SDF
-
రైతుల ఆత్మహత్యలపై స్పందన ఏదీ?
పంజగుట్ట: రాష్ట్రంలో సిరులు కురిపిస్తున్న సేద్యం అని బీఆర్ఎస్ ప్రభుత్వం డప్పులు కొట్టుకుంటోందని... అయితే రాష్ట్రం వచ్చిన 9 సంవత్సరాల్లో 7007 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని మాత్రం చెప్పడం లేదని పలువురు వక్తలు ఆరోపించారు. సోషల్ డెమొక్రటిక్ ఫోరమ్ (ఎస్డీఎఫ్) ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో “తెలంగాణలో వ్యవసాయం ఎట్లుండాలి?’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రొఫెసర్ పద్మజాషా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్డీఎఫ్ కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నాగిరెడ్డి, కో కన్వినర్లు కన్నెగంటి రవి, పృధ్విరాజ్ యాదవ్, ప్రొఫెసర్ రమ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో వ్యవసాయం ఎట్లుండాలి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని అన్ని పార్టీల అధ్యక్షులకు ఇచ్చి వారి మేనిఫెస్టోలో పెట్టాలని సూచించనున్నట్లు వారు తెలిపారు. అనంతరం ఆకునూరి మురళి మాట్లాడుతూ... రాష్ట్రంలో 59 లక్షల రైతులు కోటి 45 లక్షల భూమిని సాగుచేస్తున్నారన్నారు. వారికి 3.2 టన్నుల విత్తనాలు అవసరమున్నదని రాష్ట్ర ప్రభుత్వం విత్తన అభివృద్ధి సంస్థ పాత్ర రోజురోజుకూ తగ్గించడంతో నకిలీ విత్తనాలు అమ్మే మోసగాళ్లు పెరిగి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాలకు సంబంధించి సమగ్ర చట్టం విత్తన విధానం తీసుకురావాలని సూచించారు. రైతుల వ్యవహారాలకు సంబంధించి ఎప్పటికప్పుడూ నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో సహకరించేందుకు రాజ్యాంగ బద్ద సంస్థ ఒక వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాలని దానికి ప్రతి సంవత్సరం రూ. 100 కోట్ల బడ్జెట్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కమిషన్ అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర నిర్ణయించడం, విత్తనాలు సరఫరా, నాణ్యమైన విత్తనలు, జన్యుపరంగా మార్పు చేసి ఇవ్వాలన్నారు. క్రిమి సంహారక మందులు కూడా ఏ పంటకు ఏ మేర క్రిమిసంహారక మందులు వాడాలో సూచించాలన్నారు. రైతుబంధు పథకం చిన్న, సన్నకారు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, దీన్ని కొనసాగిస్తూనే పది ఎకరాలు పైబడి మాగాణి, వర్షాధార భూములు ఉన్న వారికి ఇవ్వరాదన్నారు. ఆదాయపు పన్ను కట్టే ఏ రైతుకుటుంబానికి, భూ యజమానులకు రైతుబందు ఇవ్వకూడదని, ఇతరదేశాల్లో స్థిరపడి ఉన్న భూ యజమానులకూ ఇవ్వరాదని సూచించారు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఎలాంటి పంటల బీమా లేని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు. ప్రతి సంవత్సరం కరువుతోనో, అధిక వర్షాలతోనో రైతులు నష్టపోతూనే ఉన్నారని ఏ ఒక్క రైతుకూడా నష్టపోకుండా పటిష్టమైన పంటల బీమా వర్తింపచేయాలన్నారు. రైతులు బాగుపడేందుకు ప్రభుత్వం రూ. 38500 కోట్లు అవసరం అవుతాయని ప్రతి సంవత్సరం అదనంగా రూ. 6400 కోట్లు కేటాయించాలని సూచించారు. సమావేశంలో రంజిత్ కుమార్, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్లకూ ఓ ఖజానా
సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లా కలెక్టర్లకు అధికారం, దర్పం, హోదా ఉన్నప్పటికీ ఇప్పటివరకు సొంతంగా అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు చేసేందుకు చిల్లిగవ్వ కూడా వారి ఖజానాలో లేని దుస్థితి. ఆసుపత్రి అభివృద్ధి నిధులనో, ఖనిజాభివృద్ధి నిధులనో ఖర్చు చేయాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో కలెక్టర్లకు ఓ ఖజానాను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో కలెక్టర్‌కు ఏడాదికి ప్రత్యేకంగా రూ.15 కోట్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల కలెక్టర్లకు రూ.195 కోట్లు కేటాయించింది. ఈ నిధుల వినియోగంలో రాజకీయ జోక్యానికి తావులేకుండా.. కలెక్టర్ల విచక్షణకు అనుగుణంగా సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చించే అధికారాన్ని ప్రభుత్వం కట్టబెట్టింది. విద్యార్థులకు తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించడం, పారిశుధ్య నిర్వహణ, చిన్నచిన్న మరమ్మతులకు ఈ నిధులను ఖర్చు చేయొచ్చు. ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు నిధులు విడుదల చేసింది. అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఇప్పటికే రూ.6.5 కోట్ల మేర నిధుల వినియోగానికి టెండర్లు పిలిచారు. టెండర్ల ద్వారానే అన్ని పనులు వాస్తవానికి గతంలో వెనుకబడిన జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి నిధులను(ఎస్డీఎఫ్) కేటాయించింది. ఒక్కో జిల్లాకు ఏడాదికి రూ.50 కోట్లు ఇచ్చింది. ఈ నిధులను ఖర్చు చేసే అధికారాన్ని కలెక్టర్లకే అప్పగించింది. కానీ, నిధుల వినియోగంలో నేరుగా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. కేంద్రం ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం రెయిన్గన్ల కొనుగోలు, సీసీ రోడ్ల నిర్మాణం వంటి పనులకు ఖర్చు చేసింది. ఇందులో కొన్ని పనులను అప్పటి అధికార పార్టీ నేతలకు నామినేషన్‌పై అప్పగించారు. ఇప్పుడు కలెక్టర్లకు ఇచ్చిన నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఏ పని అయినా టెండర్ ద్వారానే అప్పగించాలని స్పష్టం చేసింది. అనంతపురం జిల్లాలో రూ.6.5 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. ఎక్కడా నామినేషన్ పద్ధతిని పాటించడం లేదు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం మాకు ప్రత్యేకంగా కేటాయించిన బడ్జెట్‌ను సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేస్తాం. తద్వారా రానున్న రెండేళ్లల్లో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల రూపురేఖలు మారిపోనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజాదరణ పెరుగుతోంది. ఈ ఏడాది అడ్మిషన్లు పెరిగాయి. వచ్చే రెండేళ్లలో పరిస్థితిలో మరింత సానుకూల మార్పు రావడం ఖాయం’’ అని అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ చెప్పారు. -
‘వార్ వన్ సైడే.. వైఎస్ జగన్ సీఎం అవ్వడం ఖాయం’
సాక్షి, విజయవాడ : ఐదేళ్ల చంద్రబాబు పాలన అంతా మోసమోననీ.. ఈ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవుతుందని.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మాదగాని గురునాధం స్పష్టం చేశారు. ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బహుజన రాజకీయ జనచైతన్య బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనం పడుతున్నారని తెలిపారు. దళితులకు ఏ రాయితీలు రాలేదదని, మధ్యలో దళారీలు మోసం చేస్తున్నారని తమ ఆవేదను బస్సు యాత్రలో వెల్లిబుచ్చుకుంటున్నారన్నారు. పథకాలు గ్రౌండ్ లెవల్లో ఎవరికీ చేరడంలేదని, జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు, బీసీ డిక్లరేషన్‌కు ప్రజలనుంచి మంచి ఆదరణ లభిస్తోందని, రాబోయే ఎన్నికల్లో వార్ వన్ సైడేనని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమన్నారు. -
అదనపు లిక్విడిటీ వినియోగంపై కేంద్రం సమీక్ష
న్యూఢిల్లీ: వ్యవస్థలో ఉన్న అదనపు ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) వినియోగంపై శుక్రవారం బ్యాంకింగ్‌తో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక సమీక్ష నిర్వహించింది. ఇందుకు సంబంధించి స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్)ని ప్రవేశపెట్టే అంశంపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. కొందరు బ్యాంకర్లు దీనికి అంగీకరించగా, మరికొందరు స్కీమ్ మొత్తాన్ని మదింపు చేయడానికి మరికొంత సమయం కావాలని కోరినట్లు సమాచారం. ఎక్సే్ఛంజీలో ఎటువంటి హామీ అవసరం లేకుండా, అదనపు ద్రవ్య లభ్యతను వ్యవస్థ నుంచి వెనక్కు తీసుకోడానికి ఈ స్కీమ్‌ను ప్రతిపాదిస్తున్నారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పలు బ్యాంకుల చీఫ్‌లు పాల్గొన్నట్లు తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం జరిగిన భారీ డిపాజిట్ల వల్ల బ్యాంకుల వద్ద అధిక ద్రవ్య లభ్యత పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. -
సిక్కింలో స్వచ్ఛమైన దీపావళి !
గ్యాంగ్‌టక్: ధ్వని, గాలి కాలుష్యం జరగకుండా దీపావళి జరుపుకుని చిన్న రాష్ట్రం సిక్కిం ఆదర్శంగా నిలిచింది. ఇతర రాష్ట్రాలు చేయని విధంగా బాణాసంచాపై నిషేధం విధించి, ‘క్లీన్ అండ్ గ్రీన్’ దీపాల పండగను నిర్వహించింది. 2014లో దీపావళికి వెలువడిన శబ్ద కాలుష్యం, బాణాసంచా చెత్త వల్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. అదే ఏడాది డిసెంబర్ 19న అన్ని రకాల బాణాసంచాను సర్కారు నిషేధించింది. దీంతో 2015లో టపాసుల వాడకం 50 శాతానికి తగ్గింది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈసారి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వీధుల్లో చిన్నారులతో నాటకాలు వేయించారు. వీటికి ప్రజలు ముఖ్యంగా యువత నుంచి ఊహించని స్పందన లభించింది. -
కొత్త జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రులు
ఒక్కో మంత్రికి రెండు జిల్లాల అప్పగింత సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పునర్వ్యవస్థీకరణతో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా మంత్రులకు ఇన్చార్జ్ బాధ్యతలను అప్పగించాలని యోచిస్తోంది. నియోజకవర్గాల అభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక అభివృద్ధి నిధిని (ఎస్డీఎఫ్) ఖర్చు చేసే కీలక బాధ్యతలు ఇన్చార్జి మంత్రులకు అప్పగించిన విషయం తెలిసిందే. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు రూ.2 కోట్ల అభివృద్ధి నిధిని తెలంగాణ ప్రభుత్వం కేటాయిస్తోంది. ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలందరి కోసం ఆర్థిక సంవత్సరపు బడ్జెట్లో దాదాపు రూ.5,000 కోట్లు ప్రత్యేక నిధిగా పొందుపరిచారు. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటికి రూ.238 కోట్లు కేటాయించిన ప్రభుత్వం పనుల గుర్తింపు, మంజూరీ బాధ్యతలను ఇన్ఛార్జీ మంత్రులకు అప్పగించింది. గతంలో ఉన్న పది జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహించే మంత్రులు రాష్ట్ర కేబినెట్లో ఉన్నారు. దీంతో వారికే ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు. ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పడటంతో కొన్ని జిల్లాల నుంచి మంత్రివర్గంలో ప్రాధాన్యం లేకుండా పోయింది. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో పాటు 18 మంది మంత్రులున్నారు. కానీ జిల్లాల సంఖ్య 31కి చేరింది. దీంతో ఒక్కో మంత్రికి రెండు జిల్లాల చొప్పున ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వాల్సి ఉంది. ఎస్డీఎఫ్ నిధుల వినియోగపు అవసరాల దృష్ట్యా ప్రణాళిక విభాగం ఇన్చార్జ్ మంత్రుల ఫైలును సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి ఆమోదానికి పంపించినట్లు తెలిసింది. -
'ఉచిత యిసుక పేరుతో వందల కోట్ల లూటీ'
హైదరాబాద్: ఉచిత యిసుక పేరుతో కొన్ని వందల కోట్ల రూపాయాలు లూటీ చేసి టీడీపీ కార్యకర్తలకు దోచి పెడుతున్నారని వైఎస్సార్ సీపీ నాయకుడు పార్థసారధి ఆరోపించారు. అవినీతికి తావు లేకుండా ఉచిత యిసుక ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జన్మభూమి కమిటీలతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. జన్మభూమి కమిటీల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. జన్మభూమి కమిటీల అవినీతికి సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు. ఎస్డీఎఫ్ నిధుల కేటాయింపులో టీడీపీ ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎస్డీఎఫ్ ను, టీడీపీ సంక్షేమ నిధిగా మార్చేశారని ఆక్షేపించారు. ఓడిపోయిన వారికి, టీడీపీ కార్యకర్తలకు వందల కోట్లు కేటాయించడానికి సీఎంకు అధికారం ఉందా అని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తల పేరు మీద జీవోలు ఇచ్చి నిధులు కేటాయించడం సరికాదన్నారు. విచారణ జరిపి పక్షపాతధోరణితో కేటాయించిన నిధులు నిలుపుదల చేయాలని పార్థసారధి డిమాండ్ చేశారు. -
'ప్రభుత్వం మా చేతులు కట్టేస్తోంది'
హైదరాబాద్: నియోజక వర్గ శాసన సభ సభ్యులకు కెటాయించాల్సిన నిధులను స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ పేరుతో టీడీపీ కార్యకర్తలకు కెటాయించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన.. నియోజక వర్గ ప్రజలకు సేవ చేయాలని ఉన్నా ప్రభుత్వం ఇలాంటి చర్యలతో తమ చేతులు కట్టేస్తోందన్నారు. గతంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నియోజక వర్గ శాసన సభ్యలకు నిధులు కెటాయించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు శాసన సభ సభ్యులకు నిధులు కెటాయించం అని ప్రభుత్వం మొండిగా చెబుతుండటం సిగ్గుచేటన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు నిధులు కెటాయించనప్పుడు తనకు ప్రభుత్వం గౌరవ వేతనం ఇవ్వడం ఎందుకని ప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. నియోజక వర్గ శాసన సభ సభ్యులకు నిధులు కెటాయించకుండా అధికార పార్టీ నేతలు అగ్రగామి రాష్ట్రం పేరుతో నోటికొచ్చిన కూతలు కూస్తున్నారని ఆయన మండిపడ్డారు. -
ఎస్డీఎఫ్పై దద్దరిల్లిన ఏపీ అసెంబ్లీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బుధవారం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్(ఎస్డీఎఫ్)పై తీవ్ర దుమారం రేగింది. ఎస్డీఎఫ్ పేరుతో టీడీపీ నుంచి ఓడిపోయిన నేతలకు, ఆ పార్టీ ఇన్‌చార్జ్‌లకు నిధులు కేటాయించారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేలకు ఇవ్వకుండా టీడీపీ నేతలకు నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలు కందుల నారాయణ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరుతో ప్రభుత్వం ఎస్డీఎఫ్ నిధులు కెటాయించిన విషయాన్ని వైఎస్ జగన్ సభలో ప్రస్తావించారు. ఎస్డీఎఫ్ విషయంలో ప్రభుత్వ విధానంపై ప్రతిపక్ష వైఎస్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్రస్థాయిలో నినాదాలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో సభను 10 నిమిషాలు వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. -
అది టీడీపీ సంక్షేమ నిధి!
* ప్రత్యేక అభివృద్ధి నిధి అర్థం మార్చేసిన ముఖ్యమంత్రి * వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలున్న చోట్ల టీడీపీ ఇన్ఛార్జీల పేరుతో నిధులు * కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పేర్లను కూడా మార్చుతూ జీవోలు సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి ఇది పరాకాష్ట. ఇప్పటివరకూ మద్యం దుకాణాలు, ఇసుక రీచ్‌లను అధికార పార్టీ నేతలకు కట్టబెట్టిన సర్కారు ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి ఉద్దేశించిన ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్)ని కూడా వారికే దోచిపెడుతోంది. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, మౌలిక సౌకర్యాల కోసం స్థానిక ఎమ్మెల్యే సిఫార్సుల మేరకు ఎస్డీఎఫ్ నుంచి నిధులు కేటాయించాల్సి ఉండగా నిబంధనలు కాలరాసి టీడీపీ నేతల పేరుతో కేటాయింపులు సాగిస్తోంది. ఎస్డీఎఫ్ను నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలందరికీ సమానంగా పంచాల్సి ఉండగా... ముఖ్యమంత్రి విచక్షణాధికారం అనే అంశాన్ని అడ్డుగా పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు నిధులు అందకుండా చేస్తున్నారు. ప్రతిపక్షం ప్రాతినిధ్యం వహిస్తున్న చోట్ల టీడీపీ ఇన్‌ఛార్జిల పేరుతో నిధులు కేటాయిస్తూ... ప్రత్యేక అభివృద్ధి నిధిని టీడీపీ సంక్షేమ నిధిగా మార్చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం నియోజకవర్గ ఇన్చార్జిలనే ఎమ్మెల్యేలుగా పేర్కొంటూ వారి పేరుతో ప్రణాళిక శాఖ జీవోలు సైతం జారీ చేసింది. ఎస్డీఎఫ్ నిధుల విడుదలలో ఇలా అడ్డగోలుగా జీవోలు జారీ చేయడం ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి పరాకాష్టని అధికారులు, రాజకీయ పక్షాల నేతలు విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యేలనూ మార్చేసిన సర్కారు టీడీపీవారైతే చాలు... ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్యేగా పరిగణించాల్సిందే అనే ధోరణిలో ప్రభుత్వం ఉన్నట్లు ఎస్డీఎఫ్ నిధుల జారీ జీవోలను చూస్తే అర్థమవుతోంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజవకర్గానికి ఎమ్మెల్యేగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన భూమా అఖిల ప్రియను ప్రజలు ఎన్నుకున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి గంగుల ప్రభాకరరెడ్డినే ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా పరిగణిస్తోంది. ఎమ్మెల్యే ప్రభాకరరెడ్డి సిఫార్సుల మేరకు నియోజకవర్గంలోని 59 పనులకు రూ.రెండు కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రణాళిక శాఖ గురువారం విడుదల చేసిన జీవో-698 ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. పాణ్యం ఎమ్మెల్యేగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఉండగా... ఈ నియోజకవర్గానికి మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ప్రతిపాదన మేరకు నాలుగు పనులకు రూ. రెండు కోట్లు మంజూరు చేసినట్లు ఇదే జీవోలో పేర్కొన్నారు. శ్రీశైలం ఎమ్మెల్యేగా వైఎస్సార్సీపీకి చెందిన బుడ్డా రాజశేఖరరెడ్డిని ప్రజలు ఎన్నుకోగా... శిల్పా చక్రపాణిరెడ్డిని ఎమ్మెల్యేగా సర్కారు జీవో-657లో పేర్కొంది. ఆయన ప్రతిపాదనల మేరకు 54 పనులకు రూ. రెండు కోట్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. వాస్తవంగా శిల్పా చక్రపాణిరెడ్డి కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కర్నూలు జిల్లాకు చెందిన డోన్‌కు బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి (వైఎస్సార్సీపీ) ఎమ్మెల్యేగా ఉండగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఆయనను పక్కనపెట్టి నియోజవకర్గ టీడీపీ ఇన్‌ఛార్జి కేఈ ప్రతాప్ పేరుతో 86 పనులకు రూ. 2.10 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం గురువారం జీవో-695 జారీ చేసింది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి ఈయన (కేఈ ప్రతాప్) సోదరుడు కావడం గమనార్హం. ఇలాగే పలు నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను పక్కనబెట్టి తెలుగుదేశం నియోజవర్గ ఇన్ఛార్జీల పేరుతో నిధులు విడుదల చేస్తూ ప్రజాస్వామ్య విలువలను గంగలో తొక్కేస్తోంది. గిరిజన ఉప ప్రణాళిక (టీఎస్పీ) కింద స్థానిక ఎమ్మెల్యేకు సంబంధ లేకుండా నిధులు కేటాయించడం నిబంధనలకు విరుద్ధం. కానీ టీడీపీ సర్కారు నిబంధనలను తుంగలో తొక్కి విశాఖపట్నం అరకు ఎమ్మెల్యే కె.సర్వేశ్వరరావు (వైఎస్సార్సీపీ)ని కాదని టీడీపీ ఇన్‌ఛార్జి సివేరి సోమ పేరుతో జీవో జారీ చేయడం గమనార్హం. విచక్షణ కోల్పోయిన విచక్షణాధికారం! అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఏర్పాటైన ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్)ని ముఖ్యమంత్రి చంద్రబాబు విచక్షణారహితంగా వాడేస్తున్నారనడానికి స్వంత నియోజకవర్గానికి జరిపిన కేటాయింపులే నిదర్శనం. చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలోని 194 తారు రోడ్డు పనులకు రూ. 136.13 కోట్లు మంజూరు చేస్తూ గత ఏడాది జులై రెండో తేదీన ప్రభుత్వం జీవో-363 జారీ చేసింది. తదుపరి ఇదే నియోజకవర్గంలోని 582 ఆవాసాల్లో సిమెంటు రోడ్డు పనులకు రూ. 137.37 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం గత ఏడాది జూన్ 29వ తేదీన జీవో-349 జారీ చేసింది. ఇలా ఒకే ఆర్థిక సంవత్సరంలో సీఎం సొంత నియోజకవర్గానికి ఎస్డీఎఫ్ నుంచి రూ. 273.50 కోట్లు మంజూరు చేయడం గమనార్హం. సీఎం విచక్షణ మేరకు ఎస్డీఎఫ్ కేటాయింపులు అనే అంశాన్ని అడ్డుగా పెట్టుకుని ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గానికి అడ్డగోలుగా నిధులు కేటాయించుకుంటున్నారనడానికి ఇదే నిదర్శనం. -
‘ప్రత్యేక పనులకు’ పాతర
నీలగిరి : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్) కింద మంజూరైన పనులపై టీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి సారించింది. సొంత రాజకీయ ప్రయోజనాలు, నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు లబ్ధి చేకూర్చేందుకే నిధుల కేటాయింపు జరిగిందని ఆరోపణల నేపథ్యంలో ఆ పనులను నిలిపివేయాలని నిర్ణయించింది. ఎన్ని పనులు...ఎక్కడెక్కడ.. గతేడాది అక్టోబర్ 1 తర్వాత ఎస్డీఎఫ్ కింద మంజూరైన పనుల వివరాలను తెలియజేయాల్సిందిగా జిల్లా ప్రణాళిక విభాగానికి ఇటీవల ఆదేశాలు వచ్చాయి. జిల్లాకు ఎన్ని పనులు మంజూరయ్యాయి..? ఎన్ని అసంపూర్తిగా ఉన్నా యి..? ఇప్పటికీప్రారంభం కాని పనులెన్ని..? తదితర వివరాలు కోరింది. పనిలోపనిగా ఇప్పటి వరకు ప్రారంభం కాని పనులు, అసంపూర్తిగా ఉన్న పనులను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మన జిల్లాలో దాదాపు 7 కోట్ల రూపాయల పనులు ఎక్కడి కక్కడే ఆగిపోయాయి. అప్పటి ఎమ్మెల్యేల్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోదాడకు, కుందూరు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, బాలునాయక్‌లు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు స్పెషల్కోటా కింద ముఖ్యమంత్రి సిఫారసుతో 12.50కోట్ల రూపాయలు మంజూరు చేయించుకున్నారు. ఈ నిధులతో ఆయా నియోజకవర్గాల్లో 337 పనులు చేపట్టారు. వీటిలో 185 పనులు అసంపూర్తిగా ఉన్నాయి. నామినేటెడ్ పద్ధతిపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలే వీటిని దక్కించుకున్నారు. తమకు లాభసాటిగా ఉంటుందని, లింక్‌రోడ్లు, సిమెంట్ రోడ్లుకు ఈ నిధులు వెచ్చించారు. దీంతో అభివృద్ధి సంగతి ఎలా ఉన్నా... పార్టీ శ్రేణుల పంట పండింది. నియోజకవర్గాల వారీగా... ఆలేరు నియోజకవర్గానికి రూ.3.50కోట్లు మంజూరు చేశారు. 112పనులకుగాను 29 పనులు పూర్తయ్యాయి. మరో 23పనులు పురోగతిలో ఉం డగా, 60 పనులు ఇంకా మొదలు పెట్టలేదు. దేవరకొండ నియోజకవర్గానికి రూ.2కోట్లు మంజూరు చేశారు. 49 పనులకు గాను 32 పనులు పూర్తయ్యాయి. 14 పనులు పురోగతిలో ఉన్నాయి. 3 పనులు అసంపూర్తిగా ఉన్నాయి. సూర్యాపేట నియోజకవర్గానికి రూ. 3 కోట్లు మం జూరు అయ్యాయి. మొత్తం 128 పనులకు గాను 6 పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన 122 పనులు అసంపూర్తిగానే ఉన్నాయి సాగర్ నియోజకవర్గానికి రూ.2 కోట్లు మంజూరు చేశారు. 46పనులకు గాను 24పనులు పూర్తయ్యా యి. మిగిలిన 22పనులు పురోగతిలో ఉన్నాయి. కోదాడ నియోజకవర్గానికి మంజూరైన రూ.2 కోట్లకు గాను చేపట్టిన రెండు పనులు పూర్తయినట్లు అధికారులు ఓ నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపారు. నియోజకవర్గ నిధులదీ అదే పరిస్థితి.. నియోజకవర్గ అభివృద్ధి పథకం కింద చేపట్టిన పనులకూ ప్రభుత్వం బడ్జెట్ నిలిపేసింది. ఈ పథకం కింద ఒక్కో ఎమ్మెల్యేకు ఏడాదికి కోటిరూపాయలు ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఎన్నికల కోడ్ కారణంగా ఈ పనుల బడ్జెట్‌కు బ్రేక్ పడింది. దీంతో పనులు పూర్తయినా, బిల్లులు రాని పరిస్థితి నెలకొంది. 12 మంది ఎమ్మెల్యేలతో పాటు, ఇద్దరు ఎమ్మెల్సీలకు కలిపి రూ. 14 కోట్ల బడ్జెట్ ఉంటుంది. మొదటి ఆరునెలలకు గాను గత ఏడాది రూ. 7 కోట్లు విడుదల చేశారు. చివరి ఆరునెలలకు పనులకు సంబంధించి రూ. 7 కోట్లు ఇంకా పెండింగ్‌లో నే ఉన్నాయి. కొత్త ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడితేనే ఈ నిధులకు మోక్షం లభించే అవకాశముంది. -
ఎస్డీఎఫ్ పనులకు ఎసరు
- ఎన్నికల్లో లబ్ధికి గతంలో కిరణ్ సర్కారు ఆరాటం - ఎమ్మెల్యేలకు పుష్కలంగా పత్యేక నిధులు - నామినేషన్ పద్ధతిపై అనుచరులకు పనులు - నిలిపివేయమన్న చంద్రబాబు ప్రభుత్వం సాక్షి ప్రతినిధి, కాకినాడ : పాలకపక్షాలు మారిన ప్రతి సందర్భంలో గత ఏలికల ఆదేశాలను నిలిపివేయడం లేదా వాటిని తిరగ తోడటం పరిపాటిగా వస్తున్నదే. ఇప్పుడు చంద్రబాబు సర్కారూ అదే పంథాను అనుసరిస్తోంది. దాంతో.. ఎన్నికల్లో లబ్ధి కోసం కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు గత ఫిబ్రవరిలో మంజూరు చేసిన నియోజకవర్గ ప్రత్యేక అభివృద్ధి నిధుల (ఎస్డీఎఫ్)తో జిల్లాలో వివిధ దశల్లో ఉన్న పనులను నిలిపివేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ మేరకు సర్కారు నుంచి జిల్లా యంత్రాంగానికి మౌఖిక ఆదేశాలు వచ్చాయి. సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా అప్పటి ఎమ్మెల్యేలకు ఎస్డీఎఫ్ పేరుతో పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారు. ఆ నిధులతో ఎమ్మెల్యేలు తమకు నచ్చిన వారికి.. రూ.5 లక్షల వరకూ వ్యయమయ్యే పనుల్ని టెండర్లతో నిమిత్తం లేకుండా నామినేషన్ ప్రాతిపదికన కట్టబెట్టే వెసులుబాటు కల్పించి అవినీతికి తలుపులు బార్లా తెరిచారు. సీసీ రోడ్లు, మంచినీటి సరఫరా, కమ్యూనిటీహాళ్లు, డ్రైన్లతో కూడిన రోడ్ల పనులను ఎస్‌డీఎఫ్‌తో చేపట్టేందుకు అనుమతి ఇచ్చారు. ఎమ్మెల్యేలే రూపొం దించిన ప్రతిపాదనల ప్రకారం నిధులు మంజూరు చేయించుకుని తమ అనుచరగణానికి పనులు అప్పగించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఉదారంగా నిధు లిచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఇతర ఎమ్మెల్యేలకు మొ క్కుబడిగా మంజూరు చేశారు. ఎస్డీఎఫ్ నిధులు గ త ఫిబ్రవరిలోనే మంజూరు చేసినా..2011-12, 20 12-13, 2013-14 సంవత్సరాల కోసమూ అప్పటి ఎమ్మెల్యేలు పనుల్ని ప్రతిపాదించారు. జిల్లాలో 2,216 పనులకు కిరణ్ సర్కార్ రూ.98,27, 66,000లకు పరిపాలనా ఆమోదం ఇచ్చింది. 25 శాతం కూడా పూర్తికాని పనులు జిల్లాకు మంజూరైన పనుల్లో 513 పూర్తి కాగా, 1011 వివిధ దశల్లో ఉన్నట్టు సమాచారం. ఈ పనులకు సుమారు రూ.88 కోట్లు రాగా, ఇప్పటికే రూ.48 కోట్లు నామినేషన్‌పై పనులు చేస్తున్న వారికి విడుదల చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చేసరికే పనులన్నీ పూర్తి చేయాలని అప్పటి ఎమ్మెల్యేలు తొందరపడ్డా 25 శాతం కూడా పూర్తి కాలేదు. ఈ తరుణంలో ఎస్డీఎఫ్ పనులు ఎక్కడివక్కడే నిలిపివేయాలని ఆదేశాలు రావ డంతో ఇప్పటికే పనులు ప్రారంభించి, లక్షలు పెట్టుబడి పెట్టామని, వివిధ దశల్లో ఉన్న పనులు నిలి చిపోతే తమ గతి ఏమిటని మాజీ ఎమ్మెల్యేల అనుచరులు లబోదిబోమంటున్నారు. గతంలో కాంగ్రెస్‌లో ఉండి ప్రస్తుతం టీడీపీలోకి వచ్చి ఎంపీ, ఎమ్మెల్యేలైన తోట నరసింహం, తోట త్రిమూర్తులు, టీడీపీ తరఫున తిరిగి ఎమ్మెల్యేలైన పెందుర్తి వెంకటేష్, వేగుళ్ల జోగేశ్వరరావులతో పాటు ఎన్నికలకు టీడీపీ తరఫున ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావులు తమ, తమ నియోజకవర్గాల్లో అనుచరులు చేపట్టిన పనులకు నిధులు ఎలాగోలా విడుదల చేయించగలమన్న భరోసాతో ఉన్నారు. కాగా మిగిలిన వారి పరిస్థితే సందిగ్ధంలో చిక్కుకుంది. వివాదాలకు ఆస్కారం ప్రత్యేక నిధులతో చేపట్టే పనులు కొన్ని నియోజకవర్గాల్లో వివాదాలకు దారి తీయనున్నాయి. జగ్గంపేట లో అప్పటి ఎమ్మెల్యే తోట నరసింహం అత్యధికం గా నిధులు మంజూరు చేయించుకుని అనుచరుల కు పనులు అప్పగించారు. ఆయన ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఎన్నికవడం, అక్కడ వైఎస్సార్ కాం గ్రెస్ తరఫున జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్యే కావడంతో ఆ పనుల విషయంలో వివాదం తలెత్తే పరిస్థితి కని పిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో గత ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన పనులను ఇప్పటి ఎమ్మెల్యేలు వ్యతిరేకించి తమకు నచ్చిన ప్రాంతాల్లో పనులు చేయించాలనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఎస్డీఎఫ్ వ్యవహారాన్ని ఎలా చక్కబెడుతుంతో వేచి చూడాల్సిందే. -
జ్యోతిబసు రికార్డుకు పవన్ చామ్లింగ్ ఎసరు!
ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని నడపటమే గగనంగా మారిన ఈ రోజుల్లో వరుసగా 20 ఏళ్లపాటు అధికారంలో కొనసాగడమంటే మామూలు విషయం కాదు. సిక్కింలో పవన్ కుమార్ చామ్లింగ్ త్వరలోనే ఓ రికార్డును సొంతం చేసుకోనున్నారు. వరుసగా 23 ఏళ్లపాటు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన జ్యోతిబసు రికార్డుపై చామ్లింగ్ కన్నేశారు. త్వరలోనే జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్ట్ యోధుడు జ్యోతిబసు రికార్డును తిరగరాసేందుకు సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్ సిద్దమవుతున్నారు. ఈ సంవత్సరం జరిగే అసెంబ్లీలో ఎన్నికల్లో చామ్లింగ్ విజయం సాధిస్తే వరుసగా ఐదవసారి ఎన్నికైన ముఖ్యమంత్రిగా రికార్డుల్లోకి ఎక్కుతారు. 1994 డిసెంబర్ 12 తేది నుంచి సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఎస్ డీఎఫ్) ప్రభుత్వాన్ని నడుపుతున్న చామ్లింగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా 20 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. 23 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా సేవలందించిన రికార్డు జ్యోతిబసుపై ఉంది. జ్యోతిబసు 1977 జూన్ 21 నుంచి 2005 నవంబర్ 5 తేది వరకు అధికారంలో కొనసాగారు. ఆతర్వాత బుద్దదేవ్ భట్టాచార్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 12 తేదిన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో చామ్లింగ్ ప్రభుత్వం విజయం సాధిస్తే జ్యోతిబసు రికార్డును అధిగమించే అవకాశం ఉంది. జ్యోతిబసు రికార్డును చామ్లింగ్ అధిగమించే అంశాన్ని సిక్కిం రాష్ట్రంలోని 3,70,000 లక్షల ఓటర్లు ఏప్రిల్ 12 తేదిన నిర్ణయించనున్నారు. 2009 ఎన్నికలల్లో ఎస్ డీఎఫ్ 32 సిట్లు గెలుచుకుని అధికారాన్ని కైవసం చేసుకుంది. చామ్లింగ్ కు ఓటర్లు అవకాశాన్ని అందిస్తారా లేదా అనే విషయం త్వరలోనే స్పష్టమవ్వడం ఖాయం.