జ్యోతిబసు రికార్డుకు పవన్ చామ్లింగ్ ఎసరు!
ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని నడపటమే గగనంగా మారిన ఈ రోజుల్లో వరుసగా 20 ఏళ్లపాటు అధికారంలో కొనసాగడమంటే మామూలు విషయం కాదు. సిక్కింలో పవన్ కుమార్ చామ్లింగ్ త్వరలోనే ఓ రికార్డును సొంతం చేసుకోనున్నారు. వరుసగా 23 ఏళ్లపాటు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన జ్యోతిబసు రికార్డుపై చామ్లింగ్ కన్నేశారు. త్వరలోనే జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్ట్ యోధుడు జ్యోతిబసు రికార్డును తిరగరాసేందుకు సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్ సిద్దమవుతున్నారు.
ఈ సంవత్సరం జరిగే అసెంబ్లీలో ఎన్నికల్లో చామ్లింగ్ విజయం సాధిస్తే వరుసగా ఐదవసారి ఎన్నికైన ముఖ్యమంత్రిగా రికార్డుల్లోకి ఎక్కుతారు. 1994 డిసెంబర్ 12 తేది నుంచి సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఎస్ డీఎఫ్) ప్రభుత్వాన్ని నడుపుతున్న చామ్లింగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా 20 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. 23 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా సేవలందించిన రికార్డు జ్యోతిబసుపై ఉంది. జ్యోతిబసు 1977 జూన్ 21 నుంచి 2005 నవంబర్ 5 తేది వరకు అధికారంలో కొనసాగారు. ఆతర్వాత బుద్దదేవ్ భట్టాచార్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
ఏప్రిల్ 12 తేదిన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో చామ్లింగ్ ప్రభుత్వం విజయం సాధిస్తే జ్యోతిబసు రికార్డును అధిగమించే అవకాశం ఉంది. జ్యోతిబసు రికార్డును చామ్లింగ్ అధిగమించే అంశాన్ని సిక్కిం రాష్ట్రంలోని 3,70,000 లక్షల ఓటర్లు ఏప్రిల్ 12 తేదిన నిర్ణయించనున్నారు. 2009 ఎన్నికలల్లో ఎస్ డీఎఫ్ 32 సిట్లు గెలుచుకుని అధికారాన్ని కైవసం చేసుకుంది. చామ్లింగ్ కు ఓటర్లు అవకాశాన్ని అందిస్తారా లేదా అనే విషయం త్వరలోనే స్పష్టమవ్వడం ఖాయం.