మైమురిపించి! | Total review of fifa football world cup - 2018 | Sakshi
Sakshi News home page

మైమురిపించి!

Published Tue, Jul 17 2018 12:38 AM | Last Updated on Tue, Jul 17 2018 1:25 AM

Total review of fifa football world cup - 2018 - Sakshi

గోలా కాదా అనే గగ్గోలును ‘వార్‌’ తీర్చింది...
మెస్సీ, రొనాల్డొ లోటును గ్రీజ్‌మన్, లుకాకు పూడ్చారు...
జర్మనీ, బ్రెజిల్‌కు తీసిపోమని క్రొయేషియా, బెల్జియం చాటాయి...
ఫ్రాన్స్‌కు పూర్వవైభవం దక్కింది... ఇంగ్లండ్‌ చాన్నాళ్లకు మెరిసింది...
రష్యాకు ఆతిథ్య సంతృప్తితో పాటు పోరాడామన్న కీర్తి మిగిలింది...
మొత్తానికి 2018 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ సూపర్‌ హిట్‌ అయ్యింది...  

సాక్షి క్రీడా విభాగం:నెల పాటు సాగిన ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో ఎన్నెన్నో మెరుపులు. అంతకుమించి అనుభూతులు. అభిమానులకు కావాల్సినంత వినోదం. బెల్జియం కెప్టెన్‌ హజార్డ్‌ దూకుడు, ఇంగ్లండ్‌ యువ కెరటం హ్యారీ కేన్‌ పోరాటం, ఫ్రాన్స్‌ కుర్రాడు ఎంబాపె వేగం, క్రొయేషియా సారథి మోడ్రిచ్‌ స్థయిర్యం... వెరసి 64 మ్యాచ్‌ల్లో 169 గోల్స్‌. మ్యాచ్‌కు 2.6 చొప్పున నమోదు. స్కోరు లేని పోరు ఒక్కటంటే ఒక్కటే.! అర్జెంటీనా మెస్సీ ఘనతలు, పోర్చుగల్‌ రొనాల్డొ విన్యాసాలు ఇక చరిత్రే. మున్ముందు చెప్పుకోవాల్సింది రొమేలు లుకాకు గొప్పలు, గ్రీజ్‌మన్‌ గెలుపు రహస్యాలే. అందరూ ఊహించినట్లు హూలిగన్ల బెడద ఎదురవలేదు, దేశాల మధ్య వివాదాలు తలెత్తలేదు, ఆటగాళ్ల నడుమ విద్వేషాలు రేగలేదు. ఆసాంతం సాఫీ! దిగ్గజాల బేజారు... చిన్న జట్ల సంచలనంతో పుట్టుకొచ్చిన నయా తారలు.  

క్రొయేషియా ఓడి గెలిచింది... 
‘ఫిఫా’ అధ్యక్షుడు జియాని ఇన్‌ఫాటినొ వర్ణించినట్లు జగజ్జేత హోదాకు ఫ్రాన్స్‌ తగినదే. పరిస్థితులకు తగ్గట్లు ఆడిన ఫ్రెంచ్‌ జట్టు సరైన సమయంలో శక్తియుక్తులు ప్రదర్శించింది. ఇవ్వదగినదా కాదా అన్న ‘పెనాల్టీ’ వివాదాన్ని పక్కనపెట్టి... ఫైనల్లో తాము అత్యుత్తమ జట్టు చేతిలోనే ఓడామంటూ క్రొయేషియా కోచ్‌ జాల్టొ డాలిచ్, జట్టు సభ్యులు ప్రకటించి క్రీడా స్ఫూర్తిని చాటారు. పోరాటం అంటే ఏమిటో ఈ టోర్నీలో చాటిన క్రొయేషియా తడబాటుతో టైటిల్‌ను చేజార్చుకుంది. ఈసారి తుది సమరం గత రెండు కప్‌ల తరహాలో పోటాపోటీగా సాగకున్నా మరీ నిరాశపర్చలేదు.  

తరం మారుతోంది... 
ఈ ప్రపంచ కప్‌తో రొనాల్డొ, మెస్సీల శకం దాదాపు ముగిసినట్లేనని తేలింది. వచ్చే కప్‌ నాటికి 35 ఏళ్లు దాటే వీరిద్దరూ టోర్నీలో ఆడేది అనుమానమే. బ్రెజిల్‌ స్టార్‌ నెమార్‌కూ 30 ఏళ్లు వస్తాయి. ఈ తరం తర్వాత అలరించేందుకు నేనున్నానంటున్నాడు 19 ఏళ్ల ఎంబాపె. ఫ్రాన్స్‌ జగజ్జేతగా నిలవడం వెనుక గ్రీజ్‌మన్‌తో పాటు ఈ టీనేజ్‌ సంచలనం పాత్ర అంతాఇంత కాదు. జట్టులోని పోగ్బా, పవార్డ్, వరానె, కాంటె, హెర్నాండెజ్, ఉమ్‌టిటి... వీరంతా 20ల్లో ఉన్నవారే. రానున్న దశాబ్దం ఫ్రాన్స్‌దేనని వీరంతా చాటుతున్నారు.  

ఆ మూడింటికీ ఉంది భవిష్యత్‌! 
ప్రతిభను లెక్కలోకి తీసుకుంటే భవిష్యత్‌లో ఫ్రాన్స్‌కు పోటీగా వచ్చేది బ్రెజిలే అంటున్నారు. ఐదుసార్లు జగజ్జేతగా నిలిచిన సాంబా జట్టు... ఈసారి క్వార్టర్స్‌లో బెల్జియం దెబ్బకు ఔటైంది. అయినా, జీసస్‌ వంటి యువకులతో పాత ఘనతలను అందుకుంటుందనే నమ్మకం కలుగుతోంది. గారెత్‌ సౌత్‌గేట్‌ శిక్షణలో నిండా యువకులతో అడుగుపెట్టిన ఇంగ్లండ్‌ అదరగొట్టింది. పాతికేళ్లలోపు కుర్రాళ్లతో కళకళలాడుతున్న ఈ జట్టు 2022 నాటికైనా గట్టి పోటీదారేనని లోథర్‌ మథియాస్‌ లాంటి దిగ్గజమే కితాబిచ్చాడు. అందరూ ఫేవరెట్‌గా భావించిన బెల్జియం లుకాకు, హజార్డ్‌ వంటి ‘గోల్డెన్‌ జనరేషన్‌’ ఆటగాళ్లతో సెమీస్‌ చేరింది. అయితే, వచ్చే ప్రపంచకప్‌కు ఫ్రాన్స్, బ్రెజిల్‌ మాదిరిగా పూర్తి స్థాయి సామర్థ్యంతో ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఇక అర్జెంటీనా చేయాల్సింది మెస్సీ నీడ నుంచి బయటకు రావడమే. 2022 నాటికి వారికిదే పెద్ద సమస్య. ప్రపంచ కప్‌ రికార్డుల రారాజు జర్మనీ పునరుత్తేజం పొందే పనిలో పడాలి. 2000 సంవత్సరంలో యూరో కప్‌లో గ్రూప్‌ దశలో వెనుదిరిగిన జర్మనీ... తర్వాత మరింత మేటిగా తయారైంది.ఆసియా జట్లు ఈ కప్‌లోనూ ఒకటీ రెండు మెరుపులకే పరిమితమయ్యాయి. జర్మనీని ఇంటికి పంపి కొరియా ఔరా అనిపిస్తే, నాకౌట్‌లో ప్రతిఘటనతో జపాన్‌ ఆకట్టుకుంది. ఫేవరెట్లు కాకున్నా ప్రమాదకారులు అనిపించుకోవాలంటే ఇంకా చాలా దూరం ప్రయాణించాలి.

రాజకీయం... సుహృద్భావం 
రష్యా వంటి దేశంలో ప్రపంచకప్‌ జరిగినా... పెద్దగా రాజకీయ ప్రస్తావనలకు అవకాశం లేకపోయింది. ప్రారంభ మ్యాచ్‌ను వీక్షించిన అధ్యక్షుడు పుతిన్‌తో సౌదీ రాకుమారుడు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ కరచాలనం ఆకట్టుకుంది. అయితే, ఈజిప్ట్‌ స్టార్‌ సలా వివాదాస్పద చెచెన్యా నేత రమ్జాన్‌ కదిరోవ్‌ను కలవడం చర్చనీయాంశమైంది. అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్న రీత్యా నైక్‌ సంస్థ బూట్లను ధరించకుండా ఇరాన్‌ ఆటగాళ్లు బరిలో దిగడం వార్తల్లో నిలిచింది. ఫైనల్లో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రోన్‌ విజయ సంబరం... క్రొయేషియా దేశాధ్యక్షురాలు కొలిండా గ్రాబర్‌ కిటారోవిచ్‌ తమ జట్టు ఫైనల్‌కు వెళ్లాక డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లి ఆటగాళ్లను అభినందించడం, వారితో కలసి నృత్యం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.  

గాయాలు... గేయాలు 
ఇరాన్‌తో మ్యాచ్‌లో మొరాకో ఆటగాడు నార్డిన్‌ అమ్రాబట్‌ అపస్మారకంలోకి వెళ్లాడు. ముఖంపై నీళ్లు చల్లి అతడిని స్పృహలోకి తేవాల్సి వచ్చింది. బెల్జియంతో సెమీస్‌లో ఫ్రాన్స్‌ మిడ్‌ఫీల్డర్‌ మట్యుడి సైతం తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ గోల్స్‌ను మరువలేం! 
సౌదీ అరేబియాపై అలెగ్జాండర్‌ గోలోవిన్‌ (రష్యా), స్పెయిన్‌పై రొనాల్డొ, క్రొయేషియాపై ట్రిపియర్‌ (ఇంగ్లండ్‌)ల ఫ్రీ కిక్‌లు అంత తేలిగ్గా మర్చిపోలేనివి. స్విట్జర్లాండ్‌పై కౌటిన్హొ (బ్రెజిల్‌), అర్జెంటీనాపై మోడ్రిచ్‌ (క్రొయేషియా), పనామాపై లిన్‌గార్డ్‌ (ఇంగ్లండ్‌), ఫ్రాన్స్‌పై డిమారియా (అర్జెంటీనా)లు సుదూరం నుంచి కొట్టిన షాట్లు గోల్‌పోస్ట్‌లోకి చేరిన తీరు ముచ్చట గొలిపింది. కవానీ హెడర్‌  పోర్చుగల్‌ కథను 
ప్రి క్వార్టర్స్‌తోనే ముగించింది. 

‘వార్‌’ తప్పించింది ‘వీఏఆర్‌’ 
ప్రపంచ కప్‌ అంటేనే ‘గోల్‌ గగ్గోలు’ సాధారణం. కానీ ఈసారి వీడియో అసిస్టెంట్‌ రిఫరీ (వీఏఆర్‌)తో దీనికి అడ్డుకట్ట పడింది. బంతి శరీరానికి తగిలిందా లేదా అనే సంశయాలు, గాయాల నటన, రిఫరీని చుట్టుముట్టడం, ఆటగాళ్ల వేడుకోళ్లను తప్పించింది. ఆరంభంలోనే ఉన్నా ఈ పద్ధతి ఆశలు కల్పిస్తోంది. టెన్నిస్‌లో రివ్యూ, క్రికెట్‌లో హాక్‌ ఐ శైలిలో వీఏఆర్‌ కూడా కొన్నేళ్లలో ఫుట్‌బాల్‌లో మార్పు తేనుంది. టోర్నీలో 29 పెనాల్టీ (స్పాట్‌) కిక్‌లకు అనుమతివ్వగా వీటిలో 11 వీఏఆర్‌ను ఆశ్రయించి ఇచ్చినవే. లీగ్‌ దశలో ఆస్ట్రేలియాపై, ఫైనల్లో క్రొయేషియాపై గ్రీజ్‌మన్‌ కొట్టిన గోల్స్‌ ‘వార్‌’ అందించినవే కావడం విశేషం. మొత్తం 32 జట్లలో 16 జట్లు ఒక్కసారైనా పెనాల్టీతో లబ్ధిపొందాయి. మరీ ముఖ్యంగా ‘గోల్డెన్‌ బూట్‌’ విజేత హ్యారీ కేన్‌ తన ఆరు గోల్స్‌లో మూడింటిని పెనాల్టీలోనే కొట్టాడు.

వచ్చేసారి ‘ఖతర్‌’నాక్‌గా... 
2022 కప్‌ కూడా కొత్త వేదికపైనే జరుగనుంది. ఈసారి ఆతిథ్యం ఇచ్చేందుకు ‘ఖతర్‌’ ఏర్పాట్లు చేసుకుంటోంది. సహజంగా ప్రపంచకప్‌ జూన్‌–జూలైలలో నిర్వహిస్తారు. గల్ఫ్‌ లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి 2022 కప్‌ షెడ్యూల్‌ను నవంబరు–డిసెంబరుకు మార్చారు.

‘సెట్‌ పీస్‌’... 
ఇంగ్లండ్‌ సెమీస్‌ ప్రస్థానంలో పెనాల్టీలతో పాటు ‘సెట్‌ పీస్‌’ (ఫ్రీ కిక్, కార్నర్, త్రో ఇన్‌ల సహాయంతో వచ్చేవి) గోల్స్‌ది కీలక పాత్ర. తొమ్మిందిటిని ఇలానే సాధించింది మూడు సింహాల బృందం. చిత్రమేమంటే ఇంగ్లండ్‌ విజేతగా నిలిచిన 1966 తర్వాత (70) అత్యధికంగా సెట్‌పీస్‌ గోల్స్‌ ఇప్పుడే (48) నమోదయ్యాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement