ప్రచారం పరిసమాప్తం | Termination the election campaign | Sakshi
Sakshi News home page

ప్రచారం పరిసమాప్తం

Published Wed, Apr 23 2014 1:17 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

ప్రచారం పరిసమాప్తం - Sakshi

ప్రచారం పరిసమాప్తం

  •      చివరిరోజు ప్రధాన నేతల ఎన్నికల ర్యాలీలు
  •      ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కిన వాతావరణం
  •      19 లోక్‌సభ స్థానాల బరిలో 339 మంది అభ్యర్థులు
  •  
     సీఎం చవాన్‌పై మోడీ ఫైర్
     
    సాక్షి, ముంబై: గుజరాత్‌ను మించి మహారాష్ర్టనే ప్రగతి పథంలో ముందుందన్న సీఎం పృథ్వీరాజ్ చవాన్‌పై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ మండిపడ్డారు. అలాగైతే రాష్ట్రంలోని రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు.  మహా కూటమి అభ్యర్థులకు మద్ధతుగా నరేంద్ర మోడీ ఉత్తర మహారాష్ట్రలోని నందుర్బార్, ధులేలలో జరిగిన ప్రచార సభలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తనపై అనవసరమైన ఆరోపణలు చేస్తు సమయం వృధాచేసే బదులుగా రాష్ట్రంలోని రైతుల సమస్యలను పరిష్కరిస్తే మంచిదన్నారు.
     
    రాష్ట్రంలోని రైతులు ఉపాధి కోసం గుజరాత్‌కు ఎందుకు వెళ్లాల్సి వస్తుందో పృథ్వీరాజ్ చవాన్ సమాధానమివ్వాలన్నారు. గుజరాత్‌లో పంటకు మద్దతు ధర లబిస్తుందనే నమ్మకంతోనే ఇక్కడి రైతులు గుజరాత్‌కు వస్తున్నారని తెలిపారు. అంతా అభివృద్ధి జరుగుతుందని చెబుతున్న సీఎం, ధులే, నందుర్బార్, జల్‌గావ్ జిల్లాలు ఎందుకు అభివృద్దికి నోచుకోలేదో చెప్పాలన్నారు.  
     
     సాక్షి, ముంబై: లోక్‌సభ మూడో దశ ప్రచారానికి తెరపడింది. ఇన్నిరోజులు వాడివేడిగా సాగిన ప్రచార పర్వానికి మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు పరిసమాప్తి అయింది. మూడో దశలో భాగంగా 19 లోక్‌సభ నియోజకవర్గాలకు గురువారం ఎన్నికలు జరగనున్నాయి. అయితే చివరి రోజైన మంగళవారం వివిధ ప్రాంతాల్లో ప్రముఖ నాయకుల ప్రచారాలతో రాజకీయ వాతావరణం వేడేక్కింది.  
     
     చివరి రోజు వరకు వివిధ ప్రాంతాల్లో  బహిరంగ సభలతోపాటు పాదయాత్రలు, రోడ్ షోలు, ర్యాలీలు, వీధి సభలను అభ్యర్థులు నిర్వహించారు.  చివరి రోజు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, గోపీనాథ్ ముండే, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే, ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే ప్రచారాలతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. సాయంత్రం ఐదు గంటల తర్వాత అన్ని పార్టీల కార్యకర్తలు ముఖ్య నేతలతో కూడిన హోర్డింగ్‌లను తొలగించారు.
     
     బరిలో 339 మంది...

    తుది దశలో జరగనున్న మొత్తం 19 లోకసభ నియోజకవర్గాల్లో 339 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో మిలింద్ దేవరా,  గురుదాస్ కామత్, మేధాపాట్కర్, ఛగన్ భుజ్‌బల్, సునీల్ తట్కరే, మాణిక్‌రావ్ గావిత్, బాలా నాందగావ్కర్, మాజీ మంత్రి విజయ్‌కుమార్ గావిత్ కూతురు హీనా గావిత్, సంజీవ్ నాయక్, శివసేన నాయకుడు అనంత్ గీతే తదితరులు ఉన్నారు.
     
    ఈసారి కూడా ప్రధాన పోటీ  ప్రధానపార్టీలైన కాంగ్రెస్-ఎన్సీపీల ప్రజాసామ్య కూటమి, శివసేన-బీజేపీ, ఆర్‌పీఐ, స్వాభిమాని శేత్కరి పార్టీల మహాకూటమిల మధ్య జరిగే అవకాశం కనబడుతోంది. అయితే పలు నియోజకవర్గాల్లో ఆప్, ఎస్‌పీ, బీఎస్‌పీ, ఎమ్మెన్నెస్‌లతోపాటు ఇతర పార్టీలు కూడా గట్టి పోటీ ఇచ్చేఅవకాశాలు కన్పిస్తున్నాయి. ముంబై, ఠాణే జిల్లాల్లోనే పది లోక్‌సభ నియోజకవర్గాలుండడంతో ప్రముఖ పార్టీలు వీటిపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచాయి. కాగా,  గత ఎన్నికల్లో ముంబైలోని ఆరు స్థానాలను గెలుచున్న డీఎఫ్ కూటమి ఈసారి కూడా దక్కించుకోవాలని ఆరాటపడుతోంది. అయితే ఈసారి మహాకూటమి నుంచి తీవ్ర పోటీ ఎదురవుతుండటంతో విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది.
     
      దీనికితోడు ఎమ్మెన్నెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్‌పీలు బరిలో ఉండటంతో ఓట్లు చీలిపోతాయన్న భయం ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో కనబడుతోంది. ఠాణే జిల్లా పరిధిలోని నాలుగు లోక్‌సభ స్థానాల్లోనూ ఈసారి డీఎఫ్ కూటమి, మహా కూటమిల మధ్యే ప్రధాన పోరు జరిగే అవకాశముంది. ఎమ్మెన్నెస్ కూడా గట్టి అభ్యర్థులను బరిలోకి దింపడంతో ఠాణే జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. మిగతా పార్టీల ప్రభావం చెప్పుకోదగ్గ స్థాయిలో కనబడటం లేదు. ఉత్తర మహారాష్ట్ర, మరాఠ్వాడా, రాయ్‌గఢ్‌లోని తొమ్మిది లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రధాన పోటీ డీఎఫ్ కూటమి, మహాకూటమిల మధ్య ఉన్నా, ఎమ్మెన్నెస్, ఇతర పార్టీల కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ కన్పిస్తోంది.
     
     నందుర్బార్‌లో గావిత్ కుటంబీకుల మధ్య ప్రధాన పోటీ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ తరఫున మాణిక్‌రావ్ గావిత్ పోటీ చేస్తుండగా, బీజేపీ నుంచి ఎన్సీపీ నేత, మాజీ మంత్రి విజయ్‌కుమార్ గావిత్ కూతురు హీనా గావిత్ బరిలోకి దిగారు. రాయ్‌గఢ్‌లో ఎన్సీపీ అభ్యర్థి సునీల్ తట్కరే, శివసేన అభ్యర్థి అనంత్ గీతేల మధ్య ప్రధాన పోటీ జరుగుతోంది. నాసిక్‌లో ఎన్‌సీపీ అభ్యర్థిగా రాష్ట్ర ప్రజాపనుల శాఖ మంత్రి ఛగన్ భుజ్‌బల్, శివసేన అభ్యర్థి హేమంత్ గోడ్సే, ఎమ్మెన్నెస్ నుంచి ప్రదీప్ పవార్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆప్ తరఫున విజయ్ పాండరే బరిలో ఉన్నారు. దీంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది.
     
     బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య

     ఉత్తర ముంబై 21, వాయవ్య ముంబై 15, ఈశాన్య ముంబై 19, నార్త్ సెంట్రల్ ముంబై 21, దక్షిణ ముంబై 21, దక్షిణ మద్య ముంబై 10, ఠాణే 26, కళ్యాణ్ 18, భివండీ 10, పాల్ఘర్ 10, రాయ్‌గఢ్ 10, నందుర్బార్ 9, ధులే 19, జల్‌గావ్ 20, రావేర్ 23, జాల్నా 22, ఔరంగాబాద్ 27, దిండోరి 10, నాసిక్ 15.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement