కాబూల్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాల నుంచి తమ పిల్లలనైనా రక్షించాలని తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. దేశం వీడి వెళ్లిపోవడానికి వేలాదిగా కాబూల్ విమానాశ్రయానికి తరలి వస్తూ ఉండడంతో తాలిబన్లు ఎవరూ లోపలికి వెళ్లకుండా అడ్డంగా ఇనుప కంచెలు వేశారు. దీంతో ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లలేని వారంతా కనీసం తమ పిల్లలనైనా కాపాడాలంటూ విమానాశ్రయం లోపల ఉన్న యూకే, అమెరికా దళాలకి మొరపెట్టుకుంటున్నారు. కొందరైతే ఇనుప కంచెల మీదుగా పిల్లల్ని లోపలికి విసిరేస్తున్నట్టుగా స్కై న్యూస్ ఒక కథనంలో వెల్లడించింది.
‘‘కనీసం మా కంటి పాపలనైనా కాపాడండి. మీ వెంట బ్రిటన్ తీసుకువెళ్లిపోండి’’ అంటూ వారు ఆర్తిగా విజ్ఞప్తి చేస్తున్నారు. అలా ఇనుప కంచెల మీదుగా విసిరేసే క్రమంలో కొందరు పిల్లలు వాటికి చిక్కుకొని గాయపడుతున్నారు. ఇలాంటి దృశ్యాలు చూస్తూ ఉంటే భరించలేనంత ఏడుపు వస్తోందని బ్రిటన్‌కు చెందిన ఒక సైనిక అధికారి చెప్పారు. విమానాశ్రయం లోపల ఉన్నప్పటికీ బయట నుంచి కాల్పుల మోతలు, అఫ్గాన్ల నిస్సహాయమైన ఆర్తనాదాలు వినిపిస్తున్నాయని దీంతో కంటి మీద కునుకు కూడా రావడం లేదని ఆ అధికారి తెలిపారు.
తమ దేశ సిబ్బందిని, పౌరుల్ని తరలించడానికి గత కొద్ది రోజులుగా బ్రిటన్, అమెరికా సైనికులు కాబూల్ విమానాశ్రయంలోనే మకాం వేశారు. ‘‘కొందరు మహిళలు తమ పిల్లల్ని కంచెల మీదుగా విసిరేస్తున్నారు. విమానాశ్రయం లోపల ఉన్న అధికారులకు వారిని తీసుకువెళ్లాల్సిందిగా చెబుతున్నారు. ఇంతకంటే బాధాకరమైన విషయం ఏముంటుంది’’ అని ఆయన అన్నారు. అఫ్గాన్‌ను ఆక్రమించుకోగానే తాలిబన్లు తమ నిజస్వరూపం బయట పెట్టడంతో పాటు దేశం విడిచి వెళ్లాలనుకునే వారిని దారుణంగా చితక్కొడుతున్నారు. నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేస్తున్నారు. దీంతో ఎప్పుడు ఎటు వైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న ఆందోళనతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలనుకునే కుటుంబాలకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment