బందీని హింసిస్తోన్న అమెరికన్ సైనికురాలు(ఫైల్)
హేగ్: ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు(ఐసీసీ)లో అగ్రరాజ్యం అమెరికాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ సైనికులు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) ఏజెంట్లలో కొద్దిమందిపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 9/11 దాడుల అనంతరం అఫ్ఘానిస్థాన్ పై యుద్ధం చేసిన అమెరికా సైన్యం.. 2003-04 సమయంలో వందలాది మంది అఫ్ఘాన్లను పాశవికంగా హింసించిందనడానికి ప్రాథమిక ఆధారాలు లభించాయని, ఆ మేరకు అకృత్యాలకు పాల్పడినవారిపై చర్యలు తప్పవని హేగ్ లోని ఐసీసీ ప్రాసిక్యూటర్ కార్యాలయం సోమవారం మీడియాకు తెలిపింది.
సెప్టెంబర్ 11 దాడులకు ప్రతీకారంగా అల్ కాయిదా, దాని ఒకప్పుటి చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ను మట్టుపెట్టేందుకు అఫ్ఘాన్ గడ్డపై కాలుమోపిన అమెరికా సైన్యాలు ఉగ్రవాదులనే కాక సాధారణ పౌరులకు సైతం నరకం చూపించిందని ఐసీసీ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. కాన్సంట్రేషన్ క్యాంపుల తరహాలో అఫ్ఘాన్ లో తమ చేతికి చిక్కినవారిని హింసిచడానికి అమెరికన్లు ప్రత్యేక గదులు నిర్మించారని, సీఐఏ ఆధ్వర్యంలోనే హింసా కార్యక్రమాలు నడిచాయని ప్రాసిక్యూటర్ తెలిపారు. కనీసం 61 మంది అఫ్ఘాన్లను అమెరికా సైనికులు, మరో 27 మందిని సీఐఏ ఏజెంట్లు టార్చర్ పెట్టినట్లు ఆధారాలు లభించాయని, అంతర్జాతీయ నేర చట్టాలను అనుసరించి ఆయా ఘటనకు కారకులైనవారిపై వారెంట్లు జారీచేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రాసిక్యూటర్ కార్యాలయం వెల్లడించింది.
అయితే, ఐసీసీని అమెరికా ఇంకా గుర్తించలేదు. దీంతో ఒకవేళ కోర్టు వారెంట్లు జారీచేసినా అమెరికా పట్టించుకోకపోవచ్చనే భావన వ్యక్తం అవుతోంది. ఘోర అమానవీయ చర్యలకు పాల్పడే దేశాలను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టాలనే ఉద్దేశంతో అలాంటి నేరాలపై విచారణ జరిపేందుకుగానూ 2003లో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) ఏర్పాటయింది. నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ ఐసీసీ ఏర్పాటును తీవ్రంగా తప్పుపట్టడమేకాక, దానిని గుర్తించబోమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఐసీసీ కోర్టు చర్యలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.