
బ్లాటర్ కు అరెస్ట్ భయం
జ్యూరిచ్:ఐదోసారి అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అధ్యక్షుడిగా ఎన్నికై.. ఆపై రాజీనామా చేసిన సెప్ బ్లాటర్ కు అరెస్ట్ భయం పట్టుకుంది. ఒకవేళ తాను స్విట్జర్లాండ్ ను విడిచి వెళితే అమెరికాకు చెందిన ఎఫ్ బీఐ(ఫెడరల్ బ్యూరో ఇన్విస్టిగేషన్) అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆయన తాజాగా స్పష్టం చేశాడు. తాను ప్రస్తుతం దేశం విడిచి బయటకు వెళ్లాలని అనుకోవడం లేదని బ్లాటర్ తెలిపాడు.
2018 (రష్యా), 2022 (ఖతార్) ప్రపంచకప్ ఆతిథ్య హక్కులు ఆయా దేశాలకు దక్కేందుకు లంచాలు తీసుకున్నారనే కారణంతో తొమ్మిది మంది ఫిఫా అధికారులతో పాటు మరో ఐదుగుర్ని ఎఫ్ బీఐ విచారించనుంది. దీంతో బ్లాటర్ కు అరెస్ట్ భయం వెంటాడుతోంది. ఒకవేళ తాను దేశం విడిచి బయటకు వెళితే విచారణ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని బ్లాటర్ అభిప్రాయపడుతున్నాడు. బ్లాటర్ ఫిఫాలో ప్రత్యక్షంగా ఎటువంటి అవినీతికి పాల్పడకపోయినా.. విచారణ నిమిత్తం ఎఫ్ బీఐ అదుపులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.