‘ఫిఫా’ను దెబ్బతీసేందుకు యత్నం
ఖతర్‌పై ఆరోపణలకు జాతివివక్షే కారణం విరుచుకుపడిన బ్లాటర్
సావోపాలో: సాకర్ ప్రపంచకప్-2022 ఆతిథ్య హక్కులను ఖతర్ భారీగా లంచం ముట్టజెప్పి సొంతం చేసుకుందన్న ఆరోపణలపై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అధ్యక్షుడు సెప్ బ్లాటర్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఖతర్‌పై అవినీతి ఆరోపణలకు జాతి వివక్షే కారణమని మండిపడ్డారు. అదే సమయంలో ఫిఫాను దెబ్బతీసేందుకే ప్రయత్నిస్తున్నారని బ్లాటర్ విరుచుకుపడ్డారు. ‘ఫిఫా బలంగా ఉండటాన్ని వాళ్లు ఓర్వలేకపోతున్నారు. అందుకే ఫిఫాను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మనం కలిసి ముందుకు వెళితే ఎవరూ ఏమీ చేయలేరు’ అని బ్లాటర్ అన్నారు. ఫిఫా వార్షిక సమావేశం జరగనున్న నేపథ్యంలో ఆసియా, ఆఫ్రికాకు చెందిన ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు.
కొనసాగుతున్న విచారణ
మరోవైపు ఈ అవినీతి ఆరోపణలపై ఫిఫా అధికారి మైకేల్ గార్సియా తన విచారణను సోమవారమే ముగించాల్సింది. అయితే ఈ విచారణ ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గార్సియా తన నివేదికను ఫిఫా అడ్జ్యూడికేటరి చాంబర్‌కు జూలై మూడో వారంలో సమర్పించనున్నారు.
మరోసారి ఫిఫా అధ్యక్షుడిగా!
ఫిఫా అధ్యక్షుడిగా సెప్ బ్లాటర్ ఐదోసారి ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచకప్ సందర్భంగా ఫిఫా వార్షిక సర్వసభ్య సమావేశం జరగనున్న నేపథ్యంలో బ్లాటర్ ఇప్పటికే అధ్యక్షుడి బరిలో నిలవనున్నట్లు సంకేతాలు కూడా ఇచ్చారు.