సెప్ బ్లాటర్ అవుట్
జురిచ్: పదిహేడు సంవత్సరాలకు పైగా ప్రపంచ ఫుట్‌బాల్‌ను కనుసైగలతో శాసించిన ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్ ను సస్పెండ్ చేశారు. ఈ ఏడాది మేనెలలో ఐదోసారి ఫిఫా అధ్యక్షుడిగా ఎన్నికైన బ్లాటర్ పై అవినీతి ఆరోపణలు మరింత తీవ్రతరం కావడంతో అతన్ని ఎనిమిదేళ్ల పాటు సస్పెండ్ చేశారు. బ్లాటర్ తో పాటు, ఉపాధ్యక్షుడు మిచెల్ ప్లాటినిపై కూడా ఎనిమిదేళ్ల నిషేధం పడింది. దీంతో అమెరికా, ఇంగ్లండ్‌లతో పాటు యూరోపియన్ సమాఖ్య(యూఈఎఫ్‌ఏ) లు బ్లాటర్ ను బయటకు పంపాలని చేసిన ప్రయత్నం ఎట్టకేలకు ఫలించినట్లయ్యింది.
దాదాపు రెండు మిలియన్ డాలర్లకు పైగా అవినీతి సొమ్ము వారి ఖాతాల్లోకి వెళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో ఫిఫా చర్యలు చేపట్టింది. కొన్ని నెలలుగా దర్యాప్తు జరిగిన పిదప ఈ ఘటన ఓ కొలిక్కి వచ్చింది. వీరిద్దరు తమ అధికారాలను దుర్వినియోగం చేశారని కోర్టు తాజాగా పేర్కొంది. బ్లాటర్ కు యాభైవేల డాలర్లు, ప్లాటినికి ఎనభై వేల డాలర్లు జరిమానా విధిస్తున్నట్లు కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.
బ్లాటర్ కథ ముగిసినట్లేనా!
బ్లాటర్ పై ఎనిమిదేళ్ల నిషేధం పడటంతో అతని కథ దాదాపు ముగిసినట్లే కనబడుతోంది. ఈ ఏడాది మే నెలలో ఐదో సారి ఫిఫా అధ్యక్షుడిగా ఎన్నికైన బ్లాటర్ పై అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడంతో కొద్ది నెలలకే పదవికి రాజీనామ చేశారు. ఆ తరువాత విచారణను ఎదుర్కొన్నా.. అవినీతి ఆరోపణల నుంచి బయటకొచ్చి తిరిగి మళ్లీ పోటీ చేసి గెలుస్తానంటూ సవాల్ విసిరారు. కాగా, బ్లాటర్ పై అవినీతిని ధృవీకరించిన ఫిఫా అతనిపై సుదీర్ఘకాలం వేటు వేసింది. దీంతో బ్లాటర్ ఫిఫాకు దూరమైనట్లే. ప్రస్తుతం బ్లాటర్ లేటు వయసులో ఉండటం ఒక కారణమైతే, ఎనిమిదేళ్ల తరువాత పరిస్థితులు అతనికి అనుకూలంగా ఉంటాయని చెప్పడానికి వీల్లేదు. దీంతో బ్లాటర్ కు ఫిఫాతో ఉన్న బంధం-అనుబంధం ముగిసిందనే చెప్పొచ్చు.
అసలేం జరిగిందంటే...
2010లో ఫిఫా ఎగ్జిక్యూటివ్ కమిటీలో 2018, 2022 ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ నిర్వహణ హక్కుల కోసం బిడ్డింగ్ జరిగింది. ఓటింగ్‌లో 2018 టోర్నీ కోసం రష్యా.. 2022 టోర్నీ కోసం ఖతార్ నిర్వహణ హక్కులు గెలుచుకున్నాయి. అయితే ఈ వ్యవహారం వెనుక చాలా పెద్ద స్థాయిలోనే డబ్బులు చేతులు మారాయని ఆరోపణలు వినిపించాయి. సభ్య దేశాలకు చెందిన అధికారులు ఈ రెండు దేశాలకు అనుకూలంగా ఓటేయడానికి మిలియన్ల డాలర్లను ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినట్టు సమాచారం. అలాగే 2010లో దక్షిణాఫ్రికాలో జరిగిన టోర్నీ కోసం కూడా 10 మిలియన్ డాలర్లను లంచాల రూపంలో తీసుకున్నట్టు గతంలో యూఎస్ పరిశోధక సంస్థ పేర్కొంది.