తన చిన్నారితో కానిస్టేబుల్ అర్చనా జయంత్
లక్నో : తల్లిగా మారిన తర్వాత కొత్త బంధాలతో పాటు బాధ్యతలు కూడా పెరగడం సహజం. ముఖ్యంగా ఉద్యోగినులకు వృత్తిగత బాధ్యతలతో పాటు పిల్లల ఆలనాపాలనా చూసుకోవడం కాస్త సవాలుతో కూడుకున్న విషయమే. అయితే ఈ రెండింటినీ సమంగా నిర్వర్తిస్తున్నారు ఝాన్సీకి చెందిన పోలీసు కానిస్టేబుల్ అర్చనా జయంత్. ఉద్యోగ కారణాల దృష్ట్యా కుటుంబానికి దూరంగా ఉన్నందు వల్ల.. తన ఆరునెలల పాపాయిని ఆఫీసుకు తీసుకొచ్చారు. తన క్యాబిన్‌లోనే చిన్నారికి పాలుపట్టి నిద్రపుచ్చారు. ఆనక ఉద్యోగ బాధ్యతల్లో మునిగిపోయారు.
అర్చన క్యాబిన్‌లో టేబుల్‌పై నిద్రపోతున్న చిన్నారి ఫొటోను యూపీ పోలీసు అధికారి రాహుల్ శ్రీవాస్తవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ఝన్సీలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ‘మదర్‌కాప్’ అర్చనను కలవండి. మాతృత్వాన్ని చాటుకుంటూనే ఉద్యోగ బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తున్న అర్చనకు సెల్యూట్ చేయాల్సిందే’ కదా అంటూ క్యాప్షన్ జత చేశారు. కొన్ని గంటల్లోనే ఈ ఫొటో వైరల్‌గా మారడంతో నెటిజన్లు.. అర్చనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ పోస్టుకు స్పందించిన యూపీ డీజీపీ ఓం ప్రకాశ్ సింగ్.. ‘అర్చనతో మాట్లాడాం. వాళ్ల సొంతూరుకు దగ్గరగా ఉండే ఆగ్రాకు ట్రాన్స్‌ఫర్ చేయాలని నిర్ణయించాం. పోలీసు వ్యవస్థలో చేపట్టాల్సిన సంస్కరణల గురించి ఈ చిన్నారి ఫొటో మరోసారి గుర్తు చేసింది. పని ప్రదేశాల్లో తల్లులకు వీలుగా ఉండేందుకు శిశుసంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను తెలియజేసింది. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెడుతాం’ అని పేర్కొన్నారు. కాగా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన అనంతరం 2016లో అర్చన పోలీసు కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. ఆమె భర్త హర్యానాలోని గురుగ్రాంలో గల ఓ కార్ల తయారీ కంపెనీలో పనిచేస్తున్నారు. వీరికి కనక్(10), ఆనీక(6 నెలలు) సంతానం.
Comments
Please login to add a commentAdd a comment