
గ్యాంగ్‌టక్: సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్(67) భారత దేశ రాజకీయాల్లో కొత్త శకానికి తెరతీశారు. అత్యంత సుదీర్ఘ కాలం సీఎంగా కొనసాగిన నాయకుడిగా శనివారం రికార్డు సృష్టించారు. ఇంతకు ముందు ఈ అరుదైన ఘనత పశ్చిమ బెంగాల్ దివంగత ముఖ్యమంత్రి జ్యోతిబసు పేరిట ఉంది. నిర్విరామంగా ఐదోసారి సీఎంగా సేవలందిస్తున్న చామ్లింగ్ పదవీకాలం వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికల వరకు ఉంది. 1994 డిసెంబర్ 12న చామ్లింగ్ తొలిసారి సిక్కిం ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.
సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్(ఎస్‌డీఎఫ్)ని వరుసగా ఐదుస్లారు(1994, 99, 2004, 09, 14) అధికారంలోకి తీసుకొచ్చారు. జ్యోతిబసు 1977 జూన్ 21 నుంచి 2000 నవంబర్ 6 వరకు( 23 ఏళ్లకు పైనే– 8,540 రోజులు) ఐదుసార్లు పశ్చిమబెంగాల్ సీఎంగా పనిచేశారు. ఈ రికార్డును చామ్లింగ్ తాజాగా తిరగరాశారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకం వల్లే ఈ ఘనత సాధించినట్లు చామ్లింగ్ చెప్పారు. ‘ సిక్కిం ప్రజలందరికీ ఎంతో రుణపడి ఉంటా. నాపై వారికి నమ్మకం లేకుంటే నేనీ స్థానంలో ఉండే వాడిని కాదు. ఈ క్రెడిట్ అంతా సిక్కిం ప్రజలదే’ అని తెలిపారు. ఈ సందర్భంగా హడావుడి, ఆర్భాటాలతో వేడుకలు నిర్వహించబోమని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment