ఫిబ్రవరి 26న ‘ఫిఫా’ ఎన్నికలు
జ్యూరిచ్: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) ప్రత్యేక ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న జరగనున్నాయి. అవినీతి ఆరోపణలతో అనూహ్యంగా ‘ఫిఫా’ అధ్యక్ష పదవికి ఈ ఏడాది జూన్ 2న సెప్ బ్లాటర్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కొత్తగా మరొకరిని ఎంచుకునేందుకు ఈ ఎన్నికలు నిర్వహించాలని ‘ఫిఫా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది. అధ్యక్ష పదవి కోసం అభ్యర్థులు అక్టోబర్ 26 వరకు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. మాజీ ఆటగాళ్లు మైకేల్ ప్లాటిని (ఫ్రాన్స్), జికో (బ్రెజిల్) ఈ ప్రతిష్టాత్మక పదవి కోసం పోటీ పడుతున్నారు.
బ్లాటర్‌కు చేదు అనుభవం
ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన బ్లాటర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన మాట్లాడటానికి సిద్ధమైన సమయంలో ఇంగ్లండ్ హాస్య నటుడు లీ నెల్సన్ (అసలు పేరు సైమన్ బ్రాడ్‌కిన్) నకిలీ కరెన్సీ నోట్ల కట్టలను బ్లాటర్‌పైకి విసిరాడు. బ్లాటర్ అవినీతిని విమర్శిస్తున్నట్లుగా అతని చర్య సాగింది. సెక్యూరిటీ అధికారులు నెల్సన్‌ను బయటికి తీసుకెళ్లగా బ్లాటర్ కూడా వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికి వెనక్కి వచ్చి సమావేశంలో పాల్గొన్నారు.