జడ్జి పేరు ప్రకటనపై మిత్రపక్షాల అభ్యంతరం
కొత్త ప్రభుత్వానిదే తుది నిర్ణయం
న్యూఢిల్లీ: మహిళపై గుజరాత్ పోలీసుల అక్రమ నిఘా వ్యవహారం (స్నూప్‌గేట్)పై విచారణకు జడ్జిని ప్రకటించే విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. మిత్రపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ చర్యను విరమించుకుంది. దీనిపై నిర్ణయాన్ని తర్వాతి ప్రభుత్వానికే వదిలేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. యూపీఏ-2 పాలన చివరి దశలో ఇలాంటి నిర్ణయాలు వద్దంటూ కాంగ్రెస్ మిత్రపక్షాలైన ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్‌లు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీ(మే 16)కన్నా ముందే స్నూప్‌గేట్‌పై విచారణ కమిటీకి నేతృత్వం వహించే జడ్జిని ప్రకటిస్తామని కేంద్ర మంత్రులు కపిల్ సిబల్, సుశీల్‌కుమార్ షిండే గత వారం వెల్లడించారు.
దీనిపై బీజేపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఎన్నికల్లో ఓడిపోతామన్న నిర్వేదంతోనే యూపీఏ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించింది. విచారణ కమిటీని నియమించాలని గత డిసెంబర్‌లోనే కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ఇంతకాలం మిన్నకుండి ఇప్పుడు చర్యలు చేపట్టడంలోని ఆంతర్యాన్ని ఆ పార్టీ ప్రశ్నించింది. ఆ వ్యవహారంపై రాష్ర్ట ప్రభుత్వమే విచారణకు ఆదేశించినప్పటికీ.. కేంద్రం మరో కమిటీని వేయాల్సిన అవసరమేంటని మండిపడింది. దీనిపై తాజాగా యూపీఏ మిత్రపక్షాలు కూడా అభ్యంతరం చెప్పడంతో కేంద్రం వెనక్కి తగ్గింది.
‘మోడీ నిఘా’పై కేంద్రం వెనక్కి
Published Tue, May 6 2014 1:32 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM
Advertisement