కొన్నిసార్లు రాజకీయ పార్టీలకు బాగా కలిసి వస్తాయి.. మరికొన్నిసార్లు ఊహించని స్థాయిలో వైఫల్యాలు ఎదురవుతుంటాయి. మరికొద్ది రోజుల్లో చరిత్రలో కలిసిపోతున్న 2017 సంవత్సరం భారతీయ జనతా పార్టీకి ఘన విజయాలు అందించింది. ఈ ఏడాది జరిగిన ఏడు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో నాలుగుచోట్ల జయకేతనం ఎగరేసింది. రెండుచోట్ల బొటాబొటీ మెజారిటీ వచ్చినా అనూహ్యంగా అధికారాన్ని కైవసం చేసుకుంది. ఒక్క పంజాబ్‌ను మినహాయిస్తే ఆరింటిలో అధికారంలోకి వచ్చింది. ఈ ఏడాది కాంగ్రెస్‌కు అశనిపాతమే అని చెప్పాలి. పంజాబ్‌లో అధికారంలోకి వచ్చినా.. రెండు రాష్ట్రాల్లో పెద్ద పార్టీగా నిలిచినా ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోయింది. అలాగే అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌ను బీజేపీకి అప్పగించింది.
భారతీయ జనతాపార్టీ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత.. ఇంతలా కలిసి వచ్చిన ఏడాది లేదనే చెప్పాలి. సాధారణ ఎన్నికలతో పాటు జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో జమ్మూ కశ్మీర్, హర్యానా, మహరాష్ట్ర, జార్ఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లో అధికారంలోకి రాగా, ఆంధ్రప్రదేశ్‌లో సంకీర్ణ భాగస్వామిగా అధికారాన్నిపంచుకుంది. ఇక 2015లో జరిగిన ఢిల్లీ, బిహార్ ఎన్నికల్లో బీజేపీ దారుణ ఓటములను చవిచూసింది. 2016లో కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుడిచ్చేరి ఎన్నికల్లోనూ కాషాయ పార్టీకి చేదు ఫలితాలే వచ్చాయి. ఫెమాఖండూ పార్టీ మారడంతో.. అరుణాచల్ ప్రదేశ్‌ను బీజేపీ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో 2017లో జరిగిన గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, మణిపూర్‌లలో అధికారం దక్కించుకుంది. అలాగే బిహార్‌లో జరిగిన రాజకీయ మార్పులతో.. అధికార కూటమిలో భాగస్వామిగా మారింది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఒక్క పంజాబ్‌లో మాత్రమే బీజేపీ ఓటమి పాలైంది. శిరోమణి అకాళీదళ్‌తో కలిసి పోటీ చేసిన కమలం పార్టీకి ఇక్కడ చుక్కెదురైంది.
బీజేపీ బిగ్ 7
భారతీయ జనతా పార్టీ దేశమంతా విస్తరించింది.. 2017లోనే. ఈ ఏడాది విజయాలతో బీజేపీ దేశంలోని సంకీర్ణ ప్రభుత్వాలతో కలుపుకుని.. మొత్తం 19 రాష్ట్రాల్లోకి అధికారంలోకి రాగలిగింది.
ఉత్తరప్రదేశ్ :
బీజేపీకి కొత్త ఊపు, శక్తిని ఇచ్చి ఎన్నిక ఇది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 325 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలను నామమాత్రపు స్థాయికి పరిమితం చేసింది. పెద్ద నోట్ల రద్దు తరువాత జరిగిన ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్మాత్మకంగా మారింది. ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన లేకుండా ఎన్నికలకు బీజేపీ వెళ్లినా ప్రజలు మాత్రం తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు. తరువాత యోగి ఆదిత్యనాథ్‌ను బీజేపీ ముఖ్యమంత్రిగా పార్టీ ఎంపిక చేసింది.
ఉత్తరాఖండ్
2017 వరకూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం. ముఖ్యమంత్రిగా హరీష్ రావత్ వ్యహరిస్తున్నారు. 2017లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఈ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 69 స్థానాలున్న ఉత్తరాఖండ్ శాసనసభలో.. 57 చోట్ల బీజేపీ విజయదుందుభి మోగించింది. ప్రస్తుతం త్రివేంద్ర సింగ్ రావత్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు.
గోవా
గోవా శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు బీజేపీని పక్కన పెట్టారు. 2012లో గోవాలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2014లో కేంద్రంలోనూ బీజేపీ అధికారంలోకి రావడంతో.. అప్పటి వరకూ గోవా ముఖ్యమంత్రిగా వ్యహరిస్తున్న మనోహర్ పరీకర్‌ను మోదీ.. రక్షణ మంత్రిగా కేంద్ర కేబినెట్‌లోకి తీసుకున్నారు. దీంతో పరీకర్ స్థానంలో లక్ష్మీకాంత్ పర్సేకర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పర్సేకర్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో.. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గి రెండో స్థానంలో నిలించింది. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో బీజేపీ రాష్ట్రాన్ని కైవసం చేసుకుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మనోహర్ పరీకర్ తిరిగి గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
మణిపూర్ :
మణిపూర్‌లో రాష్ట్రంలోనూ ప్రజలు ఏ పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీకి 21 సీట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో 11 మంది స్వతంత్రులను కలుపుకుని బీరేన్ సింగ్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
హిమాచల్ ప్రదేశ్
హిమాలయ రాష్ట్రంలో వీరభద్రసింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ ఏడాది ఆఖర్లో జరిగిన ఎన్నికల్లో.. ఈ రాష్ట్రాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. మొత్తం 68 స్థానాల్లో బీజేపీ 44 చోట్ల విజయం సాధించింది.
గుజరాత్
బీజేపీ కంచుకోటగా ఈ రాష్ట్రాన్ని చెప్పుకోవాలి. వరుసగా 5 పర్యాయాల నుంచి ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది. తాజా ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించడంతో.. వరుసగా ఆరోసారి గుజరాత్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చినట్లు అయింది. ఇక్కడ బీజేపీకి గతంతో పోలిస్తే సీట్లు తగ్గాయి.
బిహర్
బిహార్ శాసనసభకు 2015లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ తీవ్ర వైఫల్యాన్ని మూటగట్టుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని మహాకూటమి ఘన విజయం సాధించింది. అయితే.. సరిగ్గా రెండేళ్లు కూడా తిరగముందే నితీష్ కుమార్ మహాకూటమి నుంచి బయటకు వచ్చి.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో అప్పటి వరకూ కాంగ్రెస్, జేడీయూలు అధికార కూటమిలో ఉండగా.. ప్రస్తుతం అవి ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment