Sepp Blatter
-
బ్లాటర్పై మళ్లీ నిషేధం
జ్యూరిక్ (స్విట్జర్లాండ్): అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) మాజీ అధ్యక్షుడు సెప్ బ్లాటర్పై మళ్లీ నిషేధం విధించారు. జరిమానా కూడా కట్టమన్నారు. తన పరిపాలన దక్షతతో ‘ఫిఫా’ను ఆర్థిక పరిపుష్టి చేసిన బ్లాటర్ అదే సమయంలో స్వామి కార్యాన్ని, స్వకార్యాన్ని నెరవేర్చుకునే పనిలో ఆర్థిక అవకతవకలు చేశారు. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. దీనిపై విమర్శలు వెలువెత్తడంతో దర్యాప్తు చేసిన ‘ఫిఫా’ ఎథిక్స్ కమిటీ అధికార దుర్వినియోగం, ఆర్థిక అవకతవకలు నిజమేనని తేల్చింది. దీంతో గతంలోనే ఆరేళ్ల నిషేధం విధించారు. ఇదింకా ముగియనే లేదు. ఈ ఏడాది అక్టోబర్‌లో గత నిషేధం పూర్తవుతుంది. దీనికి ఏడు నెలల ముందే 85 ఏళ్ల మాజీ అధ్యక్షుడిపై మరో దఫా నిషేధాన్ని విధిస్తున్నట్లు ‘ఫిఫా’ బుధవారం ప్రకటించింది. అలాగే 10 లక్షల స్విస్ ఫ్రాంక్స్ (రూ. 7 కోట్ల 75 లక్షలు) జరిమానా కూడా విధించింది. గత డిసెంబర్లో బ్లాటర్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించి కోమాలోకి వెళ్లిపోయారు. ఇటీవలే కాస్త కుదుటపడి కోమా నుంచి బయటపడినప్పటికీ నిషేధం నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. ఈ అవకతవకల్లో భాగమైన ‘ఫిఫా’ మాజీ కార్యదర్శి వాల్కేపై 2025 అక్టోబర్ వరకు నిషేధం ఉంది. ఆయనపై ఏకంగా పదేళ్ల నిషేధం విధించారు. -
‘నిద్రపోతున్న దిగ్గజం’ లేచేది ఎప్పుడు?
సాక్షి, న్యూఢిల్లీ : కేవలం నలభై లక్షల జనాభా కలిగిన, అందులోనూ 1991లో స్వాతంత్య్రం సాధించిన క్రొయేషియా మొట్ట మొదటిసారి వరల్డ్‌కప్ ఫుట్‌బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఫైనల్‌కు చేరుకోవడం అసాధారణ విషయం. కేవలం 34 లక్షల జనాభా కలిగిన ఉరుగ్వే, నాలుగు లక్షల లోపు జనాభా కలిగిన ఐస్లాండ్ క్రీడాకారులతో పోటాపోటీగా రాణించి ప్రపంచ ప్రజల ప్రశంసలు అందుకోవడం క్రొయేషియా క్రీడాకారులకే దక్కిన అరుదైన గౌరవం. ఇంతటి చిన్న దేశాలు అంతటి ఘనకీర్తిని దక్కించుకుంటున్నప్పుడు 130 కోట్ల జనాభా కలిగిన భారత దేశం ఇంతటి చిన్న దేశాలతోని ఎందుకు పోటీపడలేకపోతోందని, ఎందుకు ఫుట్‌బాల్ క్రీడారంగంలో రాణించలేక పోతోందన్న ప్రశ్న తలెత్తక మానదు. ‘భారత్ నిద్రపోతున్న దిగ్గజం’ అని 2012లో జరిగిన సాకర్ వరల్డ్ కప్ సందర్భంగా ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్ వ్యాఖ్యానించారు. ‘భారత్‌లో 130 కోట్ల జనాభా ఉంది. వారిలో 130 కోట్ల మంది ఫుట్‌బాల్ ఆడాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం భారత్ నిద్రపోతున్న దిగ్గజం. ఈ దిగ్గజం నిద్రలేపడానికి ఒక అలారం క్లాక్ సరిపోక పోవచ్చు. రకరకాల అలారం క్లాక్‌లను ఏర్పాటు చేయాల్సి రావచ్చు. ఆ మాటకొస్తే భారత్ ఇప్పటికీ నిద్రపోతోందని చెప్పడం సబబు కాదు. అది మెల్లగా మేల్కొనే ప్రక్రియ ప్రారంభమైంది’ అని బ్లాటర్ వ్యాఖ్యానించారు. ఆయన ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో తెలియదుగానీ ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఆరేళ్లు అవుతున్నా ‘నిద్రపోతున్న దిగ్గజం’ ఇంకా కదలిక లేదు. నిద్ర లేస్తున్న సూచనలు కూడా లేవు. భారత్‌లో జనాభా ఎక్కువగా ఉంది కనుక ఫుట్‌బాల్‌లో (ఆ మాటకోస్తే ఏ ఆటలోనైనాసరే) రాణించే సామర్థ్యం భారత్‌కు ఎక్కువగా ఉంటుందని భావించడం అర్థరహితం. ఒలింపిక్స్, సాకర్ వరల్డ్‌కప్ పోటీలు వచ్చినప్పుడల్లా అనివార్యంగా భారత్ ప్రస్తావన వస్తోంది. రాజకీయ నాయకులు, క్రీడా బోర్డులు చీఫ్‌లు అప్పటికప్పుడు నాలుగు మాటలు మాట్లాడి మళ్లీ నిద్రలోకి జారుకుంటున్నారు. ఎంతమంది ఉన్నారంటూ తలలు లెక్క పెట్టడం ద్వారా మంచి జాతీయ క్రీడాకారులను తయారు చేయలేం. దేశంలోని క్రీడా సంస్కృతిపైనే అది ఆధారపడి ఉంటుంది. భారత క్రీడాకారులు రాటుదేలి రాణించాలంటే సహజ నైపుణ్యంకన్నా మంచి వ్యవస్థలు ఎక్కువ అవసరం. ఆకర్షణీయమైన పథకాలకన్నా అకుంఠిత దీక్షతో కఠోర శ్రమ చేయడం ఎక్కువ అవసరం. 2017, అక్టోబర్ నెలలో అండర్–17 ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌ను భారత్ నిర్వహించింది. అలాంటి అవకాశం దొరకడం ఒక అదృష్టం. ఆ అవకాశాన్ని ఆసరాగా తీసుకొని దేశంలోని యువతలో క్రీడా స్ఫూర్తిని రగిలించి క్రీడా సంస్కృతి పరిఢవిల్లేందుకు అందమైన బాటలు వేసి ఉంటే ఎంతో బాగుండేది. టోర్నమెంట్ వచ్చిందీ వెళ్లింది. భారత్ నిద్రలేవలేదు. బలమైన పునాదులు లేకుండా ఫుట్‌బాల్‌లో రాణించలేం. అట్టడుగు స్థాయి క్రియాశీలత, అందుకు ప్రోత్సాహక వ్యవస్థలు అవసరం. ఈ విషయంలో భారత్ ఇప్పటికీ వెనకబడే ఉంది. పేరుకు భారత్‌లో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య ఉంది. దీని దృక్పథమే తలకిందులు. క్రీడాకారుల కోసం పైనుంచి కిందకు చూస్తోంది. అట్టడుగు లేదా గ్రామీణ స్థాయి క్రీడా కార్యక్రమాలను నిర్వహించకుండా డబ్బు ఖర్చుతో కూడిన అతిపెద్ద లీగ్‌ల నిర్వహణపైనే దృష్టిని కేంద్రీకరిస్తోంది. క్రీడా సంస్కృతి లేకుండా ఎన్ని మౌలిక సౌకర్యాలున్నా లాభం లేదు. గ్రామీణ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్యహించే వ్యవస్థలు ఉన్నప్పుడు, అవి సవ్యంగా పనిచేసినప్పుడు క్రీడా సంస్కృతి పెరుగుతుంది. క్రొయేషియా క్రీడాకారులు భలే రాణించారబ్బా! అంటూ అబ్బురపడితే మనకా క్రీడ అబ్బదు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఏదోరోజు వారివలే మనమూ రాణిస్తామన్న ఆత్మవిశ్వాసంతో అడుగులేయాలనుకుంటే నిద్రమత్తు దానంతట అదే తొలగిపోతుంది. దిగ్గజం ఘీంకారం వినిపిస్తుంది. -
'నన్ను బ్లాటర్ లైంగికంగా వేధించాడు'
న్యూయార్క్:దశాబ్దాల పాటు ప్రపంచ ఫుట్ బాల్ సమాఖ్య(ఫిఫా)పై గుత్తాధిపత్యాన్ని ప్రదర్శించి ఆపై అవినీతి ఆరోపణల కారణంగా అధ్యక్ష పదవిని కోల్పోయిన సెప్ బ్లాటర్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా బ్లాటర్ పై అమెరికా మహిళా ఫుట్‌బాల్ జట్టు మాజీ గోల్‌కీపర్ హోప్ సోలో లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. 2013 జనవరిలో ప్రతిష్ఠాత్మక బాలన్ డిఓర్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు బ్లాటర్ తన పిరు దులపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడంటూ హోప్ సోలో ఆరోపించింది. తాను వేదికను ఎక్కే సమయంలో బ్లాటర్ ఈ పని చేశాడంటూ పోర్చుగీస్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హోప్ తెలిపింది. మహిళా ఫుట్ బాలర్లకు అధికారుల నుంచి వేధింపులు సహజమేనని పేర్కొన్న హోప్.. ఇకనైనా మరికొంత మంది ముందుకు వచ్చి వాస్తవాలు వెల్లడిస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా, ఆమె ఆరోపణల్ని సెప్ బ్లాటర్ ఖండించారు. అమెరికా జాతీయ జట్టు తరపున 202 మ్యాచ్ ల్లో పాల్గొన్న హోప్.. 153 విజయాల్లో భాగస్వామ్యం అయ్యింది. మరొకవైపు 102షూటౌట్లతో ఒక అంతర్జాతీయ రికార్డును హోప్ సాధించింది. -
సెప్ బ్లాటర్ కథ ముగిసినట్లేనా?
జ్యూరిచ్:అంతర్జాతీయ ఫుట్ బాల్ సంఘాల సమాఖ్య(ఫిపా)లో భారీ అవినీతికి పాల్పడి ఆరేళ్ల పాటు నిషేధానికి గురైన మాజీ అధ్యక్షుడు సెప్ బ్లాటర్ కథ ముగిసినట్లే కనబడుతోంది. తన ఆరేళ్ల నిషేధాన్ని సవాల్ చేస్తూ కోర్ట్ ఆఫ్ స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్‌లో దాఖలు చేసిన పిటిషన్‌పై బ్లాటర్‌కు చుక్కెదురైంది. ఆ పిటిషన్‌ను కోర్టు సోమవారం తిరస్కరించడంతో బ్లాటర్ ఇక మళ్లీ ఫిఫాలోకి వచ్చే అవకాశాలు కనబడటం లేదు. ఈ మేరకు సోమవారం విచారించిన కోర్టు..బాట్లర్ నిషేధంపై దాఖలైన పిటిషన్‌ను కొట్టిపారేసింది. దాదాపు 12 కోట్ల రూపాయిలను(2 మిలియన్ డాలర్లు)ను యూఈఎఫ్ఏ అధ్యక్షుడు ప్లాటినీ ఖాతాలోకి తరలించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాని చర్యగా కోర్టు పేర్కొంది. ఇదిలా ఉండగా, ఈ తీర్పుతో తాను సంతృప్తి చెందలేదని బ్లాటర్ స్పష్టం చేశాడు. కాగా, ఆ తీర్పును స్విస్ సుప్రీంకోర్టులో సవాల్ చేసే ఉద్దేశం కూడా లేదని తెలిపాడు. దాంతోపాటు తాను ఏ తప్పు చేయలేదనే వాదనకు బ్లాటర్ కట్టుబడ్డాడు. సుమారు 41 ఏళ్ల ఫిఫా అనుభవం తన సొంతమని బ్లాటర్ పేర్కొన్నాడు.సాకర్ గేమ్‌లో అనేక విజయాలను చూసిన తనకు, అపజయాలను కూడా చూశానంటూ నిర్వేదం వ్యక్తం చేశాడు. పదిహేడు సంవత్సరాలకు పైగా ప్రపంచ ఫుట్‌బాల్‌ను కనుసైగలతో శాసించిన ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్ ను ఇటీవల ఫిఫా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఎనిమిదేళ్ల పాటు అతనిపై నిషేధం విధిస్తూ ఫిఫా నిర్ణయం తీసుకుంది. దాన్ని కోర్టులో సవాల్ చేయడంతో బ్లాట్లర్ నిషేధం ఆరేళ్లకు తగ్గింది. మరోసారి తన నిషేధాన్ని సవాల్ చేస్తూ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టును ఆశ్రయించినా అతనికి అనుకూలంగా తీర్పు రాలేదు. ప్రస్తుతం బ్లాటర్ లేటు వయసులో ఉండటం ఒక కారణమైతే, ఆరేళ్ల తరువాత పరిస్థితులు అతనికి అనుకూలంగా ఉంటాయని చెప్పడానికి వీల్లేదు. దీంతో బ్లాటర్ కు ఫిఫాతో ఉన్న బంధం-అనుబంధం ముగిసిందనే చెప్పొచ్చు. -
‘డ్రా’లను కూడా ఫిక్స్ చేశారు
యూరోపియన్ టోర్నీలపై బ్లాటర్ జ్యూరిచ్: కొన్ని యూరోపియన్ టోర్నీల ‘డ్రా’లను కూడా తమకు అనుకూలంగా ఫిక్స్ చేసుకున్నారని ‘ఫిఫా’ మాజీ అధ్యక్షుడు సెప్ బ్లాటర్ సంచలన ఆరోపణలు చేశారు. దీని కోసం చల్లని, వేడి బంతులను ఉపయోగించారని తెలిపారు. ‘డ్రా’కు ముందు చిన్న ఫుట్బాల్స్పై ఆయా జట్ల పేర్లను రాస్తారు. తమకు కావాల్సిన జట్టు బంతిని ముందే ఫ్రిజ్‌లో ఉంచి అనుకూలమైన ‘డ్రా’లో వేస్తారని చెప్పారు. అయితే తన హయాంలో మాత్రం ఇలా ఒక్క డ్రా కూడా ఫిక్స్ కాలేదని స్పష్టం చేవారు. మరోవైపు తన అవినీతికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలను స్విస్, యూఎస్ పరిశోధకులు ఇప్పటిదాకా సేకరించలేకపోయారని బ్లాటర్ తెలిపారు. తనపై జరిగిందంతా ఓ కుట్రగా ఆయన పేర్కొన్నారు. -
'వారిపై జీవితకాల నిషేధం విధించాలి'
లండన్: అంతర్జాతీయ ఫుట్ బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా)లో సంచలనం సృష్టించిన భారీ అవినీతిలో కీలకపాత్ర పోషించిన మాజీ అధ్యక్షుడు సెప్ బ్లాటర్పై అర్జెంటీనా మాజీ ఫుట్ బాల్ కెప్టెన్ డిగో మారడోనా మండిపడ్డాడు. అసలు బ్లాటర్ పై జీవితకాల నిషేధం వేయకుండా అతని నిషేధ సమయాన్ని ఆరు సంవత్సరాలకు తగ్గించి తప్పుచేశారన్నాడు. బ్లాటర్తో పాటు ఫుట్ బాల్ కు మచ్చతెచ్చిన యూరోపియన్ సాకర్ చీఫ్ ప్లాటినిని కూడా తన జీవిత కాలంలో ఫిఫా వైపు చూడకుండా చేయాలని సూచించాడు. వీరిద్దరి నిషేధాన్ని ఎనిమిది నుంచి ఆరేళ్లకు తగ్గించిన ఫిఫా ఎథిక్స్ కమిటీ తీరును సైతం తప్పుపట్టాడు. ఎథిక్స్ కమిటీ చేసింది సరైన చర్యగా కనబడటం లేదన్నాడు. దీంతో పాటు తాజాగా ఫిఫా అధ్యక్షుడిగా ఎన్నికైన ఇన్ఫెంటినోపై కూడా మారడోనా విమర్శలు గుప్పించాడు. అతనొక విశ్వాసఘాతకుడు అంటూ తీవ్రవ్యాఖ్యలు చేశాడు. -
ఆరేళ్లకు తగ్గిన బ్లాటర్, ప్లాటిని నిషేధం
జ్యూరిచ్: ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్, యూఈ ఎఫ్ఏ అధ్యక్షుడు మైకేల్ ప్లాటినిలపై నిషేధం ఎనిమిదేళ్ల నుంచి ఆరేళ్లకు తగ్గింది. బుధవారం ఫిఫా అప్పీల్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 2011లో 2 మిలియన్ డాలర్లను ప్లాటినికి చెల్లించేం దుకు బ్లాటర్ అంగీకరించడం ఈ వివాదానికి కారణం. ఫిఫా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచి గెలవాలని భావించిన ప్లాటినికి ఈ నిషేధంతో దారులు మూసుకుపోయినట్టే. శుక్రవారం ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. నిషేధాలను ఎత్తివేయాల్సిందిగా కోరుతూ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సీఏఎస్)కు వెళతామని ఇరువురు తెలిపారు. అలాగే అధ్యక్ష ఓటింగ్‌కు పారదర్శక బూత్‌లను ఏర్పాటు చేయాలన్న అభ్యర్థి ప్రిన్స్ అలీ విజ్ఞప్తిని సీఏఎస్ తోసిపుచ్చింది. -
బ్లాటర్, ప్లాటినిలపై ఎనిమిదేళ్ల నిషేధం
ఫిఫా ఎథిక్స్ కమిటీ సంచలన నిర్ణయం జ్యూరిచ్: ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అధ్యక్షుడు సెప్ బ్లాటర్, ఉపాధ్యక్షుడు మైకేల్ ప్లాటినిలపై ఎనిమిదేళ్ల నిషేధం విధిస్తూ ఫిఫా ఎథిక్స్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ కాలంలో వీరిద్దరు ఫుట్‌బాల్‌కు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొన రాదని ఆదేశించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి రానుంది. అలాగే బ్లాటర్పై 50 వేల డాలర్లు, ప్లాటినిపై 80 వేల స్విస్ ఫ్రాంక్స్ జరిమానాగా విధించారు. ఫిఫా అధ్యక్ష పదవిపై కన్నేసిన ప్లాటిని ఆశలు అడుగంటినట్టే. 2011లో ప్లాటినికి 2 మిలియన్ల డాలర్లను బ్లాటర్ చెల్లించడం ఈ వివాదానికి మూల కారణం. అయితే ఫిఫాకు కన్సల్టెంట్‌గా ఉన్నందుకే ప్లాటినికి ఈ మొత్తం చెల్లించానని బ్లాటర్ వాదించినప్పటికీ ఎథిక్స్ కమిటీ ఆయన వాదనలతో విభేదించింది. -
సెప్ బ్లాటర్ అవుట్
జురిచ్: పదిహేడు సంవత్సరాలకు పైగా ప్రపంచ ఫుట్‌బాల్‌ను కనుసైగలతో శాసించిన ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్ ను సస్పెండ్ చేశారు. ఈ ఏడాది మేనెలలో ఐదోసారి ఫిఫా అధ్యక్షుడిగా ఎన్నికైన బ్లాటర్ పై అవినీతి ఆరోపణలు మరింత తీవ్రతరం కావడంతో అతన్ని ఎనిమిదేళ్ల పాటు సస్పెండ్ చేశారు. బ్లాటర్ తో పాటు, ఉపాధ్యక్షుడు మిచెల్ ప్లాటినిపై కూడా ఎనిమిదేళ్ల నిషేధం పడింది. దీంతో అమెరికా, ఇంగ్లండ్‌లతో పాటు యూరోపియన్ సమాఖ్య(యూఈఎఫ్ఏ) లు బ్లాటర్ ను బయటకు పంపాలని చేసిన ప్రయత్నం ఎట్టకేలకు ఫలించినట్లయ్యింది. దాదాపు రెండు మిలియన్ డాలర్లకు పైగా అవినీతి సొమ్ము వారి ఖాతాల్లోకి వెళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో ఫిఫా చర్యలు చేపట్టింది. కొన్ని నెలలుగా దర్యాప్తు జరిగిన పిదప ఈ ఘటన ఓ కొలిక్కి వచ్చింది. వీరిద్దరు తమ అధికారాలను దుర్వినియోగం చేశారని కోర్టు తాజాగా పేర్కొంది. బ్లాటర్ కు యాభైవేల డాలర్లు, ప్లాటినికి ఎనభై వేల డాలర్లు జరిమానా విధిస్తున్నట్లు కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. బ్లాటర్ కథ ముగిసినట్లేనా! బ్లాటర్ పై ఎనిమిదేళ్ల నిషేధం పడటంతో అతని కథ దాదాపు ముగిసినట్లే కనబడుతోంది. ఈ ఏడాది మే నెలలో ఐదో సారి ఫిఫా అధ్యక్షుడిగా ఎన్నికైన బ్లాటర్ పై అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడంతో కొద్ది నెలలకే పదవికి రాజీనామ చేశారు. ఆ తరువాత విచారణను ఎదుర్కొన్నా.. అవినీతి ఆరోపణల నుంచి బయటకొచ్చి తిరిగి మళ్లీ పోటీ చేసి గెలుస్తానంటూ సవాల్ విసిరారు. కాగా, బ్లాటర్ పై అవినీతిని ధృవీకరించిన ఫిఫా అతనిపై సుదీర్ఘకాలం వేటు వేసింది. దీంతో బ్లాటర్ ఫిఫాకు దూరమైనట్లే. ప్రస్తుతం బ్లాటర్ లేటు వయసులో ఉండటం ఒక కారణమైతే, ఎనిమిదేళ్ల తరువాత పరిస్థితులు అతనికి అనుకూలంగా ఉంటాయని చెప్పడానికి వీల్లేదు. దీంతో బ్లాటర్ కు ఫిఫాతో ఉన్న బంధం-అనుబంధం ముగిసిందనే చెప్పొచ్చు. అసలేం జరిగిందంటే... 2010లో ఫిఫా ఎగ్జిక్యూటివ్ కమిటీలో 2018, 2022 ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ నిర్వహణ హక్కుల కోసం బిడ్డింగ్ జరిగింది. ఓటింగ్‌లో 2018 టోర్నీ కోసం రష్యా.. 2022 టోర్నీ కోసం ఖతార్ నిర్వహణ హక్కులు గెలుచుకున్నాయి. అయితే ఈ వ్యవహారం వెనుక చాలా పెద్ద స్థాయిలోనే డబ్బులు చేతులు మారాయని ఆరోపణలు వినిపించాయి. సభ్య దేశాలకు చెందిన అధికారులు ఈ రెండు దేశాలకు అనుకూలంగా ఓటేయడానికి మిలియన్ల డాలర్లను ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినట్టు సమాచారం. అలాగే 2010లో దక్షిణాఫ్రికాలో జరిగిన టోర్నీ కోసం కూడా 10 మిలియన్ డాలర్లను లంచాల రూపంలో తీసుకున్నట్టు గతంలో యూఎస్ పరిశోధక సంస్థ పేర్కొంది. -
బ్లాటర్‌కు నోబెల్
• శాంతి బహుమతి ఇవ్వాలి • రష్యా అధ్యక్షుడు పుతిన్ మాస్కో: ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) మాజీ అధ్యక్షుడు సెప్ బ్లాటర్ అత్యంత గౌరవనీయ వ్యక్తి అని, ఆయనకు నోబెల్ శాంతి బహుమతి అందజేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభిప్రాయపడ్డారు. ‘ప్రపంచ ఫుట్‌బాల్ అభివృద్ధికి బ్లాటర్ ఎంతగానో కృషి చేశారు. కేవలం దీన్ని క్రీడగానే భావించకుండా వివిధ దేశాల, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు ఓ అవకాశంగా మలుచుకున్నారు. అందుకే నోబెల్ శాంతి బహుమతి అందుకునే అర్హత బ్లాటర్‌కు ఉంది. ఆయనపై ప్రస్తుతం కొనసాగుతున్న అవినీతి విచారణ వెనుక పాశ్యాత్య దేశాల కుట్ర దాగి ఉంది’ అని పుతిన్ అన్నారు. 2 మిలియన్ డాలర్ల అవకతవకలపై బ్లాటర్పై 90 రోజుల సస్పెన్షన్‌తో పాటు క్రిమినల్ విచారణ సాగుతున్న విషయం తెలిసిందే. -
ఫిబ్రవరి 26న ‘ఫిఫా’ ఎన్నికలు
జ్యూరిచ్: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) ప్రత్యేక ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న జరగనున్నాయి. అవినీతి ఆరోపణలతో అనూహ్యంగా ‘ఫిఫా’ అధ్యక్ష పదవికి ఈ ఏడాది జూన్ 2న సెప్ బ్లాటర్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కొత్తగా మరొకరిని ఎంచుకునేందుకు ఈ ఎన్నికలు నిర్వహించాలని ‘ఫిఫా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది. అధ్యక్ష పదవి కోసం అభ్యర్థులు అక్టోబర్ 26 వరకు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. మాజీ ఆటగాళ్లు మైకేల్ ప్లాటిని (ఫ్రాన్స్), జికో (బ్రెజిల్) ఈ ప్రతిష్టాత్మక పదవి కోసం పోటీ పడుతున్నారు. బ్లాటర్‌కు చేదు అనుభవం ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన బ్లాటర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన మాట్లాడటానికి సిద్ధమైన సమయంలో ఇంగ్లండ్ హాస్య నటుడు లీ నెల్సన్ (అసలు పేరు సైమన్ బ్రాడ్కిన్) నకిలీ కరెన్సీ నోట్ల కట్టలను బ్లాటర్పైకి విసిరాడు. బ్లాటర్ అవినీతిని విమర్శిస్తున్నట్లుగా అతని చర్య సాగింది. సెక్యూరిటీ అధికారులు నెల్సన్‌ను బయటికి తీసుకెళ్లగా బ్లాటర్ కూడా వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికి వెనక్కి వచ్చి సమావేశంలో పాల్గొన్నారు. -
మళ్లీ ఫిఫా అధ్యక్ష ఎన్నికలు!
జ్యూరిచ్: భారీ అవినీతి ఉదంతంతో సంచలనం సృష్టించిన అంతర్జాతీయ ఫుట్ బాల్ సంఘాల సమాఖ్య(ఫిఫా ) లో మరోసారి అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా సోమవారం సాకర్ వరల్డ్ గవర్నింగ్ బాడీ ప్రధాన కార్యాలయంలో ఫిఫా ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీ కానుంది. ఇప్పటికే అధ్యక్ష ఎన్నికల తేదీపై ఫిఫా వైస్ ప్రెసిడెంట్ జెఫ్రీ వెబ్ తో అధ్యక్షుడు సెప్ బ్లాటర్ సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ అధ్యక్ష ఎన్నికల రేసులో యూఈఎఫ్ఏ అధ్యక్షుడు ,ఫ్రెంచ్ దేశానికి చెందిన మైకేల్ ప్లాటిని(60) ముందు వరుసలో ఉన్నారు. కాగా, భారత సంతతికి చెందిన అమెరికన్ సునీల్ గులాటి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. మాజీ బాస్ సెప్ బ్లాటర్ వారసుడిగా ఆయన పేరు తెరపైకి వచ్చింది. గత మే 29వ తేదీన జరిగిన ఎన్నికల్లో ఐదోసారి ఫిఫా అధ్యక్షుడిగా బ్లాటర్ ఎన్నిక కావడం.. ఆపై రెండు రోజులకే బ్లాటర్ రాజీనామా చేయడం తెలిసిందే. ఫిఫాలో వెలుగు చూసిన అవినీతి ఆరోపణలతో ఆరుగురు ఫిఫా అధికారులు అరెస్ట్ కావడంతో బ్లాటర్ తన పదవికి రాజీనామా చేశారు. వీరిలో ఫిఫా వైస్ ప్రెసిడెంట్ జెఫ్రీ వెబ్ కూడా ఉండటంతో బ్లాటర్ అధ్యక్షపదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అవినీతి ఆరోపణలపై అరెస్టైన జెఫ్రీ వెబ్ ను ఈ మధ్యనే న్యూయార్క్ కోర్టుకు హాజరయ్యాడు. జెఫ్రీకి 10 మిలియన్ డాలర్లు (రూ.63 కోట్లు) పూచీకత్తుతో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేయడంతో అతను పోలీసుల చెరనుంచి విముక్తి లభించింది. -
'ఆ ప్రభావం 2018 వరల్డ్ కప్ పై ఉండదు'
మాస్కో: 2018 లో రష్యాలో జరగనున్న ఫుట్ బాల్ వరల్డ్ కప్ టోర్నీకి సంబంధించి ఎటువంటి మార్పు ఉండబోదని ఆ దేశ క్రీడా మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఈ ఏడాది జరిగిన ఫిఫా అధ్యక్ష ఎన్నికల్లో సెప్ బ్లాటర్ విజయం సాధించడం.. ఆపై ఫిఫాలో అవినీతి ఆరోపణలు తారా స్థాయికి చేరడంతో బ్లాటర్ తన పదవికి రాజీనామా చేశాడు. కాగా, 2018 (రష్యా), 2022 (ఖతార్) ప్రపంచకప్ ఆతిథ్య హక్కులు ఆయా దేశాలకు దక్కేందుకు లంచాలు తీసుకున్నారనే కారణంతో ఇప్పటికే పలువురు ఫిఫా పెద్దలు విచారణ ఎదుర్కొంటున్నారు. దీనిలో భాగంగానే బ్లాటర్ ను విచారించేందుకు యూఎస్, స్విట్జర్లాండ్ దేశాలు రంగం సిద్ధం చేశాయి. ఈ క్రమంలో 2018 రష్యాలో జరుగుతుందా?లేదా? అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. దీనిపై తాజాగా స్పందించిన రష్యా క్రీడావ్యవహారాల మంత్రి విటలీ ముక్తో దానికి ముగింపు పలికాడు. ప్రస్తుతం ఫిఫా ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యుడిగా ఉన్న ముక్తో.. ఏ కొత్త అధ్యక్షుడు వచ్చినా తదుపరి ఫుట్ బాల్ వరల్డ్ కప్ టోర్నీ రష్యాలోనే జరుగుతుందని తేల్చిచెప్పారు. ఆ వరల్డ్ కప్ నిర్వహణ అనేది రష్యా ప్రాజెక్టు కాదు.. ఫిఫా ప్రాజెక్టు అని ముక్తో స్పష్టం చేశాడు. ఇప్పటికే మేనేజ్ మెంట్ తీసుకున్న ఆ నిర్ణయంలో ఎటువంటి మార్పులు ఉండవన్నాడు. -
బ్లాటర్ కు అరెస్ట్ భయం
జ్యూరిచ్:ఐదోసారి అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అధ్యక్షుడిగా ఎన్నికై.. ఆపై రాజీనామా చేసిన సెప్ బ్లాటర్ కు అరెస్ట్ భయం పట్టుకుంది. ఒకవేళ తాను స్విట్జర్లాండ్ ను విడిచి వెళితే అమెరికాకు చెందిన ఎఫ్ బీఐ(ఫెడరల్ బ్యూరో ఇన్విస్టిగేషన్) అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆయన తాజాగా స్పష్టం చేశాడు. తాను ప్రస్తుతం దేశం విడిచి బయటకు వెళ్లాలని అనుకోవడం లేదని బ్లాటర్ తెలిపాడు. 2018 (రష్యా), 2022 (ఖతార్) ప్రపంచకప్ ఆతిథ్య హక్కులు ఆయా దేశాలకు దక్కేందుకు లంచాలు తీసుకున్నారనే కారణంతో తొమ్మిది మంది ఫిఫా అధికారులతో పాటు మరో ఐదుగుర్ని ఎఫ్ బీఐ విచారించనుంది. దీంతో బ్లాటర్ కు అరెస్ట్ భయం వెంటాడుతోంది. ఒకవేళ తాను దేశం విడిచి బయటకు వెళితే విచారణ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని బ్లాటర్ అభిప్రాయపడుతున్నాడు. బ్లాటర్ ఫిఫాలో ప్రత్యక్షంగా ఎటువంటి అవినీతికి పాల్పడకపోయినా.. విచారణ నిమిత్తం ఎఫ్ బీఐ అదుపులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
'నేను రాజీనామా చేయలేదు'
జ్యురిచ్:అంతర్జాతీయ ఫుట్ బాల్ సంఘాల సమాఖ్య(ఫిఫా)లో చెలరేగిన వివాదాలకు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేటట్లు కనబడుట లేదు. ఇప్పటికే అవినీతి వివాదాలతో సతమవుతున్నఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్ అగ్నికి మరోసారి ఆజ్యం పోసే యత్నం చేశాడు. ఫిఫా అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నట్లు కొన్ని రోజుల క్రితం బ్లాటర్ ప్రకటించినా.. అసలు రాజీనామానే చేయలేదని తాజాగా పేర్కొన్నాడు. గత నెల్లో జరిగిన ఎన్నికల్లో ఐదోసారి ఫిఫా అధ్యక్షుడిగా ఎన్నికైన బ్లాటర్... తరువాత నాలుగు రోజులకే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తన వారసుడిని ఎన్నుకోవడానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని కూడా మీడియాకు తెలిపాడు. అయితే నిబంధనల ప్రకారం బ్లాటర్ డిసెంబర్ వరకు పదవిలో కొనసాగనున్న నేపధ్యంలో తన రాజీనామాపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. -
బ్లాటర్... వెంటనే తప్పుకో...
యూరోపియన్ పార్లమెంట్ డిమాండ స్ట్రాస్‌బర్గ్ (ఫ్రాన్స్) : ఫిఫా అధ్యక్ష బాధ్యతల నుంచి తక్షణం తప్పుకోవాలంటూ సెప్ బ్లాటర్‌ను యూరోపియన్ పార్లమెంట్ (ఈయూ) డిమాండ్ చేసింది. తాత్కాలిక అధ్యక్షుడికి పగ్గాలు అప్పగించి ఫిఫాలో సంస్కరణలు ప్రవేశపెట్టాలని సూచించింది. ఐదో పర్యాయం ఫిఫా చీఫ్‌గా ఎన్నికైన నాలుగు రోజులకే బ్లాటర్ రాజీనామా చేసినా... నిబంధనల ప్రకారం డిసెంబర్ వరకు పదవిలో కొనసాగనున్నారు. ఫిఫాలో సంస్కరణలు ఆలస్యమైతే ఫుట్‌బాల్‌కు తీరని నష్టం ఏర్పడుతుందని ఈయూ ఆందోళన వ్యక్తం చేసింది. -
'నాకు బ్లాటర్ తో అఫైర్ లేదు'
లండన్:ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్ తో తాను అఫైర్ కొనసాగిస్తున్నట్లు వచ్చిన వార్తలను రష్యన్ మోడల్ ఇరినా షాయక్ ఖండించింది. ఆ నిరాధారమైన రూమర్లు తనను కలచి వేశాయని స్పష్టం చేసింది. పోర్చుగీస్ ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో తో 2010 నుంచి ప్రేమాయణం నడిపిన ఇరినా.. దానికి గత సంవత్సరం బ్రేకప్ చెప్పింది. ప్రస్తుతం హాలీవుడ్ స్టార్ బ్రాడ్ లీ కూపర్ తో రిలేషన్ సాగిస్తున్న ఇరియానా తాజాగా బ్లాటర్ కు దగ్గరయ్యిందని స్పెయిన్ కు చెందిన ఓ న్యూస్ పేపర్ పేర్కొంది. అయితే దీనిపై ఇరియానా తీవ్రంగా మండిపడింది. తనకు బ్లాటర్ తో అఫైర్ ను అంటగడుతూ ప్రచురించిన వార్తల వెనుక ఉద్దేశమేమిటో అర్ధం కావడం లేదని విమర్శించింది. ఆ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఐదోసారి ఫిఫా అధ్యక్షుడిగా ఎన్నికైన జోసెఫ్ సెప్ బ్లాటర్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 1998లో తొలిసారి ఫిఫా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బ్లాటర్... 17 ఏళ్లుగా ఆ పదవిలో కొనసాగారు. -
ఐఓసీ సమావేశంలో పాల్గొనడం లేదు
బ్లాటర్పై ఫిఫా ప్రకట లాసానే : వచ్చే వారం జరిగే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సమావేశానికి సెప్ బ్లాటర్ హాజరు కావడం లేదని ఫిఫా ప్రకటించింది. ఐదోసారి ఫిఫా అధ్యక్షుడిగా ఎన్నికైన నాలుగురోజులకే పదవి నుంచి తప్పుకున్న బ్లాటర్ ఒలింపిక్ కమిటీలోనూ సభ్యుడుగా ఉన్నారు. లాసానేలో జరిగే ఈ సమావేశానికి హాజరుకాబోనని గత ఏప్రిల్‌లోనే బ్లాటర్ తెలిపారని, ఇప్పుడు కూడా ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని ఫిఫా అధికార ప్రతినిధి చెప్పారు. 1999 నుంచి ఒలింపిక్ కమిటీలో ఫుట్‌బాల్ ప్రతినిధిగా 79 ఏళ్ల బ్లాటర్ కొనసాగుతున్నారు. -
ఫిఫాలో మరో అవినీతి కలకలం!
జ్యురిచ్: అంతర్జాతీయ ఫుట్ బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా)లో అవినీతికి మరింత ఆజ్యం పోస్తూ తాజాగా బయటపడిన లేఖ తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే ఫిఫా అధికారులు లంచాలు తీసుకుని పలు దేశాలకు ఫుట్ బాల్ వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులు కట్టబెట్టిన ఆరోపణలకు మరింత బలాన్నిస్తూ వెలుగుచూసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2010వ సంవత్సరంలో ఫుట్ బాల్ ప్రపంచకప్ మ్యాచ్ లు తమ దేశంలో నిర్వహించేందుకు దక్షిణాఫ్రికా ఫుట్ బాల్ అసోసియేషన్ భారీగా లంచాన్ని ఇవ్వజూపినట్లు తెలుస్తోంది . దీనిలో భాగంగానే దక్షిణాఫ్రికా ఫుట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు డానీ జోర్డాన్ తమ దేశాన్ని బిడ్ రేస్ లో నిలిపేందుకు 10 మిలియన్ డాలర్లు లంచాన్ని ఎరవేస్తూ ఫిఫా అధికారులకు ఆ లేఖ రాసి ఉండవచ్చని యూఎస్ న్యాయవాదులు అనుమానిస్తున్నారు. 2018 (రష్యా), 2022 (ఖతార్) ప్రపంచకప్ ఆతిథ్య హక్కులు ఆయా దేశాలకు దక్కేందుకు లంచాలు తీసుకున్నారనే కారణంతో ఫిఫా ఉపాధ్యక్షుడితో పాటు మరో ఆరుగురిని స్విట్జర్లాండ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
బ్లాటర్ రాజీనామా
ఫిఫా అధ్యక్ష పదవికి గుడ్‌బై డిసెంబరు తర్వాత కొత్త ప్రెసిడెంట్ జ్యూరిచ్ : అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా)లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గత శుక్రవారం ఐదోసారి ఫిఫా అధ్యక్షుడిగా ఎన్నికైన జోసెఫ్ సెప్ బ్లాటర్... తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి కారణాలు వెల్లడి కాలేదు. 1998లో తొలిసారి ఫిఫా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బ్లాటర్... 17 ఏళ్లుగా ఆ పదవిలో కొనసాగారు. ‘నా వారసుడిని ఎన్నుకోవడానికి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాను’ అంటూ మంగళవారం జ్యూరిచ్‌లోని ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బ్లాటర్ వ్యాఖ్యానించారు. 2011లో స్వీకరించిన ముడుపుల కేసులో ఇప్పటికే తన సహచరులు అరెస్ట్ కావడంతో ఆయన కాస్త ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం. మరోవైపు యూరోపియన్ ఫుట్‌బాల్ సంఘాలు ప్రపంచకప్‌లో పాల్గొనకుండా బ్లాటర్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయి. నార్త్ అమెరికా దేశాలతో కలిసి ‘ఫిఫా’ను తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ పరిణామాలతో అయోమయానికి గురైన బ్లాటర్ రాజీనామాకు సిద్ధపడ్డారు. అయితే ఇప్పుటికిప్పుడు ఆయన ఫిఫాను వదిలి వెళ్లే అవకాశాల్లేవు. నిబంధనల ప్రకారం డిసెంబర్ వరకు ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. కాబట్టి డిసెంబర్-మార్చి మధ్యలో మళ్లీ ఎన్నికలు జరిపి కొత్త అధ్యక్షుడ్ని ఎన్నుకునే వరకు ఆయనే పదవిలో కొనసాగుతారు. -
ఇదంతా అమెరికా కుట్ర..
ప్రత్యర్థుల ఎత్తుల్ని తుత్తునీయాలుచేసి ఏడోసారి ఫిఫా అధ్యక్షుడిగా గెలుపొందిన సెప్ బ్లాటర్.. అమెరికా తీరుపై నిప్పులు చెరిగారు. ప్రపంచకప్ నిర్వహణల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ అమెరికాకు చెందిన అవినీతి నిరోధక శాఖ ఫిపా ప్రముఖుల్ని అరెస్టుచేయడాన్ని పెద్దన్న కుట్రగా ఆయన అభివర్ణించారు. ఫిఫా అధ్యక్షుడిగా గెలుపొందిన తర్వాత అమెరికా కుయుక్తులపై మొదటిసారి ఆయన నోరువిప్పారు. అమెరికా ఫిఫాను టార్గెట్ చేయడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని, యురోపియన్ ఫుట్‌బాల్ యూనియన్ల నాయకుల ద్వారా యూఎస్.. ఫిఫాను పిప్పి చేసేందుకు యత్నిస్తోందని బ్లాటర్ ఆరోపించారు. చైనాకు చెందిన జింగ్హువా న్యూస్ ఏజెన్సీ ఆదివారం ప్రసారం చేసిన వార్తాకథనంలో ఈ విషయాలను పేర్కొన్నారు. యూఎస్ ఆదేశానుసారం గతవారం ఫిఫాకు చెందిన ఏడుగురు సీనియర్ అధికారులను, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లను జ్యూరిచ్ లోని హోటల్ గదుల్లో స్విస్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఫిఫా 65వ కాంగ్రెస్ సమావేశానికి రెండు రోజుల ముందే ఈ అరెస్టులు చోటుచేసుకోవడం వెనుక కుట్ర కోణం దాగుందనే వాదనలు వినిపించాయి. బ్లాటర్ తాజా వ్యాఖ్యలు వాటిని నిజం చేశాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. అరెస్టులు జరిగినరోజే ఆ వ్యవహారాన్ని అమెరికా ఆడుతున్న నాటకంగా అభివర్ణించారు. 2018, 2022లో ఫుట్‌బాల్ ప్రపంచకప్ వేడుకలు నిర్వహించాలనుకుని బిడ్డింగ్‌లో మట్టికరిచిన ఇంగ్లాండ్, అమెరికాలు ఫిఫాపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని క్రీడారంగ నిపుణులు సైతం వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. -
‘గోల్’ తప్పని వేటగాడు
అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) 1904లో ఏర్పాటైంది. 1998 వరకు ఇది ఓ సాధారణ క్రీడా సంస్థ. 10 మంది సిబ్బందితో ఓ చిన్న ఆఫీసులో కార్యకలాపాలు నిర్వహించేవారు. టోర్నీలు నిర్వహించాలంటే అప్పు కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. కట్ చేస్తే 17 ఏళ్ల తర్వాత.... ప్రస్తుతం 1400 మంది ఉద్యోగులు... కళ్లుచెదిరే భవంతి... కోట్లాది రూపాయలను కళ్లుమూసుకుని ఇచ్చేంత ధనిక సంస్థ. ఈ మార్పు వెనక ఉన్న ప్రధాన శక్తి బ్లాటర్. ఫిఫాను అత్యంత శక్తివంతమైన క్రీడా సంస్థగా ఆయన తీర్చి దిద్దారు. అందుకే ఎన్ని ఆరోపణలు వచ్చినా ఆయన వరుసగా ఐదోసారి ఫిఫా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సాక్షి క్రీడావిభాగం : జోసెఫ్ సెప్ బ్లాటర్... ప్రస్తుతం ప్రపంచ ఫుట్‌బాల్‌ను బలీయమైన శక్తిగా తీర్చిదిద్దిన 79 ఏళ్ల స్విస్ కురు వృద్ధుడు. 111 ఏళ్ల చరిత్ర ఉన్న ఫిఫాలో బ్లాటర్‌కు ముందు ఏడుగురు అధ్యక్షులుగా పని చేశారు. కానీ ఎవరూ ఆటను విశ్వవ్యాప్తం చేయలేకపోయారు. ఆఫ్రికా ఖండంలో ప్రపంచకప్ అనే కలను సాకారం చేసి చూపించిన వ్యక్తి బ్లాటర్. ఆయన ఎత్తులు, మార్కెటింగ్ వ్యూహాలు ఫుట్‌బాల్‌కు కాసుల పంట పండించాయి. చిన్న దేశాలను నిర్లక్ష్యం చేయకుండా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయనను ఐదోసారీ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టాయి. టెక్నికల్ డెరైక్టర్ నుంచి... 1975లో తొలిసారి ఫిఫాలో టెక్నికల్ డెరైక్టర్‌గా అడుగుపెట్టిన బ్లాటర్... ఊహించని రీతిలో ఎదిగారు. 1981లో ప్రధాన కార్యదర్శి పదవిని సాధించడంతో గవర్నింగ్ బాడీలో ఆయన హవా మొదలైంది. అధికారం కోసం అడ్డదారులు తొక్కుతున్నారనే ఆరోపణలు వచ్చినా... ఏమాత్రం లెక్క చేయకుండా 1998లో ఏకంగా అధ్యక్ష పదవికే పోటీ చేశారు. ఆఫ్రికా, ఆసియా, యూరోపియన్ దేశాల మద్దతు కూడగట్టి అదే ఏడాది జూన్‌లో 8న మొట్టమొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బ్రెజిల్‌కు చెందిన జావో హవలాంజ్ నుంచి బాధ్యతలు స్వీకరించే నాటికి ఫిఫా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఖజానాలో కనీసం ఓ మిలియన్ డాలర్లు కూడా లేని పరిస్థితి. దీనికి తోడు వివాదాలు. వీటన్నింటిని తన చాకచక్యంతో పరిష్కరించిన బ్లాటర్ చిన్న చిన్న లీగ్‌లకు, టోర్నీలకు కూడా ఆర్థిక ప్రయోజనాలు కలిగేలా ప్రణాళికలు రచించారు. ఫలితం యూరోపియన్ దేశాల్లో క్లబ్‌లకు కనక వర్షం కురిసింది. ఆటకు ఆదరణ పెరగడంతో లీగ్‌ల సంఖ్య కూడా పెరిగిపోయింది. ఇక్కడే వాణిజ్య మార్కెటింగ్‌కు అనువుగా ఆటను మల్చడంలో బ్లాటర్ కీలక పాత్ర పోషించారు. అంతే స్పాన్సర్లు క్యూ కట్టారు. చిన్న దేశాలు సైతం ఫిఫా సభ్యత్వం కోసం ఆటను మొదలుపెట్టే స్థాయికి చేరుకునేలా చేశాయి. దీన్ని గ్రహించిన బ్లాటర్... ఫుట్‌బాల్ ఆడే ప్రతి దేశానికి ఫిఫా నుంచి సమాన మొత్తంలో డబ్బు అందేలా చూశారు. స్పెయిన్‌కు ఓ రకంగా గినియాకు మరో రకంగా కాకుండా పారితోషికం, వాటాలు సమాన స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా చిన్న దేశాలన్నీ బ్లాటర్ గుప్పిట్లోకి వచ్చేశాయి. గత ఐదు పర్యాయాలు భారత్ బ్లాటర్‌కే ఓటు వేయడం దీనికో చక్కని ఉదాహరణ. అవినీతి ఆరోపణలు 2002లో రెండోసారి అధ్యక్షుడి కోసం పోటీ పడుతున్న తరుణంలో ఆర్థిక లావాదేవీల్లో తేడాలు, తెరవెనుక ఒప్పందాలు అంటూ బ్లాటర్పై రూమర్లు వచ్చాయి. ఓటు వేస్తే తమకు చెరో లక్ష డాలర్లు ఇస్తానని ఆశ చూపినట్లు ఆఫ్రికన్, సోమాలియా ఫుట్‌బాల్ సంఘాలు ఆరోపించాయి. అయినా కూడా మిగతా దేశాలు మాత్రం బ్లాటర్‌కే మద్దతివ్వడంతో మళ్లీ పగ్గాలు అందుకున్నారు. 2002 ప్రపంచకప్‌కు ముందు ఫిఫాలోనూ విభేదాలు తలెత్తాయి. బ్లాటర్ నిర్ణయాల వల్ల మార్కెటింగ్ పార్ట్నర్ ఐఎస్ఎల్కు 100 మిలియన్ డాలర్లు నష్టం వచ్చిందని సెక్రటరీ జనరల్ రూఫిన్ స్విస్ అధికారులకు రహస్య పత్రాలను అందజేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు బ్లాటర్ది తప్పేమీ లేదని తేల్చారు. 2007, 2011లో కూడా ఇంతకంటే ఎక్కువ ఆరోపణలు చుట్టు ముట్టినా ఫిఫాలో తన ఆధిపత్యాన్ని మాత్రం తగ్గనీయలేదు. ఈసారి ప్రత్యర్థులు మరింత చురుగ్గా వ్యవహరించినా... బ్లాటర్ ఆధిపత్యాన్ని అడ్డుకోలేకపోయారు. కుటుంబ నేపథ్యం... స్విట్జర్లాండ్‌లోని విస్ప్ అనే చిన్న గ్రామంలో 1936లో బ్లాటర్ జన్మించారు. బిజినెస్, ఎకానమీలో డిగ్రీ సాధించిన తర్వాత పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌గా, స్పోర్ట్స్ జర్నలిస్ట్‌గా, ఐస్ హాకీకి జనరల్ సెక్రటరీగా పని చేశారు. చిన్నప్పట్నించీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న బ్లాటర్... సంపాదన కోసం చాలా రకాల ఉద్యోగాలు చేశారు. ఇప్పటి వరకు మూడు పెళ్లిళ్లు చేసుకున్న బ్లాటర్‌కు ఓ కుమార్తె ఉంది. అప్పుడప్పుడు ఆడవాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడటం బ్లాటర్‌కు అలవాటు. ఫుట్‌బాల్‌కు మరింత ఆదరణ పెరగాలంటే మహిళలకు ఆటలో అవకాశం కల్పించాలని చెప్పే బ్లాటర్... ఆడవాళ్ల స్కర్ట్ సైజ్ ఎంత చిన్నగా ఉంటే ఆటకు ఆంత ప్రాచుర్యం వస్తుందని వ్యాఖ్యానిస్తుంటారు. ప్రస్తుతం 51 ఏళ్ల లిండాతో ఆయన సహజీవనం చేస్తున్నారు. -
అందర్నీ క్షమిస్తా.. కానీ మర్చిపోను!
జ్యురిచ్: యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్ బాల్ అసోసియేషన్ (యూఈఎఫ్ఎ) నుంచి తనకు వచ్చిన బెదిరింపులపై ఫిఫా నూతన అధ్యక్షుడు సెప్ బ్లాటర్ స్పందించాడు. తనకు వ్యతిరేకంగా యూఈఎఫ్ఏ అనేక రకాలైన ఆరోపణలు స్పష్టించడం అత్యంత బాధ కల్గించిందని పేర్కొన్నాడు. వారు ఆరోపణలు చేసేంది కేవలం ఒక వ్యక్తిపై కాదు.. మొత్తం వ్యవస్థనే విషయం గుర్తించుకోవాలని బ్లాటర్ తెలిపారు.ఈ ఘటనను తాను ఎప్పటికీ మర్చిపోలేనన్నాడు. 'నాపై యూఈఎఫ్ఎ అనవసర రాద్దాంతం చేసింది. అది నిజంగా సిగ్గు చేటు. ఒక్కడ్నే లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడ్డారు. అది నా ఒక్కడికే సంబంధించినది కాదు. యావత్ ఫుట్ బాల్ వ్యవస్థనే కించపరిచినట్లుగా ఉంది.అయితే దీనిపై అందర్నీక్షమిస్తా. కాకపోతే ఈ చర్యలను మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను' అని బ్లాటర్ తెలిపాడు. శుక్రవారం జరిగిన అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అధ్యక్ష ఎన్నికల్లో బ్లాటర్... జోర్డాన్ ప్రిన్స్ బిన్ అల్ హుస్సేన్‌పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 209 మంది సభ్యులు పాల్గొన్న ఈ ఓటింగ్ లో బ్లాటర్ విజయాన్ని చేజిక్కించుకున్నాడు. -
బ్లాటర్‌కే పట్టం
ఐదోసారి ఫిఫా అధ్యక్షుడిగా ఎన్నిక జోర్డాన్ ప్రిన్స్ హుస్సేన్‌కు నిరాశ జ్యూరిచ్ : అవినీతి ఆరోపణలు చుట్టుముట్టినా... ఎన్నికలకు ఒక్కరోజు ముందు సహచరుల అరెస్టు జరిగినా... అమెరికా, ఇంగ్లండ్‌లతో పాటు యూరోపియన్ యూనియన్ బెదిరించినా... ఫుట్‌బాల్ ప్రపంచంలో సెప్ బ్లాటర్ ఆధిపత్యం చెక్కుచెదరలేదు. శుక్రవారం జరిగిన అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అధ్యక్ష ఎన్నికల్లో బ్లాటర్... జోర్డాన్ ప్రిన్స్ బిన్ అల్ హుస్సేన్‌పై ఘన విజయం సాధించారు. నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ఈ ఓటింగ్‌లో మొత్తం 209 మంది సభ్యులు పాల్గొన్నారు. తొలి రౌండ్లో 209కి గాను మూడు ఓట్లు చెల్లలేదు. మిగిలిన 206లో బ్లాటర్‌కు 133 ఓట్లు వచ్చాయి. హుస్సేన్‌కు 73 ఓట్లు మాత్రమే దక్కాయి. ఫిఫా నిబంధనల ప్రకారం విజయం సాధించాలంటే మూడింట రెండొంతుల ఓట్లు (140) రావాలి. దీంతో రెండోరౌండ్ ఎన్నిక జరపాలని నిర్ణయించారు. రెండో రౌండ్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్లే గెలిచినట్లు. అయితే రెండో రౌండ్ ఆరంభానికి ముందే జోర్డాన్ ప్రిన్స్ తన ఓటమిని అంగీకరించి పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో 79 ఏళ్ల బ్లాటర్ ఐదోసారి ఫిఫా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గత 17 సంవత్సరాలుగా ఆయనే ఈ పదవిలో ఉన్నారు. ఈ ఎన్నిక వల్ల మరో నాలుగేళ్లు ఆయన కొనసాగుతారు. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని మెజారిటీ దేశాలు బ్లాటర్‌కు అండగా నిలవడం ఆయనకు కలిసొచ్చింది. అంతకుముందు ఓటింగ్ జరుగుతున్న హాల్లో బాంబు ఉందనే ఫోన్‌కాల్‌తో కాసేపు గందరగోళం నెలకొంది. పోలీసులు, ఫిఫా భద్రతాధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత బాంబు లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇటీ వల జరిగిన పరిణామాలతో ఫిఫా ప్రతిష్ట కొంత దెబ్బతిన్నదని, రాబోయే నాలుగేళ్లలో అంతా సరిదిద్దుతానని బ్లాటర్ వ్యాఖ్యానించారు. -
‘ఫిఫా’ను దెబ్బతీసేందుకు యత్నం
ఖతర్‌పై ఆరోపణలకు జాతివివక్షే కారణం విరుచుకుపడిన బ్లాటర్ సావోపాలో: సాకర్ ప్రపంచకప్-2022 ఆతిథ్య హక్కులను ఖతర్ భారీగా లంచం ముట్టజెప్పి సొంతం చేసుకుందన్న ఆరోపణలపై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అధ్యక్షుడు సెప్ బ్లాటర్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఖతర్‌పై అవినీతి ఆరోపణలకు జాతి వివక్షే కారణమని మండిపడ్డారు. అదే సమయంలో ఫిఫాను దెబ్బతీసేందుకే ప్రయత్నిస్తున్నారని బ్లాటర్ విరుచుకుపడ్డారు. ‘ఫిఫా బలంగా ఉండటాన్ని వాళ్లు ఓర్వలేకపోతున్నారు. అందుకే ఫిఫాను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మనం కలిసి ముందుకు వెళితే ఎవరూ ఏమీ చేయలేరు’ అని బ్లాటర్ అన్నారు. ఫిఫా వార్షిక సమావేశం జరగనున్న నేపథ్యంలో ఆసియా, ఆఫ్రికాకు చెందిన ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. కొనసాగుతున్న విచారణ మరోవైపు ఈ అవినీతి ఆరోపణలపై ఫిఫా అధికారి మైకేల్ గార్సియా తన విచారణను సోమవారమే ముగించాల్సింది. అయితే ఈ విచారణ ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గార్సియా తన నివేదికను ఫిఫా అడ్జ్యూడికేటరి చాంబర్‌కు జూలై మూడో వారంలో సమర్పించనున్నారు. మరోసారి ఫిఫా అధ్యక్షుడిగా! ఫిఫా అధ్యక్షుడిగా సెప్ బ్లాటర్ ఐదోసారి ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచకప్ సందర్భంగా ఫిఫా వార్షిక సర్వసభ్య సమావేశం జరగనున్న నేపథ్యంలో బ్లాటర్ ఇప్పటికే అధ్యక్షుడి బరిలో నిలవనున్నట్లు సంకేతాలు కూడా ఇచ్చారు.