sikkim democratic front
-
బీజేపీ తదుపరి ఆపరేషన్ ఆకర్ష్.. సిక్కిం?
గ్యాంగ్‌టక్ : సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ(సీడీఎఫ్) నుంచి 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీలో చేరారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సమక్షంలో వారు కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం సిక్కింలో బీజేపీకి ఒక్క సీటుకూడా లేకపోవడం గమనార్హం. దీంతో సిక్కింలో ప్రతిపక్షపార్టీ అయిన సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీని తాజా చేరికలతో బీజేపీ విలీనం చేసుకోవడంతో ఆ పార్టీ అక్కడ రెండోస్థానంలో నిలిచింది. 25 సంవత్సారలకుపైగా సిక్కిం డెమోక్రటిక్‌పార్టీ అధ్యక్షుడు పవన్‌కుమార్ చామ్లింగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా పాలన అందించారు. ఆయన దేశంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. 2019లో పార్లమెంటు ఎన్నికలతో పాటు జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ స్వల్ప తేడాతో ఓటమి చవిచూసింది. ఇప్పుడీ తాజా చేరికలతో ఆ పార్టీలో కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే మిగిలారు. 2019లో మొత్తం 32 స్థానాలకు ఎన్నికలు జరుగగా 17 స్థానాలు గెలుచుకొని ప్రేమ్‌సింగ్ తమంగ్ నేతృత్వంలోని సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. అక్కడ బీజేపీ పోటీచేసినా ఒక్కసీటు కూడా గెలుచుకోలేదు. ఇప్పుడు ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలు చేరడంతో అక్కడ కూడా బీజేపీ పార్టీ బలపడినట్లయింది. పార్టీమారిన ఓ ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘ప్రధాని నరేంద్రమోదీ లుక్ ఈస్ట్ విధానం నచ్చిందని, మేం సిక్కింలో కమల వికాసం కోరుకుంటున్నామని’ అన్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మాట్లాడుతూ సిక్కింలో ఇక నుంచి మేం నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తామని తెలిపారు. పార్టీలో ఎమ్మెల్యేలు చేరితే ఫిరాయింపులను ప్రోత్సహించిందనే నిందను మోయకుండా మూడింట రెండు వంతుల సంఖ్యలో పార్టీలో చేర్చుకుంటూ రాజ్యాంగబద్దంగానే బీజేపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని సీడీఎఫ్ పార్టీ ఎమ్మెల్యే ఒకరు విమర్శించారు. సిక్కింలో కూడా పాగా వేస్తే సెవెన్ సిస్టర్స్ అని పిలుచుకునే ఈశాన్య రాష్ట్రాలలో పది సంవత్సరాల క్రితం ఉనికిలో కూడా లేని బీజేపీ నేడు సిక్కిం మినహా మిగతా అన్ని ఈశాన్యరాష్ట్రాలలో ఏదో ఒక విధంగా అధికారంలో ఉంది. ఇక సిక్కింలో తాజా చేరికలతో ఆ పార్టీ అధికారానికి కేవలం ఆరుగురు ఎమ్మెల్యేల దూరంలో ఉంది. అక్కడ రెండు ఎమ్మెల్యే స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నందున, అలాగే అధికార పార్టీకి మెజార్టీ తక్కువ ఉండటం, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టులో బీజేపీ కేసు వేయడం చూస్తుంటే అతి దగ్గరలోనే మరో కర్ణాటక, గోవా రాజకీయాలను సిక్కింలో చూస్తామనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా సిక్కిం రాష్ట్రం నేపాల్, చైనా, భూటాన్ దేశాల సరిహద్దులో ఉండటంతో వ్యూహాత్మకంగా భారత్‌కు కీలకమైన రాష్ట్రంగా ఉంది. -
సుదీర్ఘ సీఎం.. చామ్లింగ్
గ్యాంగ్‌టక్: సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్(67) భారత దేశ రాజకీయాల్లో కొత్త శకానికి తెరతీశారు. అత్యంత సుదీర్ఘ కాలం సీఎంగా కొనసాగిన నాయకుడిగా శనివారం రికార్డు సృష్టించారు. ఇంతకు ముందు ఈ అరుదైన ఘనత పశ్చిమ బెంగాల్ దివంగత ముఖ్యమంత్రి జ్యోతిబసు పేరిట ఉంది. నిర్విరామంగా ఐదోసారి సీఎంగా సేవలందిస్తున్న చామ్లింగ్ పదవీకాలం వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికల వరకు ఉంది. 1994 డిసెంబర్ 12న చామ్లింగ్ తొలిసారి సిక్కిం ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్(ఎస్డీఎఫ్)ని వరుసగా ఐదుస్లారు(1994, 99, 2004, 09, 14) అధికారంలోకి తీసుకొచ్చారు. జ్యోతిబసు 1977 జూన్ 21 నుంచి 2000 నవంబర్ 6 వరకు( 23 ఏళ్లకు పైనే– 8,540 రోజులు) ఐదుసార్లు పశ్చిమబెంగాల్ సీఎంగా పనిచేశారు. ఈ రికార్డును చామ్లింగ్ తాజాగా తిరగరాశారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకం వల్లే ఈ ఘనత సాధించినట్లు చామ్లింగ్ చెప్పారు. ‘ సిక్కిం ప్రజలందరికీ ఎంతో రుణపడి ఉంటా. నాపై వారికి నమ్మకం లేకుంటే నేనీ స్థానంలో ఉండే వాడిని కాదు. ఈ క్రెడిట్ అంతా సిక్కిం ప్రజలదే’ అని తెలిపారు. ఈ సందర్భంగా హడావుడి, ఆర్భాటాలతో వేడుకలు నిర్వహించబోమని వెల్లడించారు. -
ఆయన ఆ పదవిని 5వ సారి అలంకరిచబోతున్నారు!
గ్యాంగ్టాక్: పవన్ చామ్లింగ్ అయిదవసారి సిక్కిం ముఖ్యమంత్రిగా అధికార పీఠాన్ని అధిష్టించనున్నారు. ఈ నెల 21 బుధవారం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ సారథిగా చామ్లింగ్‌ను 22 మంది ఎమ్మెల్యేలు సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మే 16 నాటి ఎన్నికల ఫలితాల్లో 32 మంది సభ్యులున్న సిక్కిం అసెంబ్లీలో 22 చోట్ల ఎస్డీఎఫ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు దేశంలోనే ఎక్కువకాలం 23 ఏళ్లపాటు సీఎంగా జ్యోతి బసు రికార్డును సృష్టించారు. వరుసగా ఐదో సారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించనున్న చామ్లింగ్ ఆ రికార్డును అధిగమించాలంటే మూడేళ్లలో అధిగమించనున్నారు. -
జ్యోతిబసు రికార్డుకు పవన్ చామ్లింగ్ ఎసరు!
ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని నడపటమే గగనంగా మారిన ఈ రోజుల్లో వరుసగా 20 ఏళ్లపాటు అధికారంలో కొనసాగడమంటే మామూలు విషయం కాదు. సిక్కింలో పవన్ కుమార్ చామ్లింగ్ త్వరలోనే ఓ రికార్డును సొంతం చేసుకోనున్నారు. వరుసగా 23 ఏళ్లపాటు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన జ్యోతిబసు రికార్డుపై చామ్లింగ్ కన్నేశారు. త్వరలోనే జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్ట్ యోధుడు జ్యోతిబసు రికార్డును తిరగరాసేందుకు సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్ సిద్దమవుతున్నారు. ఈ సంవత్సరం జరిగే అసెంబ్లీలో ఎన్నికల్లో చామ్లింగ్ విజయం సాధిస్తే వరుసగా ఐదవసారి ఎన్నికైన ముఖ్యమంత్రిగా రికార్డుల్లోకి ఎక్కుతారు. 1994 డిసెంబర్ 12 తేది నుంచి సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఎస్ డీఎఫ్) ప్రభుత్వాన్ని నడుపుతున్న చామ్లింగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా 20 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. 23 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా సేవలందించిన రికార్డు జ్యోతిబసుపై ఉంది. జ్యోతిబసు 1977 జూన్ 21 నుంచి 2005 నవంబర్ 5 తేది వరకు అధికారంలో కొనసాగారు. ఆతర్వాత బుద్దదేవ్ భట్టాచార్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 12 తేదిన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో చామ్లింగ్ ప్రభుత్వం విజయం సాధిస్తే జ్యోతిబసు రికార్డును అధిగమించే అవకాశం ఉంది. జ్యోతిబసు రికార్డును చామ్లింగ్ అధిగమించే అంశాన్ని సిక్కిం రాష్ట్రంలోని 3,70,000 లక్షల ఓటర్లు ఏప్రిల్ 12 తేదిన నిర్ణయించనున్నారు. 2009 ఎన్నికలల్లో ఎస్ డీఎఫ్ 32 సిట్లు గెలుచుకుని అధికారాన్ని కైవసం చేసుకుంది. చామ్లింగ్ కు ఓటర్లు అవకాశాన్ని అందిస్తారా లేదా అనే విషయం త్వరలోనే స్పష్టమవ్వడం ఖాయం. -
మోడీ కంటే మంచి సీఎం, గుజరాత్ కన్నా మంచి రాష్ట్రం!
నరేంద్ర మోడీని భుజం మీద మోసుకుంటే తిరిగే నమో అభిమానులారా మీకు నమో నమ! మీ మోడీ గారికి కూడా అసూయ కలిగించేంత గొప్ప రికార్డున్న మరో సీఎం ఉన్నాడు. ఆయనకి 1994 నుంచి ఓటమి తెలియదు. గత అయిదేళ్లుగా ఆయన శాసన సభలో ఉన్న అన్ని సీట్లూ ఆయన పార్టీవే. అంతే కాదు. దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న జనాభా అత్యంత తక్కువగా ఉన్న రాష్ట్రం ఆయనదే. ప్రతి మారుమూల గ్రామంనుంచి రాజధానికి మోటర్లో వెళ్లే రోడ్లున్న రాష్ట్రం ఆయనదే. గొడవలు, కొట్లాటలు లేని రాష్ట్రం ఆయనదే. మరో రెండేళ్లాగితే పూర్తి స్థాయి రుణముక్త రాష్ట్రం ఆయనదే అవుతుంది. అసలాయనకు ప్రతిపక్షమే లేదు. దేశం లో ప్లాస్టిక్ వాడకం అసలే లేని రాష్ట్రం ఆయనదే. ఆయనెవరా అని అనుకుంటున్నారా? ఆయన పేరు పవన్ కుమార్ చామ్లింగ్. ఆ రాష్ట్రం పేరు సిక్కిం. సిక్కిం లోకసభకి పంపేది ఒకే ఒక ఎంపీని. అందుకే అక్కడ ఎంపీ ఎన్నికలపై ఎవరికీ ఆసక్తి లేదు. ఎంపీ ఎన్నికలతో పాటు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపైనే అందరి ఆసక్తి. 32 మంది ఎంఎల్ ఏల కోసమే ఇప్పుడు అసలు పోటీ. ఆయన గ్రామపంచాయత్ అధ్యక్ష పదవి నుంచి పైకెదిగారు. మొదట్లో సిక్కిమ్ సంగ్రామ పరిషద్ లో ఎమ్మెల్యే అయ్యారు. తరువాత అప్పటి ముఖ్యమంత్రి నర బహదూర్ భండారీ నియంతృత్వ పోకడలని నిరసించి సిక్కిం డెమాక్రటిక్ ఫ్రంట్ ను స్థాపించారు. ఆయన భండారీకి వ్యతిరేకంగా గట్టిపోరే చేశారు. ఒక సందర్భంలో ఆయన అసెంబ్లీలోకి ఒక కొవ్వొత్తిని వెలిగించి మరీ తీసుకొచ్చారు. ఏమిటి సంగతి అని అందరూ అడిగితే 'నేను అసెంబ్లీలో ప్రజాస్వామ్యం ఎక్కడనా కనిపిస్తుందేమో అని వెతుకుతున్నాను' అని జవాబిచ్చారట. పవన్ చామ్లింగ్. ఆయన పార్టీ ఈ సారి కూడా క్లీన్ స్వీప్ చేస్తారా? లేక కొత్త రాజకీయ శకం మొదలవుతుందా అన్నది ఇప్పుడు సిక్కింలో అసలు ప్రశ్న. అక్కడ రాహుల్ వర్సెస్ మోడీ పోటీ లేదు. అసలు వారిద్దరి గురించి ఎవరికీ పెద్దగా పట్టింపు లేదు. ఒక్క ఊరు తన మనసు మార్చుకున్నా అక్కడ ఎన్నికల ఫలితం తారుమారైపోతుంది. అందుకే అందరికీ సిక్కిం ఎన్నికలంటే అంత ఆసక్తి.