ఏపీ వర్సెస్ గుజరాత్.. పల్లె చల్లగా | Andhra Pradesh vs Gujarat: YSR developed better than Narendra modi | Sakshi
Sakshi News home page

ఏపీ వర్సెస్ గుజరాత్.. పల్లె చల్లగా

Published Sat, Apr 19 2014 1:28 AM | Last Updated on Sat, Aug 18 2018 4:18 PM

Andhra Pradesh vs Gujarat: YSR developed better than Narendra modi

* వైఎస్ బాటే భేష్.. గుజరాత్‌ను మించి జోష్
* మోడీ కంటే మిన్నగా సాగిన వైఎస్ పాలన
* అన్ని రంగాల్లోనూ గుజరాత్‌ను మించిన వృద్ధి
* పేదరికం తగ్గుదల, కొనుగోలు శక్తి పెరుగుదల
* వైఎస్ సంక్షేమ పథకాలు, వ్యవసాయ వృద్ధే కారణం
* అభివృద్ధికి మానవీయ కోణం జోడించి పాలన

 
ప్రొఫెసర్ కె.వి.రమణారెడ్డి: అభివృద్ధికి ఆదర్శ నమూనా అనగానే అందరి చూపుడు వేళ్లూ తిరిగేది గుజరాత్ వైపే. ప్రగతికి ప్రతిరూపంగా కొన్నేళ్లుగా వార్తల్లో నానుతున్న రాష్ట్రమది. నరేంద్ర మోడీ ఏలుబడిలో అన్ని రంగాల్లోనూ గుజరాత్ దూసుకుపోతోందంటూ మీడియాలోనూ ఒక వర్గం కోడై కూస్తోంది. కానీ వాస్తవానికి... దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సర్వతోముఖాభివృద్ధి ముందు గుజరాత్ ప్రగతి పూర్తిగా దిగదుడుపే. మోడీ, వైఎస్ పాలనను అధికారిక గణాంకాల సాయంతో రంగాలవారీగా తులనాత్మకంగా విశ్లేషించగా నిగ్గుదేలిన నిజమిది. 2004-2009ని అధ్యయన కాలంగా తీసుకుని వారిద్దరి పాలన తీరుతెన్నులను బేరీజు వేస్తూ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం కామర్స్ ప్రొఫెసర్ కేవీ రమణారెడ్డి... సెస్ (ఆర్థిక, సామాజిక అధ్యయన కేంద్రం)కు వర్కింగ్ పేపర్ సమర్పించడం కోసం ఒక అధ్యయనం చేశారు.
 
1995-2004 మధ్య బాబు పాలనను కూడా వాటితో పాటుగా పరిశీలించి సమగ్ర నివేదిక రూపొందించారు. ముగ్గురి అభివృద్ధి నమూనాల్లోనూ వైఎస్ అనుసరించిన మార్గంలోనే సమ్మిళిత వృద్ధి సాధ్యపడిందని అధ్యయనం తేల్చింది. వైఎస్ హయాంలో సామాజిక రంగాల అభివృద్ధిలో రాష్ట్రం గుజరాత్‌ను తలదన్ని దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని గణాంకయుక్తంగా పేర్కొంది. ‘‘చాలా అభివృద్ధి సూచీల్లో మోడీ కంటే వైఎస్ హయామే ఎంతో మెరుగు. వ్యవసాయానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యం, సంక్షేమ పథకాలే ఇందుకు కారణం’’ అని వివరించింది. సమ్మిళిత వృద్ధికి సూచికలైన పేదరిక నిర్మూలన, ఉపాధి, సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల వేతనాలు, వైద్యం, విద్యతో పాటు సామాజిక రంగంలో వ్యయం తదితర అంశాలను పరిశీలించి ఆ అధ్యయనం నిగ్గుదేల్చిన పలు విశేషాలు...

 ఐదేళ్లలోపు శిశు మరణాల రేటు (2006-10 మధ్య)
 ఆంధ్రప్రదేశ్ - 52 ((ప్రతి 1,000 మందికి)
 గుజరాత్ - 61

 
సగానికి తగ్గిన పేదరికం
 12వ పంచవర్ష ప్రణాళిక అప్రోచ్ పేపర్ ప్రకారం వైఎస్ హయాంలో రాష్ట్రంలో పేదరికం సగానికి సగం తగ్గిపోయింది. 1993లో 3.1 కోట్లున్న పేదల సంఖ్య 2009-10 నాటికి 1.6 కోట్లకు పరిమితమైంది. 1995-2004 (బాబు హయాం) కంటే 2004-09 మధ్య కాలం (వైఎస్ హయాం) లోనే రాష్ట్రంలో పేదరికం తగ్గుదల ఎక్కువగా నమోదైంది. 1995-2004 మధ్య 1.34 శాతమే కాగా 2004-2009 మధ్య 2.12 శాతం నమోదైంది. ఇదే కాలంలో గుజరాత్‌లో పేదరికం తగ్గుదల శాతం 1.86 శాతం మాత్రమే. ఇక జాతీయ సగటైతే కేవలం ఒక్క శాతమే! పేదరికం తగ్గుదలను గ్రామీణ, పట్టణ ప్రాంతాలల్లో విడివిడిగా గమనించినా వైఎస్ హయాంలోనే అధికంగా ఉంది. 1995-2004 మధ్య గ్రామీణ ప్రాంతాల్లో 1.7 శాతం కాగా, పట్టణ ప్రాంతాల్లో 1.07 శాతం. 2004-09 మధ్య కాలంలోనేమో పేదరికం తగ్గుదల గ్రామాల్లో 2.33 శాతం, పట్టణ ప్రాంతాల్లో 1.44 శాతం నమోదైంది.
 
 ఇదే కాలంలో గుజరాత్‌లో పట్టణ ప్రాంతాల్లో పేదరికం తగ్గుదల శాతం కేవలం 0.48 శాతమే! రాష్ట్రంలోని పేదలకు వైఎస్ హయాంలో గుజరాత్ కంటే కూడా విస్తృత స్థాయిలో లబ్ధి చేకూరిందన్నమాట. సామాజిక వర్గాలవారీగా చూస్తే గ్రామీణ ప్రాంత ఎస్టీల్లో పేదరికాన్ని బాబు తన తొమ్మిదేళ్ల పాలనలో 58.4 శాతం నుంచి 60.3 శాతానికి పెంచి పుణ్యం కట్టుకున్నారు! కానీ వైఎస్ ఐదేళ్ల పాలన చివర్లో, అంటే 2009-10 నాటికి అది గణనీయంగా, అంటే 39.3 శాతానికి తగ్గింది! పట్టణ ప్రాంత ఎస్టీల్లో కూడా పేదరికం బాబు హయాంలో 43.9 శాతం నుంచి 50 శాతానికి పెరిగితే వైఎస్ హయాం చివరి నాటికి ఏకంగా 19 శాతానికి తగ్గింది. ఎస్సీల్లోనూ పేదరికం వైఎస్ హయాంలో 35 శాతం నుంచి 23.4 శాతానికి తగ్గింది. గుజరాత్‌లో మాత్రం 2009-10 నాటికి కూడా గ్రామీణ ఎస్టీల్లో సగానికి సగం (49 శాతం) పేదరికంలోనే మగ్గుతున్నారు. పైగా 2004-2009 మధ్య మోడీ హయాంలో పట్టణాల్లో పేదరిక శాతం కూడా ఎస్సీల్లో 1 శాతం, ఎస్టీల్లో 11.5 శాతం పెరిగింది!
 
 ఇక్కడ గమనించదగ్గ ముఖ్య విషయం ఏమిటంటే, గుజరాత్ రాష్ట్ర మొత్తం జనాభాలో ఎస్టీలు ఏకంగా 16 శాతం ఉన్నారు! జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ తర్వాత దేశంలో ఇది అత్యధికమని చెప్పవచ్చు. అలాంటి జనాభాలో పేదరిక శాతం అంత ఎక్కువ ఉండటం ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మిళిత వృద్ధి అనిపించుకోదు. అంతేగాక ఆర్థిక వ్యత్యాసాలు పెరిగి, పలు సామాజిక వర్గాల మధ్య నిత్య ఘర్షణలకు కూడా దారితీస్తుంది.
 
 ఇవీ కారణాలు...
వైఎస్ హయాంలో రాష్ట్రంలో పేదరికం తగ్గడానికి సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నిధుల కేటాయింపు, సాగు రుణాల మాఫీ, ఉచిత విద్యుత్, కరెంటు బకాయిల మాఫీ, చిన్న, సన్నకారు రైతులకు సంస్థాగతంగా రుణాలిప్పించడం వంటివి ప్రధాన కారణాలు. రూ.2 కిలో బియ్యం, పావలా వడ్డీ రుణాలు, పెన్షన్లతో పాటు ఉపాధి హామీ పథకాన్ని దేశంలోనే అత్యంత విసృ్తతంగా అమలు చేయడం కూడా దోహదపడ్డాయని అధ్యయనం తెలిపింది. ఈ పథకాలు బాబు హయాంలోనూ, గుజరాత్‌లోనూ లేనివి. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలు కూడా ఈ ప్రగతికి ప్రధాన కారణాలేనని నొక్కిచెప్పింది.
 
 కొనుగోలు శక్తి పెరిగింది
 ప్రజల కొనుగోలు శక్తి పెరగడమంటే అర్థం వారి ఆర్థిక స్థితి మెరుగైందనే! ఈ కోణం నుంచి చూస్తే గ్రామీణ, పట్టణ ప్రాం తాల్లో సగటు నెలవారీ వ్యయం వైఎస్ హయాంలో భారీగా పెరిగింది. తొమ్మిదేళ్ల బాబు హయాంలో అది 1.7 శాతం నుంచి కేవలం 2.6 శాతానికి మాత్రమే పెరిగింది. కానీ కేవలం ఐదేళ్ల వైఎస్ పాలనలో సగటు నెలవారీ వ్యయం గ్రామీణ ప్రాంతాల్లో 3.4 శాతం, పట్టణ ప్రాంతాల్లో 3.5 శాతం చొప్పున పెరిగింది. గుజరాత్‌లో ఇది వరుసగా 2.05 మరియు 2.13 శాతమే. సగటు తలసరి వ్యయం పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే రాష్ట్రంలో రూ.1982 అయితే గుజరాత్‌లో అది కేవలం రూ.1914 మాత్రమే.
 
 నిరుద్యోగమూ తగ్గింది
 చంద్రబాబు హయాంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అన్ని విధాలుగానూ నిరుద్యోగుల సంఖ్య పెరిగింది. రోజువారీ పరిస్థితి (సీడీఎస్) ఆధారంగా నిరుద్యోగితను లెక్కిస్తే బాబు హయాంలో అది గ్రామీణ ప్రాంతాల్లో 0.8 శాతం నుంచి 1.3 శాతానికి పెరిగింది. వైఎస్ హయాంలో అది బాగా తగ్గుముఖం పట్టింది. 2004-09 మధ్య రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు జాతీయ సగటు కంటే కూడా తక్కువగా ఉంది.
 
 కార్మికులు-వేతనాలు
1995-2002 మధ్య, అంటే బాబు హయాంలో రాష్ట్రంలో అసంఘటిత రంగ, ముఖ్యంగా వ్యవసాయ కార్మికుల వేతనాల్లో పెరుగుదల నామమాత్రమేనంటూ రిజర్వ్ బ్యాంకు నివేదికే తేల్చి చెప్పింది. 2002-04 మధ్య కూడా అదే పరిస్థితి! పైగా అసంఘటిత రంగ కార్మికుల రోజువారీ సగటు వేతనం (మార్కెట్ రేట్ల ప్రకారం) 2002లో రూ.48.94 ఉండగా 2003 నాటికి అది కాస్తా రూ.48.32కు తగ్గింది! 2004లోనూ అది రూ.49.35 మాత్రమే. 2005 నుంచి వారి వేతనాలు గణనీయంగా పెరిగాయి. 2005లో రూ.51.78 నుంచి 2007 నాటికి రూ.71.31కి, 2009 కల్లా ఏకంగా రూ.108.32కి పెరిగాయి. అంటే రెట్టింపు కంటే ఎక్కువ! ఈ విషయంలో 2006 దాకా గుజరాత్ కంటే రాష్ట్రం వెనకబడి ఉన్నా, ఆ తర్వాత దాన్ని దాటేసింది.
 
 * వ్యవసాయ రంగంలో వేతనాలను పరిశీలిస్తే నిజ వేతన (ద్రవ్యోల్బణాన్ని లెక్కించిన తర్వాతి) వృద్ధి రేటులో 2004-09 మధ్యకాలంలో పురుషుల వేతనాల్లో రాష్ట్రంలో సగటున 7.9 శాతం వార్షిక వృద్ధి నమోదైనట్టు ఎన్‌ఎస్‌ఎస్ సర్వేల డాటా చెబుతోంది. గుజరాత్‌లో ఇది కేవలం 1.1 శాతం మాత్రమే. మహిళా కార్మికుల వేతనాల్లో కూడా రాష్ట్రంలో 10.4 శాతం వృద్ధి నమోదైతే, గుజరాత్‌లో ఇది కేవలం 1.9 శాతం మాత్రమేనంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో నమోదైన వృద్ధి రేటే ఇందుకు కారణం. నిజవేతన వృద్ధి రేటు విషయంలో వైఎస్ హయాంలో జాతీయ స్థాయిలో రాష్ట్రం తొలి స్థానానికి ఎగబాకితే, గుజరాత్ మాత్రం అట్టడుగుకు పడిపోయింది! ఈ వృద్ధి బాబు హయాంలో 1999-2008 మధ్య పురుషుల్లో కేవలం 0.4 శాతం, స్త్రీల్లో 0.21 శాతం మాత్రమే! ఆ కాలంలో గుజరాత్‌లో ఇది వరుసగా 1.1 మరియు 1.4 శాతం. బాబు పాలనా కాలంలో ఆహార ధాన్యాల వృద్ధి రేటు అట్టగుడున ఉండటమే దీనికి ఏకైక కారణం!
 
 * కనీస వేతనాలు 2004లో రూ.60 ఉంటే, అప్పటిదాకా అది రాష్ర్టవ్యాప్తంగా కేవలం 87 శాతం మాత్రమే అమలైంది. అదే వైఎస్ హయాంలో కనీస వేతనాలు రూ.120కి పెరిగినా కూడా, దాన అమలు ఏకంగా 103 శాతం నమోదైంది. అంటే, తన హయాంలో కనీస వేతనాలు రెట్టింపైనా కూడా ప్రతి కార్మికునికీ ఆ మొత్తం కంటే ఎక్కువే గిట్టుబాటయ్యేలా వైఎస్ పాలన సాగిందన్నమాట!
 
 విద్యా దాత
 ఆర్థిక ఇక్కట్లు చదువుకు అడ్డంకి కారాదన్నది వైఎస్ కృతనిశ్చయం. అందుకే ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందేలా చూశారు. లెక్కలేనంత మంది జీవితాల్లో విద్యా వెలుగులు నింపారు.
 * 2007-08లో రాష్ట్రంలో 5.14 ఏళ్ల మధ్య వయసు పిల్లల్లో ఏకంగా 90 శాతం మంది స్కూళ్లకు వెళ్తున్నారు. ఇది గుజరాత్‌తో పాటు జాతీయ సగటు కంటే కూడా చాలా ఎక్కువ. ఈ విషయంలో జాతీయ స్థాయిలో రాష్ట్రానిది ఏడో స్థానమైతే గుజరాత్‌ది 15వ స్థానం.
 * మాధ్యమిక స్థాయి విద్యను చూసుకున్నా, 13-15 ఏళ్ల పిల్లల్లో స్కూలుకు వెళ్లే వారు మన రాష్ట్రంలో 55.4 శాతమైతే గుజరాత్‌లో కేవలం 42.3 శాతమే.
 
 ఆరోగ్య ప్రదాత
 స్వతహాగా డాక్టరైన వైఎస్ వైద్య రంగానికి భారీగా నిధులు కేటాయించడమే గాక దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఆరోగ్యశ్రీ పథకంతో కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫలితంగా ఆరోగ్య రంగంలో గుజరాత్‌తో పోలిస్తే వైఎస్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఎంతో మెరుగ్గా ఉంది.
*    2006-10 మధ్య ప్రసూతి మరణాలు ప్రతి లక్ష మందికి రాష్ట్రంలో 134 అయితే గుజరాత్‌లో 148. జాతీయ సగటేమో 212.
 *    ఐదేళ్ల లోపు శిశు మరణాల రేటు ప్రతి వెయ్యికి రాష్ట్రంలో 52 ఉంటే, గుజరాత్‌లో మాత్రం ఏకంగా 61గా ఉండటం విశేషం!
 *    పౌష్ఠికాహార లోపంతో బాధపడే చిన్నారుల సంఖ్య 2006-10 మధ్య రాష్ట్రంలో 38.4 శాతం మంది కాగా గుజరాత్‌తో ఏకంగా 49.2 శాతం, జాతీయ సగటు కూడా 45.8 ఉన్నాయి.
 *    గర్భధారణ సమయంలో జాగ్రత్తల విషయంలో రాష్ర్టంలో 94.8 శాతమైతే, గుజరాత్‌లో కేవలం 87.4 శాతమే.
 *    మొత్తం రాష్ట్ర వ్యయంలో ఆరోగ్య రంగంపై చేసిన ఖర్చు 2005-10 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో 1.2 శాతమైతే, అదే కాలంలో గుజరాత్‌లో అది కేవలం 0.73 శాతమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement