Sikkim Chief Minister
-
రెండు స్థానాల్లో పోటీ చేయనున్న సిక్కిం సీఎం
సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM) పార్టీ.. రాష్ట్రంలో వున్న మొత్తం 32 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానానికి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. లోక్‌సభ స్థానానికి ప్రస్తుత ఎంపీ 'ఇంద్ర హంగ్ సుబ్బా' పేరును ప్రకటించింది. అయితే సిక్కిం ముఖ్యమంత్రి 'ప్రేమ్ సింగ్ తమాంగ్' (Prem Singh Tamang) రాబోయే ఎన్నికలలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు. ప్రేమ్ సింగ్ తమాంగ్ భార్య 'కృష్ణ కుమారి రాయ్' నామ్చి-సింఘితాంగ్ స్థానంలో ప్రతిపక్ష SDF అధ్యక్షుడు పవన్ కుమార్ చామ్లింగ్‌తో పోటీపడనుంది. సోరెంగ్-చకుంగ్, రెనోక్ నియోజకవర్గాల నుంచి ప్రేమ్ సింగ్ తమంగ్ పోటీ చేయనున్నారు. దీనిపైన SKM పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుందని అసెంబ్లీ స్పీకర్ అరుణ్ కుమార్ ఉప్రేటి (Arun Upreti) గ్యాంగ్‌టక్‌లో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. -
జనాభాను పెంచేందుకు సిక్కింలో ప్రభుత్వోద్యోగినులకు వరాలు
గాంగ్టాక్: సిక్కిం రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సీఎం ప్రేమ్ సింగ్ తమంగ్ పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు. వారి చిన్నారులకు ఇంటి వద్దే సహాయకులను ఉచితంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. చిన్నారుల బాధ్యత తీసుకునే ఆయాలకు నెలకు రూ.10 వేలను ప్రభుత్వమే ఇస్తుందన్నారు. 40 ఏళ్లు, ఆపైన వయస్సుండే మహిళలకు చిన్నారులను ఏడాది వరకు చూసుకునే బాధ్యతలను అప్పగిస్తామన్నారు. మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవులను 365 రోజులకు, తండ్రులకైతే నెల రోజులు సెలవులు ఇస్తామని చెప్పారు. రెండో బిడ్డను పోషించేందుకు ఒక ఇంక్రిమెంట్, మూడో బిడ్డకైతే రెండు ఇంక్రిమెంట్లు ఇస్తామన్నారు. తరిగిపోతున్న జననాల రేటు చాలా ఆందోళన కలిగించే అంశమన్నారు. క్షీణిస్తున్న స్థానిక జాతుల జనాభాను పెంచేందుకు ప్రభుత్వం సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. తల్లులవ్వాలనుకునే ఉద్యోగినులు పుట్టబోయే తమ సంతానం బాగోగుల గురించి ఆందోళన చెందరాదనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. జననాల రేటు పెంచేందుకు సాధారణ ప్రజానీకానికి కూడా ప్రోత్సహకాలు ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు. సంతానం కలగడంలో ఇబ్బందులు ఎదురయ్యే వారి కోసం ఐవీఎఫ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాల్లో చికిత్స తీసుకునే వారికి రూ. 3 లక్షలు గ్రాంటుగా అందజేస్తామన్నారు. సిక్కింలోని 7 లక్షల లోపు జనాభాలో 80 శాతం మంది స్థానిక తెగల ప్రజలే. సంతానోత్పత్తి రేటు 1.1%గా ఉంది. -
24ఏళ్ల తరువాత మారిన సీఎం
గాంగ్టక్: సిక్కింలో 24 సంవత్సరాల తరువాత కొత్త ముఖ్యమంత్రి వచ్చారు. సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్కేఎం) అధ్యక్షుడు, పీఎస్ గోలె పేరుతో ప్రజలకు చిరపరిచితులైన ప్రేమ్‌సింగ్ తమాంగ్(51) సోమవారం సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పల్జోర్ మైదానంలో గోలెతో పాటు మరో 11 మంది శాసనసభ్యులచేత కూడా గవర్నర్ గంగా ప్రసాద్ ప్రమాణం చేయించారు. గోలె ప్రస్తుత శాసనసభలో సభ్యుడు కారు.. ఈ ఎన్నికల్లో కనీసం పోటీ చేయలేదు. అయినప్పటికీ శనివారం శాసనసభా నేతగా ఎన్నికయ్యారు. 2013లో ఎస్కేఎం పార్టీని స్థాపించారు. 32 స్థానాలున్న సిక్కిం అసెంబ్లీలో 17 స్థానాలు గెలవడం ద్వారా 24 ఏళ్ల తరువాత చామ్లింగ్ ప్రభుత్వాన్ని మార్చగలిగింది. ఎస్డీఎఫ్ 15 సీట్లు సాధించింది. -
సుదీర్ఘ సీఎం.. చామ్లింగ్
గ్యాంగ్‌టక్: సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్(67) భారత దేశ రాజకీయాల్లో కొత్త శకానికి తెరతీశారు. అత్యంత సుదీర్ఘ కాలం సీఎంగా కొనసాగిన నాయకుడిగా శనివారం రికార్డు సృష్టించారు. ఇంతకు ముందు ఈ అరుదైన ఘనత పశ్చిమ బెంగాల్ దివంగత ముఖ్యమంత్రి జ్యోతిబసు పేరిట ఉంది. నిర్విరామంగా ఐదోసారి సీఎంగా సేవలందిస్తున్న చామ్లింగ్ పదవీకాలం వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికల వరకు ఉంది. 1994 డిసెంబర్ 12న చామ్లింగ్ తొలిసారి సిక్కిం ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్(ఎస్డీఎఫ్)ని వరుసగా ఐదుస్లారు(1994, 99, 2004, 09, 14) అధికారంలోకి తీసుకొచ్చారు. జ్యోతిబసు 1977 జూన్ 21 నుంచి 2000 నవంబర్ 6 వరకు( 23 ఏళ్లకు పైనే– 8,540 రోజులు) ఐదుసార్లు పశ్చిమబెంగాల్ సీఎంగా పనిచేశారు. ఈ రికార్డును చామ్లింగ్ తాజాగా తిరగరాశారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకం వల్లే ఈ ఘనత సాధించినట్లు చామ్లింగ్ చెప్పారు. ‘ సిక్కిం ప్రజలందరికీ ఎంతో రుణపడి ఉంటా. నాపై వారికి నమ్మకం లేకుంటే నేనీ స్థానంలో ఉండే వాడిని కాదు. ఈ క్రెడిట్ అంతా సిక్కిం ప్రజలదే’ అని తెలిపారు. ఈ సందర్భంగా హడావుడి, ఆర్భాటాలతో వేడుకలు నిర్వహించబోమని వెల్లడించారు. -
మాకు పీస్ బోనస్ ఇవ్వండి..!
న్యూఢిల్లీః తమకు పీస్ బోనస్ కావాలంటూ సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు, రాష్ట్రంలోని ఈశాన్య ప్రాంతంలో రైలు, వాయు మార్గాలను అనుసంధానం చేయడంతోపాటు, అధ్వాన్నంగా ఉన్న రహదారుల పరిస్థితి మెరుగు పరిచేందుకు పీస్ బోనస్ ను అందించాలని విన్నవించారు. అంతేకాక దేశంలోనే అత్యంత శాంతియుత రాష్ట్రంగా సిక్కిం గుర్తింపు పొందిందని గుర్తు చేస్తూ కేంద్ర ప్రభుత్వంనుంచీ పీస్ బోనస్ ను కోరారు. దేశంలోనే తమ రాష్ట్రం అత్యంత శాంతియుత రాష్ట్రం అని సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ అన్నారు. సిక్కింలో ఎటువంటి తీవ్రవాదం, హింస, విప్లవ ధోరణి లేదని, అందుకే తమకు ప్రత్యేకంగా శాంతి బోనస్ ఇవ్వాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. దశాబ్దాల తిరుగుబాటు తర్వాత 2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మిజోరాం కు పీస్ బోనస్ గా 182.45 కోట్ల రూపాయలను అందించినట్లు ఆయన గుర్తు చేశారు. సిక్కింలో ఎయిర్ పోర్ట్ నిర్మాణం జరగాలన్న ఆలోచన దశాబ్దాలుగా కొనసాగుతున్నా అమలుకు నోచుకోవడం లేదని, అలాగే రైళ్ళ అనుసంధానం విషయంలోనూ ఎటువంటి పురోగతి కనిపించడం లేదని తెలిపారు. తమకు లైఫ్ లైన్ గా అందుబాటులో ఉన్నది ఒక్క రహదారులేనన్న సీఎం.. వాటి పరిస్థితీ దీనావస్థలో ఉన్నట్లు వివరించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సిక్కింతోపాటు ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి చర్యలు చేపట్టాలని సీఎం పవన్ కుమార్ కోరారు. సిక్కిం.. భారత దేశంలో స్విట్జర్ ల్యాండ్ వంటిదని, సహజ వనరులతో పాటు బ్రహ్మాండమైన శక్తి కలిగిన తమ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వంనుంచి సహాయం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన విజ్ఞప్తి చేశారు.