ఏమా ఆట... ఎంతటి అద్భుత ప్రదర్శన... ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు... ప్రపంచకప్ ఫైనల్ అంటే ఇలా ఉంటుంది... కాదు, కాదు.. ఇంత గొప్పగా, ఇలాగే ఉంటుంది అనిపించేలా సాగిన ఆట... మైదానంలో ఆటగాళ్లు కొదమసింహాల్లా పోటీపడుతుంటే... స్టేడియంలో 90 వేల మంది ప్రేక్షకులే కాదు, ప్రపంచం మొత్తం ఊగిపోయింది... ఫైనల్లో ఆడుతున్న జట్లు మాత్రమే కాదు... ఏ జట్టుతో సంబంధం లేకపోయినా, రెప్పార్పకుండా చూసిన వీరాభిమానుల సంఖ్యకు లెక్కే లేదు... ఆట ఆరంభంలో అర్జెంటీనా దూకుడు చూస్తే మ్యాచ్ ఏకపక్షమే అనిపించింది...
ఒకసారి కాదు, రెండుసార్లు కాదు... పదే పదే అటాక్ మంత్రంగా ఆ జట్టు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడులు చేసింది... రెండు గోల్స్ ఆధిక్యం సాధించాక మెస్సీ మాయలో ఊగిపోతున్న అర్జెంటీనా అభిమానులు సంబరాలు షురూ చేసేశారు... తొలి అర్ధ భాగం చూస్తే అసలు ఫ్రాన్స్ ఫైనల్ చేరిన జట్టేనా అనిపించింది... స్టార్ ఆటగాళ్ల జాడే కనిపించలేదు. రెండో అర్ధభాగంలో కూడా కూడా అర్జెంటీనా తగ్గలేదు... మొత్తం 67 నిమిషాల ఆట సాగినా... ఒక్క షాట్ కూడా గోల్ పోస్ట్‌పై కొట్టలేకపోయింది.
అప్పుడొచ్చాడు ఎంబాపె... అప్పటి వరకు కనీసం పాస్‌లు కూడా అందుకోలేకపోయిన ఈ సంచలన ఆటగాడు తనేంటో చూపించాడు... 97 సెకన్ల వ్యవధిలో రెండు గోల్స్ చేసేసి అర్జెంటీనాను ఒక్కసారిగా అచేతనంగా మార్చాడు. ఆపై తమదే ఆట అన్నట్లుగా ఫ్రాన్స్ దూసుకుపోగా, మెస్సీ సేన నిస్సహాయంగా కనిపించింది... స్కోరు సమం చేయడం సంగతేమో కానీ డిఫెన్స్‌తో తమ గోల్‌పోస్ట్‌ను కాపాడుకోవడమే అర్జెంటీనాకు కనాకష్టంగా మారింది. నిర్ణీత సమయం ముగిసింది... ఇంజ్యూరీ టైమ్ కూడా అయిపోయింది. స్కోర్లు సమంగానే ఉన్నాయి.
అప్పుడు అదనపు సమయం తప్పలేదు. మళ్లీ మెస్సీపైనే గెలుపు భారం పడింది... తన కోసం, తన దేశం కోసం అన్నట్లుగా ఒక్కసారిగా శక్తి పుంజుకున్న మెస్సీ మరో గోల్‌తో ముందంజలో నిలిపి విజయధ్వానం చేశాడు... అయితే అది కొద్ది క్షణాలకే పరిమితమైంది... ఎంబాపె మళ్లీ మ్యాజిక్ ప్రదర్శించడంతో స్కోరు మళ్లీ సమమైంది. దాంతో ఫలితం పెనాల్టీ ‘షూటౌట్’కు వెళ్లింది.
‘అర్జెంటీనా జట్టు గెలవాలని ప్రపంచం మొత్తం కోరుకుంటోంది. మా దేశంలో కూడా అలాంటివారు ఉన్నారు’... ఫైనల్‌కు ముందు ఫ్రాన్స్ కోచ్ డెషాంప్స్ చేసిన వ్యాఖ్య ఇది. సగటు ఫుట్‌బాల్ అభిమాని దృష్టిలో ఇది నిజంగా నిజం... అందుకు ఒకే ఒక్క కారణం లయోనల్ మెస్సీ... ప్రపంచవ్యాప్తంగా అతడిని అభిమానించే వారెందరో అతను వరల్డ్‌కప్‌ను అందుకోవాలని కోరుకున్నారు.
వారంతా ఫైనల్ రోజు అర్జెంటీనా అభిమానులుగా మారిపోయారు... అందుకే మెస్సీ కొట్టిన ప్రతీ గోల్ వారిని ఆనందంతో ముంచెత్తితే... ఎంబాపె ఆట చూస్తుంటే ఎక్కడో గుండెల్లో అలజడి... ఎక్కడ అతను మ్యాచ్‌ను లాగేసుకుంటాడేమోనని ఆందోళన... కానీ అందరి కల నెరవేరింది... ఐదో ప్రపంచకప్ ప్రయత్నంలో మెస్సీ తన టీమ్‌ను విశ్వవిజేతగా నిలిపాడు. ఆ ఒక్క లోటును అధిగమించి ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిచాడు. సంవత్సరం క్రితం దివికేగిన డీగో మారడోనా పైనుంచి ఆశీర్వదించినట్లుగా 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనా చాంపియన్‌గా మారింది.
దోహా: గొంజాలో మోంటీల్... కొన్ని క్షణాల ముందు అర్జెంటీనా 3–2తో ఆధిక్యంలో ఉండి గెలుపు ఖాయమనుకుంటున్న దశలో అప్రయత్నంగానే మోచేతికి బంతికి తగిలించాడు... దాంతో ఫ్రాన్స్‌కు పెనాల్టీ కిక్ దక్కి స్కోరు సమమైంది. సబ్‌స్టిట్యూట్‌గా కొన్ని నిమిషాల క్రితమే మైదానంలోకి దిగి ఒక్క పొరపాటుతో విలన్‌గా మారిపోయాడు... కానీ మరికొన్ని నిమిషాల తర్వాత అతనే హీరోగా నిలిచాడు.
షూటౌట్‌లో అర్జెంటీనా ఓడి ఉంటే తన తప్పిదపు భారాన్ని అతను జీవితకాలం మోయాల్సి వచ్చేదేమో... షూటౌట్‌లో అర్జెంటీనా 3–2తో ఉండగా మోంటీల్ పెనాల్టీ తీసుకున్నాడు... అతను కొట్టిన కిక్ ఫ్రాన్స్ గోల్ కీపర్ లోరిస్‌ను దాటి నెట్‌లో పడింది! అంతే... అర్జెంటీనా బృందం విజయ గర్జన చేసింది... కన్నీళ్లతో మోంటీల్ భావోద్వేగభరితమయ్యాడు.
ఆదివారం జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్లో అర్జెంటీనా 4–2 (షూటౌట్‌లో) తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌ను ఓడించింది. నిర్ణీత సమయం, అదనపు సమయం కలిపి ఇరు జట్లు 3–3తో సమంగా నిలవగా, షూటౌట్‌లో ఫలితం తేలింది. అర్జెంటీనా తరఫున కెప్టెన్ మెస్సీ (23వ నిమిషం, 108వ నిమిషం), మరియా (36వ నిమిషం) గోల్స్ చేయగా... ఫ్రాన్స్ తరఫున ఎంబాపె ఒక్కడే (80వ నిమిషం, 81వ నిమిషం, 118వ నిమిషం) మూడు గోల్స్‌తో హ్యాట్రిక్ నమోదు చేశాడు.
హోరాహోరీ...
విజిల్ మోగిన దగ్గరి నుంచి అర్జెంటీనా ఆధిపత్యమే సాగింది. వరుసగా ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై జట్టు దాడులు చేస్తూ పోయింది. అదే జోరులో ఫలితం రాబట్టింది. పెనాల్టీ ఏరియాలో ఫ్రాన్స్ వింగర్ ఉస్మాన్ డెంబెలెను దాటి అర్జెంటీనా ఆటగాడు డి మరియా బంతితో దూసుకుపోయాడు. అతడిని నిలువరించే క్రమంలో ఉస్మాన్ వెనకనుంచి మరియాను తోసేశాడు. దాంతో మరో మాట లేకుండా రిఫరీ అర్జెంటీనాకు పెనాల్టీ ప్రకటించాడు. మెస్సీ ప్రశాంతంగా ఎడమ కాలితో కుడి వైపు చివరకు కిక్ కొట్టగా, మరోవైపు దూకిన గోల్ కీపర్ హ్యూగో లోరిస్ బంతిని ఆపడంలో పూర్తిగా విఫలమయ్యాడు.
ఆ తర్వాత మెస్సీ, అల్వారెజ్ అద్భుత సమన్వయంతో పాస్‌లు ఇచ్చుకుంటూ దూసుకుపోయారు. బంతి అలిస్టర్‌కు చేరగా, అతడి నుంచి పాస్ అందుకున్న మరియా అద్భుత గోల్‌గా మలిచాడు. తొలి అర్ధభాగంలో అసలు ఫ్రాన్స్ ఆటగాళ్లు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. పాస్‌లు సరిగా అందుకోలేకపోగా, కదలికల్లో కూడా వేగం లోపించింది. రెండో అర్ధభాగంలో కూడా అర్జెంటీనా ఆట చూస్తే తామే వెనుకబడి ఉన్నామా అన్నట్లు అనిపించింది. మళ్లీ మళ్లీ అదే దూకుడుతో వారు ప్రత్యర్థిపై చెలరేగారు. అయితే నికోల్స్ పొరపాటుతో ఫ్రాన్స్‌కు పెనాల్టీ దక్కింది.
దీనిని గోల్‌గా మలచిన ఎంబాపె తర్వాతి నిమిషంలో అద్భుత ఆటతో ఫీల్డ్ గోల్ నమోదు చేశాడు. మెస్సీ సేన బేలగా చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత మాత్రం అర్జెంటీనా కాస్త తేరుకుంది. దాంతో అదనపు సమయం మొత్తం పోటాపోటీగా సాగింది. మెస్సీ, ఎంబాపె ఇద్దరూ తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శిస్తూ చెరో గోల్‌తో మళ్లీ మ్యాచ్‌లో జీవం పోశారు. చివరకు పెనాల్టీ షూటౌట్ విశ్వవిజేతను తేల్చింది.
–సాక్షి క్రీడా విభాగం
Comments
Please login to add a commentAdd a comment