకు ఫుట్‌బాల్ క్రీడారంగంలో రాణించలేక పోతోందన్న ప్రశ్న తలెత్తక మానదు.
‘భారత్ నిద్రపోతున్న దిగ్గజం’ అని 2012లో జరిగిన సాకర్ వరల్డ్ కప్ సందర్భంగా ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్ వ్యాఖ్యానించారు. ‘భారత్‌లో 130 కోట్ల జనాభా ఉంది. వారిలో 130 కోట్ల మంది ఫుట్‌బాల్ ఆడాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం భారత్ నిద్రపోతున్న దిగ్గజం. ఈ దిగ్గజం నిద్రలేపడానికి ఒక అలారం క్లాక్ సరిపోక పోవచ్చు. రకరకాల అలారం క్లాక్‌లను ఏర్పాటు చేయాల్సి రావచ్చు. ఆ మాటకొస్తే భారత్ ఇప్పటికీ నిద్రపోతోందని చెప్పడం సబబు కాదు. అది మెల్లగా మేల్కొనే ప్రక్రియ ప్రారంభమైంది’ అని బ్లాటర్ వ్యాఖ్యానించారు. ఆయన ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో తెలియదుగానీ ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఆరేళ్లు అవుతున్నా ‘నిద్రపోతున్న దిగ్గజం’ ఇంకా కదలిక లేదు. నిద్ర లేస్తున్న సూచనలు కూడా లేవు.
భారత్‌లో జనాభా ఎక్కువగా ఉంది కనుక ఫుట్‌బాల్‌లో (ఆ మాటకోస్తే ఏ ఆటలోనైనాసరే) రాణించే సామర్థ్యం భారత్‌కు ఎక్కువగా ఉంటుందని భావించడం అర్థరహితం. ఒలింపిక్స్, సాకర్ వరల్డ్‌కప్ పోటీలు వచ్చినప్పుడల్లా అనివార్యంగా భారత్ ప్రస్తావన వస్తోంది. రాజకీయ నాయకులు, క్రీడా బోర్డులు చీఫ్‌లు అప్పటికప్పుడు నాలుగు మాటలు మాట్లాడి మళ్లీ నిద్రలోకి జారుకుంటున్నారు. ఎంతమంది ఉన్నారంటూ తలలు లెక్క పెట్టడం ద్వారా మంచి జాతీయ క్రీడాకారులను తయారు చేయలేం. దేశంలోని క్రీడా సంస్కృతిపైనే అది ఆధారపడి ఉంటుంది. భారత క్రీడాకారులు రాటుదేలి రాణించాలంటే సహజ నైపుణ్యంకన్నా మంచి వ్యవస్థలు ఎక్కువ అవసరం. ఆకర్షణీయమైన పథకాలకన్నా అకుంఠిత దీక్షతో కఠోర శ్రమ చేయడం ఎక్కువ అవసరం.
2017, అక్టోబర్ నెలలో అండర్–17 ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌ను భారత్ నిర్వహించింది. అలాంటి అవకాశం దొరకడం ఒక అదృష్టం. ఆ అవకాశాన్ని ఆసరాగా తీసుకొని దేశంలోని యువతలో క్రీడా స్ఫూర్తిని రగిలించి క్రీడా సంస్కృతి పరిఢవిల్లేందుకు అందమైన బాటలు వేసి ఉంటే ఎంతో బాగుండేది. టోర్నమెంట్ వచ్చిందీ వెళ్లింది. భారత్ నిద్రలేవలేదు. బలమైన పునాదులు లేకుండా ఫుట్‌బాల్‌లో రాణించలేం. అట్టడుగు స్థాయి క్రియాశీలత, అందుకు ప్రోత్సాహక వ్యవస్థలు అవసరం. ఈ విషయంలో భారత్ ఇప్పటికీ వెనకబడే ఉంది. పేరుకు భారత్‌లో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య ఉంది. దీని దృక్పథమే తలకిందులు. క్రీడాకారుల కోసం పైనుంచి కిందకు చూస్తోంది. అట్టడుగు లేదా గ్రామీణ స్థాయి క్రీడా కార్యక్రమాలను నిర్వహించకుండా డబ్బు ఖర్చుతో కూడిన అతిపెద్ద లీగ్‌ల నిర్వహణపైనే దృష్టిని కేంద్రీకరిస్తోంది.
క్రీడా సంస్కృతి లేకుండా ఎన్ని మౌలిక సౌకర్యాలున్నా లాభం లేదు. గ్రామీణ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్యహించే వ్యవస్థలు ఉన్నప్పుడు, అవి సవ్యంగా పనిచేసినప్పుడు క్రీడా సంస్కృతి పెరుగుతుంది. క్రొయేషియా క్రీడాకారులు భలే రాణించారబ్బా! అంటూ అబ్బురపడితే మనకా క్రీడ అబ్బదు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఏదోరోజు వారివలే మనమూ రాణిస్తామన్న ఆత్మవిశ్వాసంతో అడుగులేయాలనుకుంటే నిద్రమత్తు దానంతట అదే తొలగిపోతుంది. దిగ్గజం ఘీంకారం వినిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment