దోహా: సాకర్ ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయర్స్‌లో భారత్‌కు తమకన్నా మెరుగైన జట్టు ఖతర్ చేతిలో పరాజయం ఎదురైంది. గ్రూప్–ఇలో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 0–1 స్కోరుతో ఓడిపోయింది. ఆట మొదలైన కాసేపటికే ఖతర్ ఆటగాళ్లు భారత గోల్‌పోస్ట్‌పై దాడులకు పదును పెట్టారు. అయితే భారత డిఫెండర్లు చురుగ్గా స్పందించడంతో నిరాశ తప్పలేదు. 13వ నిమిషంలో ఖతర్ స్ట్రయికర్ అబ్దెల్ అజిజ్ గోల్‌పోస్ట్ కుడివైపు నుంచి క్రాస్‌షాట్ ఆడగా... అది బార్‌పైనుంచి బయటకు వెళ్లిపోవడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది.
30వ నిమిషంలో భారత స్ట్రయికర్ మన్వీర్ ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌వైపు దూసుకొచ్చాడు. గోల్ కోసం అతను చేసిన ప్రయత్నాన్ని డిఫెండర్లు నీరుగార్చారు. అయితే మరో మూడు నిమిషాల తర్వాత ఖతర్ బోణీకొట్టింది. 33వ నిమిషంలో యూసుఫ్ నుంచి వచ్చిన పాస్‌ను ఈ సారి అబ్దెల్ అజిజ్ ఎలాంటి పొరపాటు చేయకుండా భారత డిఫెన్స్‌ను ఛేదిస్తూ ఆతిథ్య జట్టుకు గోల్ సాధించి పెట్టాడు. తొలి అర్ధభాగం ముగిసేసరికి ఖతర్ 1–0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ద్వితీయార్ధంలో స్కోరు సమం చేసేందుకు భారత ఆటగాళ్లు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరకు ఖతర్ 1–0తో విజయం సాధించింది. ఆట 18వ నిమిషంలోనే డిఫెండర్ బెకెకు రిఫరీ రెడ్‌కార్డ్ చూపించాడు. దాంతో సింహభాగం మ్యాచ్‌ను భారత్ పది మందితోనే ఆడాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment