మోడీ కోసం జశోదా బెన్ మౌన తపస్సు!
ఎక్కడో కుగ్రామంలో ప్రైమరీ స్కూలు టీచర్ గా పనిచేసి, రిటైర్ అయిన జశోదా బెన్ ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తి అయింది. దశాబ్దాలుగా అజ్ఞాత జీవితం గడుపుతున్న జశోదా బెన్ చుట్టూ ఇప్పుడు టీవీ ఛానెళ్ల కెమెరాలు, విలేఖరులు తిరుగుతున్నారు.
నరేంద్ర మోడీ భార్య జశోదా బెన్ కు ఇదేమీ కొత్త కాదు. గత పలు సంవత్సరాలుగా ఆమెచేత ఏదో ఒకటి మాట్లాడించేందుకు మీడియా చేయని ప్రయత్నం లేదు. మోడీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయించడానికి కూడా చాలా ప్రయత్నాలే జరిగాయి. కానీ అవేవీ ఫలించలేదు.
ఆమె నరేంద్ర మోడీ ఎప్పుడు టీవీలో కనిపించినా వింటూంటారు. అంతే కాదు. మోడీ విజయం సాధించాలని నోములు వ్రతాలు చేస్తూంటారు. ప్రస్తుతం ఆమె చార్ ధామ్ యాత్రకు బయలుదేరారు. ఆమె రోజు రోజంతా భజనలు, కీర్తనల్లో గడుపుతూంటారు. నరేంద్ర మోడీ కోసం ఆమె కాళ్లకి చెప్పులు వేసుకోనని ఒట్టు పెట్టుకున్నారు.
నరేంద్ర మోడీకి, జశోదాబెన్ కి 1968 లో పెళ్లైంది. అప్పటికి ఆమెకు 17 ఏళ్లు. మోడీకి 19 ఏళ్లు. వారిద్దరూ మూడేళ్లు భార్యాభర్తలుగా ఉన్నారు. అయితే ఈ మూడేళ్లలో వారు కలిసున్నది కేవలం మూడు నెలలే. మోడీ నిరంతరం ఆర్ ఎస్ ఎస్ పనిలో నిమగ్నమై ఉండేవారు. ఇంట్లో ఉన్నంత సేపూ ఏదో ఒకటి చదువుతూనే ఉండేవారని ఆమె చెప్పారు.
'మేము ఒకరినొకరు ఏమీ అనుకోలేదు. ఇన్నేళ్లలో ఒకరినొకరు కలుసుకునేందుకు కూడా ప్రయత్నించలేదు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకోలేదు.' అంటారు జశోదాబెన్.