నరేంద్ర మోదీ లోపలి మనిషెవరు? | Narendra Modi is a Narcissist? | Sakshi
Sakshi News home page

నరేంద్ర మోదీ లోపలి మనిషెవరు?

Published Thu, Dec 14 2017 2:40 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Narendra Modi is a Narcissist? - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఈసారి గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ చివరి విడత ప్రచారంలో ఎందుకు తన పంథాను మార్చుకున్నారు? 2012లో జరిగిన గుజరాత్‌ ఎన్నికల్లోనూ, ఆ తర్వాత 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ అభివృద్ధే ప్రధాన ఎజెండాగా ఎన్నికల ప్రచారం చేసి మోదీ విజయం సాధించిన విషయం తెల్సిందే. ఈసారి కూడా ఇదే ఎజెండాతోని గుజరాత్‌ ఎన్నికల్లో ప్రచారం ప్రారంభించినప్పటికీ చివరి దశలో మోదీ ఎందుకు తన పంథాను మార్చుకోవాల్సి వచ్చింది?

గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు మణిశంకర్‌ అయ్యర్‌ నివాసంలో మన్మోహన్‌ సింగ్, పాక్‌ దౌత్యవేత్తలు కుట్ర పన్నారనడం, అంతకుముందు మణిశంకర్‌ అయ్యర్‌ పాకిస్థాన్‌కు వెళ్లి తనను అడ్డుతొలగించమంటూ ‘సుఫారి’ ఇచ్చివచ్చారంటూ ఆరోపించడం మోదీ ప్రచార పంథా మారిన విషయాన్ని స్పష్టం చేస్తోంది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని గ్రహించడం వల్ల ఆయన పంథా మార్చుకున్నారా? పంథా మార్చుకోవడం ద్వారా విజయావకాశాలను మెరగుపర్చుకోవాలని భావించారా? ఇతరేతర కారణాలు ఏమైనా ఉన్నాయా ? 2002, 2007లలో జరిగిన గుజరాత్‌ ఎన్నికల్లో అనుసరించిన ‘బాధిత’ పంథానే మళ్లీ ఎందుకు పునికి పుచ్చుకున్నారు?

డచ్‌ మానసిక శాస్త్రవేత్త ఎఫ్‌ఆర్‌ కెట్స్‌ డీ వైర్స్, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ ప్రొఫెసర్‌ డానీ మిల్లర్‌ రాసిన ‘నార్సిసిజమ్‌ అండ్‌ లీడర్‌షిప్‌: యాన్‌ ఆబ్బెక్టివ్‌ రిలేషన్స్‌ పర్‌స్పెక్టివ్‌’  పత్రాల్లో వివరించినట్లుగా నార్సిసిజమ్‌ లక్షణాలు మన నరేంద్ర మోదీలో కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలు కలిగిన వ్యక్తులు విజయాన్ని తప్ప పరాజయాన్ని అంగీకరించరు. విజయం సిద్ధిస్తే తన కారణంగానే అది సాధ్యమైందని, పరాజయం ఎదురైతే అది ఎదుటి వారి కుట్ర ఫలితమని చెప్పడమే కాదు, స్వతహాగా భావిస్తారు. ఇలాంటి వ్యక్తులు తమను తాము ఎంతో ఆరాధించుకుంటారు. అందుకు తగ్గట్టు వేషాధారణ ఆకర్షణీయంగా ఉండేలా చూసుకుంటారు. ఎదుటి వారి ప్రేమ, వినయ, విధేయతలపై ఎప్పుడూ ఆధారపడకూడదని అనుకుంటారు.

ఇలాంటి వ్యక్తుల్లో ఆత్మవిశ్వాసమే కాదు, అహంభావం ఎక్కువే. వీరు అందంతో పాటు అధికారాన్ని, దర్జాను, ధర్పాన్ని కోరుకుంటారు. ముఖ్యంగా అందరికంటే తానే గొప్పవాడిని కావాలని అనుకుంటారు. అందుకోసం వీరి నిత్యం బిజీగా ఉంటారు. వ్యక్తిగత విజయం కోసం ఎంతో కష్టపడతారు. వీరిలో ఎక్కువ మంది రాజకీయ అధికారాన్ని కోరుకుంటారు. వీరిలో సొంత నిర్ణయాలు తీసుకునే మనస్తత్వమే ఎక్కువ. సమిష్టి నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడరు. తీసుకున్నా రహస్యంగానే తీసుకుంటారు. అందుకు తామే బాధ్యులమని బహిరంగంగా చెప్పుకుంటారు. మోదీ దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఇలాంటిదే కావచ్చు. విజయం తప్ప పరాజయాన్ని జీర్ణించుకోని వీరు తమ పరాజయాన్ని కారకులైన వారిని ఏదో విధంగా సాధించేందుకు ప్రయత్నిస్తారు. నార్సిసిజమ్‌ లక్షణాలు కలిగిన వ్యక్తులు దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వారే ఎక్కువ ఉంటారు.

మోదీ కూడా అదే తరగతి నుంచి వచ్చారన్న విషయం మనందరికి తెల్సిందే. ఆహార్యం నుంచి దర్జా, దర్పం వరకు నార్సిసిజమ్‌ లక్షణాలు ఆయనలో కనిపిస్తున్నాయి. పరాజయానికి కారకులైన వారిని వేధిస్తారంటే...ఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ను, పొత్తుకు ముందు బిహార్‌లో నితీష్‌ కుమార్‌ ప్రభుత్వాన్ని వేధించడమే గుర్తొస్తోంది. పరాజయానికి ఎదుటవారి కుట్రలే కారణంగా చూపిస్తారు గనుక గుజరాత్‌ ఎన్నికల్లో హఠాత్తుగా తన పంథాను మోదీ అందుకే మార్చుకొని ఉంటారు. ఆయన పంథా మార్చుకోవడం మోదీ పరాజయాన్ని కొంత సూచిస్తున్నప్పటికీ ఓటమి తప్పదని భావించలేం. బాధితుడనే సానుభూతి ద్వారా విజయాన్ని సాధించాలనుకుంటారు. అందుకే 2002, 2007 గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ విజయం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement