నెతన్యాహు అరెస్టవుతారా? | Israeli Prime Minister Benjamin Netanyahu Faces Arrest Says Italy, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

నెతన్యాహు అరెస్టవుతారా?

Published Sat, Nov 23 2024 6:03 AM | Last Updated on Sat, Nov 23 2024 11:21 AM

Israeli Prime Minister Benjamin Netanyahu faces arrest says Italy

తమ దేశానికి వస్తే అరెస్టు చేస్తామన్న ఇటలీ  

ఆచితూచి స్పందించిన యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు

వాషింగ్టన్‌:  గాజాలో యుద్ధ నేరాలకు పాల్పడినందుకు ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు(ఐసీసీ) అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. ఆయన నిజంగా అరెస్టవుతారా? అనే దానిపై చర్చ మొదలైంది. ఐసీసీలో మొత్తం 124 సభ్యుదేశాలున్నాయి. అయితే, అన్ని దేశాలూ ఐసీసీ ఆదేశాలను పాటిస్తాయన్న గ్యారంటీ లేదు. అరెస్టు విషయంలో అవి సొంత నిర్ణయం తీసుకోవచ్చు. 

నెతన్యాహు తమ దేశానికి వస్తే అరెస్టు చేస్తామని ఇటలీ ప్రకటించింది. నెతన్యాహుతోపాటు ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ మాజీ మంత్రి యోవ్‌ గల్లాంట్‌ను హమాస్‌ నేతలతో సమానంగా ఐసీసీ పరిగణించడం సరైంది కాదని ఇటలీ రక్షణ మంత్రి గైడో క్రోసెట్టో చెప్పారు. ఐసీసీ ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఒకవేళ నెతన్యాహు తమ దేశ భూభాగంలోకి ప్రవేశిస్తే చేస్తామని పేర్కొన్నారు. 

నెతన్యాహు అరెస్టుపై మరికొన్ని యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు మాత్రం ఆచితూచి స్పందించాయి. ఐసీసీని తాము గౌరవిస్తామని, నెతన్యాహు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఫ్రాన్స్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి క్రిస్టోఫీ లెమైన్‌ చెప్పారు. తమ వైఖరిని ఇప్పుడే వెల్లడించలేమని అన్నారు. ఐసీసీ జారీ చేసిన అరెస్టు వారెంట్‌ ఒక సాధారణ ప్రక్రియ అని, అది తుది తీర్పు కాదని స్పష్టం చేశారు. 
 
నెతన్యాహును అరెస్టు చేయబోమని ఇజ్రాయెల్‌ మిత్రదేశం జర్మనీ సంకేతాలిచ్చింది. ఇజ్రాయెల్‌ ప్రధానిపై ఐసీసీ అరెస్టు వారెంట్‌ను హంగెరీ ప్రధానమంత్రి విక్టన్‌ ఓర్బన్‌ బహిరంగంగా ఖండించారు. నెతన్యాహు తమ దేశంపై స్వేచ్ఛగా పర్యటించవచ్చని సూచించారు. పాలస్తీనాకు మద్దతిచ్చే స్లొవేనియా దేశం ఐసీసీ నిర్ణయాన్ని సమర్థించింది. అరెస్టు వారెంట్‌కు స్లొవేనియా ప్రధానమంత్రి రాబర్ట్‌ గొలోబ్‌ మద్దతు ప్రకటించారు. 

అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు నిర్ణయాన్ని అమలు చేయడం అనేది రాజకీయపరమైన ఐచి్ఛకాంశం కాదని, చట్టపరమైన నిబంధన అని యూరోపియన్‌ యూనియన్‌ విదేశాంగ విధానం చీఫ్‌ జోసెఫ్‌ బోరెల్‌ చెప్పారు. ఐసీసీ నిర్ణయాన్ని అగ్రరాజ్యం అమెరికా ఖండించింది. ఇలాంటి అరెస్టు వారెంట్లతో పరిస్థితి మరింత విషమిస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఐసీసీ గత ఏడాది అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. కానీ, ఆయన ఇప్పటికీ అరెస్టు కాలేదు. ఐసీసీ సభ్యదేశాలకు పుతిన్‌ వెళ్లలేదు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement