మోడీ కంటే మంచి సీఎం, గుజరాత్ కన్నా మంచి రాష్ట్రం!
నరేంద్ర మోడీని భుజం మీద మోసుకుంటే తిరిగే నమో అభిమానులారా మీకు నమో నమ! మీ మోడీ గారికి కూడా అసూయ కలిగించేంత గొప్ప రికార్డున్న మరో సీఎం ఉన్నాడు. ఆయనకి 1994 నుంచి ఓటమి తెలియదు. గత అయిదేళ్లుగా ఆయన శాసన సభలో ఉన్న అన్ని సీట్లూ ఆయన పార్టీవే.
అంతే కాదు. దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న జనాభా అత్యంత తక్కువగా ఉన్న రాష్ట్రం ఆయనదే. ప్రతి మారుమూల గ్రామంనుంచి రాజధానికి మోటర్లో వెళ్లే రోడ్లున్న రాష్ట్రం ఆయనదే. గొడవలు, కొట్లాటలు లేని రాష్ట్రం ఆయనదే. మరో రెండేళ్లాగితే పూర్తి స్థాయి రుణముక్త రాష్ట్రం ఆయనదే అవుతుంది. అసలాయనకు ప్రతిపక్షమే లేదు. దేశం లో ప్లాస్టిక్ వాడకం అసలే లేని రాష్ట్రం ఆయనదే.
ఆయనెవరా అని అనుకుంటున్నారా? ఆయన పేరు పవన్ కుమార్ చామ్లింగ్. ఆ రాష్ట్రం పేరు సిక్కిం. సిక్కిం లోకసభకి పంపేది ఒకే ఒక ఎంపీని. అందుకే అక్కడ ఎంపీ ఎన్నికలపై ఎవరికీ ఆసక్తి లేదు. ఎంపీ ఎన్నికలతో పాటు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపైనే అందరి ఆసక్తి. 32 మంది ఎంఎల్ ఏల కోసమే ఇప్పుడు అసలు పోటీ.
ఆయన గ్రామపంచాయత్ అధ్యక్ష పదవి నుంచి పైకెదిగారు. మొదట్లో సిక్కిమ్ సంగ్రామ పరిషద్ లో ఎమ్మెల్యే అయ్యారు. తరువాత అప్పటి ముఖ్యమంత్రి నర బహదూర్ భండారీ నియంతృత్వ పోకడలని నిరసించి సిక్కిం డెమాక్రటిక్ ఫ్రంట్ ను స్థాపించారు. ఆయన భండారీకి వ్యతిరేకంగా గట్టిపోరే చేశారు. ఒక సందర్భంలో ఆయన అసెంబ్లీలోకి ఒక కొవ్వొత్తిని వెలిగించి మరీ తీసుకొచ్చారు. ఏమిటి సంగతి అని అందరూ అడిగితే 'నేను అసెంబ్లీలో ప్రజాస్వామ్యం ఎక్కడనా కనిపిస్తుందేమో అని వెతుకుతున్నాను' అని జవాబిచ్చారట.
పవన్ చామ్లింగ్.
ఆయన పార్టీ ఈ సారి కూడా క్లీన్ స్వీప్ చేస్తారా? లేక కొత్త రాజకీయ శకం మొదలవుతుందా అన్నది ఇప్పుడు సిక్కింలో అసలు ప్రశ్న. అక్కడ రాహుల్ వర్సెస్ మోడీ పోటీ లేదు. అసలు వారిద్దరి గురించి ఎవరికీ పెద్దగా పట్టింపు లేదు. ఒక్క ఊరు తన మనసు మార్చుకున్నా అక్కడ ఎన్నికల ఫలితం తారుమారైపోతుంది. అందుకే అందరికీ సిక్కిం ఎన్నికలంటే అంత ఆసక్తి.