మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎట్టకేలకు దేశం దాటి కాలు బయటపెట్టనున్నారు. అక్టోబర్‌లో పుతిన్ చైనాలో పర్యటించనున్నట్లు సమాచారం. కాగా ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధ నేరాలకుగానూ పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) అరెస్ట్ వారెంట్ జారీ చేసిన తర్వాత ఆయన చేయనున్న తొలి విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం.
వచ్చే అక్టోబరులో జరిగే బెల్ట్ అండ్ రోడ్ సదస్సుకు హాజరుకావాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పుతిన్‌ను ఆహ్వానించగా.. ఇందుకు రష్యా అధ్యక్షుడు అంగీకరించినట్లు బ్లూమ్‌బర్గ్ తన నివేదికలో పేర్కొంది. ఇప్పటికే పుతిన్ చైనా పర్యటన కోసం క్రెమ్లిన్ షెడ్యూల్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఐసీసీ అరెస్ట్ వారెంట్ భయంతో ఆయన అన్ని విదేశీ పర్యటనలనూ వాయిదా వేసుకుంటూ వస్తున్నారు.
చదవండి: ఆకాశంలో అద్భుతం.. నేటి సాయంత్రం సూపర్ బ్లూ మూన్ దర్శనం
అరెస్ట్ వారెంట్
కాగా గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంప్రకటించిన విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య ఏడాదిన్నరగా సైనిక చర్య కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లోని చిన్నారులను రష్యా కిడ్నాప్ చేసిందన్న ఆరోపణలపై మార్చిలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీని ప్రకారం పుతిన్ ఐసీసీలో సభ్యత్వం ఉన్న దేశాల్లో అడుగు పెడితే ఆయన్ను అరెస్టు చేయాల్సి ఉంటుంది.
అప్పటి నుంచి ఆయన రష్యా అంతర్జాతీయ సరిహద్దులు దాటలేదు. ఇక అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో సుమారు 120 సభ్య దేశాలు ఉన్నాయి. అయితే వారెంట్‌ను అమలు చేసే పరిస్థితి మాత్రం అంతర్జాతీయ దేశాల సహకారంపై ఆధారపడి ఉంటుంది. ఇక పుతిన్ యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి పొరుగున్న ఉన్న సోవియట్ యూనియన్ దేశాలు, ఇరాన్‌లో మాత్రమే పర్యటించారు. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సమావేశానికి కూడా గైర్హాజరయ్యారు. వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. ఎందుకంటే రష్యా అధ్యక్షుడు అరెస్ట్ వారెంట్‌పై సౌత్ ఆఫ్రికా కూడా ఐసీసీకి సంతకం చేసింది.
అంతేగాక సెప్టెంబర్‌లో ఢిల్లీ వేదికగా జరగబోయే జీ20 శిఖరాగ్ర సదస్సులోనూ పుతిన్ పాల్గొనడం లేదు. ఈ మేరకు సోమవారం పుతిన్ మోదీకి ఫోన్ చేసి సమావేశానికి రాకపోవడంపై వివరించారు. ఆయనకు బదులు రష్యా తరపున విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరవుతారని పేర్కొన్నారు. ఇక చివరిసారి 2022లో చైనాలో పర్యటించారు. మరోవైపు జీ జిన్‌పింగ్ ఈ ఏడాది మార్చిలో మాస్కోను సందర్శించారు. మూడోసారి చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అదే ఆయన తొలి విదేశీ పర్యటన.
చదవండి: ‘బైడెన్ పిచ్చితో మూడో ప్రపంచ యుద్ధమే!’
Comments
Please login to add a commentAdd a comment