ఆస్పత్రి వెనుకవైపు నుంచి శిశువులను తీసుకొస్తున్న స్థానికులు, ఫైర్ సిబ్బంది
ఏడుగురు నవజాత శిశువులు మృతి
మరో ఐదుగురిని కాపాడిన స్థానికులు
శనివారం అర్ధరాత్రి జరిగిన ఘటన
ఆస్పత్రి యజమాని అరెస్ట్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని వివేక్ విహార్‌లో శనివారం అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బేబీ కేర్ న్యూ బోర్న్ హాస్పిటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు పసికందులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో మొదలైన మంటలు చుట్టుపక్కలున్న మరో రెండు భవనాలకు సైతం వ్యాపించినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు.
మొత్తం 16 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చామన్నారు. ఆస్పత్రి రెండో అంతస్తులో నిల్వ ఉంచిన ఆక్సిజన్ సిలిండర్లు పేలడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పారు. మంటలు వ్యాపించిన ఆస్పత్రి భవనం నుంచి మొత్తం 12 మంది శిశువులను బయటకు తీసుకురాగా వారిలో ఏడుగురు చనిపోయారని ఫైర్ చీఫ్ అతుల్ గర్గ్ చెప్పారు. మిగతా ఐదుగురిలో కొందరు స్వల్పంగా గాయపడ్డారన్నారు.
మంటలను గమనించిన స్థానికులు, షహీద్ సేవా దళ్ కార్యకర్తలు కలిసి భవనం వెనుక వైపు నుంచి నిచ్చెనల ద్వారా పైకెక్కి చిన్నారులను కిందికి తీసుకువచ్చారని ప్రత్యక్ష సాకు‡్ష్యలు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రి సిబ్బంది పరారైనట్లు చెబుతున్నారు. ఆస్పత్రి యజమాని నవీన్ కిచిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నామని షాదారా డీసీపీ సురేంద్ర చౌదరి చెప్పారు. ఈ దారుణంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర విచారం వెలిబుచ్చారు. ధైర్యంగా ఉండాలని బాధిత కుటుంబాలను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment