‘గోల్’ తప్పని వేటగాడు | From a technical director ...to fifa president | Sakshi
Sakshi News home page

‘గోల్’ తప్పని వేటగాడు

Published Sun, May 31 2015 1:09 AM | Last Updated on Fri, Jun 15 2018 4:33 PM

‘గోల్’ తప్పని వేటగాడు - Sakshi

‘గోల్’ తప్పని వేటగాడు

అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) 1904లో ఏర్పాటైంది. 1998 వరకు ఇది ఓ సాధారణ క్రీడా సంస్థ. 10 మంది సిబ్బందితో ఓ చిన్న ఆఫీసులో కార్యకలాపాలు నిర్వహించేవారు. టోర్నీలు నిర్వహించాలంటే అప్పు కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. కట్ చేస్తే 17 ఏళ్ల తర్వాత.... ప్రస్తుతం 1400 మంది ఉద్యోగులు... కళ్లుచెదిరే భవంతి... కోట్లాది రూపాయలను కళ్లుమూసుకుని ఇచ్చేంత ధనిక సంస్థ. ఈ మార్పు వెనక ఉన్న ప్రధాన శక్తి బ్లాటర్. ఫిఫాను అత్యంత శక్తివంతమైన క్రీడా సంస్థగా ఆయన తీర్చి దిద్దారు. అందుకే ఎన్ని ఆరోపణలు వచ్చినా ఆయన వరుసగా ఐదోసారి ఫిఫా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
 
 సాక్షి క్రీడావిభాగం : జోసెఫ్ సెప్ బ్లాటర్... ప్రస్తుతం ప్రపంచ ఫుట్‌బాల్‌ను బలీయమైన శక్తిగా తీర్చిదిద్దిన 79 ఏళ్ల స్విస్ కురు వృద్ధుడు. 111 ఏళ్ల చరిత్ర ఉన్న ఫిఫాలో బ్లాటర్‌కు ముందు ఏడుగురు అధ్యక్షులుగా పని చేశారు. కానీ ఎవరూ ఆటను విశ్వవ్యాప్తం చేయలేకపోయారు. ఆఫ్రికా ఖండంలో ప్రపంచకప్ అనే కలను సాకారం చేసి చూపించిన వ్యక్తి బ్లాటర్. ఆయన ఎత్తులు, మార్కెటింగ్ వ్యూహాలు ఫుట్‌బాల్‌కు కాసుల పంట పండించాయి. చిన్న దేశాలను నిర్లక్ష్యం చేయకుండా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయనను ఐదోసారీ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టాయి.
 
 టెక్నికల్ డెరైక్టర్ నుంచి...
 1975లో తొలిసారి ఫిఫాలో టెక్నికల్ డెరైక్టర్‌గా అడుగుపెట్టిన బ్లాటర్... ఊహించని రీతిలో ఎదిగారు. 1981లో ప్రధాన కార్యదర్శి పదవిని సాధించడంతో గవర్నింగ్ బాడీలో ఆయన హవా మొదలైంది. అధికారం కోసం అడ్డదారులు తొక్కుతున్నారనే ఆరోపణలు వచ్చినా... ఏమాత్రం లెక్క చేయకుండా 1998లో ఏకంగా అధ్యక్ష పదవికే పోటీ చేశారు. ఆఫ్రికా, ఆసియా, యూరోపియన్ దేశాల మద్దతు కూడగట్టి అదే ఏడాది జూన్‌లో 8న మొట్టమొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

బ్రెజిల్‌కు చెందిన జావో హవలాంజ్ నుంచి బాధ్యతలు స్వీకరించే నాటికి ఫిఫా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఖజానాలో కనీసం ఓ మిలియన్ డాలర్లు కూడా లేని పరిస్థితి. దీనికి తోడు వివాదాలు. వీటన్నింటిని తన చాకచక్యంతో పరిష్కరించిన బ్లాటర్ చిన్న చిన్న లీగ్‌లకు, టోర్నీలకు కూడా ఆర్థిక ప్రయోజనాలు కలిగేలా ప్రణాళికలు రచించారు. ఫలితం యూరోపియన్ దేశాల్లో క్లబ్‌లకు కనక వర్షం కురిసింది. ఆటకు ఆదరణ పెరగడంతో లీగ్‌ల సంఖ్య కూడా పెరిగిపోయింది. ఇక్కడే వాణిజ్య మార్కెటింగ్‌కు అనువుగా ఆటను మల్చడంలో బ్లాటర్ కీలక పాత్ర పోషించారు.

అంతే స్పాన్సర్లు క్యూ కట్టారు. చిన్న దేశాలు సైతం ఫిఫా సభ్యత్వం కోసం ఆటను మొదలుపెట్టే స్థాయికి చేరుకునేలా చేశాయి. దీన్ని గ్రహించిన బ్లాటర్... ఫుట్‌బాల్ ఆడే ప్రతి దేశానికి ఫిఫా నుంచి సమాన మొత్తంలో డబ్బు అందేలా చూశారు. స్పెయిన్‌కు ఓ రకంగా గినియాకు మరో రకంగా కాకుండా పారితోషికం, వాటాలు సమాన స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా చిన్న దేశాలన్నీ బ్లాటర్ గుప్పిట్లోకి వచ్చేశాయి. గత ఐదు పర్యాయాలు భారత్ బ్లాటర్‌కే ఓటు వేయడం దీనికో చక్కని ఉదాహరణ.

 అవినీతి ఆరోపణలు
 2002లో రెండోసారి అధ్యక్షుడి కోసం పోటీ పడుతున్న తరుణంలో ఆర్థిక లావాదేవీల్లో తేడాలు, తెరవెనుక ఒప్పందాలు అంటూ బ్లాటర్‌పై రూమర్లు వచ్చాయి. ఓటు వేస్తే తమకు చెరో లక్ష డాలర్లు ఇస్తానని ఆశ చూపినట్లు ఆఫ్రికన్, సోమాలియా ఫుట్‌బాల్ సంఘాలు ఆరోపించాయి. అయినా కూడా మిగతా దేశాలు మాత్రం బ్లాటర్‌కే మద్దతివ్వడంతో మళ్లీ పగ్గాలు అందుకున్నారు. 2002 ప్రపంచకప్‌కు ముందు ఫిఫాలోనూ విభేదాలు తలెత్తాయి.

బ్లాటర్ నిర్ణయాల వల్ల మార్కెటింగ్ పార్ట్‌నర్ ఐఎస్‌ఎల్‌కు 100 మిలియన్ డాలర్లు నష్టం వచ్చిందని సెక్రటరీ జనరల్ రూఫిన్ స్విస్ అధికారులకు రహస్య పత్రాలను అందజేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు బ్లాటర్‌ది తప్పేమీ లేదని తేల్చారు. 2007, 2011లో కూడా ఇంతకంటే ఎక్కువ ఆరోపణలు చుట్టు ముట్టినా ఫిఫాలో తన ఆధిపత్యాన్ని మాత్రం తగ్గనీయలేదు. ఈసారి ప్రత్యర్థులు మరింత చురుగ్గా వ్యవహరించినా... బ్లాటర్ ఆధిపత్యాన్ని అడ్డుకోలేకపోయారు.

  కుటుంబ నేపథ్యం...
  స్విట్జర్లాండ్‌లోని విస్ప్ అనే చిన్న గ్రామంలో 1936లో బ్లాటర్ జన్మించారు. బిజినెస్, ఎకానమీలో డిగ్రీ సాధించిన తర్వాత పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌గా, స్పోర్ట్స్ జర్నలిస్ట్‌గా, ఐస్ హాకీకి జనరల్ సెక్రటరీగా పని చేశారు. చిన్నప్పట్నించీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న బ్లాటర్... సంపాదన కోసం చాలా రకాల ఉద్యోగాలు చేశారు. ఇప్పటి వరకు మూడు పెళ్లిళ్లు చేసుకున్న బ్లాటర్‌కు ఓ కుమార్తె ఉంది. అప్పుడప్పుడు ఆడవాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడటం బ్లాటర్‌కు అలవాటు. ఫుట్‌బాల్‌కు మరింత ఆదరణ పెరగాలంటే మహిళలకు ఆటలో అవకాశం కల్పించాలని చెప్పే బ్లాటర్... ఆడవాళ్ల స్కర్ట్ సైజ్ ఎంత చిన్నగా ఉంటే ఆటకు ఆంత ప్రాచుర్యం వస్తుందని వ్యాఖ్యానిస్తుంటారు. ప్రస్తుతం 51 ఏళ్ల లిండాతో ఆయన సహజీవనం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement