ఫ్రెంచ్‌ ఫెస్టివల్‌ | France beat Croatia by 4-2 to win their second World Cup title | Sakshi
Sakshi News home page

ఫ్రెంచ్‌ ఫెస్టివల్‌

Published Mon, Jul 16 2018 2:24 AM | Last Updated on Mon, Jul 16 2018 11:34 AM

France beat Croatia by 4-2 to win their second World Cup title - Sakshi

భారీ వర్షంలో ‘ఫిఫా’ ప్రపంచకప్‌ ట్రోఫీతో ఫ్రాన్స్‌ జట్టు కేరింత

ఫ్రెంచ్‌ కిక్‌ అదిరింది. విశ్వ వేదికపై ఫ్రాన్స్‌ త్రివర్ణం ఉవ్వెత్తున ఎగిరింది. రెండు దశాబ్దాల తర్వాత ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ మళ్లీ ‘ది బ్లూస్‌’ చెంత చేరింది. అగ్రశ్రేణి జట్టుగా తమపై ఉన్న అంచనాలకు ఎక్కడా తగ్గకుండా టోర్నీలో అజేయంగా దూసుకెళ్లిన ఫ్రాన్స్‌ చివరకు శిఖరాన నిలిచి సత్తా చాటింది. ఫైనల్‌ పోరులో అత్యద్భుత ఆట తీరు కనబర్చకపోయినా, తమ బలాన్ని నమ్ముకొని తెలివిగా, వ్యూహాత్మకంగా ఆడిన ఫ్రెంచ్‌ బృందం కూసింత అదృష్టం కూడా కలిసొచ్చి సంచలనాల క్రొయేషియా ఆట కట్టించింది. రెండో సారి వరల్డ్‌ కప్‌ విన్నర్‌గా నిలిచి తమ స్థాయిని ప్రదర్శించింది. గ్రీజ్‌మన్, పోగ్బా, ఎంబాపెలాంటి స్టార్‌లు ఆఖరి పోరులో గోల్స్‌తో చెలరేగగా... 1998లో కెప్టెన్‌గా ప్రపంచ కప్‌ అందించిన దిదియర్‌ డెచాంప్స్‌ ఇప్పుడు కోచ్‌గా మళ్లీ ట్రోఫీని ముద్దాడగలిగాడు. అటు మాస్కోలో ఆఖరి విజిల్‌ మోగగానే ఇటు ఈఫిల్‌ టవర్‌ సాక్షిగా పారిస్‌ వీధుల నిండా విరామం లేకుండా ‘ఫ్రెంచ్‌ వైన్‌’ పొంగిపొర్లడం ప్రారంభమైపోయింది.

మ్యాచ్‌ ఆసాంతం బంతిపై పట్టు... అటాకింగ్‌తో తిరుగులేని ఆట... ప్రత్యర్థి ఏరియాలోకి పదే పదే దూసుకుపోయిన ఫార్వర్డ్‌లు ... కానీ గోల్స్‌ లెక్కలో మాత్రం వెనుకబడిపోయిన క్రొయేషియాకు గుండెకోత తప్పలేదు. తొలిసారి ఫైనల్‌ చేరి ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన ఈ జట్టుకు తుది ఫలితం చేదు జ్ఞాపకాన్నే మిగిల్చింది. టైటిల్‌ పోరులో దురదృష్టం దగ్గరి బంధువులా క్రొయేషియా వెంట పరుగెత్తుకు వచ్చింది. ముందుగా సెల్ఫ్‌ గోల్, ఆపై రిఫరీ తప్పుడు నిర్ణయంతో ప్రత్యర్థికి పెనాల్టీ అవకాశం ఒక్కసారిగా జట్టును వెనుకంజ వేసేలా చేశాయి. ఆ తర్వాత ఎంత పోరాడినా అది మాజీ చాంపియన్‌ను నిలువరించడానికి సరిపోలేదు. మూడు నాకౌట్‌ మ్యాచ్‌లను కూడా అదనపు సమయంలో గెలుచుకొని పవర్‌ ప్రదర్శించిన ఈ టీమ్‌కు ఫైనల్‌ మాత్రం నిరాశనే పంచింది. ‘హృదయాలు గెలిచారు’ అనే ఓదార్పు మాట తప్ప ఇక రన్నరప్‌ ముద్రతోనే ఆ జట్టు వచ్చే నాలుగేళ్లు సహవాసం చేయాల్సిందే.   

మాస్కో: ఫ్రాన్స్‌ రెండోసారి ఫుట్‌బాల్‌ ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. 2018 టోర్నీలో ఒక్క మ్యాచ్‌ ఓడకుండా అజేయంగా ముందుకు సాగిన ఫ్రెంచ్‌ బృందం ఫైనల్లోనూ చెలరేగింది. లుజ్నికి స్టేడియంలో జరిగిన తుది పోరులో ఫ్రాన్స్‌ 4–2 గోల్స్‌ తేడాతో క్రొయేషియాను చిత్తు చేసింది. క్రొయేషియా ఆటగాడు మాన్‌జుకిచ్‌ (18వ నిమిషం) సెల్ఫ్‌ గోల్‌తో ఫ్రాన్స్‌ ఖాతా తెరవగా... గ్రీజ్‌మన్‌ (38వ ని.లో), పోగ్బా (59వ ని.లో), ఎంబాపె (65వ ని.లో) తమ జట్టు తరఫున గోల్స్‌  కొట్టారు. క్రొయేషియా తరఫున పెరిసిచ్‌ (28వ ని.లో), మాన్‌జుకిచ్‌ (69వ ని.లో) గోల్స్‌ సాధించారు. తొలి అర్ధభాగం ముగిసేసరికి ఫ్రాన్స్‌ 2–1తో ఆధిక్యంలో నిలవగా... ఆ తర్వాత మరో రెండు గోల్స్‌తో ఫ్రాన్స్‌ తమ ప్రత్యర్థికి అవకాశం లేకుండా చేసింది. చివర్లో క్రొయేషియా ఎంత పోరాడినా లాభం లేకపోయింది. ఫ్రాన్స్‌తో పోలిస్తే ఏకంగా 61 శాతం క్రొయేషియా బంతిని నియంత్రణలో ఉంచుకున్నా... తుది ఫలితం విషయంలో మాత్రం అది ప్రతిఫలించలేదు.  

క్రొయేషియా బ్యాడ్‌లక్‌...
తొలిసారి ఫైనల్‌ ఆడుతున్న క్రొయేషియా ఆరంభంలో చెలరేగింది. ప్రత్యర్థి దూకుడుగా ఆడటంతో తొలి 15 నిమిషాల పాటు ఫ్రాన్స్‌కు ఏం జరుగుతుందో అసలు అర్థం కాలేదు. ఏ దశలో కూడా ఫ్రాన్స్‌ ఆటగాళ్లు వరుసగా మూడు పాస్‌లు కూడా ఇవ్వలేకపోయారు. అయితే మంచి జోష్‌లో కనిపించిన క్రొయేషియా అదే జోరులో చేసిన పొరపాటు ఫ్రెంచ్‌ జట్టుకు కలిసొచ్చింది. గ్రీజ్‌మన్‌ కొట్టిన ఫ్రీ కిక్‌ కోసం అతని సహచరుడు రాఫెల్‌ వరాన్‌ సిద్ధమయ్యాడు. అయితే దానిని అడ్డుకునే ప్రయత్నంలో నియంత్రణ కోల్పోయిన మాన్‌జుకిచ్‌ తమ గోల్‌ పోస్ట్‌లోకే బంతిని పంపించేశాడు. ప్రపంచ కప్‌ ఫైనల్లో నమోదైన తొలి సెల్ఫ్‌ గోల్‌ ఇదే కావడం విశేషం.

అయితే కొద్దిసేపటికే పెరిసిచ్‌ గోల్‌ చేసి క్రొయేషియా ఆశలకు ఊపిరి పోశాడు. ఫ్రాన్స్‌ పెనాల్టీ ఏరియాలో ప్రతీ ఒక్కరు బంతిపై పట్టుకోసం ప్రయత్నిస్తున్న దశలో పెరిసిచ్‌ ప్రశాంతంగా అందు కొని ఏమాత్రం తడబాటు లేకుండా గోల్‌ కొట్టాడు. ఆ తర్వాత పెరిసిచ్‌ను దురదృష్టం పలకరించింది. అతను చేతితో బంతిని అడ్డుకున్నాడని రిఫరీ పెనాల్టీ ఇచ్చేశాడు. ముందుగా పెనాల్టీకి అంగీకరించని రిఫరీ ‘వీఏఆర్‌’ ద్వారా సుదీర్ఘ సమయం తీసుకొని దానిని నిర్ధారించడం వివాదాస్పదమైంది. పెరిసిచ్‌ చేతికి బంతి తగలడం వాస్తవమే కానీ అది ఉద్దేశ పూర్వకంగా చేయలేదనే క్రొయేషియా వాదన చెల్లలేదు. గ్రీజ్‌మన్‌ అలవోకగా కీపర్‌ను బోల్తా కొట్టించడంతో ఫ్రాన్స్‌ ఆధిక్యంలోకి వెళ్లింది.  

ఫ్రాన్స్‌ దూకుడు...
రెండో అర్ధభాగంలో కూడా క్రొయేషియా దూకుడుగానే ఆడే ప్రయత్నం చేయగా, ఫ్రాన్స్‌ తడబాటు కొనసాగింది. ల్యుకా మోడ్రిచ్, ఇవాన్‌ రాకిటిచ్‌ పదే పదే ఫ్రాన్స్‌ ఏరియాలో చొరబడినా గోల్‌ చేయడంలో మాత్రం సఫలం కాలేకపోయారు. ఈ దశలో ఒక్కసారిగా వ్యూహం మార్చిన ఫ్రాన్స్‌ ఫలితం సాధించింది. కౌంటర్‌ అటాక్‌తో ఆ జట్టు కీలక గోల్‌ నమోదు చేసింది. ముందుగా క్రొయేషియా డిఫెండర్ల నుంచి బంతిని లాక్కున్న పోగ్బా ఆ తర్వాత ఎంబాపెకు పాస్‌ ఇచ్చాడు. ఎంబాపె నుంచి పాస్‌ గ్రీజ్‌మన్‌కు వెళ్లి మళ్లీ పోగ్బాకు వచ్చింది. పోగ్బా కొట్టిన షాట్‌ను మోడ్రిచ్‌ అడ్డుకోవడంతో బంతి మళ్లీ వెనక్కి వచ్చింది. ఈసారి పొరపాటుకు చాన్స్‌ లేకుండా పోగ్బా గోల్‌ పోస్ట్‌లోకి పంపించాడు. ఇదే జోరులో మరో ఆరు నిమిషాలకే ఎంబాపె సునాయాస గోల్‌ సాధించాడు.

క్రొయేషియా ఏరియాలో అడ్డుకోవడానికి ఎవరూ లేకపోగా, కీపర్‌ కూడా అచేతనంగా మారిపోవడంతో... పీలే (1958లో) తర్వాత అతి పిన్న వయసులో వరల్డ్‌ కప్‌ ఫైనల్లో గోల్‌ కొట్టిన ఆటగాడిగా ఎంబాపె నిలిచాడు. తమ జట్టు ఆశలు కోల్పోయిన దశలో మాన్‌జుకిచ్‌ గోల్‌ కొట్టి ఊపు తెచ్చాడు. ఫ్రాన్స్‌ కీపర్‌ లోరిస్‌ తన వద్దకు వచ్చిన బంతిని కిక్‌ కొట్టకుండా అక్కడే డ్రిబ్లింగ్‌ చేస్తుండగా పైకి దూసుకొచ్చి మాన్‌జుకిచ్‌ అనూహ్యంగా గోల్‌ సాధించడం విశేషం. అయితే ఆ వెంటనే ఫ్రాన్స్‌ కోచ్‌ ముగ్గురు డిఫెండర్లను సబ్‌స్టిట్యూట్‌లుగా బరిలోకి దించి రక్షణాత్మక ప్రదర్శనకే మొగ్గు చూపాడు. దాంతో క్రొయేషియా ఎంత ప్రయత్నించినా మరో గోల్‌ సాధించడంలో విఫలమై కన్నీటితో నిష్క్రమించింది.  


     
మా యువ జట్టు అద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రపంచంలోనే టాప్‌ జట్టుగా నిలిచింది. మా చాంపియన్లలో కొందరికైతే 19 ఏళ్లే! నిజానికి మేం అంత గొప్పగా ఆడలేదు. కానీ మానసిక నైపుణ్యాన్ని కనబరిచాం. మొత్తానికి నాలుగు గోల్స్‌ చేశాం. గెలిచేందుకు మా వాళ్లకే అర్హత ఉంది. మా బృందమంతా చాలా కష్టపడింది. ఈ గెలుపుదారిలో ఎన్నో క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంది. రెండేళ్ల క్రితం ‘యూరో’ గెలవలేకపోవడం బాధించింది. కానీ గుణపాఠాలెన్నో నేర్పింది. ఇది నా విజయం కాదు. ఆటగాళ్లు 55 రోజులుగా పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈ ప్రపంచకప్‌. దీన్నిప్పుడు ఫ్రాన్స్‌కు తీసుకెళ్తున్నందుకు గర్వంగా ఉంది.   
–ఫ్రాన్స్‌ కోచ్‌ డెచాంప్స్‌ 



► 1970 (బ్రెజిల్‌) తర్వాత ఫైనల్లో 4 గోల్స్‌ కొట్టిన తొలి జట్టు ఫ్రాన్స్‌  
     
► 2002 నుంచి నాలుగు ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో కలిపి 6 గోల్స్‌ నమోదు కాగా... ఈ ఒక్క మ్యాచ్‌లోనే 6 గోల్స్‌ వచ్చాయి. 1958 ఫైనల్‌ తర్వాత ఒకే మ్యాచ్‌లో 6 గోల్స్‌ నమోదు కావడం కూడా ఇదే మొదటిసారి.

► జగాలో (బ్రెజిల్‌), బ్రెకన్‌బాయర్‌ (జర్మనీ) తర్వాత అటు కెప్టెన్‌గా, ఇటు కోచ్‌గా కూడా వరల్డ్‌ కప్‌ సాధించిన మూడో ఆటగాడు దిదియర్‌ డెచాంప్స్‌. 1998 అతని నాయకత్వంలోనే సొంతగడ్డపై ఫ్రాన్స్‌ వరల్డ్‌ కప్‌ గెలిచింది.  


ఎవరికెంత వచ్చాయంటే...?
► విజేత ఫ్రాన్స్‌ జట్టుకు 3 కోట్ల 80 లక్షల డాలర్లు (రూ. 260 కోట్లు)
► రన్నరప్‌ క్రొయేషియా జట్టుకు 2 కోట్ల 80 లక్షల డాలర్లు (రూ. 191 కోట్లు).
► మూడో స్థానం పొందిన బెల్జియం జట్టుకు 2 కోట్ల 40 లక్షల డాలర్లు (రూ. 164 కోట్లు).
► నాలుగో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్‌కు 2 కోట్ల 20 లక్షల డాలర్లు (రూ. 150 కోట్లు).
► క్వార్టర్స్‌లో ఓడిన జట్లకు కోటీ 60 లక్షల డాలర్లు చొప్పున (రూ. 109 కోట్లు).
► ప్రిక్వార్టర్స్‌లో ఓడిన జట్లకు కోటీ 20 లక్షల డాలర్లు చొప్పున (రూ. 82 కోట్లు).
► లీగ్‌ దశలోనిష్క్రమించిన జట్లకు 80 లక్షల డాలర్లు చొప్పున (రూ. 54 కోట్లు).


విశేషాలు
ప్రపంచకప్‌లో నమోదైన మొత్తం గోల్స్‌                   -169
జరిగిన మ్యాచ్‌లు                                              -64
ఎల్లో కార్డులు                                                   -219
రెడ్‌ కార్డులు                                                      -4
టోర్నీలో అత్యధిక గోల్స్‌ చేసిన జట్టు బెల్జియం            -16
ఒకే మ్యాచ్‌లో నమోదైన అత్యధిక గోల్స్‌
(బెల్జియం 5–ట్యూనిషియా 2; ఇంగ్లండ్‌ 6–పనామా 1).- 7
గోల్స్‌ లేకుండా ‘డ్రా’గా ముగిసిన మ్యాచ్‌లు (ఫ్రాన్స్‌–డెన్మార్క్‌).- 1
లీగ్‌ దశలో ‘డ్రా’గా ముగిసిన మ్యాచ్‌లు                              -8
నాకౌట్‌ దశలో పెనాల్టీ షూటౌట్‌ ద్వారా ఫలితం తేలిన మ్యాచ్‌లు- 3


                                    రన్నరప్‌ క్రొయేషియా జట్టు


                              ఫెయిర్‌ ప్లే అవార్డు: స్పెయిన్‌



                       ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రోన్‌ సంబరం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement