నోబెల్ అవార్డుల సీజన్ మొదలుకాబోతోంది. నామినేషన్లను ఇప్పటికే జల్లెడ పట్టగా.. వచ్చేవారంలో ఒక్కో విభాగంలో విజేతలను ప్రకటించబోతున్నాయి కమిటీలు. అయితే ఈసారి నోబెల్ పురస్కారాలు.. చాలా ప్రత్యేకతలు సంతరించుకున్నాయి. అందుకు కారణం ఉక్రెయిన్ యుద్ధం!.
1901 నుంచి వైద్య, భౌతిక, రసాయన, సాహిత్య, శాంతి.. 1969 నుంచి ఆర్థిక శాస్త్రంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డుల ప్రదానోత్సవం జరుగుతోంది. అయితే.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నోబెల్ ప్రకటనలు వెలువడే స్టాక్‌హోమ్(స్వీడన్), ఓస్లో(నార్వే)లకు దగ్గరగా యుద్ధవాతావరణం కనిపించింది లేదు. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల నడుమ అవార్డుల ప్రకటన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రత్యేకించి..
► అక్టోబర్ 7వ తేదీన వెలువడబోయే నోబెల్ శాంతి బహుమతి ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి బహుమతిని యుద్ధ నేరాల సమాచారాన్ని సేకరించే సంస్థలకు ఇవ్వబోతున్నట్లు సంకేతాలు దక్కుతున్నాయి. ఇది రష్యాను.. ముఖ్యంగా పుతిన్‌ను దృష్టిలో పెట్టుకునే ఉండనుందని స్వీడన్ ప్రొఫెసర్ పీటర్ వాలెన్‌స్టీన్ అభిప్రాయపడుతున్నారు.
► రేసులో ప్రముఖంగా.. ది హేగ్‌లోని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు లేదంటే నెదర్లాండ్స్‌కు చెందిన ఇన్వెస్టిగేషన్ జర్నలిజం గ్రూప్ బెల్లింగ్‌క్యాట్‌కుగానూ దక్కవచ్చంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
► సాధారణంగా జనవరి 31వ తేదీ వరకే.. శాంతి బహుమతి నామినేషన్ల డెడ్‌లైన్ ముగుస్తుంది. కానీ, ఐదుగురు సభ్యులున్న నార్వేగియన్ కమిటీ మాత్రం ఫిబ్రవరి చివరి వారంలో ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సాధారణంగా నామినేషన్లు చాలా గోప్యంగా ఉంటాయి. కానీ, ఈ ఏడాది మొత్తంగా 343 నామినేషన్లు వచ్చాయని సమాచారం అందుతోంది.
పుతిన్ టార్గెట్‌గా..
నార్వేగియన్ నోబెల్ కమిటీ ఈసారి శాంతి బహుమతిని కీలకంగా భావిస్తోంది. అందుకు కారణం.. ఉక్రెయిన్ యుద్ధం, తదనంతర రష్యా వ్యతిరేక పరిణామాలు.
► ఇప్పటిదాకా నోబెల్ శాంతి బహుమతి ఇవ్వనిది యాభై ఏళ్ల కిందట మాత్రమే!. అర్హులు లేరనే కారణంతో ఆ సమయంలో అవార్డు ప్రకటించలేదు.
► ఉక్రెయిన్ దురాక్రమణ.. నరమేధం, రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షల్ని నార్వేగియన్ నోబెల్ కమిటీ పరిగణనలోకి తీసుకుందని, అందుకే ఫిబ్రవరి చివరి వారంలో (ఆక్రమణ మొదలైన తర్వాత..) ప్రత్యేకంగా భేటీ అయ్యిందనే ప్రచారం నడుస్తోంది ఇప్పుడు.
► పుతిన్‌కు మంట పుట్టేలా.. ఆయన వ్యతిరేకుల పేర్లను సైతం కమిటీ పరిశీలిస్తోంది. అందులో.. క్రెమ్లిన్ విమర్శకుడు అలెక్సీ నావల్నీ(జైల్లో ఉన్నారు). బెలారస్ ప్రతిపక్ష నేత స్వెత్లానా టిఖానోవ్స్‌కావా కమిటీ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
► వీళ్లుగాక.. అవినీతి వ్యతిరేక గ్రూప్ ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్, స్వీడన్‌కు చెందిన ఉద్యమకారిణి గ్రేటా తున్‌బర్గ్, పర్యావరణ ఉద్యమకారులు నిస్రీన్ ఎల్సాయిమ్(సుడాన్), చిబెజె ఎజెకిల్(ఘనా), బ్రిటిష్ దిగ్గజం డేవిడ్ అట్టెన్‌బోరఫ్ కూడా ఉండొచ్చని చెప్తున్నారు.
► అయితే ఉక్రెయిన్ యుద్ధం దరిమిలా.. ప్రపంచమంతా భద్రతా సంక్షోభంలో ఉండగా.. పర్యావరణం వైపు కమిటీ ఆలోచన ఉండకపోవచ్చనే అభిప్రాయం ఎక్కువగా వ్యక్తం అవుతోంది.
► కిందటి ఏడాది.. ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సభ్యులైన దిమిత్రి మురాతోవ్(రష్యా), మరియా రెస్సా(పిలిప్పైన్స్)కు సంయుక్తంగా దక్కింది నోబెల్ శాంతి అవార్డు. మురాతోవ్ పుతిన్ వ్యతిరేక కథనాలతో విరుచుకుపడతాడనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రష్యాలో పత్రికా స్వేచ్ఛ కోసం పాటుపడినందుకే ఆయనకు అవార్డు దక్కింది. అంతేకాదు.. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆయన నోబెల్ ప్రైజ్‌ను అమ్మేసి విరాళంగా ఇవ్వడం వార్తల్లో పతాక శీర్షికన నిలిచింది కూడా.
చివరగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2014 నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యాడు. సిరియాపై అమెరికా క్షిపణి దాడిని నివారించడంలో కీలక పాత్ర పోషించినందుకు.. రసాయనిక ఆయుధాలను సిరియా ధ్వంసం చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నందుకు పుతిన్ నోబెల్ పీస్ ప్రైజ్‌కు నామినేటయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment