‘తల్లి’ మరణంపై కూతురు బొమ్మ.. కేసులో బిగ్‌ ట్విస్ట్‌ | Daughter Drawing Raises Doubts In UP Jhansi Sonali Budholia Case, Check Shocking Facts Inside | Sakshi
Sakshi News home page

‘తల్లి’ మరణంపై కూతురు బొమ్మ.. కేసులో బిగ్‌ ట్విస్ట్‌

Published Wed, Feb 19 2025 7:35 AM | Last Updated on Wed, Feb 19 2025 12:12 PM

Daughter Drawing Raises Doubt Over Sonali Budholia Case

ఝాన్సీ: ‘పాపా కిల్డ్‌ మమ్మీ, హ్యాంగ్‌డ్‌ బాడీ’ అంటూ నాలుగేళ్ల బాలిక వేసిన బొమ్మతో ఆమె తల్లి మరణోదంతం కొత్త మలుపు తిరిగింది. తల్లిని చంపేస్తానని తండ్రి గతంలోనూ బెదిరించాడని బాలిక చెప్పింది. అంతేగాక తననూ చంపేస్తానన్నాడని చెప్పుకొచ్చింది. దాంతో అత్తింటివారి ‘ఆత్మహత్య’ కథనాన్ని పోలీసులు అనుమానించారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని తికంగఢ్‌ జిల్లాకు చెందిన సోనాలికి ఝాన్సీలోని కొత్వాలీకి చెందిన సందీప్‌ బుధోలియాతో 2019లో వివాహమైంది. రూ.20 లక్షల కట్నమిచ్చారు. కారు అడగ్గా తమ శక్తికి మించినదని తల్లిదండ్రులు చెప్పారు. అప్పట్నుంచీ సోనాలిపై వేధింపులు మొదలయ్యాయి.

నాలుగేళ్లకు పాప పుట్టడంతో.. భర్త, అత్తామామలు సోనాలిని ఆసుపత్రిలో ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారు. సోనాలి తండ్రే ఆస్పత్రి బిల్లు చెల్లించి కూతురిని ఇంటికి తీసుకొచ్చాడు. కొంతకాలానికి అత్తింటివారు వచ్చి తల్లీకూతుళ్లను ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం, సోనాలి ఆరోగ్యం బాగాలేదంటూ భర్త ఇటీవల ఆమె తల్లిదండ్రలకు ఫోన్‌ చేశాడు. కాదు, ఉరేసుకుందంటూ ఆ వెంటనే సమాచారమిచ్చాడు. వెళ్లి చూసేసరికి సోనాలి చనిపోయి ఉంది. దాంతో కూతురిని అత్తింటివారే హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు.

అయితే తండ్రే తన తల్లిని చంపాడని వారి నాలుగేళ్ల దర్శిత చెప్పింది. ‘మమ్మీపై డాడీ దాడి చేసి చంపేశాడు. తర్వాత ‘కావాలంటే నువ్వు చచ్చిపో అని నన్ను అన్నాడు. అమ్మకు ఉరేసి రాయితో తలపై కొట్టాడు. తర్వాత కిందకు దించి సంచిలో పడేశాడు’ అంటూ బొమ్మగీసి మరి చూపించింది. ‘నువ్వు మా అమ్మను తాకితే నీ చెయ్యి విరగ్గొడతానని గతంలో నాన్నను తిట్టా. దాంతో ‘మీ అమ్మను చంపేస్తా, నిన్నూ చంపేస్తా’ అని అన్నాడు’ అని కన్నీరు పెట్టుకుంది. కూతురి వాంగ్మూలం, మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణల నేపథ్యంలో హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement