ఒక్కో సాకర్ వరల్డ్ కప్‌లో ఒక్కో యువతరంగం ఎగసింది... గోల్ అయ్యి గర్జించింది. సంచలనమై నిలిచింది... ప్రపంచ సాకర్ చరిత్రలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొంది... మరి ఇప్పుడు మరో ప్రపంచ కప్ వచ్చింది. ఈ సారి ఎగసే యువతరంగం ఎవరు?! అది ప్రపంచంలోని ఏ మూల నుంచి? ఏ స్థాయిలో?!
1958 సాకర్ వరల్డ్ కప్‌లో 17 యేళ్ల వయసున్న పీలే మొదలు మొన్నటి దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రపంచ కప్‌లో మెరిసిన థామస్ ముల్లర్ వరకూ ఆయా ప్రపంచ కప్‌లలో ఎంతోమంది టీనేజర్లు తమ అద్వితీయ ప్రతిభతో అంతర్జాతీయ గుర్తింపు సొంతం చేసుకొన్నారు. ఇప్పుడు మరోసారి ప్రపంచ కప్ వచ్చేసింది. ఈ సారి ఏ యువ ఆటగాడు సంచలనమై నిలుస్తాడు? స్ఫూర్తిమంతమైన ఆటను కనబరుస్తూ అభిమానులను సంపాదించుకొంటాడు?! అలాంటి అవకాశం ఉన్న కొంతమంది ఆటగాళ్లు వీళ్లు... వీళ్లలో మెరిసి మురిపించేది ఎవరు?!
జూలియన్ డ్రాక్సలర్ - జర్మనీ
జర్మన్ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక స్థాయి గోల్స్ చేసిన ఆటగాడు మైఖేల్ బల్లాక్. ఆ లెజెండరీ ప్లేయర్‌తో పోలిక పెట్టగ ల స్ట్రైకర్ జూలియన్ డ్రాక్సలర్. గత ప్రపంచకప్‌లో ఉత్తమ ఆటగాడిగా అవార్డును అందుకొన్న థామస్ ముల్లర్‌తో సహా అనేక మంది స్టార్ ఆటగాళ్లు ఉన్నా జర్మన్ ఫుట్‌బాల్ టీమ్ మేనేజర్ మాత్రం జూలియన్‌ను తమ తురుపు ముక్క అంటున్నాడు. మరి ఈ యువ ఆటగాడు ఏ మేరకు సంచలనంగా నిలుస్తాడో వేచి చూడాలి!
మౌరో ఇకార్డీ - అర్జెంటీనా
ఇంటర్‌మిలన్ ఫుట్‌బాల్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఆటగాడికి తమ తమ జాతీయ జట్టుకు ఆడమని ఇటలీ, స్పెయిన్, అర్జెంటీనాల దేశాల నుంచి ఆహ్వానం వచ్చింది. అర్జెంటీనాకు చెందిన ఇకార్డీకి ఇటలీ పాస్‌పోర్ట్ ఉంది. స్పెయిన్ ఫుట్‌బాల్ క్లబ్‌కు ప్రాతనిధ్యం వహిస్తున్నాడు. దీంతో ఆ దేశాల వాళ్లంతా ఇతడి ఆటకు ముగ్ధులై తమ దేశం తరపున ఆడాలని ప్రతిపాదన పంపించారు. అయితే ఇకార్డీ మాత్రం తను పుట్టింది అర్జెంటీనాలో కాబట్టి ఆ దేశానికే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ ఫార్వర్డ్ ఆటగాడు మెస్సీ స్థాయి వాడని అర్జెంటీనా టీమ్ మేనేజర్ అంటున్నారు.
లారెంజో ఇన్‌సైన్ - ఇటలీ
ఈ ఇటాలియన్ ఫార్వర్డ్ ప్లేయర్ పొట్టివాడైనా చాలా గట్టివాడు. ఐదడుగుల రెండంగుళాల ఎత్తు ఉండే లారెంజోపై ఇటలీ టీమ్ ఎన్నో ఆశలు పెట్టుకొంది. అండర్ 21 టీమ్‌కు ఆడుతున్న సమయం నుంచే ఇతడిపై అంచనాలు పెరిగిపోయాయి. మరి అలాంటి అంచనాల నేపథ్యంలో లారెంజో ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి.
కొకే - స్పెయిన్
ఇప్పుడు ప్రపంచ కప్‌లో పాల్గొంటున్న జట్ల బలాబలాలను చూస్తే మిడ్ ఫీల్డర్‌ల విషయంలో స్పెయిన్‌కు పటిష్టమైన జట్టుగా పేరుంది. డిఫెండింగ్ చాంఫియన్ అయిన స్పెయిన్‌కు మిడ్ ఫీల్డ్ క్షేత్రంలో మెరుస్తుంటాడు కొకే. ఈ 21 యేళ్ల ఆటగాడు స్పెయిన్ దిగ్గజాలకు సరితూగుతున్నాడు. గత ప్రపంచ కప్ విజేత అయిన టీమ్‌ను తిరిగి విజేతగా నిలపగలమనే ధీమాను వ్యక్తం చేస్తున్నాడు.
క్లెమెంట్ గ్రెనియర్ - ఫ్రాన్స్
2006 ఫీఫా వరల్డ్ కప్‌లో త్రుటిలో ట్రోఫీని కోల్పోయింది ఫ్రాన్స్. ఆ తర్వాత జిదాన్ వంటి ఆటగాడు నిష్ర్కమించాడు. ఈ సారి ఫ్రాన్స్‌తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న క్లెమెంట్ కూడా జిదాన్ స్థాయి ఆటగాడే అంటున్నారు. అండర్ 21 ఛాంపియన్ షిప్‌లో ఇతడు కొట్టిన కొన్ని మ్యాజిక్ గోల్స్ ఇతడిపై ఫ్రెంచ్ అభిమానుల ఆశలను, ఫుట్‌బాల్ ప్రియుల అంచనాలను అమాంతం పెంచేశాయి. వాటిని ఏ మేరకు అందుకొంటాడో!
వీరు మాత్రమే కాదు...
వెటరన్ ఫుట్‌బాల్ ప్లేయర్లకు ధీటుగా ఈ సారి అనేక మంది యువ ఆటగాళ్లు ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. హాలెండ్‌కు చెందిన మెంఫిస్ డిపే, ఇదే టీమ్‌కు చెందిన మిడ్ ఫీల్డర్ కెవిన్ స్ట్రూట్‌మన్, ఫ్రాన్స్‌కు చెందిన సెంటర్ బ్యాక్ ప్లేయర్ కుర్ట్ జౌమా, ఆస్ట్రియన్ లెఫ్ట్‌బ్యాక్ ప్లేయర్ డేవిడ్ అలబా తదితర యువ, ఇప్పుడిప్పుడే టీనేజ్‌ను దాటిన ఈ ఆటగాళ్లు, బ్రెజిల్‌లో జరగనున్న సాకర్ ప్రపంచ కప్‌కు ఆకర్షణగా మారారు. మరి ఈ ప్రపంచకప్‌తో వీళ్లలో ఎవరు తమ ప్రదర్శనతో స్టార్ ఇమేజ్‌ను సంపాదించుకొంటారో!
- జీవన్‌రెడ్డి. బి
గోల్‌గా గర్జించేది ఎవరు?!
Published Wed, May 21 2014 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM
Advertisement