US Forces
-
చైనా నుంచి తైవాన్ను కాపాడుతాం
బీజింగ్: తైవాన్ను ఆక్రమించుకునేందుకు చైనా ప్రయత్నిస్తే అడ్డుకుంటామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆదివారం పునరుద్ఘాటించారు. సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు స్పష్టం చేశారు. చైనా ఆక్రమణ నుంచి అమెరికా బలగాలు, ప్రజలు తైవాన్ను రక్షిస్తారని పేర్కొన్నారు. ‘స్వాతంత్య్రానికి సంబంధించి తైవాన్ ప్రజలే సొంతంగా నిర్ణయం తీసుకుంటారు. స్వతంత్రంగా ఉండాలంటూ వారిని మేం ప్రోత్సహించం’ అని అన్నారు. తైవాన్ అంశం శాంతియుతంగా పరిష్కారం కావాలన్నదే తమ విధానమని అనంతరం వైట్‌హౌస్ అనంతరం పేర్కొంది. ఈ విషయంలో తమ వైఖరి యథాతథమని తెలిపింది. అయితే, తైవాన్ విషయంలో సైనిక జోక్యంపై స్పందించలేదు. అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ ఇటీవలి తైవాన్ సందర్శనపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ ప్రాంతంపైకి క్షిపణులను ప్రయోగించడం, యుద్ధ విమానాలను మోహరించడం తదితర చర్యలతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో బైడెన్ చేసిన తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. దశాబ్దాలుగా ఒకే చైనా విధానాన్ని అనుసరిస్తున్న అమెరికా తైవాన్‌తో అధికారికంగా సంబంధాలు కొనసాగించడం లేదు. బైడెన్ వ్యాఖ్యలపై చైనా మండిపడింది. -
కశ్మీర్ ఉగ్రవాదుల చేతుల్లో శాటిలైట్ ఫోన్లు
శ్రీనగర్: అఫ్గానిస్తాన్‌లో అమెరికా బలగాలు వదిలేసి వెళ్లిన అత్యాధునిక సామగ్రి కశ్మీర్ ఉగ్రవాదుల చేతుల్లోకి వచ్చాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ఉగ్రవాదుల స్థావరాలపై జరిపిన దాడుల్లో ఇరిడియమ్ శాటిలైట్ ఫోన్లు, థర్మల్ ఇమేజరీ సామగ్రి దొరకడంతో ఈ మేరకు అనుమానాలు నిజమయ్యాయి. ఉత్తరకశ్మీర్ ప్రాంతంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి 15వరకు శాటిలైట్ ఫోన్ సంకేతాల జాడలు కనిపించగా, తాజాగా దక్షిణ కశ్మీర్‌లోనూ గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో ఇవి ఉన్నట్లు తేలిందని అంటున్నారు. అదేవిధంగా, రాత్రి సమయాల్లో భద్రతా బలగాల నుంచి తప్పించుకునేందుకు ఉపయోగపడే వైఫై ఆధారిత థర్మల్ ఇమేజరీ సామగ్రి ఉగ్రస్థావరాల్లో లభ్యమైంది. శరీర ఉష్ణోగ్రతల ఆధారంగా సమీపంలో ఉన్న భద్రతా సిబ్బంది ఉనికిని ఈ పరికరం గుర్తించి హెచ్చరికలు చేస్తుంది. ఉగ్రవాది దాక్కున్న ప్రాంతం వెలుపలి ప్రాంతానికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. ఈ పరికరాలు అఫ్గానిస్తాన్‌లో దశాబ్దాలపాటు తిష్టవేసిన అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు వాడినవేనని తెలిపారు. అనంతరం వీటిని తాలిబన్లు, ఇతర ఉగ్రసంస్థలు చేజిక్కించుకుని, కశ్మీర్ ఉగ్రవాదులకు అందజేసి ఉంటారని అధికారులు అంటున్నారు. అయితే, వీటిని గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. శాటిలైట్ ఫోన్ జాడలను నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఎన్టీఆర్వో), డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(డీఐఏ)లు ఎప్పటికప్పుడు కనిపెట్టే పనిలోనే ఉన్నాయన్నారు. అదేవిధంగా, థర్మల్ ఇమేజరీ పరికరాలను పనిచేయకుండా ఆపేందుకు భద్రతా బలగాలు జామర్లను ఉపయోగిస్తున్నాయని అన్నారు. వీటిని వినియోగించే వారిని త్వరలో పట్టుకుంటామని చెప్పారు. దేశంలో శాటిలైట్ ఫోన్ల వినియోగంపై కేంద్రం 2012లో పూర్తి నిషేధం విధించింది. -
పాక్ జిమ్మిక్కు.. తాలిబన్లకే టోకరా!
‘రండి అన్న రండి.. మేడిన్ అమెరికా గన్లు ఉన్నాయి. బుల్లెట్ల దగ్గరి నుంచి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల దాకా అన్నీ సరసమైన ధరలకే అమ్ముతున్నాం’ (తెలుగీకరించాం) అంటూ పాకిస్థాన్ మార్కెట్లలో ఇప్పుడు కోలాహలం కనిపిస్తోంది. ఈ అత్యాధునిక ఆయుధాలన్నీ అమెరికా అఫ్గనిస్తాన్ నుంచి పోతూ పోతూ వదిలేసి పోయినవే కావడం విశేషం!. కరాచీ, లాహోర్, పెషావర్, గుజ్రన్‌వాలా.. పాకిస్థాన్ గన్మార్కెట్లలో అమెరికాకు చెందిన అడ్వాన్స్డ్ వెపన్స్ కనిపించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓ ప్రముఖ మీడియాహౌజ్ కథనం ప్రకారం.. అక్కడి మార్కెట్లలో వీటి అమ్మకాలు తారాస్థాయిలో నడుస్తున్నాయి. ‘‘తాలిబన్లు మేమూ భాయి భాయిలం. వాళ్ల దగ్గరి నుంచి వీటిని కొనుగోలు చేయడాన్ని, మా దేశంలో పౌరులకు అమ్ముకోవడాన్ని మేం గర్వంగా భావిస్తున్నాం’’ అంటూ అక్కడి అమ్మకందారులు చెప్తున్నారు. అడ్వాన్స్డ్ పిస్టోల్స్, రైఫిల్స్, గ్రెనేడ్స్, నైట్ విజన్ గగూల్స్, బుల్లెట్‌ఫ్రూఫ్ జాకెట్లు, స్పై కెమెరాలు, నార్మల టేజర్ గన్స్, టేజర్ స్టిక్స్, ఇతరత్ర మారణాయుధాలు పాక్ గన్ మార్కెట్లలో జోరుగా అమ్ముడుపోతున్నాయి. ప్రతీకాత్మక చిత్రం తాలిబన్ల ఖండన.. అయితే ఈ కథనాలను తాలిబన్లు ఖండిస్తున్నారు. తాలిబన్(Islamic Emirate of Afghanistan) ప్రతినిధి బిలాల్ కరిమి పేరిట న్యూయార్క్ టైమ్స్‌లో తాజాగా ఓ కథనం ప్రచురితమైంది. ‘‘ఆ కథనాల్ని మేం ఖండిస్తున్నాం. ఆయుధాల విషయంలో మేమేం అంత నిర్లక్క్ష్యంగా లేము. అక్రమ రవాణా కాదుకదా.. కనీసం సింగిల్ బుల్లెట్‌ను మేం బయటవాళ్లకు అమ్ముకోలేదు’’ అని కరిమి తెలిపాడు. అమెరికన్లు వదిలేసిన వెళ్లిన ప్రతీ ఆయుధాన్ని, వస్తువుల్ని సీజ్ చేసి భద్రపరిచామని, ఆ ఆయుధాల్ని భవిష్యత్తులో తమ(తాలిబన్ల) సైన్యం అవసరాల కోసమే ఉపయోగిస్తామని కరిమి పేర్కొన్నాడు. అయినప్పటికీ అనుమానాల నేపథ్యంలో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపడతామని తాలిబన్ సంస్థ ప్రకటించింది. ప్రతీకాత్మక చిత్రం లూట్ కా మాల్! అయితే పాక్ వీధుల్లో అమ్ముడుపోతున్న ఆయుధాలు.. అమెరికా వదిలి వెళ్లిన ఆయుధాలే అని నిర్ధారణ అయ్యింది. అమెరికా భద్రతా బలగాల పహారా సాగినంత కాలం.. తాలిబన్లు-పాక్ సాయంతో కలిసి అమెరికా-నాటో బృందాలపై దాడులకు తెగపడిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనూ ఆయుధాల్ని ఎత్తుకెళ్లిపోయేవాళ్లు. ఈ తరుణంలో ఇప్పుడు వదిలేసి వెళ్లిన ఆయుధాల్ని అక్రమంగా తరలించడమో లేదంటే ఆదాయం కోసం అమ్ముకోవడమో తాలిబన్లు చేసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తాలిబన్లు మాత్రం ఈ ఆరోపణల్ని ఖండిస్తుండగా.. పాక్ వ్యాపారులు మాత్రం అంతా పద్దతిగానే జరిగిందని చెప్తుండడం విశేషం. దీంతో దొడ్డిదారిన ఆ ఆయుధాలు తరలిపోయి ఉంటాయన్న కోణంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సైన్యం ఉపసంహరణలో భాగంగా.. అఫ్గనిస్తాన్ బాగ్రమ్ ఎయిర్‌బేస్‌కు పవర్‌కట్ చేసి గప్‌చుప్‌గా వెళ్లిపోయాయి అమెరికా దళాలు. వెళ్తూ వెళ్తూ అఫ్గన్ గడ్డపై 83 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధ సంపత్తిని వదిలేశాయి. చదవండి: అలా చేయకండి.. అమెరికాకు తాలిబన్లు వార్నింగ్ -
అనుకున్న సమయానికే ఉపసంహరణ
వాషింగ్టన్: ముందుగా అనుకున్నట్లే ఆగస్టు 31 నాటికి అఫ్గాన్ నుంచి బలగాల ఉపసంహరణ పూర్తి చేస్తామని అమెరికా మరోమారు ప్రకటించింది. ఐసిస్–కే కారణంగా తరలింపు ప్రక్రియ ప్రమాదకరంగా మారినా, అనుకున్న సమయానికే పూర్తి చేయాలని యూఎస్ నిర్ణయించింది. ప్రస్తుతం పరిస్థితి బాగాలేదని, తమ దళాలు ప్రమాదంలో ఉన్నాయని, అయితే బలగాలు అఫ్గాన్‌లో ఉన్నంత కాలం ప్రమాదంలో ఉన్నట్లేనని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. తరలింపులో ఇది అత్యంత ప్రమాదకరమైన భాగమన్నాయి. కాబూల్ విమానాశ్రయంపై ఐసిస్–కే ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమెరికాకు చెందిన 13 మంది సైనికులు మరణించిన సంగతి తెలిసిందే! ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని అధ్యక్షుడు బైడెన్ చెప్పారు. బాంబు పేలుళ్ల నేపథ్యంలో తరలింపు వాయిదా వేయాలన్న ప్రతిపాదనేదీ రాలేదని, డెడ్‌లైన్ కల్లా ప్రక్రియ పూర్తి చేస్తామని మిలటరీ అధ్యక్షుడికి స్పష్టం చేసిందని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్‌సాకీ చెప్పారు. తరలింపు ప్రక్రియ ప్రస్తుతం తిరోగామి దిశలో (రెట్రోగ్రేడ్) ఉందన్నారు. అంటే రోజులు గడిచే కొద్దీ అఫ్గాన్‌లో ఉండే బలగాలు తగ్గుతూ వస్తుంటాయని, ఉన్న వారితోనే సురక్షితంగా అఫ్గాన్‌నుంచి బయటపడే ప్రక్రియ పూర్తి చేయాలని వివరించారు. తాలిబన్లను నమ్మలేం తాలిబన్లపై తమకు నమ్మకం లేదని, కానీ ప్రస్తుతం వారితో పనిచేయడం మినహా వేరే మార్గం లేదని సాకీ అభిప్రాయపడ్డారు. అఫ్గాన్‌లో చాలా భూ భాగం తాలిబన్ల అధీనంలో ఉందని, విమానాశ్ర యం కూడా వారి స్వాధీనంలోనే ఉందని, అందువల్ల వారి సహకారంతో తరలింపు ప్రక్రియ పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు 14 నుంచి ఇప్పటివరకు సుమారు 1,09,200 మందిని అఫ్గాన్ విమానాశ్రయం నుంచి తరలించామని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. శుక్రవారం 12 గంటల వ్యవధిలో 4,200 మందిని 12 యుద్ధ విమానాల్లో దేశం దాటించామని తెలిపాయి. జూలై నుంచి ఇప్పటివరకు మొత్తం 1,14,800 మందిని అఫ్గాన్ సరిహద్దులు దాటించామని వెల్లడించాయి. అమెరికా దళాల ఉపసంహరణ పూర్తయిన తర్వాత కూడా వీసాలున్న అర్హులైన అఫ్గాన్ పౌరులను దేశం దాటించే వరకు రక్షించేందుకు అంతర్జాతీయ సహకారం తీసుకోవాలని అధ్యక్షుడు బైడెన్ ఆదేశించినట్లు సాకీ తెలిపారు. పౌరుల తరలింపు పూర్తి శనివారానికి అఫ్గాన్‌లోని తమ పౌరులను తరలించే ప్రక్రియ పూర్తి అవుతుందని బ్రిటన్ ప్రకటించింది. దీంతో కేవలం కొన్ని మిలటరీ దళాలు మాత్రమే అఫ్గాన్‌లో ఉంటాయని, అవి కూడా ఆగస్టు 31కి స్వదేశానికి చేరతాయని బ్రిటన్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ నిక్‌కార్టర్ చెప్పారు. ఎంత ప్రయత్నించినా అందరినీ దేశం దాటించడం కుదరదని, నిజానికి ఇలాంటి ముగింపును తాము ఊహించలేదని తెలిపారు. ఆగస్టు 13 నుంచి దాదాపు 14,543 మందిని బ్రిటన్ కాబూల్ నుంచి తరలించింది. ఇంకా 100–150 మంది బ్రిటిష్ పౌరులు అఫ్గాన్‌లోనే ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
హమ్మయ్య.. ఆ పాప మళ్లీ నవ్వింది..!
కాబూల్: తాలిబన్ల కబంధ హస్తాల నుంచి తమ కంటి పాపల్ని కాపాడాలంటూ ఇనుప కంచెల మీదుగా పిల్లల్ని విసిరేసిన హృదయ విదారక సన్నివేశాలు గుర్తున్నాయి కదా..! ఆ దృశ్యాలు ఇప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఆ పిల్లలు ఏమయ్యారోనంటూ తలచుకొని కుమిలిపోతూనే ఉన్నాం. కాబూల్ విమానాశ్రయంలో ఇనుప కంచెల మీదుగా అమెరికా నావికాదళ అధికారి ఒకరు అత్యంత సాహసంతో ఒంటి చేత్తో ఒక పసికందుని తీసుకున్న దృశ్యం అందరి మనసుల్ని కలిచి వేసింది. తల్లి నుంచి వేరుబడ్డ రెండు నెలల చిన్నారిని లాలిస్తున్న టర్కీ సైనికురాలు ఒమర్ హైదరి అనే మానవ హక్కుల కార్యకర్త తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ సమయంలో ఆ పాప కింద పడితే పరిస్థితి ఏంటని వీడియో చూసిన వారందరికీ గుండె గుభిలుముంటుంది. అయితే ఇప్పుడు ఆ చిన్నారి చిరునవ్వులు చిందిస్తూ క్షేమంగా తిరిగి తండ్రి దగ్గరకి వచ్చింది. అప్పుడే పుట్టిన పసిపాపకి అనుకోని అనారోగ్యం రావడంతో ఆ పాపని స్వయంగా తండ్రే వైద్య చికిత్స కోసం సైనిక అధికారులకు అప్పగించారు. పసిపాపలను సముదాయిస్తున్న అమెరికా మహిళా సైనికులు అఫ్గానిస్తాన్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో తమ బిడ్డను ఆస్పత్రికి తీసుకువెళ్లే దిక్కు లేక ఆ తల్లిదండ్రులు సతమతమయ్యారు. చివరికి ఆ చిన్నారి తండ్రి గుండె రాయి చేసుకొని అన్నింటికి తెగించి కాబూల్ విమానాశ్రయంలో ఉన్న అమెరికా నావికాదళ అధికారులకి తమ బిడ్డను అప్పగించారు. విమానాశ్రయంలో ఉన్న నార్వే ఫీల్డ్ ఆస్పత్రిలో ఆ పసిపాపకి చికిత్స నిర్వహించిన అనంతరం చిన్నారిని తిరిగి భద్రంగా ఆ తండ్రికి సైనికాధికారి అప్పగించారు. ‘ఆ వీడియోలో ఉన్న పసిపాపని వైద్య చికిత్స కోసం విమానాశ్రయంలో భద్రతా అధికారికి ఇచ్చారు. ఇప్పుడు ఆ పాప పూర్తి ఆరోగ్యంతో తిరిగి తండ్రి దగ్గరకి చేరుకుంది’ అని మేజర్ జిమ్ స్టెంజర్ సీబీఎస్ న్యూస్‌కి తెలిపారు. నావికాదళ అధికారుల సత్తా ఏమిటో ఇలాంటి సంఘటనలతోనే బయట ప్రపంచానికి తెలుస్తుందని ఆయన అన్నారు. సంక్లిష్ట పరిస్థితుల్లో అత్యంత త్వరగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు పరచడం నావికాదళ అధికారులకే సాధ్యపడుతుందని ఆ మేజర్ కొనియాడారు. ఈ విషయాన్ని అమెరికాలోని పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ కూడా ధ్రువీకరించారు.‘ఆ పసిపాప తిరిగి తండ్రి దగ్గరకి వెళ్లిపోయింది. వాళ్లు ఇప్పుడు ఎక్కడున్నారో మాకు తెలీదు. కానీ పసిపిల్లల్ని వారి తల్లిదండ్రుల దగ్గరకి చేర్చడం అమెరికా సైన్యం తమ బాధ్యతగా భావిస్తుంది. ఈ విషయంలో అత్యుత్తమమైన పనితీరు కనబరుస్తుంది’ అని కిర్బీ కితాబునిచ్చారు. చిన్నారిని సురక్షితంగా తీసుకెళ్తున్న దృశ్యం ఆలనాపాలనా చూస్తున్న సైనికులు వివిధ దేశాల ప్రజల తరలింపు ప్రక్రియ నడుస్తున్న సమయంలో కాబూల్ విమానాశ్రయం అంతా గందరగోళంగా మారింది. ఆ జనం మధ్య కొందరు పిల్లలు తల్లిదండ్రుల నుంచి విడిపోయి ఏడుస్తూ కనిపిస్తున్నారు. అలాంటి పిల్లల్ని విమానాశ్రయంలో ఉన్న అమెరికా, బ్రిటన్ సైనికులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ తిరిగి వారి కుటుంబాల వద్దకు చేరుస్తున్నారు. తల్లిదండ్రులు కనిపించే లోపు ఆ పిల్లల అవసరాలన్నీ వారే తీరుస్తున్నారు. పిల్లలకి జోల పాటలు పాడుతూ వారిని పడుకోబెట్టడం, పిల్లలకి మంచినీళ్లు ఇవ్వడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఆ దృశ్యాలు చూసిన వాళ్లు ఇంకా మానవత్వం బతికే ఉందని గుండెల నిండా గాలి పీల్చుకుంటున్నారు. కంచె మీదుగా పాపను ఒంటిచేత్తో పట్టుకున్న అమెరికా సైనికుడు (ఫైల్) హెరాత్‌లో కోఎడ్యుకేషన్‌పై నిషేధం తొలి ఫత్వా జారీ చేసిన తాలిబన్లు పాత పరిపాలనను గుర్తు చేస్తూ తాలిబన్లు విధాన నిర్ణయాలను ప్రకటిస్తున్నారు. తాజాగా హెరాత్ ప్రావిన్స్‌లోని పాఠశాలలు, యూనివర్సిటీల్లో కోఎడ్యుకేషన్‌ను నిషేధిస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. సమాజంలో అన్ని అనర్థాలకు కోఎడ్యుకేషనే కారణమని, అందుకే దీన్ని నిషేధిస్తున్నామని తాలిబన్లు తెలిపారు. పలువురు ప్రొఫెసర్లు, ప్రైవేటు కాలేజీల అధిపతులతో చర్చించిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నామని తాలిబన్ వర్గాలు వెల్లడించాయని ఖామా ప్రెస్ ఏజెన్సీ తెలిపింది. అఫ్గాన్ స్వాధీనం చేసుకున్న అనంతరం తాలిబన్లు జారీ చేసిన తొలి ఫత్వా ఇదే! మగపిల్లలకు మహిళా టీచర్లు బోధించొద్దు ఉన్నత విద్యపై తాలిబన్ ప్రతినిధి ముల్లా ఫరీద్ మూడుగంటలు ఈ చర్చలు జరిపారు. కోఎడ్‌కు ప్రత్యామ్నాయం లేదని, దీన్ని నిలిపివేయడమే మార్గమని అభిప్రాయపడ్డారు. అలాగే మహిళా ఉపాధ్యాయులు కేవలం మహిళా విద్యార్థులకే బోధించాలని, మగ విద్యార్థులకు బోధించకూడదని ఆదేశించారు. పౌర పాలనలో అఫ్గాన్ ప్రభుత్వాలు పలు యూనివర్సిటీలు, కాలేజీలు, పాఠశాలలు స్థాపించి కోఎడ్‌ను ప్రోత్సహించాయి. తాలిబన్ల తాజా నిర్ణయంతో ప్రైవేట్ విద్యాసంస్థలకు ఇబ్బందులు ఎక్కువని నిపుణులు భావిస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం దేశంలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల్లో సుమారు 40 వేల మంది విద్యార్థులు, 2వేల మంది బోధనా సిబ్బంది ఉన్నారు. షరియా చట్టం కింద మహిళా హక్కులు గౌరవిస్తామని ఈవారం ఆరంభంలో తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ విలేకరుల సమావేశంలో అట్టహాసంగా ప్రకటించారు. అయితే గతంలో తమ విధానాలనే తాలిబన్లు కొనసాగించేందుకు నిర్ణయించుకున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. -
ప్రపంచ నేతల్లారా నా దేశాన్ని రక్షించండి.. స్టార్ క్రికెటర్ ఆవేదన
లండన్: ఆఫ్ఘనిస్తాన్ నుంచి యూఎస్, నాటో దళాలు వెనుదిరిగినప్పటి నుంచి ఆ దేశం మొత్తం రావణకాష్టంలా రగులుతోంది. గత నెలలో హెల్మాండ్, కాందహార్, హెరాత్ ప్రావిన్స్‌లలో తాలిబన్లు పౌరులపై జరిపిన దాడుల్లో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది మే 1న అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకోవడం ప్రారంభించినప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రదాడులు తీవ్రమయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్లోని దాదాపు 400 జిల్లాలో సగానికి పైగా తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆగష్టు 31 లోపు అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. Dear World Leaders! My country is in chaos,thousand of innocent people, including children & women, get martyred everyday, houses & properties being destructed.Thousand families displaced.. Don’t leave us in chaos. Stop killing Afghans & destroying Afghaniatan🇦🇫. We want peace.🙏 — Rashid Khan (@rashidkhan_19) August 10, 2021 ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల నేతలకు ఆ దేశ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ ఓ విజ్ఞప్తి చేశాడు. ప్రపంచ నేతలంతా ఏకమై తన దేశాన్ని రక్షించి, శాంతిని స్థాపించాలంటూ సోషల్ మీడియా వేదికగా అభ్యర్ధించాడు. ‘నా దేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రతిరోజూ వేలాది మంది అమాయకులు, పిల్లలు, మహిళలు అమరులవుతున్నారు. ఇళ్లు, ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి. వేలాది కుటుంబాలు నిర్వాసితులయ్యాయి. మమ్మల్ని ఇలాంటి గందరగోళంలో పడేయవద్దు. మాకు శాంతి కావాలి’ అంటూ ట్విటర్లో తన ఆవేదనను పంచుకున్నాడు. -
తాలిబన్లు పట్టు బిగిస్తే భారత్‌కు ఎన్నో సవాళ్లు
అమెరికా దళాలు ఇంకా పూర్తిగా వెనక్కి మళ్లనే లేదు అఫ్గాన్‌లో తాలిబన్లు చెలరేగి దాడులకు దిగుతున్నారు కీలకమైన ప్రాంతాల్లో పట్టు బిగుస్తున్నారు పాక్ సహకారంతో రెచ్చిపోతారని భారత్ ఆందోళన చెందుతోంది తాలిబన్ల పట్టు పెరిగితే భారత్‌కు ఎదురయ్యే సవాళ్లేంటి ? అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి మళ్లుతూ ఉండడంతో తాలిబన్లు తిరిగి తమ పట్టు పెంచుకుంటున్నారు. ఏకంగా 85% భూభాగం తమ అధీనంలోనే ఉందని ప్రకటించుకున్నారు. ఆగస్టు 31నాటికల్లా అమెరికా దళాలు వెనక్కి పూర్తిగా వెళ్లిపోతే పరిస్థితులు ఎలా మారుతాయోనన్న ఆందోళనలు నెలకొన్నాయి. భౌగోళికంగా భారత్‌కు అత్యంత వ్యూహాత్మక ప్రాంతమైన అఫ్గాన్‌పై తాలిబన్లు పట్టు బిగిస్తే మన దేశానికి ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. అఫ్గానిస్తాన్‌లో 398 జిల్లాలు ఉన్నాయి. ఇరవై ఏళ్ల క్రితమే అందులో 193 జిల్లాల్ని తాలిబన్లు ఆక్రమించుకున్నారు. 130 జిల్లాల్లో తాలిబన్లు, అఫ్గాన్ ఆర్మీ మధ్య ఘర్షణ జరుగుతోంది. కేవలం 75 జిల్లాలు మాత్రమే ప్రస్తుత ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. తాలిబన్లను ఎంతవరకు అఫ్గాన్ ప్రభుత్వం నిలువరిస్తుందనేది సందేహమే. భారత్‌కు ఎదురయ్యే సవాళ్లు ∙అఫ్గానిస్తాన్ తాలిబన్ల అధీనంలోకి వెళ్లిపోతే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం భారత్‌కు అతి పెద్ద సవాల్‌గా మారుతుంది. సహజంగానే తాలిబన్లు, పాకిస్తాన్ ఒకరికొకరు సహకారం అందించుకుంటారు. దీంతో పరిస్థితులన్నీ పాక్‌కి అనుకూలంగా మారే అవకాశం ఉంది. జమ్ము కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతాయన్న ఆందోళన నెలకొంది. హింసతో రగిలిపోతున్న అఫ్గాన్‌లో శాంతి స్థాపన కోసం చాలా ఏళ్లుగా భారత్ కృషి చేస్తోంది. ఆ దేశానికి అండగా ఉంటూ భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు అవన్నీ కాపాడుకోవడం మన దేశానికి మరో గట్టి సవాల్‌గా మారుతుంది. గత కొద్ది ఏళ్లలో వివిధ ప్రాజెక్టుల నిమిత్తం భారత్ అఫ్గాన్‌లో 2,200 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది. గత ఏడాదే కేంద్ర ప్రభుత్వం మరో రూ.600 కోట్లు పెడతామని ప్రకటించింది. మన దేశానికి చెందిన ఇంజనీర్లు 3 వేల మందికిపైగా అక్కడ అభివృద్ధి పనుల్లో ఉన్నారు. కానీ తాలిబన్లు మళ్లీ రెచ్చిపోతే భారత్ పెట్టుబడులపై ప్రభావం పడుతుంది. భారతీయుల ప్రాణాలు ముప్పులో పడే అవకాశం ఉంది. ∙అఫ్గాన్‌పై పట్టు నిలుపుకోవడం కూడా మరో సవాలే. భారత్‌కి పొరుగుదేశమైన అఫ్గాన్ వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగింది. వాస్తవానికి ఆ దేశంలో సహజ వనరులు, సారవంతమైన నేలలు, చమురు, యురేనియం వంటి సహజ నిక్షిప్తాలు ఏమీ లేకపోయినప్పటికీ భౌగోళికంగా అత్యంత కీలకమైనది. ఆసియాలోని వాణిజ్య రవాణాకు అఫ్గానే కేంద్రంగా ఉంది. చైనా వన్ బెల్ట్ వన్ రోడ్డు ప్రణాళికలో అఫ్గాన్ చాలా ముఖ్యమైనది. అందుకే చైనా అఫ్గాన్‌పై పట్టు పెంచుకోవాలని భావిస్తుంది. పాకిస్తాన్ అండతో డ్రాగన్ దేశం అఫ్గాన్ నుంచి లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తుంది. దీంతో చైనా, పాక్ చేసే కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కోవడం భారత్‌కు అతి పెద్ద సవాల్ విసురుతుంది. అమెరికా ఎందుకు వెనక్కి మళ్లుతోంది ? అమెరికాపై సెప్టెంబర్ 11, 2001 దాడుల తర్వాత అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ అఫ్గాన్‌లో తలదాచుకున్నాడన్న సమాచారంతో అగ్రరాజ్యం తన బలగాలను పంపింది. ఈ 20 ఏళ్లలోనూ దాదాపుగా 2 లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. కానీ హఠాత్తుగా వెనక్కి మళ్లాలని నిర్ణయించింది. గత ఏడాది దోహాలో అమెరికా, తాలిబన్ల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు బలగాలను ఉపసంహరిస్తోంది. అమెరికా అధీనంలో ఉన్న ప్రాంతాల్లో అల్‌ఖైదా కార్యకలాపాలు కొనసాగించకూడదన్న ఒకే ఒక్క షరతుతో అమెరికా వెనక్కి వెళ్లిపోతోంది. దశాబ్దాల క్రితం సోవియెట్ యూనియన్ను బలహీనపరచడానికి తాలిబన్లను అమెరికాయే పెంచి పోషించింది. వారికి క్షిపణుల్ని కూడా సరఫరా చేసింది. ఆ తర్వాత తమ దేశంపైనే ఉగ్రవాదులు దాడులు జరపడంతో ఉలిక్కిపడి స్వప్రయోజనాల కోసం తాలిబన్లను నిలువరించింది. ఇప్పుడు మళ్లీ తమకి లబ్ధి చేకూరే నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాలను ముప్పులోకి నెట్టేస్తోంది. ఇప్పటికే తాలిబన్లు జరిపే దాడులతో వందలాది మంది అఫ్గాన్లు సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. తాలిబన్ల క్రూరత్వం చూడకుండా పెరిగిన యువతీయువకుల్లో కూడా భయాందోళనలు నెలకొన్నాయి. మధ్య ఆసియాలోకి ప్రవేశిస్తారని రష్యా ఆందోళన చెందుతూ ఉంటే, ఇరాన్ తమ దేశ భద్రత ప్రమాదంలో పడుతుందని భయపడుతోంది. ఎవరీ తాలిబన్లు 1990 తొలినాళ్లలో అఫ్గానిస్తాన్ నుంచి సోవియెట్ దళాలు వెనక్కి మళ్లాక ఉత్తర పాకిస్తాన్ ప్రాంతంలో ఆదివాసీల హక్కుల కోసం తాలిబన్ల ఉద్యమం మొదలైంది. అతివాద సున్నీ మతాన్ని బోధించే మత సంస్థల్లో తాలిబన్లు తొలుత పట్టు బిగించారు. ఈ సంస్థలకు సౌదీ అరేబియా నుంచి విరాళాలు వచ్చేవి. అలా నెమ్మది నెమ్మదిగా అఫ్గాన్‌పై పట్టు బిగించి 1995లో పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. అవినీతి నిర్మూలన, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, తమ అదీనంలో ఉన్న ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగు పరచడం వంటి పనులతో మొదట్లో తాలిబన్లకు ప్రజాదరణ లభించింది. అదే సమయంలో కఠినమైన శిక్షల్ని విధించడం, నేరస్తుల్ని బహిరంగంగా ఉరి తీయడం, మహిళలు సినిమాలు చూడకూడదని, చదువుకోకూడదని విధించిన ఆంక్షలు వారిపై వ్యతిరేకత పెంచాయి. ఇప్పుడు మళ్లీ తాలిబన్లు వస్తే తమ పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆందోళన అఫ్గాన్ మహిళల్లో కూడా నెలకొంది. తాలిబన్లు మళ్లీ పట్టు బిగిస్తే అఫ్గాన్‌లో అంతర్యుద్ధం నెలకొని ప్రపంచ దేశాలకు ఎలాంటి ముప్పు వాటిల్లుతుందోనన్న చర్చ కూడా జరుగుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అనవసర యుద్ధాలకు దూరం
వాషింగ్టన్: ఇకపై విదేశాల్లో జరిగే యుద్ధాలకు తమ బలగాలను పంపమని, అవన్నీ అంతులేని నిరర్థక యుద్ధాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే పలు దేశాల్లో ఉన్న తమ సైనికులను వెనక్కు రప్పిస్తామన్నారు. కేవలం తమ దేశానికి ప్రమాదమైన టెర్రరిస్టులను మట్టుపెట్టేందుకు మాత్రమే ఈ సైన్యాన్ని ఉపయోగిస్తామన్నారు. ఫ్లోరిడాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ దశాబ్దాలుగా అమెరికా రాజకీయవేత్తలు విదేశాల పునర్నిర్మాణం, విదేశీయుద్ధాల్లో పోరాడటం, విదేశీ సరిహద్దులను కాపాడడం వంటి పనులపై లక్షల కోట్ల డాలర్లు వెచ్చించారన్నారు. కానీ ప్రస్తుతం అమెరికా సేనలు అమెరికాను, అమెరికా నగరాలను రక్షించేందుకు పరిమితమవుతున్నాయని, అమెరికా బలగాలు స్వదేశాలకు వస్తున్నాయని చెప్పారు. విదేశాల్లో జరిగే అనవసర యుద్ధాలకు సైన్యం వెళ్లదని, కానీ దేశానికి ముప్పుగా భావించే ఉగ్రవాదులను మాత్రం వదిలిపెట్టదని చెప్పారు. తమకున్నంత సైనిక సంపత్తి ఎవరికీ లేదని, బలం చూపించే శాంతిని పరిరక్షిస్తామని వివరించారు. ఈ ర్యాలీకి జనం భారీగా హాజరయ్యారు. కరోనా నిబంధనలను పక్కనబెట్టిమరీ జనం హాజరుకావడం ట్రంప్‌నకు మంచి ఉత్సాహాన్నిచ్చింది. డెమొక్రాట్లు అధికారంలోకి వస్తే పన్నులు పెంచుతారని, ఆయుధాల హక్కును రద్దు చేస్తారని, ఆ పార్టీ నిండా వామపక్షవాదులున్నారని దుయ్యబట్టారు. క్యూబా, వెనుజులా విధానాలను డెమొక్రాట్లు అమలు చేస్తారని విమర్శించారు. డెమొక్రాట్ నాయకురాలు కమలా హారిస్‌పై నేరుగా విమర్శలు చేశారు. కరోనా సంక్షోభం నుంచి అమెరికా ఎకానమీని తొందరగా బయటకు రప్పించామని చెప్పుకున్నారు. -
అప్గనిస్తాన్: ఏడుగురు పౌరుల ఊచకోత!
కాబూల్: భద్రతా బలగాలే లక్ష్యంగా తాలిబన్ ఉగ్రవాదులు బాల్క్ ప్రావిన్స్‌లో మంగళవారం జరిపిన దాడి కారణంగా ఏడుగురు పౌరులు మరణించారని అఫ్గనిస్తాన్ అధికారులు తెలిపారు. షోల్గారా జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఇరు వర్గాల మధ్య దాడులు జరగ్గా ఏడుగురు పౌరులను తాలిబన్ ఉగ్రవాదులు అపహరించారు. అనంతరం వారిని హతమార్చారని స్థానిక పోలీస్ చీఫ్ సయ్యద్ ఆరిఫ్ ఇక్బాల్ చెప్పారు. అయితే ఈ దాడికి సంబంధించి తాలిబన్ ఇప్పటివరకు స్పందించలేదన్నారు. కాగా, గత ఫిబ్రవరి చివరలో తమతో కుదిరిన శాంతి ఒప్పందానికి అమెరికా తూట్లు పొడిచిందని తాలిబన్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. (చదవండి: నకిలీ ‘శాంతి ఒప్పందం’) ఇక దక్షిణ కాందహార్ ప్రావిన్స్‌లో కూడా అదేరోజు సాయంత్రం జరిగిన మోటార్ షెల్ దాడిలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ఈ దాడిని తాలిబన్ ఉగ్రవాదులే చేశారని యూఎస్ బలగాలు ఆరోపిస్తుండగా.. అమెరికా భద్రతా బలగాల డ్రోన్ దాడిలోనే చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని తాలిబన్ ప్రతినిధి ఖరి యూసుఫ్ అహ్మది చెప్తున్నారు. అయితే, తామెలాంటి ఆయుధ ప్రయోగాం చేయలేదని అమెరికా బలగాల అధికార ప్రతినిధి సన్నీ లెగ్గెట్ స్పష్టం చేశారు. హింసను తగ్గించేందుకు తాలిబన్‌తో చర్చలు ఉంటాయని ట్వీట్ చేశారు. ఇక ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ప్రాణాంతక కరోనా కారణంగా అఫ్గాన్‌లో 14 మంది మరణించగా.. 423 మంది వైరస్ బారిన పడ్డారు. (చదవండి: అఫ్గాన్‌లో ఆత్మాహుతి దాడి: 11 మంది మృతి) -
ఐసిస్ చీఫ్ బాగ్దాదీ హతం
వాషింగ్టన్: ఉగ్రమార్గంలో ఇస్లాం రాజ్యస్థాపనే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా దాడులకు తెగబడుతున్న ఐసిస్ అంతర్జాతీయ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు అబు బకర్ అల్ బాగ్దాదీ(48)ను అమెరికా సేనలు సిరియాలో అంతమొందించాయి. దాదాపు మూడు సంవత్సరాలుగా అమెరికా సైన్యం కన్నుగప్పి దాడులకు పాల్పడుతున్న మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది బాగ్దాదీ.. వాయవ్య సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్‌లోని బరీషా గ్రామంలోని అమెరికా సేనలు చేసిన ‘రహస్య దాడి’ సందర్భంగా చనిపోయాడని వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. బాగ్దాదీ మరణించాక ఆ దాడి ప్రాంతం నుంచి అత్యంత విలువైన డాక్యుమెంట్లను అమెరికా సేనలు స్వాధీనంచేసుకున్నాయి. ఐసిస్ ఉగ్రసంస్థ కార్యకలాపాలు, భవిష్యత్ కార్యాచరణ, అంతర్జాతీయ సంబంధాల వివరాలు వాటిలో ఉన్నట్లు సమాచారం. ట్రంప్, అమెరికా సైనికాధిపతుల పర్యవేక్షణలో జరిగిన ఘటన క్షణ క్షణం నాటకీయంగా సాగినవైనమిది. బాగ్దాదీ స్థావరం ఇటీవల ఇరాక్ నుంచి వాయవ్య సిరియాకి మారింది. ఒక నెలక్రితం కుర్దుల నుంచి కచ్చితమైన సమాచారమందింది. ఆ గ్రామంలోనే బాగ్దాదీ ఉంటున్నట్లు రెండు వారాల క్రితం అమెరికా సేనలు నిర్ధారించుకున్నాయి. వాయవ్య సిరియాలోని స్థావరంపై దాడికి మూడు రోజుల ముందే ట్రంప్‌కి సమాచారం ఉంది. రష్యా, ఇరాక్, టర్కీ దేశాల అనుమతితో వాయు సేనలు సాగాయి. ఆపరేషన్ కైలా ముల్లర్ బాగ్దాదీని పట్టుకోవడం కోసం బాగ్దాదీ చేతిలో తీవ్ర చిత్రహింసలపాలై, అత్యాచారానికి గురై హతమైన అమెరికా మానవహక్కుల కార్యకర్త 26 ఏళ్ళ కైరా ముల్లర్ పేరుని ఈ ప్లాన్‌కి పెట్టారు. అసలేం జరిగింది? వర్జీనియాలో ఒక రౌండ్ గోల్ఫ్ ఆట ముగించుకొని సరిగ్గా సాయంత్రం 5 గంటలకు వైట్ హౌస్‌లోని ‘సిట్యుయేషన్ రూమ్’కి అధ్యక్షుడు ట్రంప్ చేరుకున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్, అమెరికా భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రీన్లు సిట్యుయేషన్ రూమ్‌కి వచ్చారు. బాగ్దాదీపై సైనిక రహస్యదాడిని వీడియోలో వీక్షించేందుకే సిద్ధమయ్యారు. గంటల్లో అంతా బూడిద గ్రామంపై చక్కర్లు కొడుతున్న హెలికాప్టర్లను గ్రామస్తులు గమనించారు. అమెరికా హెలికాప్లర్లు, సైన్యాన్ని చూసిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. వెంటనే వారందరినీ అమెరికా సైనికులు మట్టుబెట్టారు. ఆ తర్వాత బాగ్దాదీ ఉంటున్న ఇంటి ముఖద్వారాన్ని బాంబులతో పేల్చారు. సైన్యం దాడి విషయం తెల్సి బాగ్దాదీ వెంటనే రహస్య సొరంగ మార్గం ద్వారా భూగృహం(బంకర్)లోకి చొరబడ్డాడు. ఆయనను బంకర్ చివరివరకు అమెరికా సైనిక సేనలు, సైనిక శునకాలు తరిమాయి. బయటపడే మార్గం లేకపోవడంతో తన శరీరానికున్న బాంబుల జాకెట్‌ను పేల్చుకుని బాగ్దాదీ చనిపోయాడు. పిచ్చివాడిలా అరుచుకుంటూ.. అమెరికా సైనికులు చుట్టుముట్టడంతో ప్రాణభయంతో బాగ్దాదీ అరుచుకుంటూ, ఏడ్చుకుంటూ పరిగెత్తాడని ట్రంప్ వెల్లడించారు. అమెరికా సైనిక కే9 శునకాలు తరుముతుండడంతో చివరకు సొరంగంలోని బంకర్ చివరి అంచులకు చేరి తన ముగ్గురు పిల్లలతో సహా బాంబులతో పేల్చుకుని కుక్కచావు చచ్చాడని ట్రంప్ వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్‌లో దాడి వీడియో ప్రత్యక్షప్రసారాన్ని చూస్తున్న అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు పెన్స్, జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ -
గల్ఫ్‌కి మరిన్ని అమెరికా బలగాలు
వాషింగ్టన్/టెహ్రాన్: గల్ఫ్ ప్రాంతానికి మరిన్ని బలగాలు పంపుతున్నట్టుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడులు ఇరాన్ పనేనని అమెరికా ఆరోపిస్తున్న నేపథ్యంలో మరిన్ని బలగాలు పంపించడానికి నిర్ణయం తీసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్‌పై అమెరికా తీవ్రమైన ఆర్థిక ఆంక్షల్ని విధించిన కొద్ది గంటల్లోనే బలగాలను పంపాలని నిర్ణయించడంతో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయన్న ఆందోళన నెలకొంది. గత జూన్‌లో అమెరికా నిఘా డ్రోన్‌ను ఇరాన్ కూల్చివేసిన దగ్గర్నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణమే నెలకొంది. ఇప్పుడు సౌదీ అరేబియాలో కీలక చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడులతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగిపోయాయి. ఇందుకు ఇరానే కారణమని నమ్ముతున్న అమెరికా ఆ దేశంపై గుర్రుగా ఉంది. అమెరికా ఇరాన్‌పై కయ్యానికి కాలుదువ్వుతోందని విమర్శలు ఉన్నాయి. ఈ విమర్శలకు బదులిచ్చిన ట్రంప్ ఇప్పటికిప్పుడే ఇరాన్లో 15 కీలక ప్రాంతాలను ధ్వంసం చేసే శక్తి సామర్థ్యాలు తమకు ఉన్నాయని కానీ ఆ దేశంపై యుద్ధానికి దిగే ఉద్దేశం లేదన్నారు. రణరంగంగా మారుస్తాం: ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలో బలగాలను మోహరించాలన్న అమెరికా ఆదేశాలపై ఇరాన్ స్పందించింది. తమపై దాడికి దిగే దేశాలను యుద్ధక్షేత్రాలుగా మారుస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మేజర్ జనరల్ హొస్సైన్ సలామీ హెచ్చరించారు. ‘తమ దేశాన్ని ప్రధాన యుద్ధక్షేత్రంగా మార్చాలనుకుంటే అలాగే కానివ్వండి. మా భూభాగాన్ని ఆక్రమించుకోవడాన్ని అడ్డుకుని తీరుతాం. వాళ్లు మరోసారి వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడతారని అనుకోవడం లేదు’అని అమెరికానుద్దేశించి వ్యాఖ్యానించారు. -
సిరియాపై విరుచుకుపడుతున్న అమెరికా దళాలు
డమస్కస్ : ఏడేళ్లుగా అంత్యర్యుద్ధం కోరల్లో చిక్కుకుని అపారనష్టానికి గురైన సిరియా నెత్తిన ఇప్పుడు మరో పిడుగు పడింది. అమెరికా దళాలు సిరియాలో వైమానిక దాడులు చేపట్టాయి. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఇవి కొనసాగుతున్నాయి. గత వారం సిరియా రాజధాని డమస్కస్‌లో రసాయనిక దాడులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గట్టి హెచ్చరికలు జారీ చేసేందుకు తాము ఈ దాడులకు తెగబడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ‘అమెరికా దళాలతోపాటు ఫ్రాన్స్, యూకే దళాలు సంయుక్తంగా ఈ దాడుల్లో పాల్గొంటున్నాయి. సిరియా నియంతాధ్యక్షుడు బషర్ అల్ అస్సద్ రసాయనిక దాడులకు పురిగొల్పుతుండటమే మేం ఈ నిర్ణయం తీసుకోడానికి కారణమైంది. యూఎస్ భద్రతాధికారికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశా’ ట్రంప్ అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రసంగించారు. మరోవైపు ఆయన ప్రసంగం కొనసాగుతున్న సమయంలోనే డమస్కస్ నగరంలో భారీ పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తోంది. రసాయనిక క్షిపణులను నిల్వ చేసిన ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నామని అమెరికన్ భద్రతాధికారి ఒకరు తెలిపారు. ఇంకోపక్క సిరియాలో మోహరించిన రష్యా-ఇరాన్ దళాలకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ‘శాంతి కోరుకుంటున్న దేశాల పక్షాన నిలుస్తారా? లేక.. బషర్కి అండగా నిలుస్తూ జరగబోయే పరిణామాలకు భాద్యత వహిస్తారా? ఫలితం మీరే నిర్ణయించుకోండి’ అంటూ ట్రంప్ ఓ ప్రకటన విడుదల చేశారు. రష్యా హెచ్చరికలు.. సిరియాపై అమెరికా మరియు దాని మిత్రపక్ష సైన్యాలు చేపట్టిన ఆకస్మిక దాడులపై రష్యా స్పందించింది. పుతిన్‌ను అవమానించేలా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉపేక్షించబోమని రష్యా విదేశాంగ ప్రతినిధి అనాటోలీ ఆంటోనోవ్ వెల్లడించారు. ఈ చర్యలకు ప్రతిగా అమెరికా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించాడు. pic.twitter.com/N5IOHlv4E7 — AFP news agency (@AFP) 14 April 2018 -
నోరు విప్పిన లాడెన్ భార్య.. ఆ రాత్రి ఏమైంది?
-
నోరు విప్పిన లాడెన్ భార్య.. ఆ రాత్రి ఏమైంది?
న్యూయార్క్: మే 1, 2011 అమెరికాకు శుభదినం.. ఆ దేశ చరిత్రలో వారు సువర్ణక్షరాలుగా కూడా రాసుకొని ఉండి ఉంటారు. ఎందుకంటే తమ దేశ గౌరవాన్ని దెబ్బకొట్టి, వేల మంది తమ పౌరులను బలి తీసుకున్న అల్ కాయిదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా మట్టుబెట్టిందే ఆరోజే. ట్విన్ టవర్స్‌ను ఏకంగా విమానంతో ఢీకొట్టించి అమెరికన్ల గుండెల్లో రైల్లు పరుగెత్తించిన ఆ ఉగ్రవాదిని ఎంతో పకడ్బందీగా ప్రణాళిక రచించి గుట్టుచప్పుడు కాకుండా అమలు చేసి అతడిని అంతమొందించింది ఆ రోజే. అయితే, ఆ రోజు రాత్రి ఏం జరిగిందనే విషయంపై అన్ని చెప్పుడు కథనాలే తప్ప ఏ ఒక్కరూ ప్రత్యక్షంగా చూసిన వారు చెప్పలేదు. అయినప్పటికీ ఈ సంఘటన గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం మాత్రం మిగిలే ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్ని కథనాలు వచ్చినా తాజాగా మాత్రం ఏకంగా లాడెన్ నాలుగో భార్య అమల్ ఆ రోజు రాత్రి ఏం జరిగిందనే విషయాన్ని కాతీ స్కాట్-క్లార్క్, అడ్రియాన్ లెవీ ఇద్దరికి వెల్లడించింది. వీరు లాడెన్ చనిపోవడానికి ముందు ఆ కొద్ది నిమిషాల్లో ఏం జరిగిందనే విషయంపై వీరు ది ఎక్సైల్: ది ఫైట్ ఆఫ్ ఒసామా బిన్ లాడెన్ అనే పేరిట ఓ పుస్తకం రాస్తున్నారు. దీనికి సంబంధించి లాడెన్ భార్యను నేరుగా వారు సంప్రదించగా కొన్ని విషయాలు చెప్పింది. అందులో కొన్ని బ్రిటన్‌లోని సండే టైమ్స్‌లో, ఓ టీవీ చానెల్లో ప్రచారం అయ్యాయి. అలా ఆమె చెప్పిన కొన్ని విషయాలు ఏమిటంటే.. ‘ఆ రోజు రాత్రి అమెరికా మిలిటరీకి చెందిన బ్లాక్ హాక్ హెలికాప్టర్లో అబోటాబాద్‌లోని మా ఇంటి కాంపౌండ్‌లోకి దిగింది. అప్పటికే మేం ఆ ఇంట్లో ఆరేళ్లుగా తలదాచుకుంటున్నాం. హెలికాప్టర్ శబ్దం విని మేల్కొన్న నా భర్త(లాడెన్) ముఖంలో చాలా భయం చూశాను. అమెరికన్ సీల్స్ ఇంటిలోపలికి ప్రవేశిస్తుండగా మా సోదరీలు(లాడెన్ ముగ్గురు భార్యలు) (అమల్ లాడెన్ నాలుగో భార్య) వారి పిల్లలను తీసుకొని ఆయన ఉన్న అప్స్టెయిర్స్కు వెళ్లి ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. అయితే, వారిని అక్కడ ఉండొద్దని, అందరినీ కిందికి వెళ్లిపోవాలని లాడెన్ చెప్పారు. వారికి కావాల్సింది నేను.. మీరు కాదు ఇక్కడి నుంచి వెళ్లిపోండని అన్నారు. అయితే, మిగితా వారు వెళ్లిపోగా నేను మాత్రం ఆయన పక్కన నా కొడుకు హుస్సేన్‌తో కలిసి ఉండేందుకు నిర్ణయించుకున్నాను. అమెరికా సైనికులు లోపలిక వస్తూ లాడెన్ కుమారుల్లో ఒకరైన ఖలీద్‌ను చంపేస్తూ పిల్లలతో గొడవపడుతూ పైకి వస్తున్నారు. సరిగ్గా మేం ఉన్న గదికి రాగానే నేను వారిని తోసివేసేందుకు ప్రయత్నించాను. కానీ, వారు ఫైరింగ్ స్టార్ట్ చేయగా నా కాలికి తగిలి పక్క గదిలో పడిపోయాను. ఆ తర్వత ఓపిక చేసుకొని తిరిగొచ్చి చూసేసరికి అప్పటికే లాడెన్ చనిపోయి ఉన్నాడు. ఆ దృశ్యాన్ని నేను నా కొడుకు హుస్సేన్ చూశాడు. అది చూసి నేను నిశ్చేష్టురాలినయ్యాను’ అని వారికి చెప్పిందట. దాంతోపాటు తమకు తెలిసిన వారే ఈ విషయాన్ని వారికి చేరవేసి ఉంటారని, ఆ ఇళ్లే తమకు మృత్యుకుహరం అవుతుందని ఊహించలేకపోయామని కూడా ఆమె చెప్పినట్లు బ్రిటన్ పత్రికలో వెల్లడించారు. ఈ పుస్తకం త్వరలో విడుదల కానుంది. -
అమెరికాకు ఎదురుదెబ్బ
హేగ్: ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు(ఐసీసీ)లో అగ్రరాజ్యం అమెరికాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ సైనికులు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) ఏజెంట్లలో కొద్దిమందిపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 9/11 దాడుల అనంతరం అఫ్ఘానిస్థాన్ పై యుద్ధం చేసిన అమెరికా సైన్యం.. 2003-04 సమయంలో వందలాది మంది అఫ్ఘాన్లను పాశవికంగా హింసించిందనడానికి ప్రాథమిక ఆధారాలు లభించాయని, ఆ మేరకు అకృత్యాలకు పాల్పడినవారిపై చర్యలు తప్పవని హేగ్ లోని ఐసీసీ ప్రాసిక్యూటర్ కార్యాలయం సోమవారం మీడియాకు తెలిపింది. సెప్టెంబర్ 11 దాడులకు ప్రతీకారంగా అల్ కాయిదా, దాని ఒకప్పుటి చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ను మట్టుపెట్టేందుకు అఫ్ఘాన్ గడ్డపై కాలుమోపిన అమెరికా సైన్యాలు ఉగ్రవాదులనే కాక సాధారణ పౌరులకు సైతం నరకం చూపించిందని ఐసీసీ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. కాన్సంట్రేషన్ క్యాంపుల తరహాలో అఫ్ఘాన్ లో తమ చేతికి చిక్కినవారిని హింసిచడానికి అమెరికన్లు ప్రత్యేక గదులు నిర్మించారని, సీఐఏ ఆధ్వర్యంలోనే హింసా కార్యక్రమాలు నడిచాయని ప్రాసిక్యూటర్ తెలిపారు. కనీసం 61 మంది అఫ్ఘాన్లను అమెరికా సైనికులు, మరో 27 మందిని సీఐఏ ఏజెంట్లు టార్చర్ పెట్టినట్లు ఆధారాలు లభించాయని, అంతర్జాతీయ నేర చట్టాలను అనుసరించి ఆయా ఘటనకు కారకులైనవారిపై వారెంట్లు జారీచేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రాసిక్యూటర్ కార్యాలయం వెల్లడించింది. అయితే, ఐసీసీని అమెరికా ఇంకా గుర్తించలేదు. దీంతో ఒకవేళ కోర్టు వారెంట్లు జారీచేసినా అమెరికా పట్టించుకోకపోవచ్చనే భావన వ్యక్తం అవుతోంది. ఘోర అమానవీయ చర్యలకు పాల్పడే దేశాలను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టాలనే ఉద్దేశంతో అలాంటి నేరాలపై విచారణ జరిపేందుకుగానూ 2003లో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) ఏర్పాటయింది. నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ ఐసీసీ ఏర్పాటును తీవ్రంగా తప్పుపట్టడమేకాక, దానిని గుర్తించబోమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఐసీసీ కోర్టు చర్యలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి. -
అమెరికా కసితీర పగతీర్చుకుంది నేడే
న్యూయార్క్: సెప్టెంబర్ 11, 2001.. అమెరికా చరిత్రలో చీకటి రోజు. వారి ప్రతిష్ట అబాసుపాలైన దినం. ప్రపంచ దేశాలన్నింటికి పెద్దన్నగా భావించే ఆ దేశ ముఖ చిత్రంలో చెరిగిపోని ఓ శాశ్వత ముద్ర వేసిన రోజు. చరిత్రలో మాయమవని అక్షరాలు లిఖించబడిన రోజు.. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నింటిని శాసించగల సత్తా ఉండి కూడా ఒక కరడుగట్టిన ఉగ్రవాది ప్రకోపానికి గురైన రోజు అది.. ఆ ఉగ్రవాది మరెవరో కాదు.. ఒసామా బిన్ లాడెన్. నేడు ఆ లాడెన్‌ను అమెరికా మట్టుబెట్టిన రోజు. దాదాపు పదేళ్లపాటు అలుపెరగకుండా అదే కసితో అణువణువుగాలించి చివరకు పాకిస్థాన్‌లోని అబోటా బాద్‌లో గుర్తించి తన కసి తీరా లాడెన్‌ను చంపేసిన రోజు. నేటికి లాడెన్ ను నేల కూల్చి సరిగ్గా ఐదేళ్లు. అమెరికా టవర్స్‌పై ఆత్మాహుతి దాడి జరిగిన తర్వాత ఈ దాడికి ప్రధాన వ్యూహకర్త అయిన లాడెన్ దాదాపు పదేళ్లపాటు దొరకకుండా అమెరికాను ముప్పు తిప్పలు పెట్టాడు. చివరకు పాకిస్థాన్‌లో అతడి స్థావరాన్ని గుర్తించిన అమెరికా సేనలు ఎంతో జాగ్రత్తగా వ్యూహం పన్నాయి. పకడ్బందీగా నెప్ట్యూన్ స్పేర్ పేరిట పదేళ్ల అలుపును 40 నిమిషాల వేటతో ముగించారు. లాడెన్ తో సహా అతడి కుమారుడు మరో ముగ్గురు ఉగ్రవాదులు ఈ దాడి ప్రాణాలు విడిచారు. అమెరికాకు చెందిన నేవీ సీల్స్ ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. అబోటా బాద్‌లోని లాడెన్ నివాసంపై ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేసి.. లాడెన్‌ను నేల కూల్చారు. ఈ ఆపరేషన్ మొత్తం లైవ్‌ను స్వయంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వీక్షించారు. లాడెన్ చనిపోయిన వెంటనే.. 24గంటలు కూడా గడవకముందే అరేబియా సముద్రంలో ముస్లిం మతాచారాల ప్రకారమే ఓ గుర్తు తెలియని చోట పడేశారు. -
ఆ అడవిలో కార్లకు 70 ఏళ్లు..!
ఈ ఫోటోలోని కార్లను చూస్తే మీకేమనిపిస్తోంది..? ఈవిల్‌డెడ్ సినిమా లొకేషన్లా ఉంది కదా...! కానీ ఈ ప్రాంతం నిజంగా ఉంది. 70 ఏళ్ల నుంచి ఈ కార్లు ఆ ప్రాంతంలో అలానే ఉన్నాయి. మరి ఆ కార్లు ఎవరివో, అక్కడెందుకున్నాయో తెలుసుకుందామా...? అది బెల్జియంలోని చాటిలాన్ అనే మారుమూల గ్రామం. అక్కడ ఓ దట్టమైన అడవి ఉంది. అందులో హాలీవుడ్ హార్రర్ సినిమా లొకేషన్‌కి ఏమాత్రం తీసిపోని ప్రాంతం ఉంది. మామూలుగా అడవి అంటే జంతువులు మాత్రమే ఉంటాయి. కానీ ఈ అడవిలో జంతువులతో పాటు కార్లు కూడా ఉంటాయి. అలా అని పదో, ఇరవయ్యో కార్లు అనుకుంటే మీరు కారులో కాలేసినట్లే...! అలాంటి కార్లు ఇక్కడ కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి. అందుకే వదిలేశారు..!? రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా సైన్యాలు భారీ సంఖ్యలో బెల్జియం గడ్డపై మోహరించాయి. వీరి సైనిక బలం ఆరు లక్షలు. వీరిలో చాలా మందికి కార్లున్నాయి. యుద్ధం ముగిసిన అనంతరం ఈ సైన్యాలు వెనుదిరిగిపోయే సమయంలో రవాణా సమస్య ఏర్పడింది. కార్లు ఉన్నవారందరూ ఈ అడవి ప్రాంతాన్ని ఎంచుకుని తమ కార్లను ఇక్కడ ఉంచి తర్వాత తీసుకెళ్లాలనుకున్నారు. కానీ ఆ కారుని తెచ్చుకోవడానికి కావాల్సిన సొమ్ముతో రెండు కార్లని కొనుక్కోవచ్చు. అందుకని ఆ కార్లని అక్కడే వదిలేశారు. ఆ కార్లు అక్కడ అలా ఉండి ఎండకు ఎండి, వానకు తడిసి తుప్పు పట్టిపోయాయి. స్థానికులు, కార్ల వ్యాపారులు కొందరు ఆ కార్ల విడిభాగాలను తస్కరించుకుపోయారు. పర్యావరణ సమస్యలు తలెత్తడంతో బెల్జియం ప్రభుత్వం ఈ అడవిని నిషేధిత ప్రదేశంగా ప్రకటించింది. ఈ కథ నిజమేనా..? కొంతమంది చరిత్రకారులు ఈ కథ నిజం కాదని కొత్త వాదనను తెర పైకి తెచ్చారు. ఈ కార్లను పరిశీలిస్తే అవి 70 ఏళ్ల కిందటివి కాదని తెలిసిపోతుందని అంటున్నారు. చరిత్ర నిజమో, చరిత్రకారులు నిజమో తెలియాలంటే ఈ మిస్టరీ వీడక తప్పదు. -
సిరియా వైపు అమెరికా బలగాలు
వాషింగ్టన్: సిరియాలో రసాయనిక దాడి నేపథ్యంలో శనివారం అమెరికా నేవీ బలగాలు సిరియా తీరానికి చేరువగా ముందుకు సాగుతున్నాయి. రసాయనిక దాడిపై నిజానిజాలు తేలిన తర్వాత సిరియాపై సైనిక చర్యకు దిగే అవకాశాలను అమెరికా పరిశీలిస్తోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా జాతీయ భద్రతా బృందంతో చర్చలు జరిపారు. సిరియాలో జరిగిందేమిటో నిర్ధారించే సాక్ష్యాధారాలను సేకరించాల్సిందిగా ఒబామా ఇంటెలిజెన్స్ వర్గాలను ఆదేశించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ చెప్పారు. నిజా నిజాలను నిర్ధారించుకున్నాక ఒబామా ఈ అంశంపై నిర్ణయాన్ని ప్రకటించనున్నారని తెలిపారు. మలేసియా ప్రయాణమవుతున్న రక్షణశాఖ మంత్రి చక్ హాగెల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతీయ భద్రతా బృందంతో ఒబామా జరిపిన చర్చల్లో పాల్గొన్నారు. ఈ అంశంపై అధ్యక్షుడు ఒబామాతో తాను ఎప్పటికప్పుడు సంప్రదింపులు సాగిస్తుంటానని హాగెల్ మీడియాకు చెప్పారు. సిరియా వద్ద తమ బలగాలను మోహరించడం సహా అన్ని అవకాశాలనూ పరిశీలిస్తామని తెలిపారు. సిరియా రాజధాని డమాస్కస్‌కు చేరువలో గత బుధవారం జరిగిన రసాయనిక దాడిలో 1,300 మంది మరణించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ బలగాలు రసాయనిక దాడికి పాల్పడినట్లు తిరుగుబాటుదారులు ఆరోపిస్తుండగా, రసాయనిక ఆయుధాలను వినియోగించలేదని సిరియా ప్రభుత్వం చెబుతోంది. కాగా, రసాయనిక ఆయుధాలను వినియోగిస్తే పాశ్చాత్య ప్రపంచం నుంచి సిరియా గట్టి ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఒబామా ఇదివరకే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సిరియాపై సైనిక దాడికి దిగే ముందు అంతర్జాతీయ మద్దతును కూడగట్టుకునే ప్రయత్నాలను ముమ్మరంగా సాగిస్తున్నారు. మరోవైపు, రసాయనిక ఆయుధాల వినియోగంపై దర్యాప్తుకు అంగీకరించేలా సిరియా అధ్యక్షుడు బషర్ అసద్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ఐక్యరాజ్య సమితి ప్రతినిధి ఏంజెలా కానే డమాస్కస్ చేరుకున్నారు. ఐక్యరాజ్య సమితి దర్యాప్తుకు సహకరించాల్సిందిగా ఇప్పటికే పలు దేశాలు అసద్‌కు సూచించాయి. తిరుగుబాటుదారులే రసాయనిక ఆయుధాలు వాడారు: సిరియా సర్కారు తిరుగుబాటుదారులే రసాయనిక ఆయుధాలను వాడారని సిరియా ప్రభుత్వం శనివారం ఆరోపించింది. రసాయనాలతో నిండి ఉన్న బ్యారెల్స్, గ్యాస్ మాస్కులను ప్రభుత్వ టీవీ చానల్ చూపింది. తిరుగుబాటుదారుల స్థావరాల్లో ఉన్న ఈ ఆయుధాలు కొద్దిపాటి నమూనా మాత్రమేనని పేర్కొంది. సైన్యం ముందుకు సాగకుండా అరికట్టాలనే ఉద్దేశంతోనే తిరుగుబాటుదారులు ఈ ఆయుధాలను ఉపయోగించారని ఆరోపించింది.