సోచీ: ఫిఫా వరల్డ్ కప్ నుంచి ఆతిథ్య రష్యా నిష్క్రమించిన సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా శనివారం క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు అద్భుత ప్రదర్శన చేశాయి. నిర్ణీత సమయంలో(అదనపు సమయంతో కలుపుకుని) రష్యా, క్రొయేషియా జట్లు తలో రెండు గోల్స్ చేశాయి. దాంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది.
నిర్ణయాత్మక పెనాల్టీ షూటౌట్‌లో క్రొయేషియా 4-3తో విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టింది. వరల్డ్‌కప్‌లో క్రొయేషియా సెమీస్ చేరడం ఇది రెండోసారి. 1998లో తొలిసారి ప్రపంచకప్‌లో ఆడిన ఆ జట్టు మూడో స్థానంలో నిలిచింది. మెగా టోర్నీలో క్రొయేషియా జట్టు మరో సెమీస్‌కు చేరడంతో ఆ దేశ ఆటగాళ్లతో పాటు అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఇక ఆ దేశ అధ్యక్షురాలు కొలిండా గ్రాబర్ కిటారోవిక్ ఆనందానికైతే అవధుల్లేవు.
క్రొయేషియా జెర్సీ ధరించి మరీ తమ దేశ ఆటగాళ్లకు ఆమె మద్దతు తెలిపారు. మ్యాచ్ ఆరంభం నుంచి ఎంతో ఉత్సాహంగా కనిపించిన ఆమె.. క్రొయేషియా సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్న తర్వాత ఆనందంలో మునిగిపోయారు. ఈ క్రమంలో రష్యా ప్రధానమంత్రి దిమిత్రి మెద్వెదేవ్ ఎదురుగానే ఆనందంతో ఎగిరి గంతులేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment