'ఆ ప్రభావం 2018 వరల్డ్ కప్ పై ఉండదు'
మాస్కో: 2018 లో రష్యాలో జరగనున్న ఫుట్ బాల్ వరల్డ్ కప్ టోర్నీకి సంబంధించి ఎటువంటి మార్పు ఉండబోదని ఆ దేశ క్రీడా మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఈ ఏడాది జరిగిన ఫిఫా అధ్యక్ష ఎన్నికల్లో సెప్ బ్లాటర్ విజయం సాధించడం.. ఆపై ఫిఫాలో అవినీతి ఆరోపణలు తారా స్థాయికి చేరడంతో బ్లాటర్ తన పదవికి రాజీనామా చేశాడు. కాగా, 2018 (రష్యా), 2022 (ఖతార్) ప్రపంచకప్ ఆతిథ్య హక్కులు ఆయా దేశాలకు దక్కేందుకు లంచాలు తీసుకున్నారనే కారణంతో ఇప్పటికే పలువురు ఫిఫా పెద్దలు విచారణ ఎదుర్కొంటున్నారు. దీనిలో భాగంగానే బ్లాటర్ ను విచారించేందుకు యూఎస్, స్విట్జర్లాండ్ దేశాలు రంగం సిద్ధం చేశాయి. ఈ క్రమంలో 2018 రష్యాలో జరుగుతుందా?లేదా? అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.
దీనిపై తాజాగా స్పందించిన రష్యా క్రీడావ్యవహారాల మంత్రి విటలీ ముక్తో దానికి ముగింపు పలికాడు. ప్రస్తుతం ఫిఫా ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యుడిగా ఉన్న ముక్తో.. ఏ కొత్త అధ్యక్షుడు వచ్చినా తదుపరి ఫుట్ బాల్ వరల్డ్ కప్ టోర్నీ రష్యాలోనే జరుగుతుందని తేల్చిచెప్పారు. ఆ వరల్డ్ కప్ నిర్వహణ అనేది రష్యా ప్రాజెక్టు కాదు.. ఫిఫా ప్రాజెక్టు అని ముక్తో స్పష్టం చేశాడు. ఇప్పటికే మేనేజ్ మెంట్ తీసుకున్న ఆ నిర్ణయంలో ఎటువంటి మార్పులు ఉండవన్నాడు.