war crimes
-
నెతన్యాహు అరెస్టవుతారా?
వాషింగ్టన్: గాజాలో యుద్ధ నేరాలకు పాల్పడినందుకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆయన నిజంగా అరెస్టవుతారా? అనే దానిపై చర్చ మొదలైంది. ఐసీసీలో మొత్తం 124 సభ్యుదేశాలున్నాయి. అయితే, అన్ని దేశాలూ ఐసీసీ ఆదేశాలను పాటిస్తాయన్న గ్యారంటీ లేదు. అరెస్టు విషయంలో అవి సొంత నిర్ణయం తీసుకోవచ్చు. నెతన్యాహు తమ దేశానికి వస్తే అరెస్టు చేస్తామని ఇటలీ ప్రకటించింది. నెతన్యాహుతోపాటు ఇజ్రాయెల్ రక్షణ శాఖ మాజీ మంత్రి యోవ్ గల్లాంట్ను హమాస్ నేతలతో సమానంగా ఐసీసీ పరిగణించడం సరైంది కాదని ఇటలీ రక్షణ మంత్రి గైడో క్రోసెట్టో చెప్పారు. ఐసీసీ ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఒకవేళ నెతన్యాహు తమ దేశ భూభాగంలోకి ప్రవేశిస్తే చేస్తామని పేర్కొన్నారు. నెతన్యాహు అరెస్టుపై మరికొన్ని యూరోపియన్ యూనియన్ దేశాలు మాత్రం ఆచితూచి స్పందించాయి. ఐసీసీని తాము గౌరవిస్తామని, నెతన్యాహు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఫ్రాన్స్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి క్రిస్టోఫీ లెమైన్ చెప్పారు. తమ వైఖరిని ఇప్పుడే వెల్లడించలేమని అన్నారు. ఐసీసీ జారీ చేసిన అరెస్టు వారెంట్ ఒక సాధారణ ప్రక్రియ అని, అది తుది తీర్పు కాదని స్పష్టం చేశారు. నెతన్యాహును అరెస్టు చేయబోమని ఇజ్రాయెల్ మిత్రదేశం జర్మనీ సంకేతాలిచ్చింది. ఇజ్రాయెల్ ప్రధానిపై ఐసీసీ అరెస్టు వారెంట్‌ను హంగెరీ ప్రధానమంత్రి విక్టన్ ఓర్బన్ బహిరంగంగా ఖండించారు. నెతన్యాహు తమ దేశంపై స్వేచ్ఛగా పర్యటించవచ్చని సూచించారు. పాలస్తీనాకు మద్దతిచ్చే స్లొవేనియా దేశం ఐసీసీ నిర్ణయాన్ని సమర్థించింది. అరెస్టు వారెంట్‌కు స్లొవేనియా ప్రధానమంత్రి రాబర్ట్ గొలోబ్ మద్దతు ప్రకటించారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నిర్ణయాన్ని అమలు చేయడం అనేది రాజకీయపరమైన ఐచి్ఛకాంశం కాదని, చట్టపరమైన నిబంధన అని యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధానం చీఫ్ జోసెఫ్ బోరెల్ చెప్పారు. ఐసీసీ నిర్ణయాన్ని అగ్రరాజ్యం అమెరికా ఖండించింది. ఇలాంటి అరెస్టు వారెంట్లతో పరిస్థితి మరింత విషమిస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఐసీసీ గత ఏడాది అరెస్టు వారెంట్ జారీ చేసింది. కానీ, ఆయన ఇప్పటికీ అరెస్టు కాలేదు. ఐసీసీ సభ్యదేశాలకు పుతిన్ వెళ్లలేదు. -
పుతిన్ లక్ష్యంగా.. నోబెల్ శాంతి బహుమతి!
నోబెల్ అవార్డుల సీజన్ మొదలుకాబోతోంది. నామినేషన్లను ఇప్పటికే జల్లెడ పట్టగా.. వచ్చేవారంలో ఒక్కో విభాగంలో విజేతలను ప్రకటించబోతున్నాయి కమిటీలు. అయితే ఈసారి నోబెల్ పురస్కారాలు.. చాలా ప్రత్యేకతలు సంతరించుకున్నాయి. అందుకు కారణం ఉక్రెయిన్ యుద్ధం!. 1901 నుంచి వైద్య, భౌతిక, రసాయన, సాహిత్య, శాంతి.. 1969 నుంచి ఆర్థిక శాస్త్రంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డుల ప్రదానోత్సవం జరుగుతోంది. అయితే.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నోబెల్ ప్రకటనలు వెలువడే స్టాక్‌హోమ్(స్వీడన్), ఓస్లో(నార్వే)లకు దగ్గరగా యుద్ధవాతావరణం కనిపించింది లేదు. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల నడుమ అవార్డుల ప్రకటన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రత్యేకించి.. ► అక్టోబర్ 7వ తేదీన వెలువడబోయే నోబెల్ శాంతి బహుమతి ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి బహుమతిని యుద్ధ నేరాల సమాచారాన్ని సేకరించే సంస్థలకు ఇవ్వబోతున్నట్లు సంకేతాలు దక్కుతున్నాయి. ఇది రష్యాను.. ముఖ్యంగా పుతిన్‌ను దృష్టిలో పెట్టుకునే ఉండనుందని స్వీడన్ ప్రొఫెసర్ పీటర్ వాలెన్స్టీన్ అభిప్రాయపడుతున్నారు. ► రేసులో ప్రముఖంగా.. ది హేగ్‌లోని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు లేదంటే నెదర్లాండ్స్‌కు చెందిన ఇన్వెస్టిగేషన్ జర్నలిజం గ్రూప్ బెల్లింగ్క్యాట్కుగానూ దక్కవచ్చంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ► సాధారణంగా జనవరి 31వ తేదీ వరకే.. శాంతి బహుమతి నామినేషన్ల డెడ్‌లైన్ ముగుస్తుంది. కానీ, ఐదుగురు సభ్యులున్న నార్వేగియన్ కమిటీ మాత్రం ఫిబ్రవరి చివరి వారంలో ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సాధారణంగా నామినేషన్లు చాలా గోప్యంగా ఉంటాయి. కానీ, ఈ ఏడాది మొత్తంగా 343 నామినేషన్లు వచ్చాయని సమాచారం అందుతోంది. పుతిన్ టార్గెట్‌గా.. నార్వేగియన్ నోబెల్ కమిటీ ఈసారి శాంతి బహుమతిని కీలకంగా భావిస్తోంది. అందుకు కారణం.. ఉక్రెయిన్ యుద్ధం, తదనంతర రష్యా వ్యతిరేక పరిణామాలు. ► ఇప్పటిదాకా నోబెల్ శాంతి బహుమతి ఇవ్వనిది యాభై ఏళ్ల కిందట మాత్రమే!. అర్హులు లేరనే కారణంతో ఆ సమయంలో అవార్డు ప్రకటించలేదు. ► ఉక్రెయిన్ దురాక్రమణ.. నరమేధం, రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షల్ని నార్వేగియన్ నోబెల్ కమిటీ పరిగణనలోకి తీసుకుందని, అందుకే ఫిబ్రవరి చివరి వారంలో (ఆక్రమణ మొదలైన తర్వాత..) ప్రత్యేకంగా భేటీ అయ్యిందనే ప్రచారం నడుస్తోంది ఇప్పుడు. ► పుతిన్‌కు మంట పుట్టేలా.. ఆయన వ్యతిరేకుల పేర్లను సైతం కమిటీ పరిశీలిస్తోంది. అందులో.. క్రెమ్లిన్ విమర్శకుడు అలెక్సీ నావల్నీ(జైల్లో ఉన్నారు). బెలారస్ ప్రతిపక్ష నేత స్వెత్లానా టిఖానోవ్స్కావా కమిటీ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ► వీళ్లుగాక.. అవినీతి వ్యతిరేక గ్రూప్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్, స్వీడన్‌కు చెందిన ఉద్యమకారిణి గ్రేటా తున్బర్గ్, పర్యావరణ ఉద్యమకారులు నిస్రీన్ ఎల్సాయిమ్(సుడాన్), చిబెజె ఎజెకిల్(ఘనా), బ్రిటిష్ దిగ్గజం డేవిడ్ అట్టెన్బోరఫ్ కూడా ఉండొచ్చని చెప్తున్నారు. ► అయితే ఉక్రెయిన్ యుద్ధం దరిమిలా.. ప్రపంచమంతా భద్రతా సంక్షోభంలో ఉండగా.. పర్యావరణం వైపు కమిటీ ఆలోచన ఉండకపోవచ్చనే అభిప్రాయం ఎక్కువగా వ్యక్తం అవుతోంది. ► కిందటి ఏడాది.. ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సభ్యులైన దిమిత్రి మురాతోవ్(రష్యా), మరియా రెస్సా(పిలిప్పైన్స్)కు సంయుక్తంగా దక్కింది నోబెల్ శాంతి అవార్డు. మురాతోవ్ పుతిన్ వ్యతిరేక కథనాలతో విరుచుకుపడతాడనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రష్యాలో పత్రికా స్వేచ్ఛ కోసం పాటుపడినందుకే ఆయనకు అవార్డు దక్కింది. అంతేకాదు.. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆయన నోబెల్ ప్రైజ్‌ను అమ్మేసి విరాళంగా ఇవ్వడం వార్తల్లో పతాక శీర్షికన నిలిచింది కూడా. చివరగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2014 నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యాడు. సిరియాపై అమెరికా క్షిపణి దాడిని నివారించడంలో కీలక పాత్ర పోషించినందుకు.. రసాయనిక ఆయుధాలను సిరియా ధ్వంసం చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నందుకు పుతిన్ నోబెల్ పీస్ ప్రైజ్‌కు నామినేటయ్యారు. -
రాజకీయ ప్రత్యర్థులకు ఉరిశిక్ష ... వార్నింగ్ ఇచ్చిన యూఎన్
Myanmar Junta Executions' Plan: మయన్మార్ జుంటా ప్రభుత్వం ఆంగ్ సాన్ సూకీ పార్టీకి చెందిన మాజీ శాసనసభ్యుడు, ఒక ప్రజాస్వామ్య కార్యకర్తని ఉరితీస్తామని ప్రకటించింది. ఇద్దరూ తీవ్రవాదానికి పాల్పడ్డారని, అందువలన మరణశిక్ష విధిస్తున్నట్లు తెలిపింది. అదీగాక 1991 తర్వాత దేశంలో తొలిసారిగా న్యాయపరమైన ఉరిశిక్ష విధించిబడుతుందని పేర్కొంది. ఈ మేరకు మాజీ ఎంపీ ఫియో జెయా థా, ప్రజాస్వామ్య కార్యకర్త కో జిమ్మీతో సహా నలుగురికి మరణశిక్ష విధించినట్లు జుంటా ప్రతినిధి జా మిన్ తున్ తెలిపారు. పైగా వారిని జైలు విధానాల ప్రకారం ఉరితీస్తామని వెల్లడించారు. ఐతే ఈ కేసును మయన్మార్ తరుపున యూఎన్ విచారణా యంత్రాంగానికి అధిపతి అయిన నికోలస్ కౌమ్జియాన్ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం, విచారణలో దోషులుగా నిర్ధారించబడిన వ్యక్తుల ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడ్డాయని తెలుస్తోందన్నారు. రాజకీయ ప్రత్యర్థులను ఉరితీయడం అనేది యుద్ధ నేరం లేదా మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలతో సమానం అని ఆయన హెచ్చరించారు. గతేడాది అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత మయన్మార్ జుంటా ప్రభుత్వం అణిచివేతలో భాగంగా డజన్ల కొద్దీ తిరుగుబాటు వ్యతిరేక కార్యకర్తలకు మరణశిక్ష విధించింది. అయితే మయన్మార్ దశాబ్దాలుగా ఉరిని అమలు చేయలేదు. విచారణ న్యాయమైనదిగా పరిగణించబడాలంటే, సాధ్యమైనంత వరకు ఈ కేసుని బహిరంగంగా దర్యాప్తు చేయాలని యూఎన్ విచారణాధికారి కౌమ్జియాన్ అన్నారు. కానీ ఈ కేసులో పబ్లిక్ ప్రోసీడింగ్లు లేదా తీర్పులు బహిరంగంగా అందుబాటులో లేవు. ఇక్కడ ట్రిబ్యునల్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందా లేదా అనే సందేహాన్ని రేకెత్తించిందన్నారు. మయన్మార్ కోసమే ఈ యూఎన్ విచారణా యంత్రాంగం 2018లో యూఎన్ మానవ హక్కుల మండలిచే రూపొందించబడింది. మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించడం, క్రిమినల్ ప్రొసీడింగ్‌లను సులభతరం చేసేలా డాక్యుమెంట్ చేయడం దీని పని. (చదవండి: ఉక్రెయిన్ చిన్నారుల కోసం.. నోబెల్ బహుమతిని వేలానికి పెట్టిన రష్యాన్ జర్నలిస్ట్) -
Russia-Ukraine war: యుద్ధ నేరాలపై రష్యా సైనికుడి విచారణ
కీవ్/ఐక్యరాజ్యసమితి: రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందని మొదటినుంచీ ఆరోపిస్తున్న ఉక్రెయిన్, తొలిసారిగా ఆ అభియోగాల కింద రష్యా సైనికునిపై విచారణకు శుక్రవారం తెర తీసింది. చుపాకివ్‌కా గ్రామంలో 62 ఏళ్ల వ్యక్తిని కాల్చి చంపిన కేసులో అరెస్టయిన రష్యా జవాను సార్జెంట్ వాదిమ్ షైషిమారిన్(21)ను కీవ్‌లోని కోర్టుకు తరలించి విచారించారు. షైషిమారిన్ అంగీకరించాడని అధికారులు చెప్పారు. అతనికి యావజ్జీవ శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ‘బాలల’ సంక్షోభమే: ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం ముమ్మాటికీ బాలల హక్కుల సంక్షోభమేనని ‘యునిసెఫ్’ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఒమర్ అబ్దీ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, నాటో కూటమిలో చేరొద్దని ఫిన్లాండ్ను రష్యా హెచ్చరించింది. లేదంటే సైనిక, సాంకేతిక చర్యలు తప్పవని హెచ్చరించింది. భారత ఎంబసీ పునఃప్రారంభం కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం కార్యకలాపాలు ఈ నెల 17 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ శుక్రవారం ప్రకటించింది. రష్యా దాడుల వల్ల ఉక్రెయిన్‌లో మానవ హక్కుల పరిస్థితి నానాటికీ దిగజారుతుండడంపై ఐరాస మానవ హక్కుల మండలిలో చేసిన తీర్మానానికి భారత్ దూరంగా ఉంది. రష్యా సైన్యానికి చేదు అనుభవం తూర్పు ఉక్రెయిన్‌లోని సివెర్‌స్కీ డొనెట్స్ నదిని దాటుతున్న రష్యా దళాలపై ఉక్రెయిన్ సైన్యం విరుచుకుపడినట్లు బ్రిటిష్ అధికారులు శుక్రవారం తెలిపారు. పదుల సంఖ్యలో రష్యా సైనిక వాహనాలు ధ్వంసమయ్యాయని, జవాన్లు హతమయ్యారని వెల్లడించారు. ఆయుధాల కొనుగోలు కోసం ఉక్రెయిన్‌కు అదనంగా 520 మిలియన్ డాలర్ల సాయం అందించేందుకు యూరోపియన్ యూనియన్ శుక్రవారం ఆమోదం తెలిపింది. జి–7 దేశాల దౌత్యవేత్తలు జర్మనీలో సమావేశమయ్యారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, తాజా పరిణామాలపై చర్చించారు. -
రష్యా నేరాలపై ఐసీసీలో విచారణ
హేగ్: ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడిలో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) విచారణ ప్రారంభించింది. ఉక్రెయిన్‌లో జరుగుతున్న నరమేధంపై విచారణ ప్రారంభించినట్టుగా ఐసీసీ ప్రాసిక్యూటర్ కరీమ్ ఖాన్ చెప్పారు. రష్యా యుద్ధ నేరాలపై విచారణ జరగాలని అంతర్జాతీయంగా తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. రష్యా అనాగరిక చర్యలపై విచారణ జరిపించి దానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి లిజ్ ట్రస్ డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు యూకే, దాని మిత్రదేశాలు పోరాటం చేస్తాయని చెప్పారు. రష్యా చేస్తున్న నేరాలకు సంబంధించిన ఆధారాలన్నీ సేకరిస్తున్నామని తెలిపారు. రష్యా నేరాలపై విచారణకు ఐసీసీ న్యాయమూర్తులు అంగీకరించిన తర్వాత ప్రాసిక్యూటర్ కరీమ్ ఖాన్ తాము ఆధారాలు సేకరించే పని మొదలు పెట్టినట్టుగా తెలిపారు. ఉక్రెయిన్ ప్రభుత్వం ఈ దాడుల్లో 2 వేల మందికిపైగా పౌరులు మరణించారని చెబుతోంది. రష్యా విచక్షణారహితంగా పౌరులు నివసించే ప్రాంతాలు, పాఠశాలలు, ఆస్పత్రులు వంటివాటిపై బాంబులు వేస్తూ ఉండడంతో హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్‌లో మానవ హక్కుల హననం జరుగుతోందని ఐసీసీ విచారణకు అంగీకరించడంతోనే అర్థమవుతోందని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ తాత్కాలిక అధ్యక్షుడు బల్కీస్ జర్రా చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్,అధికారులపై అభియోగాలు మోపే అవకాశాలున్నాయి. (చదవండి: భారత్‌పై కాట్సా.. బైడెన్‌దే నిర్ణయం) -
యుద్ధనేరాల విచారణకు ఐరాస నిధులు
ఐక్యరాజ్య సమితి: సిరియా, మయన్మార్‌లలో జరిగిన యుద్ధ నేరాల విచారణ కోసం ఐక్యరాజ్య సమితి తన బడ్జెట్లో నిధులు కేటాయించింది. 2020 సంవత్సరానికి గాను ఐరాస సర్వ ప్రతినిధి సభ శుక్రవారం 307 కోట్ల డాలర్లను కేటాయించింది. గత ఏడాదితో పోల్చి చూస్తే బడ్జెట్ స్వల్పంగా పెరిగింది. 2019లో 290 కోట్ల డాలర్ల బడ్జెట్ ఉండేది. ఐక్యరాజ్య సమితి సచివాలయానికి అదనపు బాధ్యతలు అప్పగించడం, ద్రవ్యోల్బణం, డాలర్ మారకం విలువలో తేడాల కారణంగా బడ్జెట్‌ను పెంచినట్టు యూఎన్ దౌత్యవేత్తలు వెల్లడించారు. యెమన్‌లో పరిశీలకుల బృందం, హైతిలో రాజకీయ బృందాల ఏర్పాటు, సిరియా అంతర్యుద్ధం, మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింలపై జరిగిన దాడులకు సంబంధించిన నేరాలపై విచారణకు ఈ బడ్జెట్లో నిధుల్ని వినియోగించనున్నారు. ఇలా యుద్ధ నేరాల విచారణకు ఐక్యరాజ్య సమితి నిధులు కేటాయించడం ఇదే తొలిసారి. గతంలో యూఎన్ స్వచ్ఛందంగా ఈ నేరాల విచారణకు ఆర్థిక సాయాన్ని అందించేది. జూన్‌లో ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపన కోసం 600 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ప్రకటించింది. ఇప్పుడు కొత్త సంవత్సరం వేళ ప్రత్యేకంగా మరో బడ్జెట్‌ను ప్రకటించింది. కొత్త సైబర్ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు అధికమవుతుండడంతో వాటిని నిరోధించడానికి ఒక కొత్త అంతర్జాతీయ ఒప్పందాన్ని ఐరాస రూపొందిస్తోంది. దీనికి సంబంధించిన తీర్మానాన్ని శుక్రవారం ఐరాస సర్వ ప్రతినిధుల సభ ఆమోదించింది. ఈ తీర్మానాన్ని యూరోపియన్ యూనియన్, అమెరికా, మరికొన్ని దేశాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. యూఎన్‌లో ఈ తీర్మానం 79–60 ఓట్ల తేడాతో గట్టెక్కింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన నిపుణులతో ఒక కమిటీ వేసి సైబర్ నేరాలు నిరోధించడానికి కసరత్తు జరుగుతుంది. -
అమెరికాకు ఎదురుదెబ్బ
హేగ్: ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు(ఐసీసీ)లో అగ్రరాజ్యం అమెరికాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ సైనికులు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) ఏజెంట్లలో కొద్దిమందిపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 9/11 దాడుల అనంతరం అఫ్ఘానిస్థాన్ పై యుద్ధం చేసిన అమెరికా సైన్యం.. 2003-04 సమయంలో వందలాది మంది అఫ్ఘాన్లను పాశవికంగా హింసించిందనడానికి ప్రాథమిక ఆధారాలు లభించాయని, ఆ మేరకు అకృత్యాలకు పాల్పడినవారిపై చర్యలు తప్పవని హేగ్ లోని ఐసీసీ ప్రాసిక్యూటర్ కార్యాలయం సోమవారం మీడియాకు తెలిపింది. సెప్టెంబర్ 11 దాడులకు ప్రతీకారంగా అల్ కాయిదా, దాని ఒకప్పుటి చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ను మట్టుపెట్టేందుకు అఫ్ఘాన్ గడ్డపై కాలుమోపిన అమెరికా సైన్యాలు ఉగ్రవాదులనే కాక సాధారణ పౌరులకు సైతం నరకం చూపించిందని ఐసీసీ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. కాన్సంట్రేషన్ క్యాంపుల తరహాలో అఫ్ఘాన్ లో తమ చేతికి చిక్కినవారిని హింసిచడానికి అమెరికన్లు ప్రత్యేక గదులు నిర్మించారని, సీఐఏ ఆధ్వర్యంలోనే హింసా కార్యక్రమాలు నడిచాయని ప్రాసిక్యూటర్ తెలిపారు. కనీసం 61 మంది అఫ్ఘాన్లను అమెరికా సైనికులు, మరో 27 మందిని సీఐఏ ఏజెంట్లు టార్చర్ పెట్టినట్లు ఆధారాలు లభించాయని, అంతర్జాతీయ నేర చట్టాలను అనుసరించి ఆయా ఘటనకు కారకులైనవారిపై వారెంట్లు జారీచేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రాసిక్యూటర్ కార్యాలయం వెల్లడించింది. అయితే, ఐసీసీని అమెరికా ఇంకా గుర్తించలేదు. దీంతో ఒకవేళ కోర్టు వారెంట్లు జారీచేసినా అమెరికా పట్టించుకోకపోవచ్చనే భావన వ్యక్తం అవుతోంది. ఘోర అమానవీయ చర్యలకు పాల్పడే దేశాలను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టాలనే ఉద్దేశంతో అలాంటి నేరాలపై విచారణ జరిపేందుకుగానూ 2003లో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) ఏర్పాటయింది. నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ ఐసీసీ ఏర్పాటును తీవ్రంగా తప్పుపట్టడమేకాక, దానిని గుర్తించబోమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఐసీసీ కోర్టు చర్యలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి. -
మాజీ ఎంపీకి ఉరి శిక్ష
ఢాకా: బంగ్లాదేశ్‌లో ఓ మాజీ ఎంపీకి ఉరి శిక్ష వేశారు. ఆ దేశ స్వాతంత్ర పోరాటం సమయంలో యుద్ధ నేరానికి పాల్పడ్డాడని ఈ కేసులను విచారిస్తున్న ప్రత్యేక ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం అతడికి ఉరి శిక్ష ఖరారు చేసి మరికొంతమందికి జీవిత కారాగార శిక్ష వేసింది. అయితే, ఆ ఎంపీకి సంబంధించిన న్యాయవాది ఉన్నత న్యాయస్థానంలో ఈ కేసును మరోసారి అపీల్ చేస్తామని చెప్పారు. బంగ్లాదేశ్‌లో యుద్ధ నేరాల పేరిట పలువురుని ఇటీవల కాలంలో ఉరి తీస్తున్న సంగతి తెలిసిందే. అక్కడి మీడియా తెలిపిన వివరాల ప్రకారం జమాతే ఈ ఇస్లామి పార్టీకి చెందిన షాకావత్ హుస్సేన్ గతంలో ఈ పార్టీకి చెందిన విద్యార్థి విభాగం ఇస్లామీ చత్ర సంఘలో కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశాడు. అదే సమయంలో దేశ విముక్తికోసం పోరాడాల్సిందిపోయి.. బంగ్లాపై యుద్ధానికి దిగిన పాక్‌కు సహాయం చేసి ద్రోహానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ ఆరోపణలను విచారించిన ట్రిబ్యునల్ అతడికి ఉరి శిక్షను వేసింది. -
మరో ఇద్దరికి మరణశిక్షలు
ఢాకా: 1971 స్వాతంత్ర యుద్ధం సమయంలో యుద్ధ నేరాలకు సంబంధించి మరో ఇద్దరికి బంగ్లాదేశ్ లో మరణశిక్ష పడింది. అబ్దుల్ హక్ (66) అతుర్ రెహమాన్ (62 ) అనే ఇద్దరు న్యాయవాదులకు బంగ్లాదేశీ ట్రిబ్యునల్ మరణ శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పింది. బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ కు అనుకూలంగా ఈ ఇద్దరు పనిచేశారని ప్రాసిక్యూషన్ వాదించింది. అబ్దుల్ హక్ 1971లో ఒక అనుకూల పాకిస్థాన్ రాజకీయ పార్టీ నాయకుడని.. ఆయనపై మోపిన పౌరుల మీద క్రూరమైన దాడులు, చిత్రహింసలు, మహిళలపై అత్యాచారాలు తదితర ఆరోపణలు నిర్ధారణ అయ్యాయని ట్రిబ్యునల్ వెల్లడించింది. దీనికి సంబంధించి సుమారు 23 మంది సాక్షులను విచారించినట్టు తెలిపింది. రెహమాన్ కూడా ఇదే మిలిషీయా పార్టీలో సభ్యుడుగా ఉండి అనేక దురాగతాలకు పాల్పడ్డాడని పేర్కొంది. ట్రిబ్యునల్ తీర్పును ఉన్నత న్యాయ స్థానంలో సవాలు చేయనున్నట్టు డిఫెన్స్ న్యాయవాది గాజీ తమీమ్ విలేకరులతో చెప్పారు. ట్రిబ్యునల్ తీర్పును ప్రధానమంత్రి షేక్ హసీనా సమర్థించారు. ఆనాటి సంఘర్షణ గాయాల ఉపశమనానికి ఈ శిక్షలు అవసరమని పేర్కొన్నారు. తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్న నాయకులను పూర్తిగా తుడిచిపెట్టే పనిలో భాగంగానే ప్రభుత్వం ఈ చర్యలకు పూనుకుంటోందని ప్రతిపక్షాలు విమర్శించాయి. గతంలో ఢాకా సెంట్రల్ జైలులో ఇద్దరు ప్రతిపక్ష నాయకులను ఉరితీయడం సంచలనం రేకిత్తించింది. -
ఇద్దరు ప్రతిపక్ష నేతలను ఉరి తీశారు
ఢాకా: బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు సీనియర్ ప్రతిపక్ష నాయకులను శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఉరి తీసినట్టు ఓ మంత్రి తెలిపారు. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో యుద్ధ నేరాలకు పాల్పడినట్టు వారు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చివరి ప్రయత్నంగా క్షమాభిక్ష పెట్టాలని వారు అభ్యర్థనను తిరస్కరించిన నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి 12.45 గంటలకు వారిని ఉరి తీసినట్టు న్యాయశాఖ మంత్రి అనిసుల్ హఖ్ ఆదివారం మీడియాకు తెలిపారు. యుద్ధ నేరాల కేసులో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న సీనియర్ ప్రతిపక్ష నేతలు అలీ ఆషన్ మహమ్మద్ ముజాహిద్, సలాహుద్దీన్ ఖదర్ చౌదరీ తమకు క్షమాభిక్ష పెట్టాలని కోరినప్పటికీ.. ప్రభుత్వం తిరస్కరించింది. వీరి ఉరి నేపథ్యంలో ఢాకా కేంద్ర కారాగారం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతిపక్ష నాయకులను ఉరితీసిన వార్త తెలియడంతో ప్రధానమంత్రి షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ శ్రేణులు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకొన్నారు.