సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక గుజరాత్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పాలకపక్ష భారతీయ జనతా పార్టీయే మళ్లీ విజయం సాధిస్తుందని దాదాపు అన్ని ప్రీ, ఎగ్జిట్ పోల్ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. బీజేపీకి వంద సీట్లకు తక్కువ రావని, కాంగ్రెస్ పార్టీకి 74 సీట్లకు ఎక్కువ రావని అన్ని సర్వేలు సూచిస్తున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా మ్యాజిక్ ఫిగర్ 92 సీట్లు వస్తే చాలు. 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 115 సీట్లు రాగా, ఈ సారి ఎన్నికల్లో అప్పటి కంటే ఎక్కువ సీట్లే వస్తాయని మెజారిటీ సర్వేలు తేల్చాయి. అలాగే 2012 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 61 సీట్లు రాగా, అంతకన్నా ఏడెనిమిది సీట్లు ఎక్కువగానే వస్తాయని మెజారిటీ ఎన్నికల సర్వేలు తేల్చాయి. అన్ని సర్వేల సరాసరి తీసుకుంటే బీజేపీకి 117, కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు వస్తాయి.
గత ఎన్నికలకంటే బీజేపీకి రెండు సీట్లు, కాంగ్రెస్ పార్టీకి మూడు సీట్లు అదనంగా వస్తాయి. సాధారణంగా ఎన్నికల సర్వేల్లో సీట్లకన్నా ఓట్ల శాతం అంచనాల్లోనే కొంత కచ్చితత్వం ఎక్కువగా ఉంటుంది. ఆ లెక్కన 2012 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 48 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీకి 39 శాతం ఓట్లు వచ్చాయి. ఇక పలు సర్వేల ఓట్ల శాతం సరాసరి తీసుకుంటే బీజేపీకి ఈ సారి కూడా 48 శాతం ఓట్లు వస్తుండగా, కాంగ్రెస్ పార్టీకి 41 శాతం ఓట్లు వస్తున్నాయి. గుజరాత్ ఎన్నికల ప్రస్తావన మొదలైనప్పటి నుంచి క్షేత్ర స్థాయిలో 22 ఏళ్ల సుదీర్ఘ బీజేపీ పాలనకు వ్యతిరేకంగా పవనాలు వీస్తున్నాయని, ప్రభుత్వం పట్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారని వార్తలు వినిపించాయి. పెద్దనోట్లను రద్దు చేస్తూ నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయానికి గుజురాత్ ప్రజల నుంచి ముఖ్యంగా చిరువ్యాపారలు నుంచి, పాటిదార్ కమ్యూనిటీ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. జీఎస్టీ అమలుతో వ్యాపారస్థుల ఆందోళన మరింత పెరిగింది. వారు గుజరాత్‌లో పలు చోట్ల ప్రత్యక్ష ఆందోళనకు కూడా దిగారు.
వ్యవసాయానికి సరైన గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్డున పడ్డ నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధి, విద్యా అవకాశాల్లో తమకు కూడా రిజర్వేషన్లు కల్పించాలంటూ పాటిదార్లు 2015న పెద్ద ఎత్తున ప్రజాందోళనకు దిగారు. 2012 ఎన్నికల తర్వాత గుజరాత్‌లో నిరుద్యోగం, వలసలు పెరిగిన నేపథ్యంలో పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీలాంటి బీజేపీ వివాదాస్పద నిర్ణయాలు, పాటిదార్లు, దళితుల ఆందోళన కారణంగా ఎన్నికల్లో బీజేపీకి పెద్ద దెబ్బతగులుతుందని, ప్రభుత్వ వ్యతిరేక పవనాలు కూడా తోడడవడం వల్ల బీజేపీ కూలిపోయి, కాంగ్రెస్ కోలుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావించారు. 2012లో పాటిదార్లు, ఠాకూర్లు, ఓబీసీలు, దళితులు బీజేపీకే ఓటు వేశారు.
త్రిమూర్తుల ప్రభావం ఏమైంది?
రాష్ట్రంలోని దాదాపు 15 శాతం మంది ఓటర్లున్న పాటిదార్లను ఉద్యమ బాట పట్టించిన హార్దిక్ పటేల్ ఈసారి ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పక్షాన చేరారు. ఓ మోస్తారుగా ఓబీసీలను సమీకరించిన అల్పేష్ ఠాకోర్, దళితులను సమీకరించిన జిగ్నేష్ మేవానీలు నేరుగా కాంగ్రెస్‌లోనే చేరిపోయి అభ్యర్థులుగా రంగంలోకి దిగారు. ఇక పాటిదార్లకు విశేషంగా ఆకర్షించిన హార్దిక్ పటేల్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. నరేంద్ర మోదీ సభలకు దాదాపు సమానంగా, కొన్ని సభలకు ఎక్కువ మంది ప్రజలు కూడా హాజరయ్యారు. ఎన్నికలపై వీరి ప్రభావం ఏమైందీ?
‘దేకో దేకో ఇదర దేకో మోదీ కా బాప్ ఆయా హై’ అంటూ హార్దిక్ పటేల్ చేసిన నినాదానికి ప్రతి ధ్వనించిన వేల యువగొంతుకలు ఎన్నికల్లో ఏమయ్యాయి? పెద్ద వయస్కులైన పాటిదార్లు సంప్రదాయబద్ధంగా బీజేపీకే ఓటేసినా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామని బహిరంగంగా ప్రకటించిన 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లలోపు యువత ఎటు పోయింది?
విశ్వసనీయ సీఎస్‌డీఎస్–లోక్‌నీతి డిసెంబర్ ఐదున విడుదల చేసిన ప్రీ ఎన్నికల సర్వే ప్రకారం ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీకి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి మధ్య పోటీ పోటాపోటీగా ఉందని, ఇరు పక్షాలకు 43 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించింది. అదే సంస్థ గత ఆగస్టులో నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ పార్టీకి 29 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. అంటే డిసెంబర్ సర్వే నాటికి కాంగ్రెస్‌కు 14 శాతం ఓట్లు పెరిగాయి. ఈ పెరిగిన శాతం ఓట్లు ఎక్కడికి పోయాయి? ఇదే సంస్థ ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీకి 49 శాతం, కాంగ్రెస్ పార్టీకి 41 శాతం ఓట్లు వస్తాయని తేల్చింది. బీజేపీకి ఆరు శాతం ఓట్లు పెరగడానికి, కాంగ్రెస్‌కు రెండు శాతం ఓట్లు తగ్గడానికి కారణం ఏమిటీ?
మోదీ ప్రచారం కారణమా?
చివరి రోజుల్లో నరేంద్ర మోదీ చేసిన విస్తృత ప్రచారం కారణమా? చివరి దశలో ఆయన దాదాపు రోజూ ఎన్నికల ప్రచారం చేశారు. పైగా మోదీ అభివద్ధి ఎజెండాను పక్కన పడేసి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లాంటి వాళ్లు పాక్ నాయకులతో కలసి తనను అడ్డు తొలగించుకునేందుకు కుట్ర పన్నారంటూ దిగజారుడు విమర్శలు చేశారు. అది ఆయన ఓటమిని సూచిస్తోందని కూడా రాజకీయ విమర్శకులు భావించారు. క్షేత్ర స్థాయిలో ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకున్నా 2012 ఎన్నికలకన్నా ఈసారి ఎన్నికల్లో బీజే పీకి లాభంకన్నా నష్టమే ఎక్కువ జరగాలి?
కాంగ్రెస్సే గెలుస్తుందా?
రాజకీయాల్లోకి వచ్చిన మాజీ ఎన్నికల విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్‌కు కూడా ఇలాంటి సందేహాలే వచ్చినట్లన్నాయి ఎన్నికల ఫలితాలపై ఆయన అంచనాలు భిన్నంగా ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం 43 శాతం ఓట్లతో బీజేపీకి 86 సీట్లు వస్తే, కాంగ్రెస్‌కు 92 సీట్లు వస్తాయని అంచనా వేశారు. మరో అంచనా ప్రకారం బీజేపీకి 41 శాతం ఓట్లతో 65 సీట్లు, కాంగ్రెస్‌కు 45 శాతంతో 113 సీట్లు వస్తాయని అన్నారు. మూడో అంచనా ప్రకారం బీజేపీకి మరింత పరాభవం ఎదురు కావచ్చని చెప్పారు. ఆయన అంచనాలే నిజం అవుతాయా? మరి ఎన్నికల సర్వేల ఫలితాలు భిన్నంగా ఎందుకున్నాయి ? సైలెంట్‌గా ఓటేసిన ప్రజలు ఉద్దేశపూర్వకంగానే సర్వేలను కూడా పక్కదారి పట్టించారా? చివరి రెండు రోజుల్లో విస్తతంగా డబ్బులు పంచారన్న విమర్శలు నిజమై ఓటర్లే మనసు మార్చుకున్నారా? బీజేపీ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న అంధ విధేయత అన్ని విఘ్నాలను అధిగమించి విజయాన్ని చేకూర్చి పెట్టిందా ? స్పష్టత రావాల్సిందంటే తెల్లారాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment