మానవత్వం పరిమళించిన వేళ... కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద శిశువును బుజ్జగిస్తున్న అమెరికా సైనికుడు
కాబూల్: తాలిబన్ల కబంధ హస్తాల నుంచి తమ కంటి పాపల్ని కాపాడాలంటూ ఇనుప కంచెల మీదుగా పిల్లల్ని విసిరేసిన హృదయ విదారక సన్నివేశాలు గుర్తున్నాయి కదా..! ఆ దృశ్యాలు ఇప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఆ పిల్లలు ఏమయ్యారోనంటూ తలచుకొని కుమిలిపోతూనే ఉన్నాం. కాబూల్ విమానాశ్రయంలో ఇనుప కంచెల మీదుగా అమెరికా నావికాదళ అధికారి ఒకరు అత్యంత సాహసంతో ఒంటి చేత్తో ఒక పసికందుని తీసుకున్న దృశ్యం అందరి మనసుల్ని కలిచి వేసింది.
తల్లి నుంచి వేరుబడ్డ రెండు నెలల చిన్నారిని లాలిస్తున్న టర్కీ సైనికురాలు
ఒమర్ హైదరి అనే మానవ హక్కుల కార్యకర్త తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ సమయంలో ఆ పాప కింద పడితే పరిస్థితి ఏంటని వీడియో చూసిన వారందరికీ గుండె గుభిలుముంటుంది. అయితే ఇప్పుడు ఆ చిన్నారి చిరునవ్వులు చిందిస్తూ క్షేమంగా తిరిగి తండ్రి దగ్గరకి వచ్చింది. అప్పుడే పుట్టిన పసిపాపకి అనుకోని అనారోగ్యం రావడంతో ఆ పాపని స్వయంగా తండ్రే వైద్య చికిత్స కోసం సైనిక అధికారులకు అప్పగించారు.
పసిపాపలను సముదాయిస్తున్న అమెరికా మహిళా సైనికులు
అఫ్గానిస్తాన్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో తమ బిడ్డను ఆస్పత్రికి తీసుకువెళ్లే దిక్కు లేక ఆ తల్లిదండ్రులు సతమతమయ్యారు. చివరికి ఆ చిన్నారి తండ్రి గుండె రాయి చేసుకొని అన్నింటికి తెగించి కాబూల్ విమానాశ్రయంలో ఉన్న అమెరికా నావికాదళ అధికారులకి తమ బిడ్డను అప్పగించారు. విమానాశ్రయంలో ఉన్న నార్వే ఫీల్డ్ ఆస్పత్రిలో ఆ పసిపాపకి చికిత్స నిర్వహించిన అనంతరం చిన్నారిని తిరిగి భద్రంగా ఆ తండ్రికి సైనికాధికారి అప్పగించారు. ‘ఆ వీడియోలో ఉన్న పసిపాపని వైద్య చికిత్స కోసం విమానాశ్రయంలో భద్రతా అధికారికి ఇచ్చారు. ఇప్పుడు ఆ పాప పూర్తి ఆరోగ్యంతో తిరిగి తండ్రి దగ్గరకి చేరుకుంది’ అని మేజర్ జిమ్ స్టెంజర్ సీబీఎస్ న్యూస్‌కి తెలిపారు.
నావికాదళ అధికారుల సత్తా ఏమిటో ఇలాంటి సంఘటనలతోనే బయట ప్రపంచానికి తెలుస్తుందని ఆయన అన్నారు. సంక్లిష్ట పరిస్థితుల్లో అత్యంత త్వరగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు పరచడం నావికాదళ అధికారులకే సాధ్యపడుతుందని ఆ మేజర్ కొనియాడారు. ఈ విషయాన్ని అమెరికాలోని పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ కూడా ధ్రువీకరించారు.‘ఆ పసిపాప తిరిగి తండ్రి దగ్గరకి వెళ్లిపోయింది. వాళ్లు ఇప్పుడు ఎక్కడున్నారో మాకు తెలీదు. కానీ పసిపిల్లల్ని వారి తల్లిదండ్రుల దగ్గరకి చేర్చడం అమెరికా సైన్యం తమ బాధ్యతగా భావిస్తుంది. ఈ విషయంలో అత్యుత్తమమైన పనితీరు కనబరుస్తుంది’ అని కిర్బీ కితాబునిచ్చారు.
చిన్నారిని సురక్షితంగా తీసుకెళ్తున్న దృశ్యం
ఆలనాపాలనా చూస్తున్న సైనికులు
వివిధ దేశాల ప్రజల తరలింపు ప్రక్రియ నడుస్తున్న సమయంలో కాబూల్ విమానాశ్రయం అంతా గందరగోళంగా మారింది. ఆ జనం మధ్య కొందరు పిల్లలు తల్లిదండ్రుల నుంచి విడిపోయి ఏడుస్తూ కనిపిస్తున్నారు. అలాంటి పిల్లల్ని విమానాశ్రయంలో ఉన్న అమెరికా, బ్రిటన్ సైనికులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ తిరిగి వారి కుటుంబాల వద్దకు చేరుస్తున్నారు. తల్లిదండ్రులు కనిపించే లోపు ఆ పిల్లల అవసరాలన్నీ వారే తీరుస్తున్నారు. పిల్లలకి జోల పాటలు పాడుతూ వారిని పడుకోబెట్టడం, పిల్లలకి మంచినీళ్లు ఇవ్వడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఆ దృశ్యాలు చూసిన వాళ్లు ఇంకా మానవత్వం బతికే ఉందని గుండెల నిండా గాలి పీల్చుకుంటున్నారు.
కంచె మీదుగా పాపను ఒంటిచేత్తో పట్టుకున్న అమెరికా సైనికుడు (ఫైల్)
హెరాత్‌లో కోఎడ్యుకేషన్‌పై నిషేధం
తొలి ఫత్వా జారీ చేసిన తాలిబన్లు
పాత పరిపాలనను గుర్తు చేస్తూ తాలిబన్లు విధాన నిర్ణయాలను ప్రకటిస్తున్నారు. తాజాగా హెరాత్ ప్రావిన్స్‌లోని పాఠశాలలు, యూనివర్సిటీల్లో కోఎడ్యుకేషన్‌ను నిషేధిస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. సమాజంలో అన్ని అనర్థాలకు కోఎడ్యుకేషనే కారణమని, అందుకే దీన్ని నిషేధిస్తున్నామని తాలిబన్లు తెలిపారు. పలువురు ప్రొఫెసర్లు, ప్రైవేటు కాలేజీల అధిపతులతో చర్చించిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నామని తాలిబన్ వర్గాలు వెల్లడించాయని ఖామా ప్రెస్ ఏజెన్సీ తెలిపింది. అఫ్గాన్ స్వాధీనం చేసుకున్న అనంతరం తాలిబన్లు జారీ చేసిన తొలి ఫత్వా ఇదే!
మగపిల్లలకు మహిళా టీచర్లు బోధించొద్దు
ఉన్నత విద్యపై తాలిబన్ ప్రతినిధి ముల్లా ఫరీద్ మూడుగంటలు ఈ చర్చలు జరిపారు. కోఎడ్‌కు ప్రత్యామ్నాయం లేదని, దీన్ని నిలిపివేయడమే మార్గమని అభిప్రాయపడ్డారు. అలాగే మహిళా ఉపాధ్యాయులు కేవలం మహిళా విద్యార్థులకే బోధించాలని, మగ విద్యార్థులకు బోధించకూడదని ఆదేశించారు. పౌర పాలనలో అఫ్గాన్ ప్రభుత్వాలు పలు యూనివర్సిటీలు, కాలేజీలు, పాఠశాలలు స్థాపించి కోఎడ్‌ను ప్రోత్సహించాయి. తాలిబన్ల తాజా నిర్ణయంతో ప్రైవేట్ విద్యాసంస్థలకు ఇబ్బందులు ఎక్కువని నిపుణులు భావిస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం దేశంలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల్లో సుమారు 40 వేల మంది విద్యార్థులు, 2వేల మంది బోధనా సిబ్బంది ఉన్నారు.
షరియా చట్టం కింద మహిళా హక్కులు గౌరవిస్తామని ఈవారం ఆరంభంలో తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ విలేకరుల సమావేశంలో అట్టహాసంగా ప్రకటించారు. అయితే గతంలో తమ విధానాలనే తాలిబన్లు కొనసాగించేందుకు నిర్ణయించుకున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment