‘ఆరెంజ్’ ఓ రేంజ్‌లో...
నెదర్లాండ్స్ : 5
వాన్ పెర్సి: 44వ, 72వ ని.
రాబెన్: 50వ, 80వ ని. డివ్రిజ్: 62వ ని.
స్పెయిన్: 1
అలోన్సో: 27వ ని.
సూపర్‌మ్యాన్ మాత్రమే చేయగలడనిపించే విన్యాసం... చిరుతపులిని మించిన వేగం... చెక్కుచెదరని ఏకాగ్రత... ఈ మూడు కలగలిపి నెదర్లాండ్స్ కెప్టెన్ రాబిన్ వాన్ పెర్సి సంచలనం సృష్టించాడు. ప్రతి ఆటగాడూ జీవితంలో ఒక్కసారైనా సాధించాలనుకునే కలల గోల్‌తో సంచలనం సృష్టించాడు. డిఫెండింగ్ చాంపియన్‌తో మ్యాచ్‌లో అద్భుత గోల్‌తో నెదర్లాండ్స్ రాతను మార్చాడు.
సహచరుల్లో ఆత్మవిశ్వాసం నింపుతూ వాన్ పెర్సి సాధించిన ఈ గోల్ స్ఫూర్తితో... ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ అద్భుతం చేసింది. నాలుగేళ్ల క్రితం ప్రపంచకప్ ఫైనల్లో ఓటమికి బదులు తీర్చుకోవడంతో పాటు... ఎవరూ ఊహించని విధంగా ఏకంగా 5-1 గోల్స్ తేడాతో స్పెయిన్‌పై సంచలన విజయం సాధించింది. ఓ రేంజ్‌లో ఆడిన ‘ఆరెంజ్’ జట్టు కేవలం ఆట ద్వితీయార్ధంలోనే నాలుగు గోల్స్ చేయడం విశేషం.
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వాన్ పెర్సి (నెదర్లాండ్స్)
ఆడిన నిమిషాలు: 79; ఇచ్చిన పాస్‌లు: 26
చేసిన గోల్స్: 2; గోల్ పోస్ట్‌పై షాట్స్: 4
సాల్వెడార్ (బ్రెజిల్): సాకర్ ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ జట్టు చెలరేగిపోయింది. అంచనాలకు కూడా అందని రీతిలో గోల్స్ చేసి డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్‌కు ఊహించని షాకిచ్చింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి జరిగిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 5-1తో స్పెయిన్‌పై సంచలన విజయం సాధించింది. గత 51 ఏళ్లలో (1963లో స్కాట్లాండ్ చేతిలో 2-6 ఓటమి తర్వాత) స్పెయిన్ అత్యంత ఘోరమైన ఓటమిని మూటగట్టుకుంది.
ఇప్పటి వరకు వరల్డ్‌కప్ చరిత్రలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన జట్టు ఇంత తేడాతో ఓడటం కూడా ఇదే తొలిసారి. మ్యాచ్ ఆద్యంతం హవా కొనసాగించిన డచ్ వెటరన్ ఆటగాళ్లు రాబిన్ వాన్ పెర్సి, అర్జెన్ రాబెన్ చెరో రెండు గోల్స్ చేస్తే... డివ్రిజ్ ఒక గోల్ చేసి ఆరెంజ్ జట్టుకు తిరుగులేని ఆధిక్యాన్ని అందించారు. రెండో రోజు కూడా రిఫరీ నిర్ణయాలు వివాదస్పదమయ్యాయి. దీని నుంచి లబ్ది పొందిన స్పెయిన్ ఆటగాడు అలోన్సో పెనాల్టీ ద్వారా ఏకైక గోల్‌ను సాధించాడు.
ఆరంభంలో నెమ్మదిగా ఆడిన డచ్ ప్లేయర్లు మ్యాచ్ సాగే కొద్దీ దూకుడును పెంచారు. 8వ నిమిషంలో స్నిజ్డెర్ కొట్టిన బంతిని స్పెయిన్ గోల్ కీపర్ క్యాసిలాస్ సమర్థంగా అడ్డుకున్నాడు. తర్వాత దూకుడును పెంచిన స్పెయిన్ ఆటగాళ్లు ఇనిష్టా (10వ ని.), డిగో కోస్టా (13వ ని.) చేసిన గోల్స్ ప్రయత్నాలను డచ్ ఆటగాడు వ్లార్ తిప్పికొట్టాడు.
23వ నిమిషంలో జేవీ (స్పెయిన్) కొట్టిన బంతి గోల్ పోస్ట్ కార్నర్‌ను తగులుతూ వెళ్లగా, 25వ నిమిషంలో డీ గుజ్‌మన్ (డచ్) ఎల్లో కార్డుకు గురయ్యాడు.
26వ నిమిషంలో డిగో కోస్టా (స్పెయిన్)ను డివ్రిజ్ (డచ్) అడ్డుకోవడంతో స్పెయిన్‌కు పెనాల్టీ కార్నర్ లభించింది. ఈ పెనాల్టీని అలోన్సో (27వ ని.) గోల్‌గా మలిచి స్పెయిన్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు.
తర్వాత నెదర్లాండ్స్ ప్లేయర్ పెర్సీ (28, 30వ ని.) చేసిన రెండు ప్రయత్నాల్లో బంతులు ఆఫ్ సైడ్‌లో వెళ్లాయి. స్కోరును సమం చేసేందుకు డచ్ ఆటగాళ్లు చేసిన అటాకింగ్‌ను క్యాసిలాస్ సమర్థంగా తిప్పికొట్టాడు.
తొలి అర్ధభాగం ముగియడానికి 90 సెకన్ల ముందు డచ్ ఫార్వర్డ్ వాన్ పెర్సి ఓ అద్భుతమే చేశాడు. డాలీ బ్లైండ్ ఇచ్చిన క్రాస్ ఫీల్డ్ బంతిని రెప్పపాటులో హెడర్‌తో గోల్ పోస్ట్‌లోకి పంపి స్పెయిన్‌కు దిమ్మ తిరిగే షాకిచ్చాడు. దీంతో రెండు జట్లు 1-1తో విరామానికి వెళ్లాయి.
రెండో అర్ధభాగంలో డచ్ ఆటగాళ్లు మరింత ఆత్మవిశ్వాసంతో ఆడారు. దీంతో స్పెయిన్ ఒత్తిడికి లోనైంది. 53వ నిమిషంలో రాబెన్... ఓ లాంగ్ పాస్‌ను బ్లైండ్, మునిచ్‌లతో కలిసి అద్భుతంగా అదుపు చేస్తూ క్యాసిలాస్‌ను బోల్తా కొట్టిస్తూ గోల్‌గా మలిచాడు.
64వ నిమిషంలో స్నిజ్డెర్ ఇచ్చిన ఫ్రీ కిక్‌ను డివ్రిజ్ గోల్‌గా మలిచాడు. దీంతో డచ్ 3-1 ఆధిక్యంలోకి వెళ్లింది.
68వ నిమిషంలో లైన్ మీద ఆడుతూ వచ్చిన సిల్వ (స్పెయిన్)... బంతిని పెడ్రోకు అందించాడు. అయితే పెడ్రో కొట్టిన హెడర్ ఆఫ్‌సైడ్‌గా వెళ్లింది.
72వ నిమిషంలో వాన్ పెర్సి కొట్టిన బంతిని అంచనా వేయడంలో క్యాసిలాస్ విఫలం కావడంతో డచ్‌కు నాలుగో గోల్ లభించింది.
80వ నిమిషంలో బెరైన్, రామోస్‌లతో సమన్వయం చేసుకుంటూ రాబెన్... క్యాసిలాస్‌ను చుట్టుముట్టాడు. తర్వాత ఎడమ కాలితో బంతిని నెట్‌లోకి పంపి డచ్‌కు ఐదో గోల్ అందించాడు. ఇక ఆ తర్వాత గోల్స్ కోసం స్పెయిన్ ఆటగాళ్లు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఓటమి తప్పలేదు.