గాంగ్‌టాక్: సిక్కిం రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సీఎం ప్రేమ్ సింగ్ తమంగ్ పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు. వారి చిన్నారులకు ఇంటి వద్దే సహాయకులను ఉచితంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. చిన్నారుల బాధ్యత తీసుకునే ఆయాలకు నెలకు రూ.10 వేలను ప్రభుత్వమే ఇస్తుందన్నారు. 40 ఏళ్లు, ఆపైన వయస్సుండే మహిళలకు చిన్నారులను ఏడాది వరకు చూసుకునే బాధ్యతలను అప్పగిస్తామన్నారు.
మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవులను 365 రోజులకు, తండ్రులకైతే నెల రోజులు సెలవులు ఇస్తామని చెప్పారు. రెండో బిడ్డను పోషించేందుకు ఒక ఇంక్రిమెంట్, మూడో బిడ్డకైతే రెండు ఇంక్రిమెంట్లు ఇస్తామన్నారు. తరిగిపోతున్న జననాల రేటు చాలా ఆందోళన కలిగించే అంశమన్నారు. క్షీణిస్తున్న స్థానిక జాతుల జనాభాను పెంచేందుకు ప్రభుత్వం సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.
తల్లులవ్వాలనుకునే ఉద్యోగినులు పుట్టబోయే తమ సంతానం బాగోగుల గురించి ఆందోళన చెందరాదనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. జననాల రేటు పెంచేందుకు సాధారణ ప్రజానీకానికి కూడా ప్రోత్సహకాలు ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు. సంతానం కలగడంలో ఇబ్బందులు ఎదురయ్యే వారి కోసం ఐవీఎఫ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాల్లో చికిత్స తీసుకునే వారికి రూ. 3 లక్షలు గ్రాంటుగా అందజేస్తామన్నారు. సిక్కింలోని 7 లక్షల లోపు జనాభాలో 80 శాతం మంది స్థానిక తెగల ప్రజలే. సంతానోత్పత్తి రేటు 1.1%గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment