Qatar FIFA World Cup 2022: మెస్సీ మెరిసె... జగమే మురిసె... | Qatar FIFA World Cup 2022: FIFA World Cup 2022 Closing Ceremony Mrga Success | Sakshi
Sakshi News home page

Qatar FIFA World Cup 2022: మెస్సీ మెరిసె... జగమే మురిసె...

Published Tue, Dec 20 2022 6:36 AM | Last Updated on Tue, Dec 20 2022 6:36 AM

Qatar FIFA World Cup 2022: FIFA World Cup 2022 Closing Ceremony Mrga Success - Sakshi

టోర్నమెంట్‌ ప్రారంభానికి ముందు ఎన్నో వివాదాలు... వేడిమి వాతావరణంతో ఇబ్బందులు తప్పవేమోనని ఆటగాళ్ల సందేహాలు... ఆంక్షల మధ్య అభిమానులు ఆటను ఆస్వాదిస్తారో లేదోనని ఏమూలనో అనుమానం... కానీ ఒక్కసారి ‘కిక్‌’ మొదలుకాగానే... గోల్స్‌ మోత మోగింది... సంచలనాలతో సాకర్‌ సంరంభం షురూ అయింది... ఫైనల్‌ మ్యాచ్‌ చివరి క్షణం దాకా అదే ఉత్కంఠ కొనసాగింది... విశ్వవ్యాప్తంగా అభిమానులందరూ చిరకాలం గుర్తుండేలా ‘ఖతర్‌’నాక్‌ ప్రపంచకప్‌ సూపర్‌హిట్‌ అయ్యింది.

ప్రపంచ నంబర్‌వన్‌ బ్రెజిల్‌ జిగేల్‌ మనలేదు...  బెంబేలెత్తిస్తుందనుకున్న బెల్జియం బోల్తా      కొట్టింది... పూర్వ వైభవం సాధిస్తుందనుకున్న జర్మనీ ఇంకా సంధికాలంలోనే ఉన్నామని సంకేతాలు పంపించింది... క్రిస్టియానో రొనాల్డో జట్టు పోర్చు‘గల్లంతయింది’... ఆతిథ్యంలో అద్భుతమనిపించినా... ఆతిథ్య జట్టు ‘ఖతర్‌’నాక్‌ ఆటతో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. 56 ఏళ్లుగా మరో ప్రపంచకప్‌ టైటిల్‌ కోసం నిరీక్షిస్తున్న ఇంగ్లండ్‌ దానిని మరో నాలుగేళ్లకు పొడిగించుకోగా... నెదర్లాండ్స్‌ ‘షూటౌట్‌’లో అవుట్‌ అయింది... సౌదీ అరేబియా, జపాన్, ఆస్ట్రేలియా అడపాదడపా మెరిసి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కే పరిమితంకాగా... డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫ్రాన్స్‌ అంచనాలను నిలబెట్టుకుంది. అర్జెంటీనా ఆరంభ విఘ్నాన్ని అధిగమించి ఆఖరకు జగజ్జేతగా నిలిచి ఔరా అనిపించి సాకర్‌ సంగ్రామానికి శుభంకార్డు వేసింది.  

అంచనాలను మించి...
29 రోజులపాటు సాగిన ఈ సాకర్‌ సమరంలో అందరి అంచనాలను తారుమారు చేసి ఆకట్టుకున్న జట్టు మొరాకో. 2018 ప్రపంచకప్‌ రన్నరప్‌ క్రొయేషియాతో తొలి మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించి, రెండో మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ బెల్జియంను బోల్తా కొట్టించి... మూడో మ్యాచ్‌లో కెనడాపై గెలిచిన మొరాకో గ్రూప్‌ ‘ఎఫ్‌’ టాపర్‌గా నిలిచింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 2010 ప్రపంచ చాంపియన్‌ స్పెయిన్‌పై ‘షూటౌట్‌’లో గెలిచిన మొరాకో క్వార్టర్‌ ఫైనల్లో 1–0తో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్‌ జట్టును ఇంటిదారి పట్టించి ప్రపంచకప్‌ చరిత్రలో సెమీఫైనల్‌ చేరిన తొలి ఆఫ్రికా జట్టుగా ఘనత సాధించింది. అయితే సెమీఫైనల్లో పటిష్టమైన ఫ్రాన్స్‌ చేతిలో పోరాడి ఓడిన మొరాకో మూడో స్థానం కోసం మ్యాచ్‌లో క్రొయేషియా చేతిలోనూ ఓడిపోయి నాలుగో స్థానంతో ఈ మెగా ఈవెంట్‌ను ముగించింది.  

మెస్సీ ఇంకొన్నాళ్లు...
36 ఏళ్ల అర్జెంటీనా ప్రపంచకప్‌ నిరీక్షణకు తెరదించిన మెస్సీ తన కెరీర్‌లో లోటుగా ఉన్న విశ్వ కిరీటాన్ని సొంతం చేసుకొని దిగ్గజాల సరసన చేరిపోయాడు. సౌదీ అరేబియా చేతిలో ఆరంభ మ్యాచ్‌లోనే ఓడిపోయినా తన నాయకత్వ పటిమతో జట్టును ముందుండి నడిపించిన మెస్సీ ఆ తర్వాత ట్రోఫీ ముద్దాడేవరకు వెనుదిరిగి చూడలేదు. ఫ్రాన్స్‌తో ఫైనల్‌ అర్జెంటీనా తరఫున తన చివరి మ్యాచ్‌ అని ప్రకటించిన 35 ఏళ్ల మెస్సీ జట్టు జగజ్జేతగా నిలవడంతో తన నిర్ణయంపై పునరాలోచించాడు. ప్రపంచ చాంపియన్‌ అనే హోదాను ఇంకొన్నాళ్లు ఆస్వాదిస్తానని... జాతీయ జట్టుకు మరికొన్ని మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నానని తన మనసులోని మాటను వెల్లడించాడు. మెస్సీ కోరుకుంటే 2026 ప్రపంచకప్‌లోనూ ఆడవచ్చని అర్జెంటీనా కోచ్‌ లియోనల్‌ స్కలోని వ్యాఖ్యానించారు. ఈ టోర్నీలో ఏడు గోల్స్‌ సాధించిన మెస్సీ అత్యధిక ప్రపంచకప్‌ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గానూ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు.  

భవిష్యత్‌ ఎంబాపెదే...
నాలుగేళ్ల క్రితం రష్యా గడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో ఫ్రాన్స్‌ టైటిల్‌ సాధించడంలో యువస్టార్‌ కిలియాన్‌ ఎంబాపె కీలకపాత్ర పోషించాడు. ఖతర్‌లోనూ ఎంబాపె అదరగొట్టాడు. ముఖ్యంగా ఫైనల్లో చివరి పది నిమిషాల్లో ఎంబాపె ఆటతో అర్జెంటీనా హడలెత్తిపోయింది. మ్యాచ్‌ ఫ్రాన్స్, అర్జెంటీనా మధ్య కాకుండా ఎంబాపె, అర్జెంటీనా మధ్య జరుగుతోందా అనే అనుమానం కలిగింది. చివరకు ‘షూటౌట్‌’లో ఫ్రాన్స్‌ ఓడిపోయినా ఎంబాపె పోరాట యోధుడిలా అందరి దృష్టిలో నిలిచాడు. జిరూడ్, గ్రీజ్‌మన్, కరీమ్‌ బెంజెమాలాంటి అగ్రశ్రేణి ఆటగాళ్ల కెరీర్‌ చరమాంకానికి చేరుకోవడంతో భవిష్యత్‌ ఎంబాపెదే కానుంది. 23 ఏళ్ల ఎంబాపె ఇదే జోరు కొనసాగిస్తే మాత్రం వచ్చే ప్రపంచకప్‌లోనూ ఫ్రాన్స్‌ జట్టు టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుందని చెప్పవచ్చు.  

‘యునైటెడ్‌’లో కలుద్దాం...
అందరి ఆటగా పేరున్న ఫుట్‌బాల్‌ విశ్వసమరం వచ్చేసారి మూడు దేశాల్లో జరగనుంది. అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు 2026 ప్రపంచకప్‌నకు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. మరిన్ని జట్లకు అవకాశం లభించాలనే సదుద్దేశంతో ప్రపంచ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) 2026 ప్రపంచకప్‌ను 32 జట్లకు బదులుగా 48 జట్లతో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆతిథ్య దేశాల హోదాలో అమెరికా, మెక్సికో, కెనడా జట్లకు నేరుగా ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనే అవకాశం లభించింది. మిగతా 45 బెర్త్‌ల కోసం వచ్చే ఏడాది మార్చి నుంచి క్వాలిఫయింగ్‌ దశ మ్యాచ్‌లు మొదలై 2026 మార్చి వరకు కొనసాగుతాయి. మొత్తం 48 జట్లను 16 గ్రూప్‌లుగా (ఒక్కో గ్రూప్‌లో మూడు జట్లు) విభజిస్తారు. గ్రూప్‌ దశ తర్వాత ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన 32 జట్లు నాకౌట్‌ తొలి రౌండ్‌ దశకు అర్హత సాధిస్తాయి.

సాక్షి క్రీడా విభాగం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement