baby care
-
ఢిల్లీ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని వివేక్ విహార్‌లో శనివారం అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బేబీ కేర్ న్యూ బోర్న్ హాస్పిటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు పసికందులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో మొదలైన మంటలు చుట్టుపక్కలున్న మరో రెండు భవనాలకు సైతం వ్యాపించినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. మొత్తం 16 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చామన్నారు. ఆస్పత్రి రెండో అంతస్తులో నిల్వ ఉంచిన ఆక్సిజన్ సిలిండర్లు పేలడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పారు. మంటలు వ్యాపించిన ఆస్పత్రి భవనం నుంచి మొత్తం 12 మంది శిశువులను బయటకు తీసుకురాగా వారిలో ఏడుగురు చనిపోయారని ఫైర్ చీఫ్ అతుల్ గర్గ్ చెప్పారు. మిగతా ఐదుగురిలో కొందరు స్వల్పంగా గాయపడ్డారన్నారు. మంటలను గమనించిన స్థానికులు, షహీద్ సేవా దళ్ కార్యకర్తలు కలిసి భవనం వెనుక వైపు నుంచి నిచ్చెనల ద్వారా పైకెక్కి చిన్నారులను కిందికి తీసుకువచ్చారని ప్రత్యక్ష సాకు‡్ష్యలు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రి సిబ్బంది పరారైనట్లు చెబుతున్నారు. ఆస్పత్రి యజమాని నవీన్ కిచిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నామని షాదారా డీసీపీ సురేంద్ర చౌదరి చెప్పారు. ఈ దారుణంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర విచారం వెలిబుచ్చారు. ధైర్యంగా ఉండాలని బాధిత కుటుంబాలను కోరారు. -
పసికందులు ఎందుకు ఏడుస్తున్నారో ఠక్కున చెప్పేసే డివైజ్!
ఇంకా మాటలు రాని వయసులో కేరింతలు, ఏడుపులు మాత్రమే పసికందుల భాష. పసిపిల్లలు సంతోషంగా ఉన్నప్పుడు బోసినవ్వులొలికిస్తూ కేరింతలు కొడతారు. ఆకలేసినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు ఏడుస్తారు. పసిపిల్లల ఏడుపును అర్థం చేసుకోవడం ఒక్కోసారి కష్టంగా ఉంటుంది. ఆకలితోనే ఏడుస్తున్నారా, మరే కారణం వల్ల ఏడుస్తున్నారా తెలుసుకోవడం అంత సులువు కాదు. గుక్కతిప్పుకోకుండా ఏడ్చే పసిపిల్లలతో తల్లులు నానా తంటాలు పడుతుంటారు. పసిపిల్లలు ఏడ్చేటప్పుడు ఇకపై అంతగా ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఇదిగో ఈ బుల్లిపరికరం పసికందుల ఏడుపును మనకు బోధపడే భాషలోకి అనువదిస్తుంది. ఇది ఇరవై నాలుగు గంటలూ పసికందులను కంటికి రెప్పలా కనిపెడుతూ ఉంటుంది. వారు ఏడుస్తున్నట్లయితే, ఎందుకు ఏడుస్తున్నారో ఇట్టే తెలియజెబుతుంది. అమెరికన్ కంపెనీ ‘మాక్సికోసీ’ పిల్లల ఏడుపును అనువదించే ఈ బుల్లిరోబోను ఇటీవల రూపొందించింది. దీనికి అనుబంధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే బేబీ మానిటర్ కూడా ఉంటుంది. పిల్లలు ఏడుస్తున్నట్లయితే, వారు ఆకలికి ఏడుస్తున్నారో, నిద్రవస్తున్నందుకు ఏడుస్తున్నారో, భయం వల్ల ఏడుస్తున్నారో, గందరగోళం వల్ల ఏడుస్తున్నారో ఇది ఇట్టే చెప్పేస్తుంది. దీని ధర 61.99 డాలర్లు (రూ.5,154) మాత్రమే!. (చదవండి: కాస్మెటిక్ ఆక్యుపంక్చర్ గురించి విన్నారా?) -
జనాభాను పెంచేందుకు సిక్కింలో ప్రభుత్వోద్యోగినులకు వరాలు
గాంగ్టాక్: సిక్కిం రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సీఎం ప్రేమ్ సింగ్ తమంగ్ పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు. వారి చిన్నారులకు ఇంటి వద్దే సహాయకులను ఉచితంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. చిన్నారుల బాధ్యత తీసుకునే ఆయాలకు నెలకు రూ.10 వేలను ప్రభుత్వమే ఇస్తుందన్నారు. 40 ఏళ్లు, ఆపైన వయస్సుండే మహిళలకు చిన్నారులను ఏడాది వరకు చూసుకునే బాధ్యతలను అప్పగిస్తామన్నారు. మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవులను 365 రోజులకు, తండ్రులకైతే నెల రోజులు సెలవులు ఇస్తామని చెప్పారు. రెండో బిడ్డను పోషించేందుకు ఒక ఇంక్రిమెంట్, మూడో బిడ్డకైతే రెండు ఇంక్రిమెంట్లు ఇస్తామన్నారు. తరిగిపోతున్న జననాల రేటు చాలా ఆందోళన కలిగించే అంశమన్నారు. క్షీణిస్తున్న స్థానిక జాతుల జనాభాను పెంచేందుకు ప్రభుత్వం సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. తల్లులవ్వాలనుకునే ఉద్యోగినులు పుట్టబోయే తమ సంతానం బాగోగుల గురించి ఆందోళన చెందరాదనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. జననాల రేటు పెంచేందుకు సాధారణ ప్రజానీకానికి కూడా ప్రోత్సహకాలు ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు. సంతానం కలగడంలో ఇబ్బందులు ఎదురయ్యే వారి కోసం ఐవీఎఫ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాల్లో చికిత్స తీసుకునే వారికి రూ. 3 లక్షలు గ్రాంటుగా అందజేస్తామన్నారు. సిక్కింలోని 7 లక్షల లోపు జనాభాలో 80 శాతం మంది స్థానిక తెగల ప్రజలే. సంతానోత్పత్తి రేటు 1.1%గా ఉంది. -
తల్లిబిడ్డల కోసం రైళ్లలో సరికొత్త సౌకర్యం!
చంటిపిల్లలు ఉన్న తల్లుల కోసం రైల్వేశాఖ వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రయాణ సమయంలో తల్లులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైలులో ప్రత్యేక ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా బేబీ బెర్త్‌లను అందుబాటులోకి తెచ్చింది. నార్తర్న్ రైల్వే డివిజన్ అధికారులు చంటిపిల్లలు ఉన్న తల్లుల కోసం బేబీ బెర్త్‌లను అందుబాటులోకి తెచ్చారు. ఆ డివిజన్‌కు చెందిన ఇంజనీర్లతో కలిసి లోయర్ బెర్త్‌లో కొన్ని అదనపు మార్పులు చేసి బేబీ బెర్త్‌ను రూపొందించారు. ఈ సౌకర్యాన్ని లక్నో మెయిల్లో తొలిసారిగా అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడ ఫలితాలు బాగుంటే క్రమంగా ఇతర రైళ్లలోకి, ఇతర డివిజన్లలోకి విస్తరించే అవకాశం ఉంది. భారతీయ రైళ్లలో పెద్ద సంఖ్యలో బాలింతలు, చంటిపిల్లలు ఉన్న తల్లలు ప్రయాణిస్తున్నారను. వీరి కోసం ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడంతో తల్లిబిడ్డలు ఒకే బెర్త్‌పై పడుకోవాల్సి వస్తోంది. రైళ్లలో ఎన్నో కొత్త సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా ఈ సమస్యకు ఇన్నాళ్లు పరిష్కరం చూపలేకపోయారు. అయితే తొలిసారిగి నార్నర్ రైల్వే ఇంజనీర్లు బేబీ బెర్త్ కాన్సెప్టుతో ముందుకు వచ్చారు. Happy Mother's Day. A baby berth has been introduced in Coach no 194129/ B4, berth no 12 & 60 in Lucknow Mail, to facilitate mothers traveling with their baby. Fitted baby seat is foldable about hinge and is secured with a stopper. @AshwiniVaishnaw @RailMinIndia @GM_NRly pic.twitter.com/w5xZFJYoy1 — DRM Lucknow NR (@drm_lko) May 8, 2022 చదవండి: అప్పడు వర్క్ ఫ్రం హోం అడిగితే.. దారుణంగా... -
హమ్మయ్య.. ఆ పాప మళ్లీ నవ్వింది..!
కాబూల్: తాలిబన్ల కబంధ హస్తాల నుంచి తమ కంటి పాపల్ని కాపాడాలంటూ ఇనుప కంచెల మీదుగా పిల్లల్ని విసిరేసిన హృదయ విదారక సన్నివేశాలు గుర్తున్నాయి కదా..! ఆ దృశ్యాలు ఇప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఆ పిల్లలు ఏమయ్యారోనంటూ తలచుకొని కుమిలిపోతూనే ఉన్నాం. కాబూల్ విమానాశ్రయంలో ఇనుప కంచెల మీదుగా అమెరికా నావికాదళ అధికారి ఒకరు అత్యంత సాహసంతో ఒంటి చేత్తో ఒక పసికందుని తీసుకున్న దృశ్యం అందరి మనసుల్ని కలిచి వేసింది. తల్లి నుంచి వేరుబడ్డ రెండు నెలల చిన్నారిని లాలిస్తున్న టర్కీ సైనికురాలు ఒమర్ హైదరి అనే మానవ హక్కుల కార్యకర్త తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ సమయంలో ఆ పాప కింద పడితే పరిస్థితి ఏంటని వీడియో చూసిన వారందరికీ గుండె గుభిలుముంటుంది. అయితే ఇప్పుడు ఆ చిన్నారి చిరునవ్వులు చిందిస్తూ క్షేమంగా తిరిగి తండ్రి దగ్గరకి వచ్చింది. అప్పుడే పుట్టిన పసిపాపకి అనుకోని అనారోగ్యం రావడంతో ఆ పాపని స్వయంగా తండ్రే వైద్య చికిత్స కోసం సైనిక అధికారులకు అప్పగించారు. పసిపాపలను సముదాయిస్తున్న అమెరికా మహిళా సైనికులు అఫ్గానిస్తాన్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో తమ బిడ్డను ఆస్పత్రికి తీసుకువెళ్లే దిక్కు లేక ఆ తల్లిదండ్రులు సతమతమయ్యారు. చివరికి ఆ చిన్నారి తండ్రి గుండె రాయి చేసుకొని అన్నింటికి తెగించి కాబూల్ విమానాశ్రయంలో ఉన్న అమెరికా నావికాదళ అధికారులకి తమ బిడ్డను అప్పగించారు. విమానాశ్రయంలో ఉన్న నార్వే ఫీల్డ్ ఆస్పత్రిలో ఆ పసిపాపకి చికిత్స నిర్వహించిన అనంతరం చిన్నారిని తిరిగి భద్రంగా ఆ తండ్రికి సైనికాధికారి అప్పగించారు. ‘ఆ వీడియోలో ఉన్న పసిపాపని వైద్య చికిత్స కోసం విమానాశ్రయంలో భద్రతా అధికారికి ఇచ్చారు. ఇప్పుడు ఆ పాప పూర్తి ఆరోగ్యంతో తిరిగి తండ్రి దగ్గరకి చేరుకుంది’ అని మేజర్ జిమ్ స్టెంజర్ సీబీఎస్ న్యూస్‌కి తెలిపారు. నావికాదళ అధికారుల సత్తా ఏమిటో ఇలాంటి సంఘటనలతోనే బయట ప్రపంచానికి తెలుస్తుందని ఆయన అన్నారు. సంక్లిష్ట పరిస్థితుల్లో అత్యంత త్వరగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు పరచడం నావికాదళ అధికారులకే సాధ్యపడుతుందని ఆ మేజర్ కొనియాడారు. ఈ విషయాన్ని అమెరికాలోని పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ కూడా ధ్రువీకరించారు.‘ఆ పసిపాప తిరిగి తండ్రి దగ్గరకి వెళ్లిపోయింది. వాళ్లు ఇప్పుడు ఎక్కడున్నారో మాకు తెలీదు. కానీ పసిపిల్లల్ని వారి తల్లిదండ్రుల దగ్గరకి చేర్చడం అమెరికా సైన్యం తమ బాధ్యతగా భావిస్తుంది. ఈ విషయంలో అత్యుత్తమమైన పనితీరు కనబరుస్తుంది’ అని కిర్బీ కితాబునిచ్చారు. చిన్నారిని సురక్షితంగా తీసుకెళ్తున్న దృశ్యం ఆలనాపాలనా చూస్తున్న సైనికులు వివిధ దేశాల ప్రజల తరలింపు ప్రక్రియ నడుస్తున్న సమయంలో కాబూల్ విమానాశ్రయం అంతా గందరగోళంగా మారింది. ఆ జనం మధ్య కొందరు పిల్లలు తల్లిదండ్రుల నుంచి విడిపోయి ఏడుస్తూ కనిపిస్తున్నారు. అలాంటి పిల్లల్ని విమానాశ్రయంలో ఉన్న అమెరికా, బ్రిటన్ సైనికులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ తిరిగి వారి కుటుంబాల వద్దకు చేరుస్తున్నారు. తల్లిదండ్రులు కనిపించే లోపు ఆ పిల్లల అవసరాలన్నీ వారే తీరుస్తున్నారు. పిల్లలకి జోల పాటలు పాడుతూ వారిని పడుకోబెట్టడం, పిల్లలకి మంచినీళ్లు ఇవ్వడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఆ దృశ్యాలు చూసిన వాళ్లు ఇంకా మానవత్వం బతికే ఉందని గుండెల నిండా గాలి పీల్చుకుంటున్నారు. కంచె మీదుగా పాపను ఒంటిచేత్తో పట్టుకున్న అమెరికా సైనికుడు (ఫైల్) హెరాత్‌లో కోఎడ్యుకేషన్‌పై నిషేధం తొలి ఫత్వా జారీ చేసిన తాలిబన్లు పాత పరిపాలనను గుర్తు చేస్తూ తాలిబన్లు విధాన నిర్ణయాలను ప్రకటిస్తున్నారు. తాజాగా హెరాత్ ప్రావిన్స్‌లోని పాఠశాలలు, యూనివర్సిటీల్లో కోఎడ్యుకేషన్‌ను నిషేధిస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. సమాజంలో అన్ని అనర్థాలకు కోఎడ్యుకేషనే కారణమని, అందుకే దీన్ని నిషేధిస్తున్నామని తాలిబన్లు తెలిపారు. పలువురు ప్రొఫెసర్లు, ప్రైవేటు కాలేజీల అధిపతులతో చర్చించిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నామని తాలిబన్ వర్గాలు వెల్లడించాయని ఖామా ప్రెస్ ఏజెన్సీ తెలిపింది. అఫ్గాన్ స్వాధీనం చేసుకున్న అనంతరం తాలిబన్లు జారీ చేసిన తొలి ఫత్వా ఇదే! మగపిల్లలకు మహిళా టీచర్లు బోధించొద్దు ఉన్నత విద్యపై తాలిబన్ ప్రతినిధి ముల్లా ఫరీద్ మూడుగంటలు ఈ చర్చలు జరిపారు. కోఎడ్‌కు ప్రత్యామ్నాయం లేదని, దీన్ని నిలిపివేయడమే మార్గమని అభిప్రాయపడ్డారు. అలాగే మహిళా ఉపాధ్యాయులు కేవలం మహిళా విద్యార్థులకే బోధించాలని, మగ విద్యార్థులకు బోధించకూడదని ఆదేశించారు. పౌర పాలనలో అఫ్గాన్ ప్రభుత్వాలు పలు యూనివర్సిటీలు, కాలేజీలు, పాఠశాలలు స్థాపించి కోఎడ్‌ను ప్రోత్సహించాయి. తాలిబన్ల తాజా నిర్ణయంతో ప్రైవేట్ విద్యాసంస్థలకు ఇబ్బందులు ఎక్కువని నిపుణులు భావిస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం దేశంలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల్లో సుమారు 40 వేల మంది విద్యార్థులు, 2వేల మంది బోధనా సిబ్బంది ఉన్నారు. షరియా చట్టం కింద మహిళా హక్కులు గౌరవిస్తామని ఈవారం ఆరంభంలో తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ విలేకరుల సమావేశంలో అట్టహాసంగా ప్రకటించారు. అయితే గతంలో తమ విధానాలనే తాలిబన్లు కొనసాగించేందుకు నిర్ణయించుకున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. -
Baby Accessories: కిక్స్ – క్రాల్ ఆర్గానిక్ ఉత్పత్తులు
హైదరాబాద్: ప్రస్తుత మహమ్మారి నేపథ్యంలో ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలను మరింత పటిష్టం చేసినట్లు కిక్స్ అండ్ క్రాల్ ఒక ప్రకటనలో పేర్కొంది. పసి పిల్లల అవసరాలు నెరవేర్చడానికి సంబంధించి తల్లుల మనస్సుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న తమ కంపెనీ, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఉత్పత్తుల్లో ‘ఆర్గానిక్’ విధానానికి పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపింది. పసి పిల్లలకు అవసరమైన క్లాతింగ్, బేబీ యాక్సెసరీస్, మెటర్నిటీ వియర్, సాక్స్ వంటి పలు రకాల ఉత్పాదనల విషయంలో తల్లిదండ్రులకు తమ బ్రాండ్‌పై ఉన్న ప్రత్యేక అభిమానాన్ని మరింత పరిపుష్టం చేసుకోవడంలో భాగంగా తాజా ప్రొడక్టులను తీసుకువస్తున్నట్లు వివరించింది. తమ సొంత వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్, అజియో, ఫస్ట్ క్రై, మింత్రా, నైకా ఫ్యాషన్ వంటి మార్కెట్ ప్లేస్ వేదికలపై అన్ని రకాల నాణ్యమైన, విభిన్న ప్రొడక్టులు అందుబాటు ధరల్లో లభ్యమవుతాయని వివరించింది. చదవండి: GVK Biosciences: రూ. 7,300 కోట్ల డీల్! -
లోకం చూడకముందే కళ్లు మూస్తున్నారు
‘నల్లగొండ జిల్లా నార్కెట్పల్లికి చెందిన సుజాత నాలుగు రోజుల క్రితం స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడే పుట్టిన ఆ బిడ్డ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించి నిలోఫర్‌కు సిఫార్సు చేశారు. బిడ్డను తీసుకుని ఆదివారం అర్ధరాత్రి ఆస్పత్రికిచేరుకున్నారు. అయితే ఉదయం వరకు బిడ్డను ఎవరూ పట్టించుకోలేదు. అప్పటికే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శిశువు మృతి చెందింది. రెండు రోజుల క్రితం బండ్లగూడకు చెందిన రాగిణి పేట్లబురుజు ఆస్పత్రిలో ఆడశిశువుకు జన్మనిచ్చింది. కడుపులో ఉండగా ఉమ్మనీరు తాగడంతో బిడ్డను చికిత్స కోసం నిలోఫర్‌కు సిఫార్సు చేశారు. సకాలంలో వైద్యం అందకపోవడంతో శిశువు మృతి చెందింది‘. ఇలా ఒక్క సుజాత, రాగిణిల బిడ్డలే కాదు అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి చేరుకుంటున్న అనేక మందికి ఇదే అనుభవం ఎదురవుతుంది. సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మక నిలోఫర్ చిన్నపిల్లల ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యవేక్షణ లోపం..సకాలంలో వైద్యం అందకపోవడంతో అనేక మంది శిశువులు మృత్యువాతపడుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వ బకాయిలు పేరుకపోవడంతో ఇటీవల ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ బాధితులకు చికిత్సలను నిరాకరిస్తుండటంతో వారంతా నిలోఫర్‌ను ఆశ్రయిస్తున్నారు. సీరియస్ కండిషన్లో వస్తున్న రోగుల సంఖ్య ఇటీవల రెట్టింపైంది. ఆస్పత్రిలో వీరికి ఆశించిన స్థాయిలో వైద్యం అందకపోవడం, చికిత్సల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. పరోక్షంగా వారి మృత్యువాతకు కారణమవుతోంది. ఆస్పత్రికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, సరిహద్దులోని మహారాష్ట్ర, ఒరిస్సా, కర్నాటక రాష్ట్రాల వారు ఇక్కడికి వస్తుండటం, నెలలు నిండక ముందు తక్కువ బరువుతో జన్మించడం, పుట్టుకతోనే గుండెకు రంధ్రాలు ఏర్పడం, అవయవాల నిర్మాణం సరిగా లేకపోవడం, ఉమ్మనీరు మింగడం, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న వారే ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. వెయ్యి పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రిలో నిత్యం 1200 మంది చిన్నారులు చికిత్స పొందుతుంటారు. నిజానికి 2014తో పోలిస్తే ప్రస్తుతం ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. రాజీవ్ ఇంటెన్సివ్ కేర్ (ఎమర్జన్సీ వార్డు)వచ్చాక అదనంగా మరో 500 పడకలు అందుబాటులోకి వచ్చాయి. వార్మర్లు, ఫొటో థెరపీ యూనిట్లు, వెంటిలేటర్లు, ఆల్ట్రా సౌండ్, ఎక్సరే మిషన్లు అందుబాటులోకి వచ్చాయి. వైద్యపోస్టులు కూడా చాలా వరకు భర్తీ అయ్యాయి. మౌలిక సదుపాయాల పెంపు తర్వాత మరణాల రేటు తగ్గాల్సిందిపోయి...ఏటా మరింత పెరుగుతుండటం తల్లిదం డ్రులకు తీవ్ర ఆందోళన కలి గిస్తుంది. సంరక్షకులే నర్సుల అవతారం.. ఇండియన్ మెడికల్ కౌన్సిల్(ఐఎంసీ) నిబంధనల ప్రకారం ప్రతి ఇద్దరు చిన్నారులకు ఒక నర్సు ఉండాలి. కానీ ఆస్పత్రిలో 130 మందే ఉన్నారు. 200 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 75 మంది, జనరల్ వార్డులో ప్రతి ఐదుగురు శిశువులకు ఒక నర్సు ఉండాల్సి ఉండగా, యాభై మందికి ఒకరు, ఇంటెన్సివ్‌కేర్ యూనిట్లో ప్రతి ఇద్దరు చిన్నారులకు ఒక నర్సు ఉండాల్సి ఉండగా, ఇరువై మందికి ఒక నర్సు మాత్రమే ఉంది. ప్రతి వెంటిలేటరుకు కనీసం నాలుగు రౌండ్లకు కలిపి కనీసం నలుగురు నర్సులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం పని చేస్తున్న పదిహేడు వెంటిలేటర్లకు కేవలం పది మంది మాత్రమే ఉన్నారు. శిశువుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటి కప్పుడు పర్యవేక్షించేందుకు ఆస్పత్రిలో సరిపడా నర్సులు లేకపోవడంతో ఆ బాధ్యత కూడా సంరక్షకులే నిర్వహించాల్సి వస్తోంది. వీరంతా కాళ్లు చేతులు శుభ్రం చేసుకోకుండా పాదరక్షలతోనే వార్డుల్లోకి వెళ్తున్నారు. ఆసుపత్రికి ప్రస్తుతం 289 మంది నర్సుల అవసరం ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం మూడేళ్ల క్రితం జీవో నెంబరు 88 ప్రకారం ఆ పోస్టులు మంజూరు చేసి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమాకాలు చేపట్టారు. కొందరు కోర్టుకు వెళ్లడంతో ఈ ప్రక్రియ నిలిచిపోవడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. తల్లిదండ్రులకు తప్పని గుండె కోత.. హృద్రోగ సమస్యలతో నిత్యం 100 మంది వరకు శిశువులు వస్తుంటారు. వీరికి ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలు చేయాలి.ఆస్పత్రిలో ఈ మిషన్లు లేక పోవడంతో రోగులను ఉస్మానియాకు తరలిస్తున్నారు. అప్పటికే అక్కడ రోగుల రద్దీ ఎక్కువ ఉండటంతో శిశువుల వైద్యపరీక్షల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. న్యూరోసర్జరీ, న్యూరోఫిజీషియన్, నెఫ్రాలజీ, ఆర్ధో, కిడ్నీ వైద్య నిపుణులు లేకపోవడంతో ఆయా సమస్యలతో బాధపడుతున్న శిశువులను అంబులెన్స్‌లో ఉస్మానియాకు తరలిస్తున్నారు. ఇదిలా ఉంటే కీలక టెస్టులన్నీ కేవలం గంట వ్యవధిలోనే ఉచితంగా నిర్వహిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నా.. వాస్తవానికి అమలు కావడం లేదు. ఇన్ వార్డులతో పాటు క్యాజువాలిటీ, సర్జికల్, ప్రసూతి వార్డుల్లో సీనియర్ వైద్యులు అందుబాటులో ఉండాల్సి ఉండగా, రాత్రి పొద్దుపోయిన తర్వాత వారు కన్పించడం లేదు. ఒక వేళ ఉన్నా రోగులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కళ్లముందే కన్నబిడ్డ మృవాత పడుతుండటంతో బంధువులు తీవ్ర ఆగ్రహంతో వైద్యులపై దాడులకు దిగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. -
నెల రోజుల అమ్మ
స్త్రీ అమ్మగా మారడానికి రోజులు అక్కర్లేదు. ఒక్క నిమిషం చాలు. పసిబిడ్డ గుండెలకు తాకిన మరుక్షణమే ఏ స్త్రీ అయినా తల్లిలా మారిపోతుంది. మేరి అనిత కూడా అలా మారింది. కాని ఆమె షించాల్సిన పాత్ర నెలరోజులు మాత్రమే అనే వాస్తవం ఉద్వేగభరితమైనది. జూన్ 14, 2020. ఎర్నాకులంలోని చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు ఒక ఫోన్ వచ్చింది. షీనా అనే మహిళకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని, ఆమెకు ఆరు నెలల కుమారుడు ఉన్నాడని, ఆ పసివాణ్ణి చూసుకోవడానికి మనిషి కావాలని. కాని ఎవరూ లేరు. చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో కలిసి పని చేస్తున్నడా. మేరీ అనితకు ఈ సంగతి తెలిసింది. ఆమె క్లినికల్ సైకాలజిస్ట్. స్పెషల్ చిల్డ్రన్ కోసం ఒక కేంద్రం నడుపుతోందామె. ‘ఎవరూ లేరు. కాని నేను ఆ పసివాడికి తల్లినవుతాను’ అంది మేరీ. కోవిడ్ వచ్చిన తల్లిదండ్రులు ఆ పసివాడి పేరు ఉన్నికుట్టన్. తల్లిదండ్రులు నర్సులుగా హర్యానా వెళ్లి ఉపాధి పొందుతున్నారు. అక్కడ మొదట తండ్రికి కరోనా వచ్చింది. అతడు అక్కడే క్వారంటైన్లోకి వెళ్లగా తల్లి బాబును తీసుకొని కేరళలోని సొంత ప్రాంతమైన ఎర్నాకులం వచ్చింది. వచ్చాక ఆమెకు కోవిడ్ పాజిటివ్ తేలింది. అదృష్టవశాత్తు పసివాడికి నెగెటివ్ వచ్చింది. తల్లి వైద్యానికి ఆస్పత్రిలో ఉంటే పసివాణ్ణి ఎవరు చూసుకోవాలనే సమస్య వచ్చింది. షీనా బంధువులు కాని ముసలి తల్లిదండ్రులు కాని సాయం చేసే స్థితిలో లేరు. ఆ సమయంలో మేరీ అనిత ముందుకు వచ్చింది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త అడ్వకేట్‌గా పని చేస్తున్నాడు. వారిని సలహా అడిగితే వారంతా మనస్ఫూర్తిగా పసివాడికి సాయం చేయమన్నారు. పిల్లవాడికి ఏ క్షణమైనా కోవిడ్ వచ్చే అవకాశం ఉండటంతో మేరి అనిత వాణ్ణి తీసుకొని పక్కనే ఉన్న ఒక ఖాళీ ఫ్లాట్‌లోకి మారి క్వారంటైన్లోకి వెళ్లింది. నెల రోజులుగా బాబుకు అమ్మలా మారి బాగోగులు చూసుకుంది. నెల రోజుల తల్లి ఉన్నికుట్టన్‌కు అమ్మపాలు అలవాటు. కాని మేరి అనిత మెల్లగా పోతపాలలోకి మార్చగలిగింది. మెల్లమెల్లగా పసివాడు మేరిలోనే తల్లిని చూసుకోసాగాడు. ఈ నెలరోజులు వారి మధ్యగట్టి బంధం ఏర్పడిపోయింది. తండ్రి హర్యానా నుంచి తిరిగి రాగా, తల్లి కోవిడ్ నుంచి బయట పడగా రెండు రోజుల క్రితం మేరి ఆ పసివాణ్ణి సొంత తల్లిదండ్రులకు అధికారుల సమక్షంలో అప్పజెప్పింది. ఉన్నికుట్టన్ తల్లిని గుర్తుపట్టి మెల్లగా నవ్వాడు. కాని పసివాణ్ణి తిరిగి ఇస్తూ మేరి కంట నీరు పెట్టుకుంది. ‘ఆమె దేవతలా నా బిడ్డను కాపాడింది’ అని షీనా అంది. మేరి ఉండే అపార్ట్మెంట్లోని వారంతా వచ్చి ఉన్నికుట్టన్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. అయితే తన ఇల్లు చేరుకున్నాక ఉన్ని కుట్టన్ మేరి కోసం ఏడుపు మొదలు పెట్టాడు. అది గమనించిన తల్లి షీనా వెంటనే మేరికి కాల్ చేసింది. ‘ఒకసారి వీడియోకాల్ చేస్తాను. మాట్లాడండి’ అని ప్రాధేయపడింది. మేరి అనిత ఆ విన్నపాన్ని మన్నించలేదు. ‘వద్దు. మీ ప్రేమతో వాణ్ణి నన్ను మరిపించండి’ అని మెల్లగా ఫోన్ పెట్టేసింది. పాశం పెంచుకునే సందర్భాలు ఎంత సంతోషాన్ని ఇస్తాయో తుంచుకునే క్షణాలు అంత బాధను మిగులుస్తాయి. కరోనా నమోదు చేసిన లీలల్లో ఇది ఒకటి. -
ఈ చిన్నారి ఫొటో.. వ్యవస్థను మార్చేస్తుందా?!
లక్నో : తల్లిగా మారిన తర్వాత కొత్త బంధాలతో పాటు బాధ్యతలు కూడా పెరగడం సహజం. ముఖ్యంగా ఉద్యోగినులకు వృత్తిగత బాధ్యతలతో పాటు పిల్లల ఆలనాపాలనా చూసుకోవడం కాస్త సవాలుతో కూడుకున్న విషయమే. అయితే ఈ రెండింటినీ సమంగా నిర్వర్తిస్తున్నారు ఝాన్సీకి చెందిన పోలీసు కానిస్టేబుల్ అర్చనా జయంత్. ఉద్యోగ కారణాల దృష్ట్యా కుటుంబానికి దూరంగా ఉన్నందు వల్ల.. తన ఆరునెలల పాపాయిని ఆఫీసుకు తీసుకొచ్చారు. తన క్యాబిన్‌లోనే చిన్నారికి పాలుపట్టి నిద్రపుచ్చారు. ఆనక ఉద్యోగ బాధ్యతల్లో మునిగిపోయారు. అర్చన క్యాబిన్లో టేబుల్‌పై నిద్రపోతున్న చిన్నారి ఫొటోను యూపీ పోలీసు అధికారి రాహుల్ శ్రీవాస్తవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ఝన్సీలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ‘మదర్కాప్’ అర్చనను కలవండి. మాతృత్వాన్ని చాటుకుంటూనే ఉద్యోగ బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తున్న అర్చనకు సెల్యూట్ చేయాల్సిందే’ కదా అంటూ క్యాప్షన్ జత చేశారు. కొన్ని గంటల్లోనే ఈ ఫొటో వైరల్‌గా మారడంతో నెటిజన్లు.. అర్చనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ పోస్టుకు స్పందించిన యూపీ డీజీపీ ఓం ప్రకాశ్ సింగ్.. ‘అర్చనతో మాట్లాడాం. వాళ్ల సొంతూరుకు దగ్గరగా ఉండే ఆగ్రాకు ట్రాన్స్ఫర్ చేయాలని నిర్ణయించాం. పోలీసు వ్యవస్థలో చేపట్టాల్సిన సంస్కరణల గురించి ఈ చిన్నారి ఫొటో మరోసారి గుర్తు చేసింది. పని ప్రదేశాల్లో తల్లులకు వీలుగా ఉండేందుకు శిశుసంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను తెలియజేసింది. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెడుతాం’ అని పేర్కొన్నారు. కాగా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన అనంతరం 2016లో అర్చన పోలీసు కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. ఆమె భర్త హర్యానాలోని గురుగ్రాంలో గల ఓ కార్ల తయారీ కంపెనీలో పనిచేస్తున్నారు. వీరికి కనక్(10), ఆనీక(6 నెలలు) సంతానం. -
స్కోచ్ అవార్డుకు కేసీఆర్ కిట్
2017కు నామినేట్ అయిన పథకం సాక్షి, హైదరాబాద్: సర్కారీ దవాఖానాల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్ర భుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం తాజాగా స్కోచ్ అవార్డు–2017కు నామినేట్ అయ్యింది. పేదల కోసం ప్రభుత్వం చొరవ తీసుకుని అమలు చేసే కార్యక్రమాల విభాగంలో ఈ పథకం నామినేట్ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2న ఈ పథకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవించిన వారికి రూ.12 వేలు.. ఆడపిల్ల పుడితే అదనంగా మరో వెయ్యి(రూ.13 వేలు) అందిస్తోంది. 4 దశలుగా ఈ సొమ్మును లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. కాన్పు జరిగిన వెంటనే శిశువు సంరక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన కిట్‌ను అందిస్తున్నారు. వైద్య శాఖ ఆగస్టు 21 వరకు 57,627 కిట్లను పంపిణీ చేసింది. జూన్‌లో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులలో 15,839 మందికి కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. జూలైలో ఈ సంఖ్య 34,963కు పెరిగింది. 1997 నుంచి గుర్గావ్ కేంద్రంగా స్కోచ్ పనిచేస్తోంది. సామాజిక, ఆర్థిక అంశాలు, సమ్మిళిత వృద్ధి తదితర అంశాలపై ఈ సంస్థ అధ్యయనం చేస్తుంది.