Soccer World Cup
-
Qatar FIFA World Cup 2022: మెస్సీ మెరిసె... జగమే మురిసె...
టోర్నమెంట్ ప్రారంభానికి ముందు ఎన్నో వివాదాలు... వేడిమి వాతావరణంతో ఇబ్బందులు తప్పవేమోనని ఆటగాళ్ల సందేహాలు... ఆంక్షల మధ్య అభిమానులు ఆటను ఆస్వాదిస్తారో లేదోనని ఏమూలనో అనుమానం... కానీ ఒక్కసారి ‘కిక్’ మొదలుకాగానే... గోల్స్ మోత మోగింది... సంచలనాలతో సాకర్ సంరంభం షురూ అయింది... ఫైనల్ మ్యాచ్ చివరి క్షణం దాకా అదే ఉత్కంఠ కొనసాగింది... విశ్వవ్యాప్తంగా అభిమానులందరూ చిరకాలం గుర్తుండేలా ‘ఖతర్’నాక్ ప్రపంచకప్ సూపర్‌హిట్ అయ్యింది. ప్రపంచ నంబర్‌వన్ బ్రెజిల్ జిగేల్ మనలేదు... బెంబేలెత్తిస్తుందనుకున్న బెల్జియం బోల్తా కొట్టింది... పూర్వ వైభవం సాధిస్తుందనుకున్న జర్మనీ ఇంకా సంధికాలంలోనే ఉన్నామని సంకేతాలు పంపించింది... క్రిస్టియానో రొనాల్డో జట్టు పోర్చు‘గల్లంతయింది’... ఆతిథ్యంలో అద్భుతమనిపించినా... ఆతిథ్య జట్టు ‘ఖతర్’నాక్ ఆటతో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. 56 ఏళ్లుగా మరో ప్రపంచకప్ టైటిల్ కోసం నిరీక్షిస్తున్న ఇంగ్లండ్ దానిని మరో నాలుగేళ్లకు పొడిగించుకోగా... నెదర్లాండ్స్ ‘షూటౌట్’లో అవుట్ అయింది... సౌదీ అరేబియా, జపాన్, ఆస్ట్రేలియా అడపాదడపా మెరిసి ప్రిక్వార్టర్ ఫైనల్‌కే పరిమితంకాగా... డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ అంచనాలను నిలబెట్టుకుంది. అర్జెంటీనా ఆరంభ విఘ్నాన్ని అధిగమించి ఆఖరకు జగజ్జేతగా నిలిచి ఔరా అనిపించి సాకర్ సంగ్రామానికి శుభంకార్డు వేసింది. అంచనాలను మించి... 29 రోజులపాటు సాగిన ఈ సాకర్ సమరంలో అందరి అంచనాలను తారుమారు చేసి ఆకట్టుకున్న జట్టు మొరాకో. 2018 ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియాతో తొలి మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించి, రెండో మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ బెల్జియంను బోల్తా కొట్టించి... మూడో మ్యాచ్‌లో కెనడాపై గెలిచిన మొరాకో గ్రూప్ ‘ఎఫ్’ టాపర్‌గా నిలిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో 2010 ప్రపంచ చాంపియన్ స్పెయిన్‌పై ‘షూటౌట్’లో గెలిచిన మొరాకో క్వార్టర్ ఫైనల్లో 1–0తో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ జట్టును ఇంటిదారి పట్టించి ప్రపంచకప్ చరిత్రలో సెమీఫైనల్ చేరిన తొలి ఆఫ్రికా జట్టుగా ఘనత సాధించింది. అయితే సెమీఫైనల్లో పటిష్టమైన ఫ్రాన్స్ చేతిలో పోరాడి ఓడిన మొరాకో మూడో స్థానం కోసం మ్యాచ్‌లో క్రొయేషియా చేతిలోనూ ఓడిపోయి నాలుగో స్థానంతో ఈ మెగా ఈవెంట్‌ను ముగించింది. మెస్సీ ఇంకొన్నాళ్లు... 36 ఏళ్ల అర్జెంటీనా ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించిన మెస్సీ తన కెరీర్లో లోటుగా ఉన్న విశ్వ కిరీటాన్ని సొంతం చేసుకొని దిగ్గజాల సరసన చేరిపోయాడు. సౌదీ అరేబియా చేతిలో ఆరంభ మ్యాచ్‌లోనే ఓడిపోయినా తన నాయకత్వ పటిమతో జట్టును ముందుండి నడిపించిన మెస్సీ ఆ తర్వాత ట్రోఫీ ముద్దాడేవరకు వెనుదిరిగి చూడలేదు. ఫ్రాన్స్‌తో ఫైనల్ అర్జెంటీనా తరఫున తన చివరి మ్యాచ్ అని ప్రకటించిన 35 ఏళ్ల మెస్సీ జట్టు జగజ్జేతగా నిలవడంతో తన నిర్ణయంపై పునరాలోచించాడు. ప్రపంచ చాంపియన్ అనే హోదాను ఇంకొన్నాళ్లు ఆస్వాదిస్తానని... జాతీయ జట్టుకు మరికొన్ని మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నానని తన మనసులోని మాటను వెల్లడించాడు. మెస్సీ కోరుకుంటే 2026 ప్రపంచకప్‌లోనూ ఆడవచ్చని అర్జెంటీనా కోచ్ లియోనల్ స్కలోని వ్యాఖ్యానించారు. ఈ టోర్నీలో ఏడు గోల్స్ సాధించిన మెస్సీ అత్యధిక ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గానూ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. భవిష్యత్ ఎంబాపెదే... నాలుగేళ్ల క్రితం రష్యా గడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ టైటిల్ సాధించడంలో యువస్టార్ కిలియాన్ ఎంబాపె కీలకపాత్ర పోషించాడు. ఖతర్‌లోనూ ఎంబాపె అదరగొట్టాడు. ముఖ్యంగా ఫైనల్లో చివరి పది నిమిషాల్లో ఎంబాపె ఆటతో అర్జెంటీనా హడలెత్తిపోయింది. మ్యాచ్ ఫ్రాన్స్, అర్జెంటీనా మధ్య కాకుండా ఎంబాపె, అర్జెంటీనా మధ్య జరుగుతోందా అనే అనుమానం కలిగింది. చివరకు ‘షూటౌట్’లో ఫ్రాన్స్ ఓడిపోయినా ఎంబాపె పోరాట యోధుడిలా అందరి దృష్టిలో నిలిచాడు. జిరూడ్, గ్రీజ్మన్, కరీమ్ బెంజెమాలాంటి అగ్రశ్రేణి ఆటగాళ్ల కెరీర్ చరమాంకానికి చేరుకోవడంతో భవిష్యత్ ఎంబాపెదే కానుంది. 23 ఏళ్ల ఎంబాపె ఇదే జోరు కొనసాగిస్తే మాత్రం వచ్చే ప్రపంచకప్‌లోనూ ఫ్రాన్స్ జట్టు టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుందని చెప్పవచ్చు. ‘యునైటెడ్’లో కలుద్దాం... అందరి ఆటగా పేరున్న ఫుట్‌బాల్ విశ్వసమరం వచ్చేసారి మూడు దేశాల్లో జరగనుంది. అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు 2026 ప్రపంచకప్‌నకు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. మరిన్ని జట్లకు అవకాశం లభించాలనే సదుద్దేశంతో ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) 2026 ప్రపంచకప్‌ను 32 జట్లకు బదులుగా 48 జట్లతో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆతిథ్య దేశాల హోదాలో అమెరికా, మెక్సికో, కెనడా జట్లకు నేరుగా ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే అవకాశం లభించింది. మిగతా 45 బెర్త్‌ల కోసం వచ్చే ఏడాది మార్చి నుంచి క్వాలిఫయింగ్ దశ మ్యాచ్‌లు మొదలై 2026 మార్చి వరకు కొనసాగుతాయి. మొత్తం 48 జట్లను 16 గ్రూప్‌లుగా (ఒక్కో గ్రూప్‌లో మూడు జట్లు) విభజిస్తారు. గ్రూప్ దశ తర్వాత ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన 32 జట్లు నాకౌట్ తొలి రౌండ్ దశకు అర్హత సాధిస్తాయి. సాక్షి క్రీడా విభాగం -
సాకర్ వరల్డ్ కప్ లో క్రిస్టియన్ రోనాల్డ్ సరికొత్త రికార్డు
-
Fifa World Cup Qatar 2022: ఎడారి దేశంలో.. సాకర్ తుఫాన్
రొనాల్డో... మెస్సీ... నెమార్... హ్యారీ కేన్... ఫుట్‌బాల్ ప్రపంచంలో ఇవేమీ కొత్త పేర్లు కాదు... కానీ ఇప్పుడు మళ్లీ అవన్నీ మన ముంగిట కొత్తగా వినిపిస్తాయి. సాధారణంగా ఎప్పుడు పిలవని, నోరు తిరగని నామ ధేయాలు కూడా ఇప్పుడు మన నోటిపై జపం చేస్తాయి. క్రీడాభిమానుల కళ్లన్నీ నెల రోజుల పాటు మిగతా ఆటలన్నీ గట్టున పెట్టేసి ఈ మ్యాచ్‌ల ఫలితం కోసం ఎదురు చూస్తాయి. ఇప్పుడు లెక్క సెంచరీల్లోనో, పరుగుల సంఖ్యలోనో కాదు... సింగిల్ డిజిట్‌లోనే సీన్లు మారిపోతాయి... అంతా గోల్స్ గోలనే ... ఒక్క అంకె ఒకవైపు ఆనందం నింపితే, మరోవైపు గుండెలు బద్దలు చేస్తుంది. 32 దేశాల మెరుపు వీరులు మైదానంలో పాదరసంలా దూసుకుపోతుంటే... ఉత్సాహం, ఉద్వేగానికి లోటు ఏముంటుంది... 64 మ్యాచ్‌లలో మన కళ్లన్నీ బంతి మీదే నిలిస్తే ఆఖరి రోజున జగజ్జేతగా మనమే నిలిచిన భావన అభిమానిది... అవును, ప్రపంచ వ్యాప్తంగా అందరినీ అలరించేందుకు ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ మళ్లీ వచ్చేసింది. 29 రోజుల పాటు కళ్లార్పకుండా చూసేందుకు, ప్రతీ క్షణాన్ని ఆస్వాదించేందుకు మీరంతా సిద్ధమైపోండి! మరి కొన్ని గంటల్లో... ప్రపంచం మొత్తం అబ్బురపడే అత్యద్భుత ఘట్టానికి తెర లేవనుంది... ఎడారి దేశం ఖతర్‌లో ఇసుక తుఫాన్లు సాధారణం. అయితే రాబోయే నెలరోజులు సాకర్ సంగ్రామం ఎడారి దేశాన్ని ఒక ఊపు ఊపనుంది. సుమారు 16 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌తో సిద్ధమైన మెగా క్రీడా సంబరానికి విజిల్ మోగనుంది. ఇప్పటి వరకు 21 ప్రపంచకప్‌లు జరిగాయి... కానీ 22వది మాత్రం అన్నింటికంటే భిన్నం! అమెరికా, యూరోప్ దేశాలను దాటి అరబ్ దేశంలో తొలిసారి నిర్వహిస్తున్న టోర్నీ కాగా... ఆతిథ్య దేశం ఆలోచనలకు అనుగుణంగా వచ్చిన నియమ నిబంధనలు ఈ మెగా టోర్నీని మరింత ప్రత్యేకంగా మార్చాయి... ఆతిథ్య హక్కులు కేటాయించిన నాటి నుంచి ఇప్పటి వరకు పలు వివాదాలు వెంట వచ్చినా, ఖర్చు అంచనాలను దాటి ఆకాశానికి చేరినా వెనక్కి తగ్గని ఖతర్ దేశం టోర్నమెంట్‌ను మెగా సక్సెస్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే పండగ ముందు ఏర్పాట్లలో ఎంత కష్టం ఉన్నా... ఒక్కసారి ఆట మొదలైతే అన్నీ వెనక్కి వెళ్లిపోతాయి.‘ఫిఫా’ కూడా సరిగ్గా ఇదే ఆశిస్తోంది. ఖతర్ దేశపు రాజధాని దోహా వేదికగా 22వ ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు రంగం సిద్ధమైంది. నేడు జరిగే తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఖతర్‌తో ఈక్వెడార్ తలపడుతుంది. ఖతర్ జాతీయ దినోత్సవం అయిన డిసెంబర్ 18న ఫైనల్ జరుగుతుంది. 2006లో ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఖతర్‌లో మరో మెగా క్రీడా సంబరం ఇదే కావడం విశేషం. 2002లో జపాన్–దక్షిణ కొరియా సంయుక్తంగా పోటీలను నిర్వహించిన తర్వాత ఒక ఆసియా దేశంలో ‘ఫిఫా’ ప్రపంచ కప్ జరగడం ఇది రెండోసారి కాగా... ఒక మధ్యప్రాచ్య దేశం విశ్వ సంరంభానికి వేదిక కావడం ఇదే మొదటిసారి. 32 టీమ్‌లతో నిర్వహించనున్న ఆఖరి వరల్డ్ కప్ ఇదే కానుంది. వచ్చే ఈవెంట్ నుంచి 48 జట్లు బరిలోకి దిగుతాయి. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ప్రతీ ప్రపంచకప్ సాధారణంగా జూన్–జూలైలో నిర్వహిస్తారు. అయితే ఆ సమయంలో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఈ ఎడారి దేశంలో నిర్వహణ సాధ్యం కాదని ‘ఫిఫా’ మరో ప్రత్యామ్నాయాన్ని సూచించింది. పలు చర్చోపర్చలు, ఒప్పందాల్లో సవరణలు, వివిధ దేశాల్లో జరిగే ఫుట్‌బాల్ లీగ్‌ల షెడ్యూల్లో మార్పులు చేస్తూ చివరకు దానిని నవంబర్–డిసెంబర్‌కు మార్చారు. అయితే ఈ సమయంలో కూడా వేదికలను సాధ్యమైనంత చల్లగా ఉంచేందుకు నిర్వాహక కమిటీ పలు కొత్త సాంకేతికలను ఉపయోగించి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 2018లో విజేతగా నిలిచిన ఫ్రాన్స్ ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. ► మొత్తం 8 వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. వరల్డ్ కప్ ట్రోఫీని, 8 వేదికలను గుర్తు చేయడంతో పాటు ఎప్పటికీ శాశ్వతం అన్నట్లుగా గణిత సంజ్ఞ ‘ఇన్ఫినిటీ’ని కలుపుతూ టోర్నీ లోగోను నిర్వాహకులు తయారు చేశారు. మహిళా రిఫరీలు... పురుషుల ప్రపంచకప్‌లో మహిళా రిఫరీలను నియమించడం ఇదే తొలిసారి కావడం మరో విశేషం. స్టెఫానీ ఫ్రాపర్ట్ (ఫ్రాన్స్), సలీమా ముకసంగా (రువాండా), యోషిమి యమషిత (జపాన్) ఆ అరుదైన అవకాశం దక్కించుకున్నారు. ఈ ముగ్గురితో పాటు మరో ముగ్గురు మహిళలకు అసిస్టెంట్ రిఫరీలుగా కూడా తొలిసారి అవకాశం దక్కింది. ‘ఖతర్’నాక్ నిబంధనలు! అమెరికా, దక్షిణ కొరియా, జపాన్, ఆస్ట్రేలియాలతో పోటీ పడి 2010లో ఖతర్ నిర్వాహక హక్కులు దక్కించుకుంది. వైశాల్యంపరంగా చూస్తే ప్రపంచకప్ నిర్వహణ హక్కులు దక్కించుకున్న అతి చిన్న దేశం ఇది. గతంలో ఒక్కసారి కూడా వరల్డ్ కప్‌లో పాల్గొనకుండా నిర్వహణ హక్కులు తీసుకున్న రెండో దేశం ఖతర్ (జపాన్ 2002లో కోసం 1996లోనే హక్కులు కేటాయించారు. అయితే నిర్వహణకు ముందు ఆ జట్టు 1998 టోర్నీకి క్వాలిఫై అయింది). ఈ క్రమంలో పెద్ద ఎత్తున వివాదాలు కూడా వెంట వచ్చాయి. తగినన్ని అర్హత ప్రమాణాలు లేకపోయినా... ‘ఫిఫా’ అధికారులు విపరీతమైన అవినీతికి పాల్పడి హక్కులు కేటాయించినట్లుగా విమర్శలు వచ్చాయి. విచారణలో అది వాస్తవమని కూడా తేలి చాలా మంది నిషేధానికి కూడా గురయ్యారు కానీ అప్పటికే ఏర్పాట్లు జోరుగా ఉండటంతో వెనక్కి తీసుకునే అవకాశం లేకుండా పోయింది. స్టేడియాల నిర్మాణంలో 6 వేలకు పైగా కార్మికులు మరణించారని, మానవ హక్కులకు తీవ్ర భంగం కలిగిందని కూడా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. అయితే ఎన్ని జరిగినా... చివరకు ఆట మాత్రం ముందుకు వెళ్లింది. అయితే ఇప్పుడు సరిగ్గా మెగా ఈవెంట్ సమయంలో ఆ దేశపు నిబంధనలు అటు ‘ఫిఫా’ అధికారులను, ఇటు ప్రపంచవ్యాప్త అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దేశ న్యాయవ్యవస్థ మొత్తం ‘షరియా’ ఆధారంగా ఉండటంతో అందరికీ ఇది కొత్తగా అనిపిస్తోంది. కానీ నిబంధనలు మాత్రం కఠినంగా ఉండటంతో పాటు ఉల్లంఘిస్తే శిక్షలు కూడా కఠినమే. భారీ జరిమానాలతో పాటు జైలు శిక్షలు కూడా ఇందులో ఉన్నాయి. ► ముందుగా ‘హయ్యా’ కార్డును తీసుకోవాలి. ఆ దశపు ‘వీసా’, మ్యాచ్ టికెట్ ఉన్నా సరే... హయ్యా కార్డు ఉంటేనే ఎక్కడికైనా వెళ్లేందుకు అనుమతిస్తారు. రవాణా సౌకర్యం వాడుకునేందుకు కూడా ఇది అవసరం. ► స్టేడియం పరిసరాల్లో ఆల్కహాల్ నిషేధం.. బీర్లకు కూడా అనుమతి లేదు. దీని వల్ల సుదీర్ఘకాలంగా తమకు స్పాన్సర్‌గా ఉన్న ప్రఖ్యాత కంపెనీ ‘బడ్వైజర్’తో ‘ఫిఫా’కు ఒప్పంద ఉల్లంఘన సమస్య వచ్చింది. దీనిని సరిదిద్దేందుకు వారికి తలప్రాణం తోకకు వచ్చింది. చివరగా స్టేడియాలకు కొద్ది దూరంలో ‘ఫ్యాన్ ఫెస్టివల్’ జోన్లు ఏర్పాటు చేసి అక్కడ తాగేందుకు అనుమతినిచ్చారు. అయితే ఎవరైనా తాగి గ్రౌండ్లోకి వచ్చి ఇబ్బందికరంగా ప్రవర్తిస్తే మాత్రం దేశం నుంచి బయటకు పంపించేస్తారు. ► ఇష్టమున్నట్లుగా దుస్తులు ధరిస్తే కుదరదు. భుజాలు, మోకాళ్లు కనిపించేలా మహిళల దుస్తులు ఉండరాదు. పబ్లిక్ బీచ్‌లలో స్విమ్సూట్లు ధరించరాదు. అది హోటల్ స్విమ్మింగ్పూల్లకే పరిమితం. మైదానంలో ఉత్సాహంతో షర్ట్లు తొలగించడం కూడా కుదరదు. స్పెషల్ జూమ్ కెమెరాలతో వాటిని గుర్తించి చర్యలు తీసుకుంటారు. ► భార్యాభర్తలైనా సరే, బహిరంగ ప్రదేశాల్లో రూపంలో కూడా తమ ప్రేమను ప్రదర్శించరాదు. హోమో సెక్సువల్స్కైతే అసలే కలిసి ఉండేందుకు అనుమతి లేదు. విజేత జట్టుకు రూ. 341 కోట్లు ప్రపంచకప్ మొత్తం ప్రైజ్‌మనీ 440 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 3,500 కోట్లు) కాగా... విజేతలకు 42 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 341 కోట్లు), రన్నరప్‌కు 30 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 244 కోట్లు) లభిస్తాయి. ► వరల్డ్ కప్‌లో జట్లు ఒక్కో మ్యాచ్ నుంచి మరో మ్యాచ్ కోసం విమానాల్లో ప్రయాణించే అవసరం లేకుండా వెళ్లేలా వేదికలు ఉండటం 1930 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. ఎనిమిది స్టేడియాలు, ప్రాక్టీస్ మైదానాలన్నీ 10 కిలోమీటర్ల పరిధిలో ఉండటమే ఇందుకు కారణం. ప్రతీ జట్టు తమకు ప్రాక్టీస్ కోసం కేటాయించిన ఒకే బేస్ క్యాంప్‌లోనే టోర్నీ మొత్తం సాధన చేస్తుంది. –సాక్షి క్రీడా విభాగం -
భారత్ పరాజయం
దోహా: సాకర్ ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయర్స్‌లో భారత్‌కు తమకన్నా మెరుగైన జట్టు ఖతర్ చేతిలో పరాజయం ఎదురైంది. గ్రూప్–ఇలో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 0–1 స్కోరుతో ఓడిపోయింది. ఆట మొదలైన కాసేపటికే ఖతర్ ఆటగాళ్లు భారత గోల్‌పోస్ట్‌పై దాడులకు పదును పెట్టారు. అయితే భారత డిఫెండర్లు చురుగ్గా స్పందించడంతో నిరాశ తప్పలేదు. 13వ నిమిషంలో ఖతర్ స్ట్రయికర్ అబ్దెల్ అజిజ్ గోల్‌పోస్ట్ కుడివైపు నుంచి క్రాస్‌షాట్ ఆడగా... అది బార్‌పైనుంచి బయటకు వెళ్లిపోవడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. 30వ నిమిషంలో భారత స్ట్రయికర్ మన్వీర్ ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌వైపు దూసుకొచ్చాడు. గోల్ కోసం అతను చేసిన ప్రయత్నాన్ని డిఫెండర్లు నీరుగార్చారు. అయితే మరో మూడు నిమిషాల తర్వాత ఖతర్ బోణీకొట్టింది. 33వ నిమిషంలో యూసుఫ్ నుంచి వచ్చిన పాస్‌ను ఈ సారి అబ్దెల్ అజిజ్ ఎలాంటి పొరపాటు చేయకుండా భారత డిఫెన్స్‌ను ఛేదిస్తూ ఆతిథ్య జట్టుకు గోల్ సాధించి పెట్టాడు. తొలి అర్ధభాగం ముగిసేసరికి ఖతర్ 1–0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ద్వితీయార్ధంలో స్కోరు సమం చేసేందుకు భారత ఆటగాళ్లు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరకు ఖతర్ 1–0తో విజయం సాధించింది. ఆట 18వ నిమిషంలోనే డిఫెండర్ బెకెకు రిఫరీ రెడ్‌కార్డ్ చూపించాడు. దాంతో సింహభాగం మ్యాచ్‌ను భారత్ పది మందితోనే ఆడాల్సి వచ్చింది. -
ప్రపంచ కప్‌కు ప్రాక్టీస్
2022 సాకర్ ప్రపంచ కప్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టారు అమితాబ్ బచ్చన్. అందుకే ఫుట్‌బాల్ పట్టుకుని గ్రౌండ్లో దిగారు. అప్పుడే సాకర్ ఫీవర్ ఎందుకంటే.. బిగ్ బి లేటెస్ట్ సినిమా కోసమే. మరాఠీ బ్లాక్‌బస్టర్ ‘సైరాట్’ దర్శకుడు నాగరాజ్ దర్శకత్వంలో అమితాబ్ ‘జుంద్’ అనే చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ ఫుట్‌బాల్ కోచ్‌గా కనిపించనున్నారు. తన కోచింగ్‌తో వీధి బాలలను ఎలా విజయం సాధించేలా చేశారనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నారు అమితాబ్. ఈ చిత్రం షూటింగ్ లొకేషన్లోని ఫొటో షేర్ చేస్తూ ‘‘ప్రపంచ కప్‌కు ప్రాక్టీస్ చేస్తున్నాను’’ అని సరదాగా పేర్కొన్నారు బిగ్ బి. -
క్రొయేషియా.. మేనియా!
జాగ్రెబ్: క్రొయేషియా.. 50 లక్షల జనాభా కూడా లేని ఈ దేశం పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. రష్యాలో జరుగుతున్న సాకర్ ప్రపంచకప్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగి, దిగ్గజ జట్లను మట్టికరిపిస్తూ ఫైనల్ చేరి ఆ దేశ జట్టు పెను సంచలనమే సృష్టించింది. ఆదివారం ఫ్రాన్స్‌తో జరిగే ఆఖరి పోరాటానికి సిద్ధమైంది. బుధవారం ఇంగ్లండ్‌ను సెమీఫైనల్లో ఓడించినప్పటి నుంచి నెటిజన్లు ఎక్కువగా అన్వేషిస్తున్నది క్రొయేషియా గురించే కావడం గమనార్హం. చరిత్రలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న ఈ చిన్న దేశం గురించి కొన్ని వివరాలు.. పురాతన చారిత్రక నేపథ్యం.. ఆరు నుంచి 14వ శతాబ్దం వరకు క్రొయేషియన్లు అనేక ఒడిదుడుకులు చవిచూశారు. 1527లో ఒట్టోమన్ చక్రవర్తుల ఆక్రమణల నేపథ్యంలో క్రొయేషియన్ పార్లమెంట్ ఫెర్డినాండ్‌ను తమ అధినేతగా ఎన్నుకుంది. 1918 తొలి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత సెర్బ్‌లు, స్లోవియన్లతో కలిసి క్రొయేషియన్లు యుగోస్లావియా రాజ్యాన్ని స్థాపించారు. సొంతంగా దేశం ఏర్పాటు చేసుకోవాలన్న ఆకాంక్షల మధ్య తలెత్తిన గందరగోళ పరిస్థితుల్లో 1929లో రాజు అలెగ్జాండర్ పార్లమెంట్‌ను పక్కనపెట్టి నియంతృత్వ పాలన సాగించాడు. 1941, ఏప్రిల్ 6న జర్మనీ బలగాలు దాడిచేసి క్రొయేషియా రాజ్యాన్ని ఆక్రమించుకుని ఫాసిస్టు నాయకుడు ఉస్టేన్ నేతృత్వంలో కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. రెండో ప్రపంచయుద్ధం ముగిసిన తరువాత టిటో నేతృత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. 1980లో టిటో కన్ను మూశాక, 1989 నాటికి తూర్పు ఐరోపాలోని అనేక దేశాల్లో కమ్యూనిస్ట్ పాలన అంతమైంది. 1991లో క్రొయేషియన్లు స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు. క్రొయేషియా సరిహద్దుల్లో నివసిస్తున్న సెర్బ్ల రక్షణ పేరుతో యుగోస్లావియా సైన్యం దేశంలోకి చొచ్చుకురావడం సుదీర్ఘ యుద్ధానికి దారి తీసింది. 1992 జనవరి 15న క్రొయేషియాను ఐరోపా మండలి గుర్తించింది. ఎర్తుట్ ఒప్పందం వల్ల 1995లో ఆ యుద్ధం ముగిసింది. 1998 వరకు ఐరాస కింద ఉన్న తూర్పు స్లొవోనియాను క్రొయేషియాకు అప్పగించారు. 2009లో నాటో కూటమిలో, 2013లో ఐరోపా మండలిలో చేరింది. పొంచి ఉన్న సవాళ్లు.. ప్రస్తుతం క్రొయేషియా ఆర్థిక వ్యవస్థ కొన్ని సవాళ్లు ఎదుర్కొంటోంది. ఇతర దేశాల నుంచి వస్తున్న వలసలతో పాటు యువతలో 43 శాతం నిరుద్యోగం దేశాన్ని పట్టిపీడిస్తోంది. కమ్యూనిజం నుంచి ఇప్పుడిప్పుడే పెట్టుబడిదారీ విధానంవైపు అడుగులేస్తోంది. ఈయూ, ఐరాస, కౌన్సిల్ ఆఫ్ యూరోప్, నాటో, డబ్ల్యూటీవోలలో సభ్యదేశంగా కొనసాగుతోంది. ఐరాస శాంతి పరిరక్షక దళంలో కీలకపాత్ర పోషిస్తోంది. దేశ ఆర్థికవ్యవస్థలో సేవా, పారిశ్రామిక, వ్యవసాయ, పర్యాటక రంగాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచంలోని టాప్–20 పర్యాటక ప్రాంతాల్లో క్రొయేషియా ఒకటిగా ఉంది. ఆసక్తికర విషయాలు... ► జనాభా: 41,63,968 (ఐరాస గణాంకాల ప్రకారం) ► జన సాంద్రత: చ.కి.మీకు 74 మంది ► వైశాల్యం: 55,960 చ.కి.మీ.లు ► పట్టణ జనాభా: 60.60 శాతం ► ప్రపంచంలోనే అతి చిన్న పట్టణం (17–23 మంది మాత్రమే నివసిస్తారు) ‘హమ్’ ఇక్కడే ఉంది. ► అత్యంత సుందరమైన సూర్యాస్తమయాన్ని ఇక్కడి డాల్మేషియాలోని ‘జడర్’లో వీక్షించవచ్చు. ► ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘డాల్మేషియన్’ శునకాల మూలాలు 17వ శతాబ్దంలో ఇక్కడే బయటపడ్డాయి. ► క్రొయేషియాలో ఎనిమిది జాతీయ పార్కులు, 11 నేచర్ పార్కులు, రెండు నేచర్ రిజర్వులున్నాయి. ► హెచ్‌బీఓ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ను డాల్మేషియన్ తీరంలో చిత్రీకరిస్తున్నారు. -
సాకర్ వార్
-
1400 బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్
న్యూఢిల్లీ: సాకర్ ప్రపంచ కప్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా వేలాది కోట్ల రూపాయిల బెట్టింగ్ జరిగింది. ఈ మెగా ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఆసియాలోనే 1400 మంది బెట్టింగ్ రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి దాదాపు 60 కోట్ల రూపాయిలను స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్ పోల్ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. చైనా, హాంకాంగ్, మకావు, మలేసియా, సింగపూర్, వియత్నాం దేశాలకు చెందిన పోలీసులు వెయ్యికిపైగా బెట్టింగ్ స్థావరాలపై దాడులు చేశారు. చాలా వరకు నేర ముఠాలు బెట్టింగ్ కార్యకలాపాలను నిర్వహించాయి. వెబ్సైట్ల ద్వారా 11 వేల రూపాయిలు చేతులు మారినట్టు అంచనా వేస్తున్నారు. మనీ లాండరింగ్, అక్రమ పద్ధతుల ద్వారా డబ్బును తరలించినట్టు అధికారులు తెలిపారు. పోలీసు అధికారులు జూన్ 1 నుంచి జూలై 13 వరకు ప్రత్యేక నిఘా వేసి దాడులు నిర్వహించారు. -
ఆటగాళ్లకు ఆమె అందించిన స్ఫూర్తి ఎంతో..!
సాకర్ ప్రపంచకప్‌ను గెలిచిన జర్మనీ జట్టు శక్తియుక్తుల గురించి అనేకమంది ప్రశంసిస్తున్నారు. జర్మనీ వ్యూహాల గురించి అనేకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆటగాళ్ల ప్రతిభ అద్భుతమని సాకర్ విశ్లేషకులు అంటున్నారు. మరి ఇటువంటి సమయంలో జర్మన్ టీమ్ విజయం గురించి చర్చిస్తే.. అందులోప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన వ్యక్తి ఏంజెలా మెర్కెల్. జర్మన్ ఛాన్సరల్ అయిన మెర్కెల్ తమ జాతీయ జట్టును అడుగడుగునా ప్రోత్సహించారు. ఆటగాళ్లతో స్నేహితురాలిగా మెలుగుతూ వారిలో స్ఫూర్తిని నింపారు. మెర్కెల్ స్థాయి వ్యక్తి తమను అంతగా అభిమానించడం, అండగా నిలవడం తమకు కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని, గెలవాలనే తపనను, బాధ్యతను పెంచిందని జర్మన్ ఆటగాళ్లు వ్యాఖ్యానించారు. ప్రపంచకప్‌ను గెలుచుకొచ్చిన టీమ్‌ను అభినందిస్తూ వారితో సరదాగానో, హుందాగానో గడిపే దేశాధ్యక్షులు, ప్రధానమంత్రులు ఎంతోమంది ఉంటారు. అయితే మెర్కెల్ అందరిలాంటి నాయకురాలు కాదు. మొన్నటి ఆదివారం జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో జర్మన్ ఫుట్‌బాల్ టీ మ్ఏకైక గోల్సాధించగానే మెర్కెల్ ఒక సాధారణ ఫుట్‌బాల్ అభిమానిలా గంతులేశారు. ఇక మ్యాచ్‌లో జర్మనీ విజేతగా నిలవగానే ప్రోటోకాల్ నిబంధనలను పక్కనపెట్టి మరీ ఆటగాళ్లతో ఒక స్నేహితురాలిలా కలిసిపోవడం చర్చనీయాంశమైంది. కేవలం తమ జట్టు గెలిచినప్పుడు మాత్రమే కాదు, ప్రపంచ కప్‌లో జర్మనీజట్టు ఆటను ప్రతిమ్యాచ్‌లోనూ సమీక్షించినట్టుగా కనిపిస్తోంది మెర్కెల్. ఆమె సాకర్ వరల్డ్‌కప్ ప్రారంభోత్సవానికే హాజరైంది. ఇక తొలి మ్యాచ్‌లో జర్మనీ జట్టు తమ తొలిమ్యాచ్‌లో పోర్చగల్ను ఓడించి శుభారంభం చేసినప్పుడయితే ఆనందంతో ఉక్కిరిబిక్కిరైంది. అప్పుడే ఆమె తమ ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్ వరకూ వెళ్లి అభినందించి వచ్చారు. దీన్నిబట్టి ఆమె తమ టీమ్‌కు ఎంత అండగా నిలిచారో అర్థం చేసుకోవచ్చు. ఆటగాళ్లతో సన్నిహితంగా గడపడం ద్వారా ఏంజెలా ఆటతోబాటు అభిమానుల మనసులను కూడా గెలిచింది! -
‘ఆరెంజ్’ ఓ రేంజ్లో...
నెదర్లాండ్స్ : 5 వాన్ పెర్సి: 44వ, 72వ ని. రాబెన్: 50వ, 80వ ని. డివ్రిజ్: 62వ ని. స్పెయిన్: 1 అలోన్సో: 27వ ని. సూపర్‌మ్యాన్ మాత్రమే చేయగలడనిపించే విన్యాసం... చిరుతపులిని మించిన వేగం... చెక్కుచెదరని ఏకాగ్రత... ఈ మూడు కలగలిపి నెదర్లాండ్స్ కెప్టెన్ రాబిన్ వాన్ పెర్సి సంచలనం సృష్టించాడు. ప్రతి ఆటగాడూ జీవితంలో ఒక్కసారైనా సాధించాలనుకునే కలల గోల్‌తో సంచలనం సృష్టించాడు. డిఫెండింగ్ చాంపియన్‌తో మ్యాచ్‌లో అద్భుత గోల్‌తో నెదర్లాండ్స్ రాతను మార్చాడు. సహచరుల్లో ఆత్మవిశ్వాసం నింపుతూ వాన్ పెర్సి సాధించిన ఈ గోల్ స్ఫూర్తితో... ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ అద్భుతం చేసింది. నాలుగేళ్ల క్రితం ప్రపంచకప్ ఫైనల్లో ఓటమికి బదులు తీర్చుకోవడంతో పాటు... ఎవరూ ఊహించని విధంగా ఏకంగా 5-1 గోల్స్ తేడాతో స్పెయిన్‌పై సంచలన విజయం సాధించింది. ఓ రేంజ్లో ఆడిన ‘ఆరెంజ్’ జట్టు కేవలం ఆట ద్వితీయార్ధంలోనే నాలుగు గోల్స్ చేయడం విశేషం. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వాన్ పెర్సి (నెదర్లాండ్స్) ఆడిన నిమిషాలు: 79; ఇచ్చిన పాస్‌లు: 26 చేసిన గోల్స్: 2; గోల్ పోస్ట్‌పై షాట్స్: 4 సాల్వెడార్ (బ్రెజిల్): సాకర్ ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ జట్టు చెలరేగిపోయింది. అంచనాలకు కూడా అందని రీతిలో గోల్స్ చేసి డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్‌కు ఊహించని షాకిచ్చింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి జరిగిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 5-1తో స్పెయిన్‌పై సంచలన విజయం సాధించింది. గత 51 ఏళ్లలో (1963లో స్కాట్లాండ్ చేతిలో 2-6 ఓటమి తర్వాత) స్పెయిన్ అత్యంత ఘోరమైన ఓటమిని మూటగట్టుకుంది. ఇప్పటి వరకు వరల్డ్‌కప్ చరిత్రలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన జట్టు ఇంత తేడాతో ఓడటం కూడా ఇదే తొలిసారి. మ్యాచ్ ఆద్యంతం హవా కొనసాగించిన డచ్ వెటరన్ ఆటగాళ్లు రాబిన్ వాన్ పెర్సి, అర్జెన్ రాబెన్ చెరో రెండు గోల్స్ చేస్తే... డివ్రిజ్ ఒక గోల్ చేసి ఆరెంజ్ జట్టుకు తిరుగులేని ఆధిక్యాన్ని అందించారు. రెండో రోజు కూడా రిఫరీ నిర్ణయాలు వివాదస్పదమయ్యాయి. దీని నుంచి లబ్ది పొందిన స్పెయిన్ ఆటగాడు అలోన్సో పెనాల్టీ ద్వారా ఏకైక గోల్‌ను సాధించాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన డచ్ ప్లేయర్లు మ్యాచ్ సాగే కొద్దీ దూకుడును పెంచారు. 8వ నిమిషంలో స్నిజ్డెర్ కొట్టిన బంతిని స్పెయిన్ గోల్ కీపర్ క్యాసిలాస్ సమర్థంగా అడ్డుకున్నాడు. తర్వాత దూకుడును పెంచిన స్పెయిన్ ఆటగాళ్లు ఇనిష్టా (10వ ని.), డిగో కోస్టా (13వ ని.) చేసిన గోల్స్ ప్రయత్నాలను డచ్ ఆటగాడు వ్లార్ తిప్పికొట్టాడు. 23వ నిమిషంలో జేవీ (స్పెయిన్) కొట్టిన బంతి గోల్ పోస్ట్ కార్నర్‌ను తగులుతూ వెళ్లగా, 25వ నిమిషంలో డీ గుజ్మన్ (డచ్) ఎల్లో కార్డుకు గురయ్యాడు. 26వ నిమిషంలో డిగో కోస్టా (స్పెయిన్)ను డివ్రిజ్ (డచ్) అడ్డుకోవడంతో స్పెయిన్‌కు పెనాల్టీ కార్నర్ లభించింది. ఈ పెనాల్టీని అలోన్సో (27వ ని.) గోల్‌గా మలిచి స్పెయిన్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. తర్వాత నెదర్లాండ్స్ ప్లేయర్ పెర్సీ (28, 30వ ని.) చేసిన రెండు ప్రయత్నాల్లో బంతులు ఆఫ్ సైడ్‌లో వెళ్లాయి. స్కోరును సమం చేసేందుకు డచ్ ఆటగాళ్లు చేసిన అటాకింగ్‌ను క్యాసిలాస్ సమర్థంగా తిప్పికొట్టాడు. తొలి అర్ధభాగం ముగియడానికి 90 సెకన్ల ముందు డచ్ ఫార్వర్డ్ వాన్ పెర్సి ఓ అద్భుతమే చేశాడు. డాలీ బ్లైండ్ ఇచ్చిన క్రాస్ ఫీల్డ్ బంతిని రెప్పపాటులో హెడర్‌తో గోల్ పోస్ట్‌లోకి పంపి స్పెయిన్‌కు దిమ్మ తిరిగే షాకిచ్చాడు. దీంతో రెండు జట్లు 1-1తో విరామానికి వెళ్లాయి. రెండో అర్ధభాగంలో డచ్ ఆటగాళ్లు మరింత ఆత్మవిశ్వాసంతో ఆడారు. దీంతో స్పెయిన్ ఒత్తిడికి లోనైంది. 53వ నిమిషంలో రాబెన్... ఓ లాంగ్ పాస్‌ను బ్లైండ్, మునిచ్లతో కలిసి అద్భుతంగా అదుపు చేస్తూ క్యాసిలాస్ను బోల్తా కొట్టిస్తూ గోల్‌గా మలిచాడు. 64వ నిమిషంలో స్నిజ్డెర్ ఇచ్చిన ఫ్రీ కిక్‌ను డివ్రిజ్ గోల్‌గా మలిచాడు. దీంతో డచ్ 3-1 ఆధిక్యంలోకి వెళ్లింది. 68వ నిమిషంలో లైన్ మీద ఆడుతూ వచ్చిన సిల్వ (స్పెయిన్)... బంతిని పెడ్రోకు అందించాడు. అయితే పెడ్రో కొట్టిన హెడర్ ఆఫ్‌సైడ్‌గా వెళ్లింది. 72వ నిమిషంలో వాన్ పెర్సి కొట్టిన బంతిని అంచనా వేయడంలో క్యాసిలాస్ విఫలం కావడంతో డచ్‌కు నాలుగో గోల్ లభించింది. 80వ నిమిషంలో బెరైన్, రామోస్లతో సమన్వయం చేసుకుంటూ రాబెన్... క్యాసిలాస్ను చుట్టుముట్టాడు. తర్వాత ఎడమ కాలితో బంతిని నెట్లోకి పంపి డచ్‌కు ఐదో గోల్ అందించాడు. ఇక ఆ తర్వాత గోల్స్ కోసం స్పెయిన్ ఆటగాళ్లు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఓటమి తప్పలేదు. -
తాత.. బామ్మ.. 9 ప్రపంచకప్‌లు...
కోల్‌కతా: నాలుగేళ్లకోసారి జరిగే ప్రపంచకప్ చూడాలని ప్రతీ సాకర్ అభిమాని కోరుకుంటాడు. కానీ అందరికీ సాధ్యం కాదు.. అయితే కోల్‌కతాకు చెందిన 81 ఏళ్ల పన్నాలాల్ చటర్జీ, ఆయన భార్య చైతాలి మాత్రం రెండు దశాబ్దాలుగా సాకర్ ప్రపంచకప్ ఎక్కడ జరిగినా అక్కడ వాలిపోతున్నారు. ప్రస్తుతం బ్రెజిల్లో జరుగుతున్న సాకర్ ప్రపంచకప్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అక్కడికి వెళుతున్నారు. ఈ నెల 17న తాత, బామ్మలు బ్రెజిల్‌కు బయల్దేరి వెళ్లనున్నారు. 1982 నుంచి ఒక్క ప్రపంచకప్ కూడా వదలకుండా ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. ఇప్పటిదాకా 8 ప్రపంచకప్‌లకు హాజరయ్యారు. తొమ్మిదోసారి సాకర్ మజాను ఆస్వాదించబోతున్నారు. ఈ వృద్ధ దంపతులది మధ్యతరగతి కుటుం బమే. రూ. 7500 పెన్షన్ వచ్చే పన్నాలాల్ అందులో కొంత మొత్తాన్ని ప్రతీ నెల ప్రపంచకప్ కోసం కేటాయిస్తారు. ఇక చైతాలి బామ్మ తాను చేసే చీరల వ్యాపారం ద్వారా కొంత సంపాదించి ప్రపంచకప్ కోసం ఉపయోగిస్తారు. -
గెట్..సెట్...కిక్
నేటి నుంచి సాకర్ ప్రపంచకప్ అందరి దృష్టి బ్రెజిల్ పైనే బ్రెజిల్ xక్రొయేషియా రాత్రి గం. 1.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం సావో పాలో: ఇప్పటివరకు ఐదుసార్లు ప్రపంచ చాంపియన్లు... గత 12 ఏళ్లుగా తమ గడ్డపై ఓటమి ఎరుగని ఘన చరిత్ర... ప్రపంచంలో ఏ మూలన సాకర్ టోర్నీ జరిగినా టైటిల్ ఫేవరెట్లలో ముందుండే జట్టు... ఫుట్‌బాల్ ప్రపంచంలో బ్రెజిల్ జట్టు గురించి చెప్పడానికి ఈ ఉపమానాలు సరిపోతాయి. కానీ సొంతగడ్డపై ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌ను గెలవలేదన్న ఒకే ఒక్క లోటు మాత్రం బ్రెజిల్‌ను పీడిస్తోంది. అలాంటి జట్టుకు వరల్డ్‌కప్‌ను గెలుచుకునే అరుదైన అవకాశం ఇప్పుడు వచ్చింది. నేటి నుంచి ప్రారంభం కానున్న ఫుట్‌బాల్ ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో పటిష్టమైన బ్రెజిల్.. ప్రపంచ 18వ ర్యాంకర్ క్రొయేషియాతో తలపడనుంది. ప్రస్తుత ఫామ్‌ను చూస్తే ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే సొంతగడ్డపై టోర్నీ జరుగుతుండటంతో జట్టుపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో సహజంగానే జట్టుపై ఒత్తిడి పెరిగింది. నెమార్ చుట్టే వ్యూహాలు బ్రెజిల్ జట్టులో స్టార్ ప్లేయర్లకు కొదువలేదు. పటిష్టమైన లైనప్.. ఫార్వర్డ్స్ అటాకింగ్.. అంచనాలకు మించి ఆడే ఆటగాళ్లు... ప్రత్యర్థి వ్యూహాలను క్షణంలో పసిగట్టే కోచ్..ఇలా ప్రతి అంశంలోనూ బ్రెజిల్ ప్రత్యేకత చాటుకుంది. దీంతో గత కొన్నేళ్లుగా సాకర్‌లో ఆధిపత్యం చెలాయిస్తోంది. అయితే ఓవరాల్‌గా బ్రెజిల్ ప్రణాళికలన్నీ నెమార్ చుట్టే తిరుగుతుంటాయి. ఇతన్ని అడ్డుకుంటే ప్రత్యర్థి జట్టు విజయావకాశాలు సగంపైగా మెరుగుపడతాయి. గ్రూప్-ఎలో బ్రెజిల్‌కు ఎదురులేకున్నా... తొలి మ్యాచ్ కోసం మాత్రం అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తక్కువ అంచనా వేస్తే... మరోవైపు క్రొయేషియా జట్టు కూడా సమతుల్యంగా ఉంది. అనుభవజ్ఞులు, యువకులతో జట్టు మేళవింపు బాగుంది. అయితే కీలక ఆటగాళ్లు మారియో మండ్జుకిచ్, బెరైన్ మునిచ్లు ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. రానున్న ఐదు వారాల్లో... ఓ వ్యక్తి గాల్లోకి చూస్తూ తనలో తానే ఏదో మాట్లాడుతుంటే ఆశ్చర్యపోవద్దు. రోడ్డు మీద పిల్లాడు కాలితో బలంగా రాళ్లను తంతుంటే విస్తు పోవద్దు. అర్ధరాత్రి హాల్లో టీవీలు హోరెత్తుతుంటే విసుక్కోవద్దు... ఎందుకంటే... ప్రపంచంలో చాలా దేశాల అధ్యక్షులు తమ పనులనే వాయిదా వేసుకుంటున్నారు. చాలా దేశాల్లో ఆలుమగలు సంసారం మానేసి టీవీలకే అతుక్కుపోతారు. ఫుట్‌బాల్ పిచ్చి అలాగే ఉంటుంది మరి. ‘సాకర్’ అనే మూడక్షరాలతో ప్రపంచం ఊగిపోతుంది. రేడియోలు, టీవీలలో ఆ ఆటే హోరెత్తుతుంది. ఏ ఇద్దరు క్రీడాభిమానులు కలిసినా స్కోరు గురించే చర్చ జరుగుతుంది. మామూలుగానే ఫుట్‌బాల్ ప్రపంచకప్ అంటే గ్లామర్. ఇక బ్రెజిల్ లాంటి సాంబా నృత్యాలతో హోరెత్తే దేశంలో ఈ పండగ జరిగితే... చూడటానికి రెండు కళ్లూ చాలవేమో..! 32 జట్లు... 64 మ్యాచ్‌లు... ఒక్క విజేత. జులై 13న బ్రెజిల్లో కప్ అందుకోవాలనే లక్ష్యంతో ఆటగాళ్లు... తమ జట్టు ఓడిపోతే ప్రాణాలు తీసుకునే అభిమానులు... ముసలోళ్లను కూడా పసిపిల్లలుగా మార్చేదే ఫుట్‌బాల్ ప్రపంచకప్. ఈ మెగా క్రీడా సంరంభానికి సావోపాలోలో నేడు తెరలేవనుంది. ఇక ఈ ఐదు వారాలూ కావలసినంత ‘కిక్’... ప్రపంచకప్ విశేషాలు ఇప్పటివరకు 19 ప్రపంచకప్‌లలో ఆతిథ్య జట్టు 6 సార్లు టైటిల్ నెగ్గింది. ప్రపంచకప్ గెలిచిన జట్లలో సొంతగడ్డపై టైటిల్ సాధించని ఒకే ఒక జట్టు బ్రెజిల్ 1930లో జరిగిన తొలి ప్రపంచ కప్‌లో 13 జట్లు పాల్గొంటే... 2014లో 32 జట్లు బరిలోకి దిగుతున్నాయి. బ్రెజిల్ ఒక్కటే ఇప్పటివరకు అన్ని ప్రపంచకప్‌లు ఆడింది. దక్షిణ అమెరికా, యూరోప్ ఖండాలకు చెందిన దేశాలే ఇప్పటి వరకు ప్రపంచకప్‌లు గెలిచాయి. అత్యధిక సార్లు ప్రపంచ కప్ గెలిచిన జట్టు బ్రెజిల్ (5). ఇటలీ (4), జర్మనీ (3) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు రొనాల్డో (బ్రెజిల్-15). ఒకే టోర్నీలో అత్యధిక గోల్స్ రికార్డు (13) జస్ట్ ఫాంటెయిన్ (ఫ్రాన్స్-1958) పేరిట ఉంది. ప్రపంచ కప్ మ్యాచ్‌లలో ఎక్కువ సార్లు నమోదైన స్కోరు 1-0. ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ గోల్ 11వ సెకన్లో నమోదైంది. హకన్ సుకుర్ (టర్కీ) 2002లో దక్షిణ కొరియాపై సాధించాడు. ఎక్కువ వయసులో (42 ఏళ్ల 39 రోజులు) ప్రపంచ కప్ బరిలోకి దిగిన ఆటగాడు రోజర్ మిల్లా (కామెరూన్) ఫుట్‌బాల్, క్రికెట్ ప్రపంచకప్‌లలో తమ దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఏకైక ఆటగాడు వివియన్ రిచర్డ్స్ (వెస్టిండీస్, ఆంటిగ్వా) -
‘ఘనా’భిమానం...
అక్రా (ఘనా): సాకర్ ప్రపంచకప్‌లో ఘనా ఎప్పుడూ సంచలనమే. గత రెండు ప్రపంచకప్‌లలో అంచనాలకు మించి రాణించిన ఘనా ఇప్పుడు మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. అయితే ‘గ్రూప్ ఆఫ్ డెత్’లో ఉన్న తమ జట్టును ప్రోత్సహించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 500 మంది అభిమానులను బ్రెజిల్‌కు తీసుకెళుతోంది. అంతేకాదు వీరికి స్పాన్సర్‌గా కూడా వ్యవహరించనుంది. వీలైతే మరింత మంది అభిమానులను కూడా తీసుకెళ్లే అవకాశాలను పరిశీస్తున్నట్లు ఘనా క్రీడల మంత్రి అంక్రా చెప్పారు. అయితే దేశం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో అభిమానులను బ్రెజిల్‌కు తీసుకెళ్లడం డబ్బులను వృథా చేయడమేనని కొందరు ప్రశ్నిస్తున్నారు. అక్కడి ప్రభుత్వం మాత్రం ఈ విమర్శలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మరోవైపు ఘనా జట్టు గ్రూప్ మ్యాచ్‌లకు సన్నద్ధమవుతోంది. మియామీలో తీవ్రంగా సాధన చేస్తోంది. ఘనా జట్టు ఈ నెల 16న తన తొలి మ్యాచ్‌లో అమెరికాతో తలపడనుంది. -
‘ఫిఫా’ను దెబ్బతీసేందుకు యత్నం
ఖతర్‌పై ఆరోపణలకు జాతివివక్షే కారణం విరుచుకుపడిన బ్లాటర్ సావోపాలో: సాకర్ ప్రపంచకప్-2022 ఆతిథ్య హక్కులను ఖతర్ భారీగా లంచం ముట్టజెప్పి సొంతం చేసుకుందన్న ఆరోపణలపై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అధ్యక్షుడు సెప్ బ్లాటర్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఖతర్‌పై అవినీతి ఆరోపణలకు జాతి వివక్షే కారణమని మండిపడ్డారు. అదే సమయంలో ఫిఫాను దెబ్బతీసేందుకే ప్రయత్నిస్తున్నారని బ్లాటర్ విరుచుకుపడ్డారు. ‘ఫిఫా బలంగా ఉండటాన్ని వాళ్లు ఓర్వలేకపోతున్నారు. అందుకే ఫిఫాను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మనం కలిసి ముందుకు వెళితే ఎవరూ ఏమీ చేయలేరు’ అని బ్లాటర్ అన్నారు. ఫిఫా వార్షిక సమావేశం జరగనున్న నేపథ్యంలో ఆసియా, ఆఫ్రికాకు చెందిన ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. కొనసాగుతున్న విచారణ మరోవైపు ఈ అవినీతి ఆరోపణలపై ఫిఫా అధికారి మైకేల్ గార్సియా తన విచారణను సోమవారమే ముగించాల్సింది. అయితే ఈ విచారణ ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గార్సియా తన నివేదికను ఫిఫా అడ్జ్యూడికేటరి చాంబర్‌కు జూలై మూడో వారంలో సమర్పించనున్నారు. మరోసారి ఫిఫా అధ్యక్షుడిగా! ఫిఫా అధ్యక్షుడిగా సెప్ బ్లాటర్ ఐదోసారి ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచకప్ సందర్భంగా ఫిఫా వార్షిక సర్వసభ్య సమావేశం జరగనున్న నేపథ్యంలో బ్లాటర్ ఇప్పటికే అధ్యక్షుడి బరిలో నిలవనున్నట్లు సంకేతాలు కూడా ఇచ్చారు. -
గోల్‌గా గర్జించేది ఎవరు?!
ఒక్కో సాకర్ వరల్డ్ కప్‌లో ఒక్కో యువతరంగం ఎగసింది... గోల్ అయ్యి గర్జించింది. సంచలనమై నిలిచింది... ప్రపంచ సాకర్ చరిత్రలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొంది... మరి ఇప్పుడు మరో ప్రపంచ కప్ వచ్చింది. ఈ సారి ఎగసే యువతరంగం ఎవరు?! అది ప్రపంచంలోని ఏ మూల నుంచి? ఏ స్థాయిలో?! 1958 సాకర్ వరల్డ్ కప్‌లో 17 యేళ్ల వయసున్న పీలే మొదలు మొన్నటి దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రపంచ కప్‌లో మెరిసిన థామస్ ముల్లర్ వరకూ ఆయా ప్రపంచ కప్‌లలో ఎంతోమంది టీనేజర్లు తమ అద్వితీయ ప్రతిభతో అంతర్జాతీయ గుర్తింపు సొంతం చేసుకొన్నారు. ఇప్పుడు మరోసారి ప్రపంచ కప్ వచ్చేసింది. ఈ సారి ఏ యువ ఆటగాడు సంచలనమై నిలుస్తాడు? స్ఫూర్తిమంతమైన ఆటను కనబరుస్తూ అభిమానులను సంపాదించుకొంటాడు?! అలాంటి అవకాశం ఉన్న కొంతమంది ఆటగాళ్లు వీళ్లు... వీళ్లలో మెరిసి మురిపించేది ఎవరు?! జూలియన్ డ్రాక్సలర్ - జర్మనీ జర్మన్ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక స్థాయి గోల్స్ చేసిన ఆటగాడు మైఖేల్ బల్లాక్. ఆ లెజెండరీ ప్లేయర్‌తో పోలిక పెట్టగ ల స్ట్రైకర్ జూలియన్ డ్రాక్సలర్. గత ప్రపంచకప్‌లో ఉత్తమ ఆటగాడిగా అవార్డును అందుకొన్న థామస్ ముల్లర్‌తో సహా అనేక మంది స్టార్ ఆటగాళ్లు ఉన్నా జర్మన్ ఫుట్‌బాల్ టీమ్ మేనేజర్ మాత్రం జూలియన్‌ను తమ తురుపు ముక్క అంటున్నాడు. మరి ఈ యువ ఆటగాడు ఏ మేరకు సంచలనంగా నిలుస్తాడో వేచి చూడాలి! మౌరో ఇకార్డీ - అర్జెంటీనా ఇంటర్మిలన్ ఫుట్‌బాల్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఆటగాడికి తమ తమ జాతీయ జట్టుకు ఆడమని ఇటలీ, స్పెయిన్, అర్జెంటీనాల దేశాల నుంచి ఆహ్వానం వచ్చింది. అర్జెంటీనాకు చెందిన ఇకార్డీకి ఇటలీ పాస్‌పోర్ట్ ఉంది. స్పెయిన్ ఫుట్‌బాల్ క్లబ్‌కు ప్రాతనిధ్యం వహిస్తున్నాడు. దీంతో ఆ దేశాల వాళ్లంతా ఇతడి ఆటకు ముగ్ధులై తమ దేశం తరపున ఆడాలని ప్రతిపాదన పంపించారు. అయితే ఇకార్డీ మాత్రం తను పుట్టింది అర్జెంటీనాలో కాబట్టి ఆ దేశానికే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ ఫార్వర్డ్ ఆటగాడు మెస్సీ స్థాయి వాడని అర్జెంటీనా టీమ్ మేనేజర్ అంటున్నారు. లారెంజో ఇన్సైన్ - ఇటలీ ఈ ఇటాలియన్ ఫార్వర్డ్ ప్లేయర్ పొట్టివాడైనా చాలా గట్టివాడు. ఐదడుగుల రెండంగుళాల ఎత్తు ఉండే లారెంజోపై ఇటలీ టీమ్ ఎన్నో ఆశలు పెట్టుకొంది. అండర్ 21 టీమ్‌కు ఆడుతున్న సమయం నుంచే ఇతడిపై అంచనాలు పెరిగిపోయాయి. మరి అలాంటి అంచనాల నేపథ్యంలో లారెంజో ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి. కొకే - స్పెయిన్ ఇప్పుడు ప్రపంచ కప్‌లో పాల్గొంటున్న జట్ల బలాబలాలను చూస్తే మిడ్ ఫీల్డర్ల విషయంలో స్పెయిన్‌కు పటిష్టమైన జట్టుగా పేరుంది. డిఫెండింగ్ చాంఫియన్ అయిన స్పెయిన్‌కు మిడ్ ఫీల్డ్ క్షేత్రంలో మెరుస్తుంటాడు కొకే. ఈ 21 యేళ్ల ఆటగాడు స్పెయిన్ దిగ్గజాలకు సరితూగుతున్నాడు. గత ప్రపంచ కప్ విజేత అయిన టీమ్‌ను తిరిగి విజేతగా నిలపగలమనే ధీమాను వ్యక్తం చేస్తున్నాడు. క్లెమెంట్ గ్రెనియర్ - ఫ్రాన్స్ 2006 ఫీఫా వరల్డ్ కప్‌లో త్రుటిలో ట్రోఫీని కోల్పోయింది ఫ్రాన్స్. ఆ తర్వాత జిదాన్ వంటి ఆటగాడు నిష్ర్కమించాడు. ఈ సారి ఫ్రాన్స్తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న క్లెమెంట్ కూడా జిదాన్ స్థాయి ఆటగాడే అంటున్నారు. అండర్ 21 ఛాంపియన్ షిప్లో ఇతడు కొట్టిన కొన్ని మ్యాజిక్ గోల్స్ ఇతడిపై ఫ్రెంచ్ అభిమానుల ఆశలను, ఫుట్‌బాల్ ప్రియుల అంచనాలను అమాంతం పెంచేశాయి. వాటిని ఏ మేరకు అందుకొంటాడో! వీరు మాత్రమే కాదు... వెటరన్ ఫుట్‌బాల్ ప్లేయర్లకు ధీటుగా ఈ సారి అనేక మంది యువ ఆటగాళ్లు ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. హాలెండ్‌కు చెందిన మెంఫిస్ డిపే, ఇదే టీమ్‌కు చెందిన మిడ్ ఫీల్డర్ కెవిన్ స్ట్రూట్మన్, ఫ్రాన్స్‌కు చెందిన సెంటర్ బ్యాక్ ప్లేయర్ కుర్ట్ జౌమా, ఆస్ట్రియన్ లెఫ్ట్బ్యాక్ ప్లేయర్ డేవిడ్ అలబా తదితర యువ, ఇప్పుడిప్పుడే టీనేజ్‌ను దాటిన ఈ ఆటగాళ్లు, బ్రెజిల్లో జరగనున్న సాకర్ ప్రపంచ కప్‌కు ఆకర్షణగా మారారు. మరి ఈ ప్రపంచకప్‌తో వీళ్లలో ఎవరు తమ ప్రదర్శనతో స్టార్ ఇమేజ్ను సంపాదించుకొంటారో! - జీవన్‌రెడ్డి. బి