
ఆటగాళ్లకు ఆమె అందించిన స్ఫూర్తి ఎంతో..!
సాకర్ ప్రపంచకప్‌ను గెలిచిన జర్మనీ జట్టు శక్తియుక్తుల గురించి అనేకమంది ప్రశంసిస్తున్నారు. జర్మనీ వ్యూహాల గురించి అనేకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆటగాళ్ల ప్రతిభ అద్భుతమని సాకర్ విశ్లేషకులు అంటున్నారు. మరి ఇటువంటి సమయంలో జర్మన్ టీమ్ విజయం గురించి చర్చిస్తే.. అందులోప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన వ్యక్తి ఏంజెలా మెర్కెల్. జర్మన్ ఛాన్సరల్ అయిన మెర్కెల్ తమ జాతీయ జట్టును అడుగడుగునా ప్రోత్సహించారు. ఆటగాళ్లతో స్నేహితురాలిగా మెలుగుతూ వారిలో స్ఫూర్తిని నింపారు.
మెర్కెల్ స్థాయి వ్యక్తి తమను అంతగా అభిమానించడం, అండగా నిలవడం తమకు కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని, గెలవాలనే తపనను, బాధ్యతను పెంచిందని జర్మన్ ఆటగాళ్లు వ్యాఖ్యానించారు. ప్రపంచకప్‌ను గెలుచుకొచ్చిన టీమ్‌ను అభినందిస్తూ వారితో సరదాగానో, హుందాగానో గడిపే దేశాధ్యక్షులు, ప్రధానమంత్రులు ఎంతోమంది ఉంటారు. అయితే మెర్కెల్ అందరిలాంటి నాయకురాలు కాదు. మొన్నటి ఆదివారం జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌లో జర్మన్ ఫుట్‌బాల్ టీ మ్‌ఏకైక గోల్‌సాధించగానే మెర్కెల్ ఒక సాధారణ ఫుట్‌బాల్ అభిమానిలా గంతులేశారు. ఇక మ్యాచ్‌లో జర్మనీ విజేతగా నిలవగానే ప్రోటోకాల్ నిబంధనలను పక్కనపెట్టి మరీ ఆటగాళ్లతో ఒక స్నేహితురాలిలా కలిసిపోవడం చర్చనీయాంశమైంది.
కేవలం తమ జట్టు గెలిచినప్పుడు మాత్రమే కాదు, ప్రపంచ కప్‌లో జర్మనీజట్టు ఆటను ప్రతిమ్యాచ్‌లోనూ సమీక్షించినట్టుగా కనిపిస్తోంది మెర్కెల్. ఆమె సాకర్ వరల్డ్‌కప్ ప్రారంభోత్సవానికే హాజరైంది. ఇక తొలి మ్యాచ్‌లో జర్మనీ జట్టు తమ తొలిమ్యాచ్‌లో పోర్చగల్‌ను ఓడించి శుభారంభం చేసినప్పుడయితే ఆనందంతో ఉక్కిరిబిక్కిరైంది. అప్పుడే ఆమె తమ ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్ వరకూ వెళ్లి అభినందించి వచ్చారు. దీన్నిబట్టి ఆమె తమ టీమ్‌కు ఎంత అండగా నిలిచారో అర్థం చేసుకోవచ్చు. ఆటగాళ్లతో సన్నిహితంగా గడపడం ద్వారా ఏంజెలా ఆటతోబాటు అభిమానుల మనసులను కూడా గెలిచింది!