Shocking Videos from Kabul Airport:: కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో అఫ్గనిస్తాన్ ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. అధికారం తాలిబన్ల వశం కావడంతో అఫ్గన్ నుంచి బయట పడేందుకు నానాతంటాలు పడుతున్నారు. అఫ్గన్ మీదుగా విమానాల రాకపోకలపై నిషేధం విధించడంతో కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. రన్‌వేపై కదులుతున్న విమానం ఎక్కేందుకు వందలాది మంది ప్రయత్నించారు. విమానం డోర్ క్లోజ్ చేసినా వేలాడుతూ ప్రయాణించేందుకు సాహసించారు. ఈ క్రమంలో టేకాఫ్ అయిన విమానం నుంచి ఇద్దరు అప్గన్‌లు ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. దీనికి సంబంధించిన భయానక వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కాగా అఫ్గనిస్తాన్ తాలిబన్ల వశం కావడం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే తాలిబన్లు మొత్తం అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించడం గమనార్హం. ఇక పూర్తి అధికారాన్ని దక్కించుకొనే దిశగా అడుగులేస్తున్నారు. అందరూ ఊహించనట్లుగానే తాలిబన్లు ఆదివారం అఫ్గన్ రాజధాని కాబూల్‌లోకి దర్జాగా ప్రవేశించారు. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే ఈ చారిత్రక నగరంలో పాగా వేశారు.
తాము ఎవరిపైనా దాడులు చేయబోమని, ప్రభుత్వం బేషరతుగా లొంగిపోవాలని తాలిబన్లు నిర్దేశించారు. దీంతో అఫ్గన్ కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పలేదు. శాంతియుతంగా అధికార మార్పిడి కోసం ప్రయత్నిస్తున్నట్లు తాలిబన్ ప్రతినిధులు వెల్లడించారు. అఫ్గన్ తాలిబన్ల వశం కావడంతో అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తన పదవికి రాజీనామా చేసి, తన బృందంతో కలిసి దేశం విడిచి వెళ్లిపోయారు. తజకిస్తాన్‌కు వెళ్లి తలదాచుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment