దోహా: ఎనిమిదేళ్ల క్రితం ప్రపంచకప్ అందినట్టే అంది చేజారిన క్షణం ఇప్పటికీ అర్జెంటీనా కెప్టెన్ లయనెల్ మెస్సీకి గుర్తుండే ఉంటుంది. ఎనిమిదేళ్ల తర్వాత ప్రపంచకప్‌ను ముద్దాడే అవకాశం మళ్లీ మెస్సీ ముంగిట వచ్చింది. ఈరోజు జరిగే ప్రపంచకప్ ఫైనల్ తన అంతర్జాతీయ కెరీర్‌లో అర్జెంటీనా తరఫున చివరి మ్యాచ్ కాబోతుందని ఇప్పటికే ప్రకటించిన 35 ఏళ్ల మెస్సీ ఈ తుది సమరాన్ని చిరస్మరణీయం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు.
పేరుకు అర్జెంటీనా–ఫ్రాన్స్ జట్ల మధ్య సాకర్ ప్రపంచకప్ ఫైనల్ అంటున్నా... దీనిని మెస్సీ, ఫ్రాన్స్ మధ్య పోరుగానే అభివర్ణించాల్సి ఉంటుంది. తటస్థ అభిమానులందరూ అర్జెంటీనా గెలిచి మెస్సీ తన కెరీర్‌ను ఘనంగా ముగించాలని కోరుకుంటున్నా... అత్యంత పటిష్టంగా ఉన్న ఫ్రాన్స్ మెస్సీ కల కలగానే మిగిలిపోవాలనే లక్ష్యంతో పోరాటం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
అంతా తానై...
టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకటిగా ఖతర్‌కు వచ్చిన అర్జెంటీనాకు తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో అనూహ్య ఓటమి ఎదురైంది. దాంతో మెస్సీపైనే కాకుండా అర్జెంటీనా జట్టు సత్తాపై అందరికీ సందేహం కలిగింది. అయితే కెప్టెన్‌గా మెస్సీ రెండో మ్యాచ్ నుంచి అంతా తానై జట్టును ముందుండి నడిపించాడు. మెరుపు కదలికలతో ప్రత్యర్థి డిఫెండర్లను బోల్తా కొట్టిస్తూ ఐదు గోల్స్ చేయడంతోపాటు సహచరులు గోల్స్ చేయడానికి తోడ్పడ్డాడు. ముఖ్యంగా క్రొయేషియాతో జరిగిన సెమీఫైనల్లో మెస్సీ విశ్వరూపం ప్రదర్శించాడు. ఆ మ్యాచ్‌లో మెస్సీ మ్యాజిక్‌తోనే అర్జెంటీనా మూడో గోల్ చేయగలిగింది.
క్రొయేషియా డిఫెండర్ గ్వార్డియోల్ ఎంత వెంటపడ్డా మెస్సీ తన పాదరసంలాంటి కదలికలతో అతడిని తప్పిస్తూ సహచరుడు అల్వారెజ్‌కు అందించిన పాస్, క్షణాల్లో నమోదైన గోల్‌ను ఎప్పటికీ మర్చిపోలేము. అయితే ఫ్రాన్స్‌తో జరిగే ఫైనల్‌ను అర్జెంటీనా కెప్టెన్ మెస్సీతోపాటు అతడి సహచరులు తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఆడినా తమ నుంచి ట్రోఫీ మరోసారి చేజారిపోతుందని అర్జెంటీనాకు తెలుసు. మెస్సీతోపాటు ఈ టోర్నీలో నాలుగు గోల్స్ చేసిన అల్వారెజ్, ఎంజెల్ డి మారియా, రోడ్రిగో డి పాల్, ఎంజో ఫెర్నాండెజ్, గోల్‌కీపర్ మార్టినెజ్ రాణించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అర్జెంటీనా ఆద్యంతం పకడ్బందీగా ఆడి ట్రోఫీని అందుకుంటుందా లేక ఆఖరి మెట్టుపై తడబడి నాలుగోసారి ట్రోఫీని చేజార్చుకుంటుందో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.
ఎంబాపె ఒక్కడే కాదు...
అర్జెంటీనా విజయావకాశాలు మెస్సీ ఆటపై ఆధారపడి ఉండగా... ఫ్రాన్స్ మాత్రం ఒకరిద్దరిపై ఆధారపడకుండా సమష్టి ఆటతో ఫైనల్‌కు చేరుకుంది. 23 ఏళ్ల కిలియాన్ ఎంబాపె ఐదు గోల్స్‌తో అదరగొట్టగా... 36 ఏళ్ల ఒలివియర్ జిరూడ్ నాలుగు గోల్స్‌తో మెరిపించాడు. థియో హెర్నాండెజ్, చువమెని, రాన్‌డల్, రాబియోట్ ఒక్కో గోల్ చేయగా... గ్రీజ్‌మన్ గోల్స్ చేయకున్నా సహచరులు గోల్స్ చేయడానికి తోడ్పడ్డాడు. గోల్‌కీపర్, కెప్టెన్ హుగో లోరిస్ ఏకంగా 53 సార్లు గోల్స్ కాకుండా అడ్డుగోడలా నిలబడ్డాడు. 1998లో తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన ఫ్రాన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న దీదీర్ డెషాంప్స్... కోచ్‌గా మారి 2018లో ఫ్రాన్స్‌కు రెండోసారి ప్రపంచ కప్‌ను అందించాడు. ఈ నేపథ్యంలో అత్యంత పటిష్టంగా కనిపిస్తున్న ఫ్రాన్స్ జట్టుకు మరోసారి గెలవాలంటే ఎలా ఆడాలో తెలుసు కాబట్టి నేటి ఆఖరి సమరం రంజుగా సాగుతుందని కచ్చితంగా చెప్పవచ్చు.
6: అర్జెంటీనాకిది ఆరో ప్రపంచకప్ ఫైనల్. 1978, 1986లలో విజేతగా నిలిచిన అర్జెంటీనా 1930, 1990, 2014లలో రన్నరప్‌గా నిలిచింది. నేటి ఫైనల్లో
అర్జెంటీనా ఓడిపోతే అత్యధిక సార్లు ఫైనల్లో ఓడిపోయిన జట్టుగా జర్మనీ (4 సార్లు) పేరిట ఉన్న రికార్డును సమం చేస్తుంది.
4: ఫ్రాన్స్ జట్టుకిది నాలుగో ప్రపంచకప్ ఫైనల్. 1998, 2018లలో టైటిల్ నెగ్గిన ఫ్రాన్స్ 2006లో రన్నరప్‌గా నిలిచింది.
3: నేటి ఫైనల్లో ఫ్రాన్స్ గెలిస్తే ఇటలీ (1930, 1934), బ్రెజిల్ (1958, 1962) జట్ల తర్వాత వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ గెలిచిన మూడోజట్టుగా చరిత్ర సృష్టిస్తుంది.
4: ప్రపంచకప్ చరిత్రలో ఫ్రాన్స్, అర్జెంటీనా జట్ల మధ్య జరగనున్న నాలుగో మ్యాచ్ ఇది. 1930లో అర్జెంటీనా 1–0తో... 1978లో అర్జెంటీనా 2–1తో ఫ్రాన్స్‌పై గెలిచింది. 2018 ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 4–3తో అర్జెంటీనాను ఓడించింది.
10: దక్షిణ అమెరికా జట్లతో జరిగిన గత 10 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ఫ్రాన్స్ ఓడిపోలేదు. ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి, నాలుగు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. చివరిసారి దక్షిణ అమెరికా జట్టు చేతిలో ఫ్రాన్స్ ఓడిపోవడం 1978లో (అర్జెంటీనా చేతిలో 1–2తో) జరిగింది.
11: దక్షిణ అమెరికా, యూరోప్ ఖండాలకు చెందిన దేశాల మధ్య జరగనున్న 11వ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఇది. ఏడుసార్లు దక్షిణ అమెరికా జట్లకు టైటిల్
లభించగా... మూడుసార్లు యూరోప్ జట్ల ఖాతాలో టైటిల్ చేరింది.
Comments
Please login to add a commentAdd a comment