అది టీడీపీ సంక్షేమ నిధి!
* ప్రత్యేక అభివృద్ధి నిధి అర్థం మార్చేసిన ముఖ్యమంత్రి
* వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలున్న చోట్ల టీడీపీ ఇన్‌ఛార్జీల పేరుతో నిధులు
* కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పేర్లను కూడా మార్చుతూ జీవోలు
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి ఇది పరాకాష్ట. ఇప్పటివరకూ మద్యం దుకాణాలు, ఇసుక రీచ్‌లను అధికార పార్టీ నేతలకు కట్టబెట్టిన సర్కారు ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి ఉద్దేశించిన ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌డీఎఫ్)ని కూడా వారికే దోచిపెడుతోంది.
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, మౌలిక సౌకర్యాల కోసం స్థానిక ఎమ్మెల్యే సిఫార్సుల మేరకు ఎస్‌డీఎఫ్ నుంచి నిధులు కేటాయించాల్సి ఉండగా నిబంధనలు కాలరాసి టీడీపీ నేతల పేరుతో కేటాయింపులు సాగిస్తోంది. ఎస్‌డీఎఫ్‌ను నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలందరికీ సమానంగా పంచాల్సి ఉండగా... ముఖ్యమంత్రి విచక్షణాధికారం అనే అంశాన్ని అడ్డుగా పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు నిధులు అందకుండా చేస్తున్నారు.
ప్రతిపక్షం ప్రాతినిధ్యం వహిస్తున్న చోట్ల టీడీపీ ఇన్‌ఛార్జిల పేరుతో నిధులు కేటాయిస్తూ... ప్రత్యేక అభివృద్ధి నిధిని టీడీపీ సంక్షేమ నిధిగా మార్చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం నియోజకవర్గ ఇన్‌చార్జిలనే ఎమ్మెల్యేలుగా పేర్కొంటూ వారి పేరుతో ప్రణాళిక శాఖ జీవోలు సైతం జారీ చేసింది. ఎస్‌డీఎఫ్ నిధుల విడుదలలో ఇలా అడ్డగోలుగా జీవోలు జారీ చేయడం ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి పరాకాష్టని అధికారులు, రాజకీయ పక్షాల నేతలు విమర్శిస్తున్నారు.
ఎమ్మెల్యేలనూ మార్చేసిన సర్కారు
టీడీపీవారైతే చాలు... ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్యేగా పరిగణించాల్సిందే అనే ధోరణిలో ప్రభుత్వం ఉన్నట్లు ఎస్‌డీఎఫ్ నిధుల జారీ జీవోలను చూస్తే అర్థమవుతోంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజవకర్గానికి ఎమ్మెల్యేగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన భూమా అఖిల ప్రియను ప్రజలు ఎన్నుకున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి గంగుల ప్రభాకరరెడ్డినే ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా పరిగణిస్తోంది. ఎమ్మెల్యే ప్రభాకరరెడ్డి సిఫార్సుల మేరకు నియోజకవర్గంలోని 59 పనులకు రూ.రెండు కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రణాళిక శాఖ గురువారం విడుదల చేసిన జీవో-698 ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.
పాణ్యం ఎమ్మెల్యేగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఉండగా... ఈ నియోజకవర్గానికి మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ప్రతిపాదన మేరకు నాలుగు పనులకు రూ. రెండు కోట్లు మంజూరు చేసినట్లు ఇదే జీవోలో పేర్కొన్నారు. శ్రీశైలం ఎమ్మెల్యేగా వైఎస్సార్‌సీపీకి చెందిన బుడ్డా రాజశేఖరరెడ్డిని ప్రజలు ఎన్నుకోగా... శిల్పా చక్రపాణిరెడ్డిని ఎమ్మెల్యేగా సర్కారు జీవో-657లో పేర్కొంది. ఆయన ప్రతిపాదనల మేరకు 54 పనులకు రూ. రెండు కోట్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. వాస్తవంగా శిల్పా చక్రపాణిరెడ్డి కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
కర్నూలు జిల్లాకు చెందిన డోన్‌కు బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి (వైఎస్సార్‌సీపీ) ఎమ్మెల్యేగా ఉండగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఆయనను పక్కనపెట్టి నియోజవకర్గ టీడీపీ ఇన్‌ఛార్జి కేఈ ప్రతాప్ పేరుతో 86 పనులకు రూ. 2.10 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం గురువారం జీవో-695 జారీ చేసింది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి ఈయన (కేఈ ప్రతాప్) సోదరుడు కావడం గమనార్హం. ఇలాగే పలు నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను పక్కనబెట్టి తెలుగుదేశం నియోజవర్గ ఇన్‌ఛార్జీల పేరుతో నిధులు విడుదల చేస్తూ ప్రజాస్వామ్య విలువలను గంగలో తొక్కేస్తోంది.
గిరిజన ఉప ప్రణాళిక (టీఎస్‌పీ) కింద స్థానిక ఎమ్మెల్యేకు సంబంధ లేకుండా నిధులు కేటాయించడం నిబంధనలకు విరుద్ధం. కానీ టీడీపీ సర్కారు నిబంధనలను తుంగలో తొక్కి విశాఖపట్నం అరకు ఎమ్మెల్యే కె.సర్వేశ్వరరావు (వైఎస్సార్‌సీపీ)ని కాదని టీడీపీ ఇన్‌ఛార్జి సివేరి సోమ పేరుతో జీవో జారీ చేయడం గమనార్హం.
విచక్షణ కోల్పోయిన విచక్షణాధికారం!
అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఏర్పాటైన ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌డీఎఫ్)ని ముఖ్యమంత్రి చంద్రబాబు విచక్షణారహితంగా వాడేస్తున్నారనడానికి స్వంత నియోజకవర్గానికి జరిపిన కేటాయింపులే నిదర్శనం. చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలోని 194 తారు రోడ్డు పనులకు రూ. 136.13 కోట్లు మంజూరు చేస్తూ గత ఏడాది జులై రెండో తేదీన ప్రభుత్వం జీవో-363 జారీ చేసింది. తదుపరి ఇదే నియోజకవర్గంలోని 582 ఆవాసాల్లో సిమెంటు రోడ్డు పనులకు రూ. 137.37 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం గత ఏడాది జూన్ 29వ తేదీన జీవో-349 జారీ చేసింది.
ఇలా ఒకే ఆర్థిక సంవత్సరంలో సీఎం సొంత నియోజకవర్గానికి ఎస్‌డీఎఫ్ నుంచి రూ. 273.50 కోట్లు మంజూరు చేయడం గమనార్హం. సీఎం విచక్షణ మేరకు ఎస్‌డీఎఫ్ కేటాయింపులు అనే అంశాన్ని అడ్డుగా పెట్టుకుని ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గానికి అడ్డగోలుగా నిధులు కేటాయించుకుంటున్నారనడానికి ఇదే నిదర్శనం.