రాష్ట్రాల వారిగా ఎన్నికల ఫలితాలు | General Election results announced state wise | Sakshi
Sakshi News home page

రాష్ట్రాల వారిగా ఎన్నికల ఫలితాలు

Published Sun, May 18 2014 3:25 AM | Last Updated on Fri, Mar 29 2019 5:57 PM

General Election results announced state wise

గుజరాత్: బీజేపీ, కాంగ్రెస్ మధ్య తేడా 26% ఓట్లు
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్‌లో ఆ పార్టీకి ఈసారి 12.6 శాతం ఓట్లు అదనంగా రావటంతో క్లీన్ స్వీప్ చేసేసింది. ఎన్నికల్లో పోలైన ఓట్లలో 59.1 శాతం (1.52 కోట్లు) ఓట్లు బీజేపీకే పడ్డాయి. కాంగ్రెస్‌కు కేవలం 32.9 శాతం (84.86 లక్షలు) ఓట్లే దక్కాయి. రాష్ట్రంలోని 26 లోక్‌సభ సీట్లనూ బీజేపీ గెలుచుకోగా.. ఒక్క సీటూ దక్కించుకోలేక కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 46.5 శాతం ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 43.2 శాతం ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 11 సీట్లు గెలుచుకోగా బీజేపీ 15 సీట్లు గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా 3.3 శాతం మాత్రమే ఉంటే.. ఇప్పుడది ఏకంగా ఏకంగా 26.2 శాతానికి పెరిగింది.
 
 మహారాష్ట్ర: బీజేపీ వైపు భారీ స్వింగ్
 మహారాష్ట్రలో బీజేపీ - శివసేన కూటమికి ఈసారి భారీ స్థాయిలో 15.03 శాతం ఓట్లు పెరిగాయి. ఈ రెండు పార్టీలతో పాటు స్వాభిమాన్ పక్ష్ పార్టీ కలిసి కూటమిగా పోటీ చేయగా.. అన్నిటికీ కలిపి 50.2 శాతం ఓట్లు పోలయ్యాయి. దీంతో రాష్ట్రంలోని 48 లోక్‌సభ సీట్లలో 42 సీట్లు ఈ కూటమి సొంతమయ్యాయి. ఇక అధికార కాంగ్రెస్ - ఎన్‌సీపీ కూటమికి కేవలం 34.1 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. ఇది బీజేపీ కూటమి కన్నా 16.1 శాతం తక్కువ. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ - ఎన్‌సీపీలకు 38.89 శాతం ఓట్లు లభించగా.. బీజేపీ-శివసేనలకు 35.17 శాతం లభించాయి. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ 23, శివసేన 18, స్వాభిమాన్ పక్ష్ 1 సీటు చొప్పున మొత్తం 42 సీట్లు గెలుచుకున్నాయి.
 
 తమిళనాడు: పురుచ్చితలైవి ప్రభంజనం
ఈ ఎన్నికల్లో దేశమంతటా మోడీ సునామీ చుట్టేస్తే.. తమిళనాడులో మాత్రం పురుచ్చితలైవి పెను ప్రభంజనం కనిపించింది. ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకేకు అనుకూలంగా.. ఐదూ పది కాదు.. ఏకంగా 21.3 శాతం ఓట్లు స్వింగయ్యాయి. ప్రధాన ప్రత్యర్థి డీఎంకే, కాంగ్రెస్‌లు తుడిచిపెట్టుకుపోయాయి. 2009 ఎన్నికల్లో 23 శాతం ఓట్లు తెచ్చుకున్న జయలలిత పార్టీకి ఈసారి దాదాపు రెట్టింపు స్థాయిలో 44.3 శాతం ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలోని 39 లోక్‌సభ సీట్లలో నాటి ఎన్నికల్లో కేవలం 9 సీట్లు గెలుచుకోగలిగిన అన్నా డీఎంకే ఈసారి ఏకంగా 37 సీట్లు సొంతం చేసుకుంది.
 
 ఉత్తరప్రదేశ్:
కమలం ఆల్‌టైమ్ రికార్డ్
 లోక్‌సభకు గుండెకాయ వంటి ఉత్తరప్రదేశ్‌లో మోడీ సునామీలో ప్రత్యర్థి పార్టీలన్నీ చిత్తయ్యాయి. ఈ ఎన్నికల ముందు వరకూ యూపీ లో బీజేపీకి అత్యధిక ఓట్ షేర్ 36.49 శాతమైతే.. ఇప్పుడది 42.3 శాతానికి పెరిగింది. బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రావటంలో సింహ భాగం ప్రస్తుత యూపీలోని 80 సీట్లలో 71 సీట్లను ఆ పార్టీ సొంతం చేసుకుంది. బీఎస్‌పీ 33 సీట్లలో రెండో స్థానంలో నిలిచినప్పటికీ.. ఆ పార్టీకి పోలైన ఓట్ల శాతం 2009 కన్నా భారీగా తగ్గిపోయింది. గత ఎన్నికల్లో 27.42 శాతం ఓట్లు తెచ్చుకున్న బీఎస్‌పీకి ఇప్పుడు 19.6 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక అధికార సమాజ్‌వాది పార్టీకి 2009లో 23.26 శాతంగా ఉన్న ఓట్లు ఇప్పుడు 22.2 శాతానికి తగ్గాయి.
 
 కర్ణాటక: ఏడాదికే పుంజుకున్న కమలం
 కాంగ్రెస్ పాలనలోని కర్ణాటకలో బీజేపీ కేవలం 2.2 శాతం ఓట్ల తేడాతో అధికార పార్టీపై ఆధిపత్యం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40.8 శాతం ఓట్లు పోలవగా.. బీజేపీకి 43 శాతం ఓట్లు లభించాయి. ఇది 2009 ఎన్నికల్లో వచ్చిన 41.63 శాతం కన్నా స్వల్పంగా అధికం. అయితే.. సరిగ్గా ఏడాది కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 19.9 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. రాష్ట్రంలోని 28 లోక్‌సభ సీట్లలో 2009లో 19 సీట్లు గెల్చుకున్న బీజేపీ ఇప్పుడు 17 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి 9 సీట్లు దక్కగా.. మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవెగౌడ నేతృత్వంలోని జేడీఎస్ 11 శాతం ఓట్లతో 2 సీట్లు కైవసం చేసుకుంది.
 
 పంజాబ్: ఇద్దరినీ దెబ్బతీసిన ఆప్

 మొన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ.. తాజా లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోటీకి దిగినప్పటికీ పంజాబ్‌లో మాత్రమే ప్రత్యర్థులు నిర్ఘాంతపోయేలా ప్రభావం చూపగలిగింది. ఆప్ తొలిసారి బరిలోకి దిగిన పంజాబ్‌లో ఏకంగా 24.4 శాతం ఓట్లు సొంతం చేసుకుని అధికార శిరోమణి అకాలీదళ్‌తో పాటు.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీనీ ఖంగుతినిపించింది. అకాలీదళ్‌కు ఆప్‌కు మధ్య తేడా రెండు శాతం ఓట్లు కూడా లేదు. అకాలీదళ్‌కు 26.3 శాతం ఓట్లు మాత్రమే పోలవగా.. దాని మిత్రపక్షమైన బీజేపీకి కేవలం 8.7 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్రంలోని 13 లోక్‌సభ స్థానాల్లో అకాలీదళ్, ఆప్‌లకు చెరో 4 సీట్లు దక్కగా.. బీజేపీకి 2 సీట్లు లభించాయి.
 
 బీహార్: బీజేపీకి రెట్టింపయిన ఓట్లు, సీట్లు
 మోడీ హవాతో బీహార్‌లో బీజేపీ, దాని మిత్రపక్షమైన ఎల్‌జేపీలకు అనుకూలంగా భారీ స్వింగ్ నమోదైంది. 2009లో కేవలం 13.93 శాతం ఓట్లు తెచ్చుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లో ఏకంగా 35 శాతం ఓట్లు సొంతం చేసుకుంది. దీంతో జేడీ(యూ), ఆర్‌జేడీలను మట్టికరిపిస్తూ రాష్ట్రంలోని 40 సీట్లలో బీజేపీ కూటమి 31 సీట్లు తన ఖాతాలో వేసుకుంది. 2009 ఎన్నికల్లో నితీశ్‌కుమార్‌తో పొత్తుతో పోటీ చేసినప్పుడు కూడా బీజేపీ కూటమికి 30 సీట్లు వచ్చాయి. అయితే అప్పుడు బీజేపీకి కేవలం 12 సీట్లు మాత్రమే వస్తే ఈసారి ఏకంగా 22 సీట్లు గెలుచుకుంది.
 
 ఒడిశా: బీజేడీ ఆధిక్యం సంపూర్ణం
 ఒడిశాలో బిజూ జనతాదళ్‌కు అనుకూలంగా పెరిగిన ఆరు శాతం ఓట్లు ఆ పార్టీకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టాయి. రాష్ట్రంలో నవీన్‌పట్నాయక్ సర్కారు వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావటంతో పాటు.. రాష్ట్రంలోని 21 లోక్‌సభ స్థానాల్లో 20 సీట్లను సొంతం చేసుకోవటానికి ఈ ఆరు శాతం ఓట్ల పెరుగుదలే కారణం. మొత్తం 147 శాసనసభ స్థానాల్లో బీజేడీ 117 సీట్లను గెలుచుకుంది. 2009 ఎన్నికల్లో ఆ పార్టీకి 103 అసెంబ్లీ సీట్లు, 14 లోక్‌సభ సీట్లు వచ్చాయి. నవీన్ పార్టీకి ఆ ఎన్నికల్లో 37.23 శాతం ఓట్లు రాగా.. తాజా ఎన్నికల్లో అది 44.1 శాతానికి పెరిగింది. అదే సమయంలో.. ఒడిశాలో 2009లో కాంగ్రెస్‌కు 32.75 శాతం ఓట్లు పోలవగా ఈసారి అది 26 శాతానికి పడిపోయింది. 6.75 శాతం ఓట్లు తగ్గిపోవటంతో కాంగ్రెస్ ఈసారి ఖాతా కూడా తెరవలేకపోయింది. 2009లో బీజేపీకి 21.5 శాతం ఓట్లు పోలవగా ఈసారి అది 16.89 శాతానికి పడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement