పంజ్‌షీర్‌పై పట్టు సాధించాం! | Panjshir resistance forces claim to have captured hundreds of Taliban | Sakshi
Sakshi News home page

Taliban-Panjshir: పంజ్‌షీర్‌పై పట్టు సాధించాం!

Published Tue, Sep 7 2021 4:39 AM | Last Updated on Tue, Sep 7 2021 8:06 AM

Panjshir resistance forces claim to have captured hundreds of Taliban - Sakshi

పంజ్‌షీర్‌ గవర్నర్‌ ఆఫీస్‌ వద్ద తమ జెండా ఎగరేస్తున్న తాలిబన్లు

కాబూల్‌: దశాబ్దాలుగా తమకు కొరకరాని కొయ్యగా మారిన పంజ్‌షీర్‌ ప్రావిన్సును ఎట్టకేలకు హస్తగతం చేసుకున్నామని తాలిబన్లు సోమవారం ప్రకటించారు. ఇప్పటివరకు తాలిబన్ల పాలనకు లొంగకుండా ఉన్నవారికి పంజ్‌షీర్‌ కేంద్రస్థానంగా నిలిచింది. కానీ తాజాగా పంజ్‌షీర్‌లోని 8 జిల్లాల్లో తాలిబన్లు వేలాదిగా ప్రవేశించి మొత్తం ప్రావిన్సును ఆక్రమించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తమ ఫైటర్ల చేతికి పంజ్‌షీర్‌ చిక్కిందని తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ ప్రకటించారు. ప్రతిఘటన బృందాలను జయించామని, మిగిలినవారు పారిపోయారని చెప్పారు. అణచివేతకు గురైన పంజ్‌షీర్‌ ప్రజలకు విముక్తి లభించిందన్నారు.

పంజ్‌షీర్‌ ప్రజలకు సంపూర్ణ రక్షణ ఇస్తామని, వారిపై ఎలాంటి వివక్ష చూపమని జబీహుల్లా చెప్పారు. కానీ తాలిబన్ల రాకతో భయపడిన వేలాదిమంది పర్వతాల్లోకి  పారిపోయారు. తాలిబన్‌ బృందాలు గవర్నర్‌ ఆఫీసు వద్ద జెండా ఎగరవేస్తున్న దృశ్యాలు ట్విట్టర్‌లో వైరల్‌ అయ్యాయి. మరోవైపు తాలిబన్ల ప్రకటనను పంజ్‌షీర్‌ పోరాట నేతలు తోసిపుచ్చారు. అఫ్గాన్‌ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లాసలేహ్, పంజ్‌షీర్‌ నేత అహ్మద్‌ మసూద్‌ నేతృత్వంలో ఇంతవరకు పంజ్‌షీర్‌లో దళాలు తాలిబన్లను ప్రతిఘటిస్తూ వచ్చాయి. తాలిబన్లు మారణ హోమాన్ని నిలిపివేస్తే చర్చలకు తాము సిద్ధమని ఇటీవలే అహ్మద్‌ ప్రకటించారు. కానీ తాలిబన్లు పోరాటానికే నిశ్చయించుకొని పంజ్‌షీర్‌ లోయపై దాడి చేశారు.   

ఫహీమ్‌ని చంపేశారు
పంజ్‌షీర్‌ పోరాట దళాల ప్రతినిధిగా బయటప్రపంచానికి ఎప్పటికప్పుడు విశేషాలు తెలియజేస్తూ వచి్చన ఫహీమ్‌ దష్తి గొంతు మూగబోయింది. ఈ మేరకు అఫ్గాన్‌ రెసిస్టెంట్‌ ఫ్రంట్‌ ఫేస్‌బుక్‌ పేజీలో ప్రకటించింది. ఫాసిస్టు గ్రూపుతో పోరాటంలో ఫహీమ్‌ అమరుడయ్యాడని నివాళి అరి్పంచింది. పాకిస్తాన్‌ జరిపిన దాడిలో ఫహీమ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా మరణించారని పంజ్‌ïÙర్‌ నేత మసూద్‌ ఒక ప్రకటనలో చెప్పారు. చర్చలకు సిద్ధమన్నా వినకుండా తాలిబన్లు తమపై పోరుకు వస్తున్నారని మసూద్‌ సోమవారం విమర్శించారు.

అమ్రుల్లా సలేహ్, మసూద్‌ ఎక్కడ ఉన్నది తెలియరాలేదు. సలేహ్‌ నివసించే ఇంటిపై ఆదివారం హెలికాప్టర్లతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆ దాడి నుంచి సలేహ్‌ సురక్షితంగా తప్పించుకొని గుర్తుతెలియని ప్రదేశానికి వెళ్లిపోయారు. తాలిబన్లకు వ్యతిరేకంగా పంజ్‌షీర్‌ చాలా రోజులు పోరాటం చేస్తుందని నిపుణులు భావించారు. కానీ అంతర్జాతీయంగా ఎలాంటి సాయం అందకపోవడంతో చివరకు ఈ ప్రాంతం కూడా తాలిబన్లకు తలవంచాల్సి వచి్చంది.  

పాక్‌ అండతోనే: మసూద్‌
పంజ్‌షీర్‌పై తాలిబన్లు పట్టుసాధించడంలో పాకిస్తాన్‌ సాయం చేసిందని పంజ్‌ïÙర్‌ నేత అహ్మద్‌ మసూద్‌ నిప్పులు చెరిగారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ఆడియో మెసేజ్‌ విడుదల చేశారు. పాక్‌– తాలిబన్‌ బంధం గురించి ప్రతి దేశానికి తెలుసని, కానీ ఎవరూ నోరువిప్పడం లేదని వాపోయారు. కాబూల్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నప్పటి నుంచి వారికి పాక్‌ సాయం చేస్తోందని దుయ్యబట్టారు. పాక్‌ సాయంతోనే తాలిబన్లు పంజ్‌షీర్‌పై దాడికి దిగారన్నారు. తాలిబన్లు మారలేదని, మరింత క్రూరంగా తయారయ్యారని విమర్శించారు.

పంజ్‌ïÙర్‌ను ఆక్రమించుకున్నామన్న తాలిబన్‌ ప్రకటనను ఆయన సోమవారం కొట్టిపారేశారు. చివరి రక్తపు బొట్టు వరకు తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. పాక్‌కు చెందిన ఒక జెట్‌ను తమ యోధులు కూలి్చవేశారని ఆయన ఒక ట్వీట్‌లో తెలిపారు. పాక్‌ పంపిన డ్రోన్లను పంజ్‌షేర్‌ దళాలపై దాడి చేయడానికి తాలిబన్లు వినియోగించారని,  కమాండోలను పాక్‌ ఎయిర్‌డ్రాప్‌ చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

పాక్‌ సహా ఇతర దేశాల జోక్యాన్ని సహించం
ఇస్లామాబాద్‌: అఫ్గానిస్తాన్‌ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి పాకిస్తాన్‌తో సహా ఏ దేశాన్నీ అనుమతించబోమని తాలిబన్‌ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌  స్పష్టంచేశారు. సోమవారం జబీహుల్లా  ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ అధినేత లెఫ్టినెంట్‌ జనరల్‌ ఫయాజ్‌ హమీద్‌.. తాలిబన్‌ అగ్రనేత ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌తో కాబూల్‌లో సమావేశమయ్యారనే విషయాన్ని ఈ సందర్భంగా జబీహుల్లా ధ్రువీకరించారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా సాగే ఎలాంటి కార్యకలాపాలకైనా అఫ్గాన్‌ భూభాగాన్ని వాడుకోనివ్వబోమంటూ బరాదర్‌ ఈ భేటీ సందర్భంగా హామీద్‌కు హామీ ఇచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ పాత్రపై మీడియా ప్రశ్నించగా.. అఫ్గాన్‌ అంతర్గత వ్యవహారాల్లో పాకిస్తాన్‌తో సహా ఏ ఇతర దేశమూ జోక్యం చేసుకోవడానికి అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమ దేశ వ్యవహారాల్లో ఇతరులు వేలు పెట్టొద్దని సూచించారు.

తాలిబన్‌ ‘తెర’గతులు
అఫ్గాన్‌లో యూనివర్సిటీ తరగతులు ప్రారంభమయ్యాయి. పలు ప్రైవేట్‌ కాలేజీలు తెరుచుకున్నాయి. అన్నిట్లో స్త్రీ, పురుష విద్యార్ధులను వేరు చేస్తూ అడ్డంగా కర్టెన్లు, తెరలను ఏర్పాటయ్యాయి. షరియా చట్టం ప్రకారం మహిళలకు చదువుకునే హక్కు ఉందని, అయితే మగ పిల్లలతో పాటు కలిసి చదివే వీల్లేదని తాలిబన్లు స్పష్టం చేశారు. దీంతో కాలేజీలన్నింటిలో తరగతి గదుల మధ్యలో తెరలు ప్రత్యక్షమయ్యాయి. అలాగే మహిళా విద్యార్థులకు కేవలం మహిళలు లేదా వృద్ధులైన మగవారు మాత్రమే బోధన చేయాలని తాలిబన్లు హుకుం జారీ చేశారు. అలాగే మహిళా విద్యార్ధులు తప్పనిసరిగా అబయా, నికాబ్‌(శరీరాన్ని పూర్తిగా కవర్‌ చేసే బురఖా) ధరించాలని, ఆడపిల్లలను క్లాసు అయిపోవడానికి ఐదు నిమిషాల ముందే బయటకు పంపాలని, అప్పుడే మగవిద్యార్ధులతో వారు కలవకుండా ఉంటారని తాలిబన్లు ఆర్డరేశారు. తరగతి గదుల్లో తెరలు వేలాడదీసిన ఫొటోలను అమాజ్‌ న్యూస్‌ ట్విట్టర్‌లో పోస్టు చేసింది.   

కాలేజీలో విద్యార్థినీ విద్యార్థుల సీట్ల మధ్య తెర ఏర్పాటుచేసిన దృశ్యం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement