అహ్మదాబాద్/సిమ్లా/న్యూఢిల్లీ : హోరాహోరీగా జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ తిరిగి జయకేతనం ఎగురవేసింది. వరుసగా ఆరోసారి విజయఢంకా మోగించింది. అదే సమయంలో రాహుల్ గాంధీ సారథ్యంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా తలపడి బీజేపీకి ముచ్చెమటలు పట్టించింది. మొత్తంగా 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ 99 స్థానాలను, కాంగ్రెస్(+) 79 స్థానాలు, ఇతరులు నాలుగు స్థానాలను గెలుచుకున్నారు. మెజారిటీకి అవసరమైన 92 స్థానాలకు మించి
సాధించినా.. వంద మార్కును దాటకపోవడం బీజేపీ నేతలు, శ్రేణుల్ని నిరాశపర్చింది. మరోవైపు హిమాచల్‌ప్రదేశ్‌లో ఎగ్జిట్ పోల్ సర్వేల అంచనాల్ని నిజం చేస్తూ బీజేపీ సునాయాసంగా విజయం సాధించింది. కానీ బీజేపీ సీఎం అభ్యర్థి ప్రేమ్‌కుమార్ ధూమల్ ఓటమి పాలవడం ఆ పార్టీని షాక్‌కు గురిచేసింది. మొత్తంగా ఈ రెండు రాష్ట్రాల్లో విజయాలతో బీజేపీ దేశ రాజకీయాలపై మరింత పట్టు బిగించిందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. హిమాచల్‌ప్రదేశ్ కూడా తన ఖాతాలో చేరడంతో... మిత్రపక్షాలతో కలిసి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 19కి చేరింది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 18 నెలల సమయమే ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ మరో రాష్ట్రాన్ని కోల్పోయినా.. కొత్త సారథి రాహుల్ నేతృత్వంలో గుజరాత్‌లో బీజేపీకి గట్టి పోటీ ఇవ్వడం ఆ పార్టీకి ఊరట కలిగించే అంశం.
టెన్షన్.. టెన్షన్!
సోమవారం ఉదయం 8 గంటలకు గుజరాత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలుకాగా.. ఆది నుంచి తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. ప్రారంభంలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగినా.. కొద్దిసేపటికి కాంగ్రెస్ దూసుకొచ్చింది. ఎగ్జిట్ పోల్ సర్వేల్ని తలకిందులు చేస్తూ ఒక దశలో బీజేపీతో సమానంగా కాంగ్రెస్ ఆధిక్యంలోకి వచ్చింది. దాంతో స్టాక్ మార్కెట్లు సైతం కుప్పకూలాయి. సీఎం విజయ్ రూపానీ, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్‌లు కూడా వెనకపడడంతో బీజేపీ నేతలు డీలా పడ్డారు. కొద్దిసేపు బీజేపీ, కాంగ్రెస్‌లతో ఫలితాలు దోబూచులాడడంతో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. కానీ ఫలితాలు వెలువడుతున్న కొద్దీ బీజేపీ క్రమంగా ఒక్కో స్థానాన్ని పెంచుకుంటూ.. మెజారిటీ మార్కును దాటింది. చివరకు గుజరాత్‌లో విజయ ఢంకా మోగించి మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమైంది. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకుగాను 99 స్థానాల్లో ఆ పార్టీ గెలుపొందింది. ఒక దశలో అధికారానికి దగ్గరకంటూ వచ్చిన కాంగ్రెస్ 77 స్థానాల్లో గెలుచుకొంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ 61 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది.
ఇక ఎన్సీపీ ఒక స్థానంలో, భారతీయ ట్రైబల్ పార్టీ రెండు చోట్ల గెలవగా.. స్వతంత్రులు మూడు స్థానాల్లో విజయం సాధించారు. ఒక దశలో వెనుకంజ వేసిన విజయ్ రూపానీ రాజ్‌కోట్ వెస్ట్ నుంచి 54 వేల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. మెహ్‌సనా నుంచి డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ గెలుపొందారు. కాంగ్రెస్ ఓబీసీ నేత అల్పేశ్ ఠాకూర్ రధన్‌పూర్ నుంచి, కాంగ్రెస్ మద్దతుతో దళిత నాయకుడు జిగ్నేశ్ మేవానీ వడ్గాం నుంచి విజయం సొంతం చేసుకున్నారు. ఇక భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) అధ్యక్షుడు ఛోటు వసావా ఝగాడియా స్థానం నుంచి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో బీటీపీ కాంగ్రెస్‌తో జట్టుకట్టింది. బీజేపీ 48.8 శాతం, కాంగ్రెస్ 41.7 శాతం ఓట్లను సొంతం చేసుకున్నాయి. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ తన పట్టును నిరూపించుకోగా.. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధిక్యాన్ని ప్రదర్శించింది.
సుదూరంలో ‘మిషన్ 150’!
1998 నుంచి గుజరాత్‌ను పాలిస్తున్న బీజేపీ.. 2012లో 116 స్థానాల్లో గెలుపొందగా ఈసారి 17 సీట్లు తగ్గాయి. గెలిచిన ఆనందం ఒకవైపు.. ఆశించినన్ని స్థానాలు రాని నిరాశ మరోవైపు బీజేపీ శ్రేణుల్లో కనిపించింది. 150 స్థానాల్లో గెలుపే లక్ష్యంతో అమిత్‌షా నేతృత్వంలో సాగిన ‘మిషన్ 150’ప్రయోగం సఫలం కాలేదు. సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్ గెలుపును ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ ఇద్దరు నేతలు రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. అటు రాహుల్ కూడా జీఎస్టీ, నోట్ల రద్దు, గుజరాత్ అభివృద్ధి లోపాలపై పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. గుజరాత్, హిమాచల్‌లో గెలుపు బీజేపీ ఆధిక్యాన్ని, మోదీ ప్రభావాన్ని పెంచినా.. అదే సమయంలో బీజేపీని దీటుగా ఎదుర్కోవడంలో రాహుల్ ఆత్మవిశ్వాసాన్ని కూడా చాటిచెప్పింది. ఈ ఎన్నికల్లో సీట్ల సంఖ్యను మాత్రమే కాకుండా రెండు శాతం ఓట్లను కూడా కాంగ్రెస్ పెంచుకుంది. పటీదార్, ఓబీసీ, దళిత నేతలైన హర్దిక్ పటేల్, అల్పేశ్ ఠాకూర్, జిగ్నేశ్ మేవానీల యువ నాయకత్వం కాంగ్రెస్‌కు బాగా సాయపడింది.
బీజేపీ చేతికి హిమాచల్ పగ్గాలు
హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ 44 స్థానాల్లో గెలిచి ఐదేళ్ల అనంతరం మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. కాంగ్రెస్ 21 స్థానాల్లో విజయం సాధించింది. 68 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి ఓటింగ్ 10 శాతం పెరిగింది. కాంగ్రెస్ ఓట్లు ఒక శాతం తగ్గాయి. హిమచల్ ప్రదేశ్‌ను బీజేపీ తన ఖాతాలో వేసుకున్నా... ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రేమ్‌కుమార్ ధూమల్ పరాజయం ఆ పార్టీకి నిరాశ మిగిల్చింది. సుజన్‌పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రాజీందర్ రానా చేతిలో ధూమల్ పరాజయం చెందారు. ఎన్నికలకు 9 రోజుల ముందు బీజేపీ ఆయనను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. హిమాచల్‌లో పరాజయంతో కాంగ్రెస్ పార్టీ అధికారం ఇక కర్ణాటక, పంజాబ్, మేఘాలయ, మిజోరం, పుదుచ్చేరిలకే పరిమితం కానుంది. గుజరాత్, హిమాచల్‌లో విజయంతో ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కార్యకర్తలు బాణాసంచా పేల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.
ప్రజాతీర్పును గౌరవిస్తాం
మాపై ప్రేమ చూపినందుకు ఇరు రాష్ట్రాల ప్రజలకు ధన్యవాదాలు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వాలకు అభినందనలు. కాంగ్రెస్‌లోని నా సోదర సోదరీమణులు నేను గర్వపడేలా చేశారు. మీపై కోపాన్ని, ద్వేషాన్ని చూపినవారిపై మీరు హుందాగా పోరాటం సాగించారు. కాంగ్రెస్ పార్టీకి హుందాతనం, ధైర్యమే అన్నింటికన్నా గొప్ప బలాలని మీరు తెలియజేశారు. --కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ
మా సంస్కరణలకు ప్రజామోదం
అధికార దాహంతో కాంగ్రెస్ గుజరాత్‌లో కులతత్వాన్ని వ్యాప్తి చేయాలనుకుంది. కేంద్రంలో బీజేపీ తీసుకొచ్చిన సంస్కరణలకు ప్రజామోదం ఉందనడానికి ఈ ఫలితాలే నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా దేశం మంచి గుర్తింపు పొందాలంటే అభివృద్ధిలో కొత్త శిఖరాలను అందుకోవాల్సి ఉంది. హిమాచల్‌ప్రదేశ్‌లోనూ తప్పుడు పనులకు వ్యతిరేకంగా, అభివృద్ధికి అనుకూలంగానే ప్రజలు ఓటేశారు. -- ప్రధాని మోదీ
మోదీకి కేసీఆర్ అభినందన..
గుజరాత్, హిమాచల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినందుకు అభినందిస్తూ ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ సందేశం పంపారు.
మోదీ మ్యాజిక్..బీజేపీ డబుల్ హ్యాట్రిక్
Comments
Please login to add a commentAdd a comment